శర్మ కాలక్షేపంకబుర్లు- పొమ్మనలేక పొగ

పొమ్మనలేక పొగ 

పొమ్మనలేక పొగపెట్టడమనే నానుడి మన తెనుగునాట చాలా విస్తృతంగా వినపడుతుంది. దీని కధ కమామిషు ఏమని అలోచిస్తే ఓ చెప్పుకోతగ్గ కధ, అవధరించండి.

పూర్వ కాలంలో ఎవరేనా బంధువులు వస్తే వెళ్ళడానికి కనీసం పది రోజులు సమయం పట్టేది. పెళ్ళిళ్ళు, కధలూ కార్యాలూ అయితే నెలలే వేసేవారు మకాం. ఇక కావలసిన వారు దగ్గర చుట్టాలయితే చెప్పేదే లేదు. దగ్గర ఊళ్ళలో చుట్టరికాలయితే ఇక్కడ భోజనం చేసి అక్కడ చెయ్యి కడిగినట్లుగా ఉండేవారు. ఆప్యాయతలు ఎక్కువగానే ఉండేవి. వచ్చిన వారు వారం లోపు వెళ్ళిపోతూంటే ఊరిలో వారే ఏంబాబా! అప్పుడే వెళ్ళిపోతున్నారూ అని అడిగేవారు. ఇది నాకు బాగా అనుభవమే! నేను ఉద్యోగరీత్యా తల్లి తండ్రులనుంచి దూరంగా ఉండేవాడిని. దానికి తోడు నేను మరొకరికి దత్తత వెళ్ళడం చేత నా జనక తల్లితండ్రులను చూడటానికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. వాళ్ళూ చుట్టం చూపుగా వచ్చి చూసి వెళుతూ ఉండేవారు. నేను అమ్మ, నాన్నలని చూడాలనిపించినపుడు మధ్యాహ్నం బయలుదేరి, రాత్రికి చేరుకుని అమ్మ దగ్గర నాన్న దగ్గర రాత్రి కూచుని కబుర్లు చెప్పుకుని ఉదయమే బయలుదేరి వెళ్ళిపోతుంటే ఊళ్ళో వారు అప్పుడే వెళిపోతున్నావేం బాబా! అమ్మ, నాన్న దగ్గర నాలుగురోజులుండచ్చుగా అనేవారు. ఒకణ్ణే వస్తే కోడలు రాలేదేం అనేవారు. మేమిద్దరం వంతులుగా మీరు మీ పుట్టింటికి, నేను నా పుట్టింటికి వెళ్ళొద్దామనేది, నా ఇల్లాలు.ఒక్కోకప్పుడు ఇద్దరం కలిసి ఆవిడ పుట్టింటికి కాని నా పుట్టింటికి కాని వెళ్ళేవాళ్ళం.

ఎక్కడో అంతబొంతర చుట్టరికం ఉన్నవారు కూడా వచ్చి ఉంటూ ఉండేవారు, ఆ రోజుల్లో. ఇళ్ళూ పెద్దవిగానూ, వ్యవసాయం, పాడి, పంట ఉండటం చేత మరొకరు కొంతకాలం ఉన్నా బాధగానూ ఉండేది కాదనుకుంటా.

ఇలాటి రోజులలో ఒక జంట, ఒక పల్లెలో కలిగినవారింటి వారికి దూరపు బంధువులుగా వచ్చారు. వచ్చిన వారిని ఇంటివారు ఆదరించారు. వారికి ఉండటానికిగాను ఒక గది ఏర్పాటుచేశారు. వీరికి ఏర్పాటు చేసిన గది పెద్ద ఇంటికి ఎదురుగా ఉండే గాదులు,నిలవ సరుకులు ఉంచుకునే గది వగైరాలున్న ఇంటిదానిలో సౌకర్యంగా ఉన్నది కేటాయించారు. వచ్చిన వారు ఇంటివారితో కలిసిపోయారు. వీరు ఆ వూరు ఎందుకువచ్చినదీ చెప్పలేదు. ఉదయమే లేస్తున్నారు, భోజనభాజనాలు చేస్తున్నారు, రాత్రికి హాయిగా గదిలొ శయనిస్తున్నారు, ఇలా జరిగిపోతూ ఉంది, కాలం. వీరు వచ్చి వారమయ్యింది, నెలయ్యింది, మూడు నెలలయింది, సంవత్సరమూ అయింది. ఇంటివారికి కొద్దిగా విసుగూ కలిగింది. వచ్చిన వారికి ఆ ఊరులో ప్రత్యేకమయిన పని లేదు, పోనీ ఇక్కడే ఉండిపోయి బతుకు తెరువు చూసుకుంటామన్న మాటా లేదు. సత్రవు భోజనం మఠం నిద్ర బాగా జరిగిపోతూ ఉంది.  ఇంటి వారు వచ్చిన చుట్టాలని పొమ్మని చెప్పలేరు.

DSCN3379

ఇంటి వారిలో కొద్దిగా చికాకు కలగడం తో ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. వీరేమో ఎక్కడో దూరపు చుట్టరికమయినా బంధువులు, వెళ్ళిపొమ్మని చెప్పలేరు. అలా చెబితే చుట్టాలలో పరువు పోతుంది కదా! ఇప్పుడేం చేయాలంటే, ఇంటిలో చిన్నవానికి ఒక ఆలోచన వచ్చింది.వచ్చిన వారుంటున్న గది పక్క గది ఖాళీ చేసి తోటలో నరికి తెచ్చిన అరటి గెలలు సొరపతో చుట్టినవి పండబెట్టటానికి గదిలో వేయించాడు. ఇప్పుడంటే వద్దు మొర్రో, కార్బయిడ్ పెట్టద్దు పళ్ళు ముగ్గ పెట్టడానికి అంటే వినటం లేదు కాని ఆ రోజులలో పళ్ళు, ముగ్గబెట్టడానికి పొగ పెట్టేవారు. ఇది ఇప్పటికీ ఉన్న అలవాటే. పొగపెడితే పచ్చికాయ తొందరగా సహజంగా పక్వానికి వస్తుంది.మామిడి కాయ అలా ముగ్గేసినవి బాగుంటాయి,

DSCN3380

ఇది మా అనుభవం. అదిగో అలా పొగపెట్టడం మొదలెట్టేరు. పక్కనే గదిలో వారికి ఇబ్బందిగా ఉండేది, పొగతో.  ఇరవై నాలుగు గంటలూ పొగ ఉంటోంది.దీనితో ఉక్కిరిబిక్కిరవుతూ భరించలేక ఉన్నపళంగా బయలుదేరి వెళిపోతున్నామని ఇంటివారికి చెప్పి వెళ్ళేరు. ఇదేంటి! ఇప్పటి వరకు ఉన్నవారు ఉన్నపళంగా వెళిపోతున్నారని కొంతమంది అ ఊరి జనం అనుకుంటూ ఉంటే, విషయం తెలిసిన ఒకరు, పొమ్మనలేక పొగ పెట్టేరు, అప్పుడు కాని వీళ్ళు కదలలేదను కున్నారు. అదిగో అలా ఈ సంగతి పొమ్మనలేక పొగ పెట్టడంగా స్థిరపడిపోయింది. మరొక సంగతి, పాత రోజులలో ఇల్లు అద్దెకి కనక ఇస్తే, ఇంట్లో ఉన్నవారు ఖాళీ చేయకపోతే తలుపుల రెక్కలు తీసేసేవారట. తలుపులు లేని ఇంటిలో కాపరమెలా? అందుకు చచ్చినట్లు ఖాళీ చేసేవారట.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- పొమ్మనలేక పొగ

 1. చక్కటి విషయాలను తెలియజేసారు.
  పావుకిలో పది రూపాయలుగా కూరగాయల రేట్లు ఉన్న ఈ రోజుల్లో బంధువుల తాకిడి ఎక్కువ ఉండేవారికి బోలెడు డబ్బు కూడా ఖర్చు అవుతుంది.

  • @అనురాధ,
   ఇప్పుడు కావలసిన చుట్టమొచ్చినా కొన్ని గంటలే ఉంటున్నారు. ఒక వేళ రాత్రికి ఉందామన్నా పడుకోడానికి చోటు కనపడటం లేదు, అగ్గిపెట్టి గదులలో, ఇదే బాగున్నట్లుంది.
   దయుంచండి.

 2. శర్మ గారు,

  మన పంచ దశ లోకం లో చెప్పాలంటే, చదివింది చాలయ్యా ఇక పోవయ్యా అనటానికి, కామెంటు పెట్టె బాక్సుని మూత పెట్టి ఉంచడం లాంటిదని చెప్పండి మరి ఇది !

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s