శర్మ కాలక్షేపంకబుర్లు- లోభికి ఖర్చెక్కువ….

లోభికి ఖర్చెక్కువ…..

6

లోభికి ఖర్చెక్కువ,ఏబ్రాసికి పనెక్కువ, తద్దినానికి కూరలెక్కువ,దరిద్రానికి ఆకలెక్కువ,దరిద్రానికి పిల్లలెక్కువ, చెల్లని రూపాయికి గీతలెక్కువ, అంటూ వుంటారు. నిజమా అని అనుమానమొచ్చింది.

ఈ మాటలని వాడేస్తోవుంటాం కాని అన్వయించుకోడం లో తడబడుతుంటాం. లోభికి ఖర్చెక్కువ. అసలు లోభి ఎవరో ఇలా చెప్పేరు.

ఆత్మానం ధర్మకృత్యంచ పుత్రదారాంశ్చ పీడయేత్
లోభాద్యః పితరౌ భ్రాతౄన్ స కదర్య ఇతిస్మృతిః

లోభమువలన ఆలుబిడ్డలను, తల్లి తండ్రులను,సోదరులను పీడించువాడు,ధర్మ కార్యాచరణమునకు వెనుకాడుచు  విలవిలలాడువాడు,కడకు తానుగూడ అనుభవింపక కృశించుచు కూడబెట్టువాడు కదర్యుడు.

లోభికి సంస్కృతంలో కదర్యుడు అని పేరు. మొన్ననీ మధ్య మా వూళ్ళో ఒక కలిగిన ఆసామీ, వడ్డీ వ్యాపారస్తుడు, అప్పు పట్టుకెళ్ళేవాళ్ళు కారుల్లో వస్తారు, లక్షకి తక్కువ అప్పు ఇవ్వడు. అదుగో అటువంటివాడు ఆటోలో తిరుగుతాడు, ఒక గోనె గుడ్డ సంచి పుచ్చుకుని, దానినిండా నూని మరకలు వగైరాతో చాలా అసహ్యంగా ఉంటుంది.అతను మాత్రం ఆ సంచిని ప్రాణప్రదంగా హత్తుకుంటాడు. నిజానికి ఆ సంచిని ఎక్కడేనా వదిలేస్తే చూసినవాడెవడూ దానిని ముట్టుకోడానికి కూడా సాహసించడు. కాని ఆ సంచిలో లక్షల రూపాయలుంటాయి, తక్కువలో తక్కువ పది లక్షలేనా ఉంటాయి. అదిగో అటువంటి ఆసామీ ఆటో దిగుతుండగా పైకి తేలిన రేకు, ఆటోది బలంగా గుచ్చుకుంది, కాల్లో. రక్తమూ వచ్చింది. కాసిని నీళ్ళు పోసి కడిగేసి ఇంటికి వెళిపోయాడు. మర్నాడు ఉదయానికి కాలు మోపు చేసింది. ఇతనికి శంఖు, చక్రాలున్నాయి, అదే బీ.పి, సుగరు. చూసినవారు డాక్టర్ దగ్గరకెళ్ళమని సలహా ఇచ్చారు. ‘ఉప్పు కాపడం’ పెట్టిస్తే అదే తగ్గిపోతుందన్నాడు,ఎవరూ ఇక చెప్ప సాహసించలేదు.రెండురోజులకి కాలు వాపు పెరిగి కాలు కింద పెట్టలేని స్థితి వచ్చేసింది, చీమూ పట్టేసింది. సలుపు పోటు భరించలేని స్థాయికి చేరేయి.అప్పుడు కొడుకు బలవంతాన పక్క పట్నంలో డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే హాస్పిటల్ లో పారేసేరు. ఇదుగో ఇప్పుడు రోజుకి వెయ్యి రూపాయలకి తక్కువ కాకుండా ఖర్చవుతోంది, ఇంకా ఎంతవుతుందో తెలియదు. అదే మొదటిరోజు డాక్టర్ దగ్గరకెళ్ళి టి.టి చేయించుకుని మందు వేసుకుంటే వందతో పోయేది, ఇప్పుడు వేలవుతున్నాయి, బాధా పడుతున్నాడు. సరిగా సరిపోయింది కదా లోభికి ఖర్చెక్కువ అన్నది.

ఏబ్రాసికి పనెక్కువ. ఇది నా గురించే చెప్పినట్లుంది. టపా మొదలుపెడతాను సగం రాస్తాను, మిగిలినది తరవాత రాద్దామని మూల పారేస్తాను. ఈ ఆలోచన కాకెత్తుకుపోతుంది. ఆ టపా అలాగే ఉండిపోతుంది, మళ్ళీ ఎప్పుడో మొదటినుంచి చూసుకుని రాస్తే అతుకుల బొంత తయారవుతుంది, వెయ్య బుద్ధి కాదు మూలపడుతుంది.మరొకటి, భోజనాలు చేస్తారందరూ, ఆ తరవాత తిన్న కంచాలు గిన్నెలు సింక్ లో పారేస్తారు, పొద్దుట చూసుకోవచ్చని. పొద్దుటికి అన్నీ ఎండిపోయి అట్టలు కట్టేసి ఎంతసేపటికి వదలవు, కంగారు, టైమయిపోతోందని. చచ్చి చెడి గిన్నెలు తోముకునేటప్పటికి చాయంగల విన్నపాలవుతాయి. పని మనిషయినా ‘కాసిని నీళ్ళ చుక్కలోస్తే నీ సొమ్మేంపోయిందమ్మా! గిన్నిలొదలవు’ అని గోల పెడుతుంది. అప్పటి పని అప్పుడు చేసుకుంటే ఉదయమే ఈ బెడద వుండదుకదా! ఇదే ఏబ్రాసికి పనెక్కువంటే! చేసినదే చెయ్యడం.

తత్+దినము=తద్దినము అనగా ఆరోజు,అదే ఏరోజు. ఎవరో కాలం చేసినరోజు.ఆ రోజు వారిని తలుచుకుని ఇద్దరిని అర్చిస్తాం. అప్పుడు పెట్టే భోజనంలో నాలుగు కూరలు, నాలుగు పచ్చడులు, పిండివంట గారెలు, అప్పాలు, అరిసెలు, చారు, పరమాన్నం విధిగా వండుతారు. రోజూ ఇన్ని వ్యంజనాలు వండుతారా? అందుకే తద్దినానికి కూరలెక్కువ అన్నది.

8

దరిద్రానికి ఆకలెక్కువ, పిల్లలెక్కువ. ఇది చాలా నిజమనిపిస్తుంది. కలిగిన కుటుంబాలలో ఒకరో ఇద్దరో ఉండేవారు. లేనివారింట్లో దోసతోటలాగా సంవత్సరానికొకరు పుడుతూనే ఉండేవారు. ఇప్పుడు అందరిళ్ళలోనూ ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటున్నారు కాని దరిద్రం మాత్రం తగ్గలేదు.
కృషితో నాస్తి దుర్భిక్షం,
జపతోనాస్తి పాతకం,
మౌనేన కలహోనాస్తి
నాస్తి జాగరతో భయం         అన్నారు పెద్దలు.
అంటే వ్యవసాయం చేస్తే దుర్భిక్షం ఉండదు అనేకాక ప్రయత్నం చేస్తే పనులు సానుకూలమవుతాయి, దరిద్రం పోతుంది. కాని కృషి కనపడటం లేదు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదేభారం అంటే ఎలాకుదురుతుంది? గాలిలో దీపం పెడితే అఛ్ఛాదన ఉండాలి ఆరిపోకుండా, అలాగే దరిద్రం పోవాలి దేవుడా అంటే పోదు, కృషి ఉండాలి.పని మొదలుపెట్టగానే ఫలితం వచ్చెయ్యలనుకుంటే కుదురుతుందా? మనం పుట్టిన తరవాత ఎంత కాలనికి ఇంతయ్యాము? అలాగే పని మొదలుపెట్టి వెంటనే ఫలితం కావాలనుకోడం అవివేకం కదా? మరో దరిద్రం ఉంది అది భావదరిద్రం, దీనిగురించి చెప్పుకుంటూ పోతే చాటు (చేట కాదు) భారతమే అవుతుంది.వీరేదో మొదలు పెడతారు, ఆగిపోతారు, ఆరంభింపరు నీచ మానవులన్న పద్యంలా ఉంటుంది వీరి చర్య. వారెవరికో భావాలొస్తాయి ఏదో రాస్తారు, వీరికి కడుపు మండిపోతూ ఉంటుంది. పోనీ వీరు వారి భావాలను పట్టుకుని కొత్త భావాలు పుట్టించుకోవచ్చుగా? అబ్బే కష్టపడలేరు కాని వారికొచ్చిన పేరు మాత్రం వచ్చేయాలనే దురాశ మిగులుతుంది. 🙂 అసలు బుఱ్ఱ లో గుంజుంటే ఒక రోజుకాకపోతే మరొకరోజు రాణిస్తుంది. మరి బుఱ్ఱ గుంజులేకపోతే? సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రయత్నం చెయ్యగా చెయ్యగా పని సానుకూల పడుతుంది. ఎలక్త్రీక్ లైట్ కనుగొన్న ఎడిసన్ ఎన్ని సార్లు విఫలమయ్యాడు?

చివారాఖరిది, చివరిదన్నా ఆఖరిదన్నా ఒకటే కదా అగ్గినిప్పులాగా! చెల్లని రూపాయికి గీతలెక్కువ. పాత రోజుల్లో వెండి రూపాయలు, అర్ధలు, పావలాలు ఉండేవి లెండి. ఆ రోజులలో నకిలీవి తయారు సత్తుతో (జింక్) తయారు చేసేవారు. చెల్లనిదాన్ని సత్తురూపాయనేవారు. దానితో చేతి మీద గీస్తే పెన్సిల్ తో గీసినట్లు పడేది, అదీగాక కిరసనాయిల్ వాసన వచ్చేది. రూపాయి నకిలీదో అసలైనదో చెప్పాలంటే వాసన చూసి చెప్పేవారు. చెల్లే రూపాయయితే ఆవూళ్ళోనే చెల్లును మనదాకా రాదయ్యా అనేవారు. అంటే పనికొచ్చేవారయితే ఆవూరువారే వుపయోగించుకుని వుండరా? అని చెప్పడమనమాట.

బాగా బోర్ కొట్టేసేనా?

11

Amarnadh yaatra.

Photos courtesy From a friend by mail

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- లోభికి ఖర్చెక్కువ….

 1. టపా చక్కగా ఉందండి.

  అమరనాధ్ యాత్ర చిత్రాలు అనుకుంటున్నాను.. చిత్రాలు బాగున్నాయండి.

  • @అనురాధ,
   అమరనాథ్ యాత్ర చిత్రాలే, మెయిల్లో మిత్రులు పంపితే పెట్టేను. నచ్చినందుకు
   ధన్యవాదాలు.

  • @సుధాకర్ జీ,
   నాకేం. అభిమాన వర్షం లో తడిపేస్తున్నారు. రొంప చేస్తే మీ దగ్గరకే వచ్చేస్తా 🙂
   ధన్యవాదాలు.

 2. శర్మ గారూ ,

  నమస్తే .

  ఈ అలవాట్లలో చిక్కుకున్న వాళ్ళకు ఇది మంచి టపా సుమండీ , తమ తప్పు తెలుసుకొని , మార్చుకునే మాంఛి అవకాశం కల్పించారు . ధన్యవాదములు .

 3. అలా చెప్పెరేమండీ శర్మ గారు !

  లోభీ పరమో దాతః అని ఆర్యోక్తి

  మనమైనా కూడ బెట్టిన దాని లో కొంత ఖర్చు పెడతాం ! లోభి ఏదీ ఖర్చు పెట్ట కుండా అంతా రాబోయే తరానికి దానమై దార పోస్తాడు కదా మరి !!

  జిలేబి

  • @జిలేబి గారు,
   పాపం లోభి నిజంగానే తరవాత తరానికి వదలిపోతున్నాడు. నిజం గా గొప్ప దాతే:) మనవారు ఇది సవ్యమని చెప్పలేదు…
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s