శర్మ కాలక్షేపంకబుర్లు- వంటెవరు చేయాలి?

 వంటెవరు చేయాలి?

aaidbbba

వంటెవరు చేయాలనే దాని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి కాని, ఒక సారి వెనక్కి తిరిగి చూదాం.

చరిత్రలో, సమాజం గణాలుగా ఉన్నరోజులలో స్త్రీ ఆహార సంపాదన చేసి పిల్లలను పోషించేది. ఆ స్త్రీలు, పిల్లలు గణానికి ఉమ్మడిగా చెందినవారే, తండ్రి ఇదమిద్ధమని తెలియని పరిస్థితి నెలకొని ఉండేదంటారు. అదుగో అప్పటినుంచి తల్లి పిల్లలను సాకడానికిగాను ఆహార సంపాదన మరియు పచనం చేసి పెట్టే రెండు బాధ్యతలూ తీసుకుంది. తీసుకోడం కాదు ప్రకృతి చేసిన ఏర్పాటు కూడా. బిడ్డ పుట్టగానే ఆహారం ఇచ్చేది తల్లి మాత్రమే. రక్షణ కూడా తల్లి దగ్గరే పొందుతుంది. ప్రతిజీవికి పుట్టిన వెంఠనే కాక కొద్దికాలం కూడా తల్లే ఆహారం సంపాదించి పెట్టడం సృష్టిలో ఉన్నదే. స్త్రీ శరీర నిర్మాణం కూడా ప్రకృతి అలాగే ఉండేలా చేసింది, లేదా భగవంతుడు అలా నిర్మించేడు. “ఆకీటబ్రహ్మజనని” లలితా సహస్రం లో అమ్మకి ఒక పేరు, ఎంత నిజం, కీటకం నుంచి బ్రహ్మదాకా అందరికి తల్లి. అదిగో అలా స్త్రీలో అమ్మతనమే కాని ఆడతనం చూడని జాతి మనది. ఐతే కాలం మారింది, పరిస్థితులు మారుతున్నాయి స్త్రీని అంగడి వస్తువుగా, వ్యాపార వస్తువుగా చేసిన సంస్కృతి కోసం అర్రులు చాస్తున్నాం.

ఆ తరవాత సమాజంలో పెళ్ళి వ్యవస్థ ఏర్పాటయిన తరవాత తల్లి కున్న రెండు బాధ్యతలలో ఒకటయిన ఆహార సంపాదన మగవాడు తీసుకుంటే ఆహారం పచనం చేయడం పిల్లలకు పెట్టడం తో పాటు భర్తకు కూడా పెడుతోంది. నిజానికి కుటుంబ యజమాని స్త్రీ యే కాని పురుషుడు కాదన్న విషయం, సత్యం, భారతం కూడా చెబుతోంది. భారతంలో ద్రౌపది కుటుంబ వ్యవహారాలు, అతిధి అభ్యాగతులను ఆదరించడం, ఇంటి తాలూకు ఆదాయ వ్యయాలు చూసుకొవడం చేసిందని చెబుతోంది. అందుచేత వంట చేసేపని స్త్రీ మాత్రమే నిర్వహించేది. రోజులు మారుతున్నాయి, బాధ్యతలూ మారుతున్నాయి. ఇప్పుడు భార్యా భర్తలిద్దరూ సమానంగా డబ్బు సంపాదిస్తున్నారు కనక స్త్రీ పిల్లలను సాకడం అదనంగా చేస్తోంది కనక పురుషుడు వంట బాధ్యతను తను కూడా నిర్వహిస్తున్నాడు. నిజానికి పని బాధ్యతలలో సమతూకం కొరవడిందనే చెప్పాలి. నేనెరిగిన ఇటువంటి ఇద్దరూ ఉద్యోగస్తులయిన కుటుంబాలలో ఉదయం భార్య వంట చేసి పెడితే లంచ్ బాక్స్ లు బేక్ పేక్ లు తగిలించుకుని ఆదరా బాదరాగా పరుగెట్టుకుపోతున్నారు. సాయంత్రం భర్త తీరుబడిగా వంట చేసి ఉంచితే భార్య, భర్త పిల్లలు కలసికూచుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. కాని ప్రకృతి మాత్రం స్త్రీకే ఆ అధికారం కట్టబెట్టింది మరి.

మాతా పితా స్నుషే పుత్రౌ పుత్రీ పత్న్వతిథిఃస్వయమ్
దశ సంఖ్యః కుటుంబీతి విష్ణునోక్తం ద్విజోత్తమ

ఓ బ్రాహ్మణోత్తమా! తల్లి తండ్రి, ఇద్దరుకొడుకులు,ఇద్దరుకోడళ్ళు,కూతురు, తన ధర్మ పత్ని,తాను, అతిథి అను పదిమందితో కూడి ఉండువాడు “కుటుంబి”.ఇదిటండి భారతీయ కుటుంబం. నేటి కాలానికి కుటుంబ నిర్వచనం మారిపోతోంది కదా!

నేను ఆరుగురి సంతానంలో మూడవ వాడిని అక్కడ వంటచేయలేదు, కొద్దిగా అన్నం వండటం మాత్రం నేర్చుకున్నా! ఆ తరవాత పెంచుకున్నమ్మ నేను నడిస్తేనే అరిగిపోతాననుకునేది, మరి వంట చేయడమెక్కడ? ఒక పూట ఒక ముద్ద తక్కువ తింటే తల్లడిల్లిపోయేది. ఇక శ్రీమతివారి హయాంలో జీవితంలో వంటింటిలోకి వస్తే కాళ్ళు విరగకొడతానని ప్రతిజ్ఞ చేసిందావిడ. నేను భోజనం చెయ్యడానికే!!! వంట చేత కాదు. కబుర్లు చెప్పుకు బతికేసేను :). సరదాగా ఏ పకోడీలో వేసుకోవాలనుకుని వంటిటిలోకి వెళితే, ఎందులో ఏముందో తెలియదు కదా! వెతుకుతుంటే “ఏంటీ పుణుక్కుంటున్నారూ! దేనికోసం?” అంటే “పకోడీలెద్దామని” అన్నా! ఒక రోజు. “పళ్ళూడిపోయి పకోడీలు తక్కువయ్యాయి, ముదిమికి ముచ్చట్లు లావని” అంది “అయితే పకొడీలు వద్దంటావా?” అన్నా. “ఇప్పుడు సాయంత్రమవుతోంది అవితింటే శనగపిండి పడక రాత్రికి విరోచనాలెళ్తాయి, చెబితే వినాలి, చిన్నపిల్లల్లా ఏంటీ మంకు పట్టు” అంది. ఉత్సాహం చప్పబడిపోయింది. కోడలేమో తలుపుచాటున నిలబడి నవ్వుకుంటోంది,ఈవిడేమో నా పరువు తీసేస్తోంది. ఏంచెయ్యనూ? చల్లగా జారుకున్నా. ఇదండి సంగతి, వంట చేసుకు తినే స్వతంత్రం కూడా లేదు మరి. 🙂 అలా జరిగిన రోజు రాత్రి భోజనం లో పకోడీలు లెక్కగా ప్రత్యక్షమవుతాయి 🙂

ఈ వేళ పేపర్ లో చూశాను, అభివృద్ధి సాధించినట్టి అమెరికా సమాజంలో 1970 లో 70% పైన ఉన్న పెళ్ళిళ్ళు ఇప్పుడు 30% కి తక్కువలో ఉన్నాయట. సహజీవనం చాలు, పెళ్ళి గోలెందుకు అంటున్నారట.అంటే మళ్ళీ గణ వ్యవస్థకి వెళుతున్నారనమాట. మళ్ళీ మనమూ గణ  వ్యవస్థకే చేరాలనుకుంటున్నామా? ఇదేనా అభివృద్ధి?.భూమి గుండ్రంగా ఉండటం, కాల చక్రం తిరగడం అంటే ఇదేనేమో!

fdghafaj

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- వంటెవరు చేయాలి?

 1. ఆ తరవాత సమాజంలో పెళ్ళి వ్యవస్థ ఏర్పాటయిన తరవాత తల్లి కున్న రెండు బాధ్యతలలో ఒకటయిన ఆహార సంపాదన మగవాడు తీసుకుంటే ఆహారం పచనం చేయడం పిల్లలకు పెట్టడం తో పాటు భర్తకు కూడా పెడుతోంది. నిజానికి కుటుంబ యజమాని స్త్రీ యే కాని పురుషుడు కాదన్న విషయం, సత్యం, భారతం కూడా చెబుతోంది. భారతంలో ద్రౌపది కుటుంబ వ్యవహారాలు, అతిధి అభ్యాగతులను ఆదరించడం, ఇంటి తాలూకు ఆదాయ వ్యయాలు చూసుకొవడం చేసిందని చెబుతోంది. అందుచేత వంట చేసేపని స్త్రీ మాత్రమే నిర్వహించేది. రోజులు మారుతున్నాయి, బాధ్యతలూ మారుతున్నాయి. ఇప్పుడు భార్యా భర్తలిద్దరూ సమానంగా డబ్బు సంపాదిస్తున్నారు కనక స్త్రీ పిల్లలను సాకడం అదనంగా చేస్తోంది కనక పురుషుడు వంట బాధ్యతను తను కూడా నిర్వహిస్తున్నాడు. నిజానికి పని బాధ్యతలలో సమతూకం కొరవడిందనే చెప్పాలి. నేనెరిగిన ఇటువంటి ఇద్దరూ ఉద్యోగస్తులయిన కుటుంబాలలో ఉదయం భార్య వంట చేసి పెడితే లంచ్ బాక్స్ లు బేక్ పేక్ లు తగిలించుకుని ఆదరా బాదరాగా పరుగెట్టుకుపోతున్నారు. సాయంత్రం భర్త తీరుబడిగా వంట చేసి ఉంచితే భార్య, భర్త పిల్లలు కలసికూచుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. కాని ప్రకృతి మాత్రం స్త్రీకే ఆ అధికారం కట్టబెట్టింది మరి.

 2. శర్మ గారూ ,

  నమస్తే .

  వంట వాస్తవానికి గంట , అనుపాకాలు సిధ్ధంగా ( కూరలన్నీ తరిగి ) వుంటే . అందరికీ వచ్చి వుంటే , రకరకాలరుచులతో ( అభిరుచులు వేరుగ వున్నట్లు ) జీవితానికి బోర్ లేకుండా ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ కొనసాగించవచ్చు . అయితే ఈ అవకాశమ్ మగ / మొగుడు అనే మహరాజులకు ఆడ అనే మహరాణులు సనాతన కాలం నుంచి అవకాశం యీయకుండా చేశారు . ఐతే ఈ కాలంలో ఆడా / మగ తేడా సృష్టి కొరకే గాని వ్యక్తిగతానికి వర్తించదు అని ఘంటాపధంగా నేటి మహిళలు నొక్కి చెప్పటం వలన అవకాశం అందుకొంటున్నారు , అటు వైపు అడుగులు వేసి ఆనందాలను పంచుతున్నారు . నేటి సమాజంలో ఎవరికి వీలుంటే వారు వంటచేయటం మంచిదే . ఐతే రుచికరంగా వుండాలంటే లోటు పాట్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ప్రోత్సాహకరంగా , రుచికరంగా చేయగలిగే స్థాయికి ఎదుగుతారు మగ అయినా / ఆడ అయినా .
  సంసారంలో ఎవరిది గెలుపు / అలుపు / ఓటమి అంటే సమాధానం ఒక్కటే ఇరువురిది అన్నట్లు , వంట కూడా సంసార దోహదకారిణే కనుక ఇరువురిలో ఎవరు చేసినా ( వాళ్ళకున్న వసతిని బట్టి ) తప్పు లేదు . ఇది ఏ ఒక్కరిదో కాదు , ఇది మాత్రం మరచిపోకూడదు .

  • @శర్మాజీ,
   ఈ వంట చేయడం అనేదాన్ని స్త్రీలు పురుషులనుంచి లాగేసుకున్నారంటారు, మరెందుకూ మన హక్కు నిలబెట్టుకుందాం ఏమంటారు? 🙂
   ధన్యవాదాలు.

 3. బాగుంది వంట పురాణం ! సంసార జీవితం లో వైవిధ్యం ఉండాలంటే భార్యా భర్తలిద్దరికీ ( లేక స్త్రీ పురుషులిద్దరికీ ) వచ్చి ఉండాలి ! చాలా మంది మగ వారికి తాము తినే వంటలు వంకలు పెట్టడమే పని గా ఉంటుంది కదా !
  వారు , కాస్త వంట వంక కూడా శ్రద్ధ పెడితే , జీవితాలలో కొత్త రుచులు వస్తాయి, నిజంగానే !

  • @సుధాకర్ జీ,
   మంచి మాట చెప్పేరు. ఇదివరకు కూడా మగవాళ్ళు వంట చేసినవారే. మీరన్నట్లు ఇద్దరూ చేసేవారయితే కొత్త కొత్త రుచులు పుట్టేసావకాశం ఎంతయినా ఉంది కదా! 🙂 కాని So many cooks… కాదుకదా:)
   ధన్యవాదాలు.

 4. తాతాగారు బాగున్నాయండి పకోడీలు..
  ఇక వంట బాధ్యత అంటారా?
  మనకిష్టమైనది మనమే వండుకొని తినడం ఒక అదృష్టం అయితే
  మనకిష్టమైనవారు చేసిపెట్టింది తినడం మరో అదృష్టం .
  ఈ అదృష్టాలు కూడా ఇద్దరి మధ్యా మారుతూ ఉంటే ఇంకా అదృష్టం.. 🙂

  • @అమ్మాయ్ ధాత్రి,
   బాగున్నావా? ఎలా వున్నారు. కబురు కాకరకాయ లేదు. ఎలావున్నావో తెలియదు. ఇలాటి టపాలు రాస్తే మాత్రమే తాతా అంటూ పలుకుతావనమాట. 🙂
   “మనకిష్టమైనది మనమే వండుకొని తినడం ఒక అదృష్టం అయితే
   మనకిష్టమైనవారు చేసిపెట్టింది తినడం మరో అదృష్టం .
   ఈ అదృష్టాలు కూడా ఇద్దరి మధ్యా మారుతూ ఉంటే ఇంకా అదృష్టం.. :)”
   చక్కటి మాట చెప్పేవు కదా:)
   ధన్యవాదాలు.

 5. వంట ఎవ్వరు చెయ్యాలనేది కాదు ప్రశ్న
  తిన దగు నెవ్వరు చేసిన ,
  నని లొట్టలు వేసుకొని, తిని నిశ్చయముగా
  చేసిన వారి నుత్సాహ పరుచoగ వలయును

  • @మోహన్జీ,
   వంట చెయ్యడం చేత కానివారు బాగుందని మెచ్చుకోడమైనా చేయకపోతే ఎలాగంటారు?. మెచ్చేసుకుందాం 🙂
   ధన్యవాదాలు.

 6. ఎప్పటిలాగే చాలా బాగా రాశారు తాతయ్య గారు.

  మీరు మరోలా అనుకోనంటే.. ఒక చిన్న కోరిక. బామ్మగారి వంటల్లో మీకు నచ్చిన వంటకాలు (అత్యాశేమో..? క్షమించండి. కనీసం ఒక్క వంటకమైనా) మీ బ్లాగ్ ద్వారా మాకూ నేర్పిస్తే చాలా చాలా బావుంటుంది. ఏవంటారు?

 7. శర్మగారూ ,
  తమరదృష్టవంతులు . మా శ్రీమతికి వంట గండ ముందని జోస్యులు సెలవిచ్చేరు . నాకైతే జోస్యం మీద నమ్మకంలేకున్నా ,
  తనకుంది మరి . ఏతావత్ , మాంచి రుచికరంగా వండడం నేర్చేసు కొన్నాను . నా ఇష్టానికి ఏది కావాలంటే అది వండుకొని లాగించెయ్యగలను . ఇంకొకరు చేసి పెట్టే వరకు నిరీక్షించే పరిస్థతే లేదు . వంటరాని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది మరి .
  నా స్నేహితులలో కొందరు శ్రీ వైష్ణవులున్నారు . భార్యలను వంట ముట్టుకో నివ్వరు . వంటా వార్పూ , జప తపాలూ పొద్దున్న ఎనిమిదింటికే ముగించేసి , భోంచేసి , రెండు పండ్లు – నీళ్ళ బాటిలూ బేగులో పడేసుకొని స్కూళ్ళకొచ్చేస్తారు . వాళ్ళను చూస్తే ముచ్చటేస్తుంది మరి. వంట నేర్వక పోవడం లోపమే కదా ! ఏమంటారు ?

  • @ వెంకట రాజారావు . లక్కాకుల గారు,
   ఎంతదృష్టవంతులు, ఎంతదృష్టవంతులు. ఏంటో నాకెవరూ ఈ సావకాశం రానివ్వలేదండి.
   ధన్యవాదాలు.

  • @జిలేబి గారు,
   నిజమైన మాట చెప్పేరు. మరొక టపా “భోజనం చేయడం కళ” వస్తోంది చూడండి. కొన్ని పేపర్లు స్కేన్ కోసం ఆగింది.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s