మింగలేక కక్కలేక…
మింగలేక కక్కలేక అంటారు మన తెనుగునాట ఎందుకూ అని ఆలోచిస్తే మంచి సంఘటన గుర్తుకొచ్చింది, అవధరించండి.
దేవదానవులు అమృతం కోసం సముద్ర మథనం చేయబూనారు, అందుకు వాసుకుని అడిగేరు కవ్వపుతాడుగా, ఒప్పుకున్నాడు, అమృతం లో భాగమిస్తామంటే. కవ్వం కోసం మంధరగిరిని పెకలించారు. మోసుకుని తేలేకపోతే, స్వయంగా విష్ణుమూర్తి గరుడునిపై తెచ్చి పాల కడలిలో దించారు. దేవతలు వాసుకి తల దగ్గర పట్టుకున్నారు. దానవులు, ‘పాముతోక నీచంకదా! తోకపట్టుకుంటామా? వేదం చదువుకున్న వాళ్ళం, గొప్పవాళ్ళం మాకు అవమానం కాదా’ అన్నారు, దేవతలు తోక దగ్గరకి మారేరు. మథనం ప్రారంభించారు. మంధరగిరి ములిగిపోయింది. విఘ్నేశ్వరునికి మొక్కలేదు కనక ఇలా జరిగిందని ఆయనను అర్చించేరు. స్వయంగా విష్ణుమూర్తి కూర్మావతారమెత్తి మంధరగిరిని తన వీపుమీద పెట్టుకున్నారు,కవ్వం నీళ్ళలో ములిగిపోకుండా.. చిలకడం ప్రారంభమయింది. మొదటగా హాలాహలమనే విషం పుట్టింది సముద్రం నుంచి అన్నారు, వ్యాసులవారు. రామాయణం లో వాల్మీకి వాసుకినుంచి పుట్టిందీ హాలాహలమన్నారు. ఎక్కడనుంచి పుట్టినా ఈ విషం లోకాలని దహిస్తూ ఉంది. భయంతో పరిగెట్టి శివుని దగ్గరకి పోయారు,అందరూ.. ఆయనను ప్రార్ధించి, ఆది దేవుడవు కనక సముద్రం నుంచి మొదటగా పుట్టినది నీవే తీసుకోమన్నారు. శివుడు అమ్మకేసిచూసి
“శిక్షింతు హాలాహలమును,భక్షింతున్ మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్,
రక్షింతును బ్రాణికోట్లను,వీక్షింపుము నేడు నీవు విక చాబ్జముఖీ…భాగ..స్కం..8..237.
అని పలికిన బ్రాణవల్లభునకు వల్లభ యిట్లనియె. దేవా చిత్తంబుకొలదినవధరింతుగాక”.
మింగడానికి నోట్లో పెట్టుకున్నాడు,శివుడు. శివునికే సంకట పరిస్థితి వచ్చింది. ఈ హాలాహలాన్ని మింగితే శివుని ఉదరంలో ఉన్న సర్వ ప్రాణులూ నశిస్తాయి, కక్కితే బయట ఉన్న ప్రాణులన్నీ నశిస్తాయి. అందుకని మింగలేక కక్కలేక గొంతుకలో ఉంచుకున్నాడు. అందుకే గరళకంఠుడయ్యాడు, నీల కంఠుడూ అయ్యాడు.
దీనినె సామాన్యంగా విడవమంటే పాముకి కోపం కరవమంటే కప్పకి కోపం అంటాం కదూ! మరో మోటు సామెతా ఉంది చెప్పేసుకుందాం! ముండ గర్భం దించుకుంటే తెలిసిపోతుంది, ఉంచుకుంటే పెరిగిపోతుంది.మీకు ఇప్పుడేమయినా గుర్తొస్తోందా?ఇది చదివాకా? సమస్యలను మురగబెడితే ఇదిగో ఇలాగే తయారవుతాయి.దిగి సింగయ్య,రోడ్ మేప్ వేసేవా? అని కనపడిన ప్రతివాణ్ణి అడుగుతున్నాడు కాని, ఏదయినా చేసేది ఉందనీ చెప్పలేడు లేదనీ చెప్పలేడు.వాడెవడో నీ ఇంట్లో లంకె బిందెలున్నాయంటే సొమ్ములు దోచిపెట్టి మోసం చేసేడనీ చెప్పలేరు, మానం పోయిందనీ ఏడవలేరు కదా!
వివరాలలోకి పోవద్దుకాని, ఒక దొంగతనం జరిగింది, ఒకప్పుడు ఒక పెద్దవారింట్లో, దగ్గరగా ఐదువందల తులాల పై చిలుకు బంగారం, దొంగలు పట్టుకుపోయారని చెప్పుకున్నారు, జనం. అసలు వారు మాత్రం ఏడుపు మొహంతో, అబ్బే! ఏంపోలేదండి మహపోతే ఒక ఐదు కాసులలోపు బంగారం పోయిందని పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. అర్ధం కాలేదా? ఐదువందల తులాల బంగారం పోయిందని పోలీస్ కి కంప్లయింటిస్తే ఇన్ కం టాక్స్ వాళ్ళు తగులుకుంటారు. అందుకే దీన్ని మింగలేక కక్కలేక అంటారు కదా!
క్రిమినల్ కేసుల్లో దోషులయిన ప్రజాప్రతినిధులు వెంటనే పదవి కోల్పోతారనీ, ఎన్నికలలో పోటీకి అనర్హులని సంచలన తీర్పిచ్చింది, మరి రాజకీయ పార్టీల, నాయకుల పని ఇప్పుడు పై సామెత సరిపోతుంది కదూ!!!
అటువంటి సహజ న్యాయమైన తీర్పిచ్చిన సుప్రీం కోర్ట్ వారిని ఇలా పెద్ద బొకేతో అభినందిద్దామా!
పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు- మింగలేక కక్కలేక… | Bagunnaraa Blogs
శర్మ గారు బాగున్నారా? బొకే చిత్రం చాలా బాగుందండి. ఎక్కడిదండి ఆ చిత్రం?
@జలతారు వెన్నెల గారు,
బహుకాల దర్శనం, నడుస్తోందండి, బండి. ఫోటో లు ఎక్కడివో తెలియదు ఒక మిత్రుడు పంపేరు, దగ్గరగా ఒక పాతిక ఉంటాయి ఇటువంటివి, మెయిల్లొ, ఎంత నచ్చేసేయో! అందుకే బ్లాగ్ లో పెట్టేశా మీకూ నచ్చినందుకు,
ధన్యవాదాలు.
పూల అలంకరణాల తో ఫోటోలు ఆకర్ష ణీ యంగా ,
సెలవిచ్చిన మాటలు ఉపయోగంగా ఉన్నాయి .
ధన్యవాదాలు.
@మిత్రులు మోహన్జీ,
పలుకు బొమ్మ రెండూ నచ్చినందుకు, మెచ్చినందుకు
ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పారు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి ఇరకాట పరిస్థితే ఇదీనూ.
@మిత్రులు జోగారావు గారు,
ఈ సామెత మరచాను. గుర్తుచేసినందుకు
ధన్యవాదాలు.
టపాలో చక్కటి విషయాలను తెలియజేశారు. చిత్రం కూడా బాగుంది.
అటువంటి సహజ న్యాయమైన తీర్పిచ్చిన సుప్రీం కోర్ట్ వారిని తప్పక అభినందించాలండి, ఇలా పెద్ద బొకేతో ..బొకే కూడా చాలా బాగుందండి.
ఈ తీర్పు వల్ల చాలామంది రాజకీయుల పరిస్థితి మింగలేక కక్కలేక ….అయితే ఈ తీర్పును ఆచరణలో అమలు జరిగేటట్లు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
@అనురాధ,
సుప్రీం కోర్ట్ ఆర్డర్ పైన మళ్ళీ రెవ్యూ పెటిషన్ వేస్తారట.ఫోటో నచ్చినందుకు
ధన్యవాదాలు.