శర్మ కాలక్షేపంకబుర్లు- విద్య/చదువు.

విద్య/చదువు.

fcadbhfh

ఏం చదువులో చచ్చిపోతున్నాం అంటూ వచ్చింది ఇల్లాలు.
ఏమయిందన్నా?
స్కూల్ లో ఏదో చెప్పేరట చిన్నపిల్ల పేచీ పెడుతోందంది, ఆవిడ చూసుకుంటుందని ఆలోచనలో పడిపోయా! ఇది గుర్తొచ్చింది.

విద్య యొసగును వినయంబు వినయమునను
బడయు పాత్రత పాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు

పై పద్యం చిన్నప్పుడు చదువుకున్నా, పద్యంలో కొంత భాగం గుర్తులేదు, పద విభజనా గుర్తులేదు, కాని పద్యం, భావం గుర్తుండిపోయాయి, మిత్రులు శ్యామలరావు గారిని అడిగితే పద్యాన్ని సంస్కరించి ఇచ్చారు. అదీ పద్యం గొప్ప. మరి వచనం అబ్బో! దేనికదే! జిలేబీ కావాలా, జాంగ్రీ కావాలా అంటే ఎలా? రెండూ గొప్పవే దేనిగొప్ప దానిదే, ఐతే ధారణకి పనికొచ్చేది పద్యం.

కవిగారేమంటారూ! విద్య నేర్చుకుంటే వినయాన్నిస్తుంది, విద్య, వినయం తో పాత్రత అర్హత (ఎలిజిబిలిటీ,కేపబిలిటీ)వస్తుంది, దానివల్ల ధనం వస్తుంది దానివలన ధర్మం చేయాలి దానితో మానవుడు ఇహ పర సుఖాలు పొంది తరించాలి

నిజమండి, మనవారు విద్య అంటే దైవాన్ని తెలుసుకునేదే విద్య అన్నారు.విద్యతో మోక్షమన్నారు.విద్యతో వినయం మొదటి మెట్టు, వినయంతో అర్హత రెండవమెట్టు, అర్హతతో ధనం మూడవమెట్టు, ధనం తో ధర్మం, దానితో ఇహ సుఖం, ఆ తరవాత పర సుఖం అంటే ముక్తి. మిగిలినవన్నీ పొట్టకూటి కోసం చేసేపనులే అన్నారు. అందుకే అభ్యాసము కూసు విద్య అని కూడా అన్నారు.కవిగారు విద్యతో వినయం రావాలన్నారు. నేడు చదువేస్తే ఉన్నమతి పోయిందన్నట్లూ, చదువుకోక ముందు కాకరకాయ అన్నవారు చదువుకున్న తరవాత కీకర కాయ అన్నట్లుగా తయారవుతున్నారు,నాలుగు ముక్కలు రానివారు కూడా నోటికొచ్చినట్లు మాటాడుతున్నారు. అలా తయారయింది మన విద్య, అలా తయారయింది మన విద్యా విధానం. వినయంతో పాత్రత వస్తుందన్నాడు,రావాలన్నారు,చదువు ‘కొన్న’వారికి అర్హత డిగ్రీలలో ఉంటోంది కాని పనిలో కాదు. వెధవలకి పదవులొచ్చినా గాడిదలకి కొమ్ములొచ్చినా పట్టుకోలేమన్నట్లుగా, ఇప్పుడు పనికిరానివారు మాత్రమే అందలాలెక్కుతున్నారు. పనికొచ్చేవాడు అడవులు పట్టిపోతున్నాడు.మెరిట్ ఉన్నవాళ్ళకి చదువులేదు, చదివేవాళ్ళకి మెరిట్ లేదు. పాత్రతవలన ధనం అన్నారండి అపాత్రులకే ధనం పాత్రులకి ఋణం మిగులుతున్నాయి. అలా ధర్మంగా సంపాదించిన ధనం తో ధర్మం అన్నారు. నేడు అధర్మమే ధర్మమై కూచుంది. ఐహికమైన సుఖాలు పై ఉన్నమోజు ఆముష్మికసుఖం మీదలేదు. దృష్టి అంతా, ఈ ప్రపంచమే సర్వస్వం, పంచేంద్రియాలతో అనుభవించేదే సుఖమనుకుంటున్నారు, మందు, విందు, పొందు కోసం వెంపర్లాడుతున్నారు, విచక్షణ లేకుండా, చదుకున్నామనుకుంటున్న చదువు’కొన్న’వారు. ఈ సందర్భంగా మరో పద్యం.

చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి చేకురునటయ్య భాస్కరా ….. అన్నారు శతక కారులు.

చదువెంత ఉంటే ఉపయోగం ఉంది? ‘రసజ్ఞత’ అనే పణుగులాటి మాట పారేసేరు కవిగారు. దీనికి మనం అర్ధం చెప్పచ్చు కాని అది సంపూర్తి కాదని నాఉద్దేశం. ఈ మాట బ్రహ్మ పదార్ధం లాటిది, నిజమూ కూడా. ఎప్పటికి ఎలా మసలుకోవాలో తెలియని వారి చదువు నిరర్ధకం, అందుకే కవిగారు ఉపమానం చెప్పేరు,ఈ మాటకి అర్థం చెప్పి ఒప్పించడం కష్టమని, ఎలా అంటే ఎంత గొప్పగా కూర వండి ఉపయోగమేంటి అందులో సరిపడా ఉప్పులేకపోతే అన్నారు కవిగారు. అంటే ఉప్పు ఎక్కువయినా బాగోదు, తక్కువయినా బాగోదు కదా! సరిపడా కావాలి. అదుగొ అది ఎంతో తెలుసుకోవడమే రసజ్ఞత. ఇప్పుడు చదువు కొన్నవారికి ఇదెక్కడనుంచి వస్తుంది.”ఈశానః సర్వ విద్యానామ్,ఈశానః సర్వభూతానమ్, బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం” అన్నది మరుస్తున్నారు.   విద్య, వైద్యం, రక్షణ,న్యాయం ఈ నాలుగూ వ్యాపార వస్తువులు కాకుండా ఉండే రోజు కావాలని కోరుకుందాం.ఇప్పుడు చదువు ‘కొన్న’ వారికి చేసే పనిలో నిపుణతలేదు, చేస్తున్నపని మీద శ్రద్ధ లేదు.

శ్రద్ధ, ఇది లక్ష్మీదేవి పేరు,ఐదవది, పాత రోజుల్లో ఉడిపి కాఫీ హోటల్ కి వెళితే ఏమున్నాయంటే, ఇడ్లీ, వడ, రవ్వదోశ, పెసర, మినప…రసగుల్లా,జాంగ్రీ….దండకం చదివేసేవాడు. అందులో మనకి కావలసినది చెబితే అక్కడినుంచే ఆర్డర్ కిచెన్ లో వాడికోసం అరిచి అదే పట్టుకొచ్చేవాడు, మనం చెప్పిన విధంగా. నేను కాకినాడలో ఉద్యోగం చేస్తున్న రోజులలో ఐదు ఆరుగురు మిత్రులం కలసి టౌన్ హాల్ ఎదురుగా ఉండే ఉడిపి హోటల్ కి వెళ్ళేవాళ్ళం. ఐదారు గ్లాసుల మంచి నీళ్ళు ఐదు వేళ్ళు గ్లాసులలో ములిగేలా తెచ్చి టక్కున టేబుల్ మీద పెట్టి ఏం కావాలిసార్ అనేవాడు. ఒక్కకరు ఒక్కోరకంగా చెప్పేవాళ్ళం, పెసరట్టు అల్లం జీలకర్ర రోస్ట్ ఒకటీ,ముక్కలెక్కువా, పేపర్ దోశా మసలా కూర్మా, సాంబార్ ఇడ్లీ, ఇలా ఆర్డర్ తీసుకుని వేయవలసిన వాటి గురించి ఇక్కడి నుంచే ఒక అరుపు అరిచి పేపర్ దోశా ఒకటీ, అల్లం జీలకర్రా ఒకటీ, మిర్చి తక్కువా, ఇలా అరిచేవాడు. మరొక టేబుల్ దగ్గరకిపోయేవాడు.ఐదారు టేబుల్స్ కి ఒకడే సర్వ్ చేసేవాడు. లోపలికి పోయి ఇచ్చిన ఆర్దర్ ప్రకారంగా తెచ్చి ఎవరు ఏమి చెబితే వారి ముందు అది ఉంచేవాడు. అదీ నిపుణత, పని పై శ్రద్ధ, నేనిది చూసి ముచ్చట పడ్డాను, నేర్చుకున్నా కూడా. ఇప్పుడు హోటల్ కి వెళితే ఆర్డర్ తీసుకోడానికి పెన్ను పేపరు పట్టుకొస్తున్నాడు రాసుకోడానికి, టేబుల్ మీద మెనూ కార్డ్ ఉంటుంది. ఇక్కడ వైవిధ్యం చచ్చిపోలేదూ?పని తపస్సు, పనిలో నిపుణత్వం విద్య…,ఏదీ? ఎక్కడా?విదేశలలో డిగ్రీలకి ప్రాముఖ్యత లేదు, పనిలో నిపుణత కావాలి, మరి మనకో డిగ్రీలు కావాలి, నిపుణత పూజ్యం….

heart Love Pic

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- విద్య/చదువు.

 1. నిజమండి, మనవారు విద్య అంటే దైవాన్ని తెలుసుకునేదే విద్య అన్నారు.విద్యతో మోక్షమన్నారు.విద్యతో వినయం మొదటి మెట్టు, వినయంతో అర్హత రెండవమెట్టు, అర్హతతో ధనం మూడవమెట్టు, ధనం తో ధర్మం, దానితో ఇహ సుఖం, ఆ తరవాత పర సుఖం అంటే ముక్తి. మిగిలినవన్నీ పొట్టకూటి కోసం చేసేపనులే అన్నారు. అందుకే అభ్యాసము కూసు విద్య అని కూడా అన్నారు.కవిగారు విద్యతో వినయం రావాలన్నారు. నేడు చదువేస్తే ఉన్నమతి పోయిందన్నట్లూ, చదువుకోక ముందు కాకరకాయ అన్నవారు చదువుకున్న తరవాత కీకర కాయ అన్నట్లుగా తయారవుతున్నారు,నాలుగు ముక్కలు రానివారు కూడా నోటికొచ్చినట్లు మాటాడుతున్నారు. అలా తయారయింది మన విద్య, అలా తయారయింది మన విద్యా విధానం. వినయంతో పాత్రత వస్తుందన్నాడు,రావాలన్నారు,చదువు ‘కొన్న’వారికి అర్హత డిగ్రీలలో ఉంటోంది కాని పనిలో కాదు. వెధవలకి పదవులొచ్చినా గాడిదలకి కొమ్ములొచ్చినా పట్టుకోలేమన్నట్లుగా, ఇప్పుడు పనికిరానివారు మాత్రమే అందలాలెక్కుతున్నారు. పనికొచ్చేవాడు అడవులు పట్టిపోతున్నాడు.మెరిట్ ఉన్నవాళ్ళకి చదువులేదు, చదివేవాళ్ళకి మెరిట్ లేదు. పాత్రతవలన ధనం అన్నారండి అపాత్రులకే ధనం పాత్రులకి ఋణం మిగులుతున్నాయి. అలా ధర్మంగా సంపాదించిన ధనం తో ధర్మం అన్నారు. నేడు అధర్మమే ధర్మమై కూచుంది. ఐహికమైన సుఖాలు పై ఉన్నమోజు ఆముష్మికసుఖం మీదలేదు. దృష్టి అంతా, ఈ ప్రపంచమే సర్వస్వం, పంచేంద్రియాలతో అనుభవించేదే సుఖమనుకుంటున్నారు, మందు, విందు, పొందు కోసం వెంపర్లాడుతున్నారు, విచక్షణ లేకుండా, చదుకున్నామనుకుంటున్న చదువు’కొన్న’వారు. ఈ సందర్భంగా మరో పద్యం.

 2. శర్మగారు,

  టపా చాలా బాగుంది సూటిగా.

  ౧. మా నాన్నగారు నాకు చిన్నప్పుడే భాస్కరశతకాన్ని కొనిచ్చి చదివించారు. నాకు మహదానందం‌ కలిగింది ఆ పద్యాలతో. ఎందుకంటే అనేక పద్యాలను మా నాన్నగారే విశదీకరించి నేర్పించారు కాబట్టి.
  ౨. తూ.గో.జి. కొత్తపేటలో నా హైస్కూలు చదువు గడిచింది. అక్కడ బస్సు స్టాండు యెదురుగా ఒక అయ్యరు హోటలుండేది. ఇప్పుడూ ఉందేమో తెలియదు. ఆ హోటలు ఓనరు కృష్ట్ణయ్యరు అనుకుంటాను. ఆయన కుమారుడికి ఉపనయనం చేస్తూ ఊళ్ళో పెద్దలని అందర్నీ‌అహ్వానించాడు. ఉపాహారాలన్నీ స్వయంగా అందింపజేసాడు. ఎవరన్నా ప్రస్తావించారేమో గుర్తులేదు కానీ ఒక మాట “అయ్యా హోటలు లౌకిక జీవనం‌ అండీ. ఇది వైదిక కార్యక్రమం – స్వయంగా మాయింట్లో మడిగా చేయిచిన ఉపాహారాలూ కాఫీలూనూ” అన్నాడు. బస్సు స్టాండులోని హోటలైనా ఎంతో శుభ్రంగా ఉండేది, పదార్థాల తయారీ‌ అంతా స్వయంగా పర్యవేక్షించే వాడు. చదువుకునే పిల్లలను చాలా ఆదరంగా చూసేవాడు.
  ౩. మీ టపా చివరన బిందుభోగీంద్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. మీరీ‌బొమ్మలు ఎలా సేకరిస్తునారో చెబితే నేనూ ప్రయత్నిస్తాను నా బ్లాగు కోసం

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   ఏదో విషయంలో బాధ కలిగింది, అప్పుడు రాసిన టపా!
   ౧.చిన్నప్పుడు శతకాలన్నీ బట్టీ వేసినవే! ౫ శతాకాలున్న పుస్తకం దొరికితే కొన్నా ౫ ఏళ్ళ కితం. మనసుబాగోనపుడు అవి చదువుతూ ఉంటా.
   ౨.మీరు చెప్పినటువంటి వారు ఇదివరలో ఎక్కువగా కనపడేవారు, ఇప్పుడు తక్కువ కనపడుతున్నారు.
   ౩.రోజూ ఉదయం ౦౫.౩౦ తరవాత టపావేసి నడకకి వెళతాను. అక్కడ నా బ్లాగ్ అభిమాని కలిసి నిన్నటి టపా సమీక్ష చేస్తారు.ప్రత్యక్ష వ్యాఖ్యాత. ఆయన నాకు ఈ ఫోటోలు పంపుతున్నారు మెయిల్లో. ఆయనకి మరెవరో పంపుతోంటే నాకు ఫార్వార్డ్ చేస్తున్నారనమాట. నాకయితే చిత్రాలు బాగా నచ్చి బ్లాగ్ లో పెడుతున్నాను. మీకూ నచ్చినందుకు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s