శర్మ కాలక్షేపంకబుర్లు-ఏభయి ఏళ్ళక్రితం విధవా వివాహం జరిపించా .

ఏభయి ఏళ్ళక్రితం విధవా వివాహం జరిపించా .

Kandukuri_Viresalingam

మొన్న చనిపోయిన చెల్లాయి ఆలోచనల్లోనే ఉండిపోతే, ఏభయి సంవత్సరాల కితం జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి.

ఏభయై ఏళ్ళకితం ఈ చెల్లాయి పెళ్ళి కలిగినంతలో వైభవంగానే చేసేను, కట్నకానుకలిచ్చి. నేను అమ్మ, నాన్నల చేత దత్తత ఇవ్వబడినా, ఆ కుటుంబంతో సంబంధాలు తెంచుకోలేకపోయా. ఆడపిల్ల పెళ్ళి అయిన తరవాత అత్తిల్లే తన స్వంత ఇల్లయినా, పుట్టింటి పై ఆశ మమకారం ఎలా నిలిచిపోతాయో! అలాగే నాకూ నిలిచిపోయాయి. అత్తవారింటికెళ్ళిన చెల్లాయి సంవత్సరం తిరగకముందే తిరిగొచ్చేసింది, అమ్మా నాన్నల దగ్గరకి, భర్త కాలం చేయడంతో. అదుగో అక్కడనుంచి మొదలయ్యాయి రుసరుసలు, ఇంట్లో. చెల్లాయిని ఏ విషయంలోను ఇబ్బంది పెట్టద్దని చెప్పి, ఆ అమ్మాయి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి వచ్చేసేం,ఇల్లాలు నేనూ. ఈ అమ్మాయి భవిష్యత్తు గురించి మొదటగా ఇల్లాలితో మాటాడేను. “చదువుకుని తను తన కాళ్ళపై నిలబడేలా చేయాలని,లేకపోతే దాని బతుకు పని మనిషికంటే హీనమైపోతుందని, పొట్ట కూటికి ఎవరి పంచకో చేరి ఈసడింపులతో బతకాలని ” ఇల్లాలు చెప్పింది, తను చదువుకోకపోయినా, పెద్దగా లోక జ్ఞానం లేకపోయినా. పెంచుకున్నమ్మని అడిగితే అప్పటికే దగ్గరగా 70 ఏళ్ళున్నామె కూడా అలాగే చెప్పింది. ఇద్దరి ఉద్దేశాలు నా ఉద్దేశం ఒకటవటంతో ఆనందమయింది.

మూడు నెలల తరవాత అమ్మ నాన్నల దగ్గరకెళ్ళి చెల్లాయికి చదువు చెప్పిస్తాను, రాజమంద్రి వీరేశలింగం విడోహోం లో చేర్పిస్తానని చెప్పేను. అమ్మ “నీకు మంచిదనితోచిన పని చెయ్యి,అని చెబుతూ నాన్న గారినడిడిగేవా?” అంది. అప్పటికి కూడా నాన్నగారితో మాట్లాడటమంటే భయమే! అమ్మను తీసుకుని వెళ్ళి అమ్మను చెప్పమన్నా. వివరాలు అమ్మ నాన్న్నగారికి చెబితే లావా చిమ్ముతుందనుకున్న అగ్ని పర్వతం హిమం కురిపించింది. “అబ్బాయి నీవు తప్పు చేయవని, చేయలేవని నా నమ్మకం, ఆ పిల్ల భవిషత్తుకొరకు ఏమి చేస్తే మంచిదో అది చెయ్య”మన్నారు. చెల్లాయిని తీసుకొచ్చి విడో హోం లో చేర్చాను, పండిట్ కోర్స్ చదవటం ప్రారంభించింది . ఇంట్లో సన్న సన్నగా మాటలు వినపడుతూ వచ్చాయి.అమ్మ నేను తప్పించి మరెవరూ చెల్లాయిని తొంగి చూసిన వారు లేరు. నేను వారానికి ఒక సారి వెళ్ళి చూసివచ్చేవాడిని. రెండు సంవత్సరాలు గడిచాయి.

అక్కడ వాతావరణం, అడపాదడపా జరుగుతున్న వివాహాలు చూసిన చెల్లాయికి వివాహం మరల చేసుకోవడం తప్పు కాదనే అభిప్రాయం కలిగించే సావకాశం కలిగింది.ఒక రోజు హోం సూపరింటెండెంట్ ఫోన్ చేసి రమ్మన్నారు. వెళితే ఆమె  చెల్లాయిని వివాహం చేసుకోడానికి ఇద్దరు ముగ్గురు సానుకూలత వెలిబుచ్చారని, కాని తానే చాలా కారణాలకి తిరస్కరించానని చెబుతూ, “ఒక సంబంధం వచ్చింది, నాకు అన్ని విధాలా నచ్చింది, వయసు తేడా కూడా లేదు గార్డియన్ గా మీ ఉద్దేశం చెప్ప”మన్నారు.”మరో సంగతి, ఈ అమ్మాయి చదువులో అసాధారణంగా లేదు కనక వివాహం చేయడం మంచిదని నా సలహా.అమ్మాయిని ఒప్పించే బాధ్యత నాదే” అని చెప్పేరు. “నేను నాకుగా నిర్ణయం తీసుకోలేను కనక పెద్దలనడిగి చెబుతానని” వచ్చేశాను.

మొదటగా ఇల్లాలితో ఆలోచిస్తే వివరాలు చూసి బాగుంటే పెళ్ళి చేసేయమంది. ఇద్దరం పెంచుకున్నమ్మ దగ్గరకెళ్ళి చెబితే “శుభస్య శీఘ్రం” అంది. ఇంట గెలిచాను. ఆమ్మ, నాన్న ల దగ్గరకెళ్ళి ఇద్దరినీ కూచోబెట్టి విషయం చెప్పేను. ఇద్దరూ “నీకు మంచిదని తోచినది చేయమని” చెప్పేరు. అప్పటికి చాలా వయసున్న మా మేనత్త దగ్గరకెళ్ళి విషయం చెప్పి “ఇబ్బంది కలుగుతుందేమో” అని అనుమానం వెలిబుచ్చితే “ఎవడ్రా! పెళ్ళికి అడ్డొచ్చేది? నేను వస్తా!పెళ్ళి ఎవడాపుతాడో చూస్తా” అని ఆవేశపడింది.” పెళ్ళి చేసెయ్య”మని ప్రోత్సహించింది. ఇంతమంది పెద్దలను ఒప్పించగలిగాను కాని చిత్రంగా సమకాలీకులనుంచి వ్యతిరేకత ఎదురయింది. లెక్క చేయలేదు,పెళ్ళికొడుకు వివరాలు కూలంకషంగా తెలుసుకుని, ముందుగా సంప్రదించిన పెద్దలందరికీ చెప్పి, వివాహం జరిపించాను. అప్పుడు తీసిన ఫోటో ఉండేది, కనపడలేదు. అందులో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, నేను, వివాహం చేయించిన బ్రహ్మగారు, మా అమ్మ, అత్తయ్య తప్పించి మరెవరూ పెళ్ళికి కూడా రాలేదు.

అలా ఇబ్బందుల మధ్య ఏభయి సంవత్సరాలకితం విధవా వివాహం జరిపించా, స్వంత చెల్లెలికి. అంతా సవ్యంగా జరిగిపోతే ఇది జీవితమెందుకవుతుందీ?

ప్రకటనలు

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏభయి ఏళ్ళక్రితం విధవా వివాహం జరిపించా .

 1. వీరేశలింగం గారి చిత్రపటం తో పోస్టు మొదలెట్టడం బాగుంది. మీరు ఆ రోజులలోనే ఈ పని చేయడం మీలోని చైతన్యానికి ప్రతీక. అభినందనలు సరు. వీరేశలింగం గారి ఫోటో ప్రతి మహిళా ప్రతి ఇంట్లో పెట్టాలి. కానీ నేటి తరం చరితను అన్నింటా మరచిపోతున్నది.

  • @మిత్రులు కొండలరావుగారు,
   నేడు ప్రభుత్వాలు, మన ఇళ్ళలో కూడా చరిత్ర గురించి మాటాడటానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడు కూటికి లేక బాధపడినవారమని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నారు. ఫాల్స్ ప్రెస్టిజ్ లో కొట్టుకుపోతున్నారు.నేడు ప్రతి స్త్రీ వీరేశలింగంగారి గురించి తెలుసుకుని తీరాలి.స్త్రీ స్వాతంత్ర్యం ఏంటో అదెంత విలువైనదో కూడా తెలుస్తుంది.
   ధన్యవాదాలు.

 2. ఒకందుకు మీరు అదృష్టవంతులు , మీతో కూడా మీ శ్రీమతీ , మీ తల్లి దండ్రులు కూడా అందరికీ ఆదర్శం !
  ఎందుకంటే , ఈ ఇంటర్నెట్ కాలం లో కూడా భర్త పొతే ,రాత బాగాలేదనీ , శని అనీ, వితంతు వైన భార్యను రక రకాలు గా మందలించే వారూ , హింసించే వారూ ఇంకా ఉన్నారు కదా !
  మీరు యాభై ఏళ్ల క్రితమే , ఇంటర్నెట్ కాలం కన్నా ముందుకు పోయారు ! ఇది నిజం గా మీరు గర్వ పడే విషయమే !

  • @సుధాకర్ జీ,
   ఈ విషయంలో నా భార్య చదువుకోనిదయినా, లోక జ్ఞానం అప్పటికి లేకపోయినా నాకు పూర్తి సహకారమిచ్చింది.నా పెంచిన తల్లి సహకారం మరువలేనిది. వీరిద్దరూ సహకరించకపోతే నేను చేయగలదేమీ ఉండేది కాదు. పెద్దవాళ్ళంతా విషయాన్ని తెలుసుకుంటూ మార్గదర్శనం చేశారు. నేను ఇమిత్త మాత్రునిగా పని పూర్తి చేశాను.
   ధన్యవాదాలు

 3. శర్మ గారూ ,

  నమస్తే .

  స్త్రీకి కూడా , మగవాళ్ళలా కోరికలుంటాయని , అవి తీరే మార్గాన్ని అణచివేతే అర్హతగా భావించారు మన పూర్వీకులు . నిజంగా ఆ కోరికలని అలా బలవంతంగా అణచిపెడ్తే ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవలసివస్తుందన్నది గ్రహించక , పరువు ప్రతిష్టలు , ఆచారం సంప్రదాయలంటూ ఒంటికి వదిలించుకోలేనంతగా పట్టించుకున్నారు .
  సరిగ్గా అటువంటి సమయంలోనే శ్రీ వీరేశలింగం పంతులు గారు ఈ విధవ పునర్వివాహాన్ని చేసుకోవటం తప్పులేదని , దాన్ని చట్టబధ్ధం చేయించటం స్త్రీ జీవనసరళిలో వచ్చిన చక్కటి మార్పు .
  అయితే దీనికి ముందర మన పెద్దలు ఆచరించిన మరో ఘోర తప్పిదం ఉంది . అదే ” బాల్య వివాహం ” . ప్రపంచంలో చేసే ప్రతిపనికి ఓ కారణం వుంటుంది అన్నది అక్షర సత్యం . నిజానికి ఆ బాల్య వివాహాల వల్లనే చాలా మంది స్త్రీలు విధవలుగా మిగిలిపోయారు .
  మీరు ఈ విషయాన్ని ఆ వయసులో అర్ధం చేసుకొని వివాహం జరిపించటం చాలా మంచి పనే .

  • @శర్మాజీ
   స్త్రీకి శారీరికమైన కోరికలే కాక ఆర్ధిక స్వాతంత్ర్యం కూడా కావాలి. చాలా అవసరం.అది వెర్రి తలలు వేయకూడదు అది వేరు విషయం.
   ధన్యవాదాలు

 4. ఇలాంటి థీం నే స్వాతిముత్యం సినిమాలో చక్కగా చూపించారు విశ్వనాథ్ గారు. ఆరోజుల్లో ధైర్యంగా మీరు చేసిన పంచి మంచి ఫలితాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను.

  • @surya గారు,
   అవసరం ధైర్యాన్నిచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నా.సినిమాలలో ఇతరత్రా ఇటువంటి ఆదర్శాలు చెబుతారు, ఆచరణ చాలా కష్టం, కష్టం ఎలా ఉంటుందో నేటి టపా చూడండి
   ధన్యవాదాలు

  • @Prameela Vedantamగారు,
   నా చెల్లాయి, ఆ నాటి బాధలు పడుతున్న విధవలలా బాధలపాలు కాకూడదన్నదె నా ఉద్దేశం.
   ధన్యవాదాలు

  • @లలిత గారు,
   ఏభయి ఏళ్ళ కితం ఆడవారి పరిస్థితి అందునా విధవల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. దానినుంచి ఈ అమ్మాయిని కాపాడాలనుకున్నా! అది నా స్వార్ధమే! ఆదర్శం కాదేమో అనుకుంటా.
   ధన్యవాదాలు

  • @పంతుల జోగారావు గారు,
   ఆదర్శాలను ఆచరణలోకి తెచ్చేటప్పుడుండే బాధ ఎలా ఉంటుందో బాగా అనుభవం లోకి వచ్చింది.
   ధన్యవాదాలు

 5. శర్మ గారూ, చాలా ఉదాత్తమమైన పని చేసారు మీరు. అటువంటి సత్కార్యం చెయ్యటం నిజంగా కష్టమైనదే – ముఖ్యంగా ఏభై ఏళ్ళ క్రితం.

  • @విన్నకోట నరసింహారావు గారు,
   నాడు పడిన కష్టాలు నేటి టపాలో చూడండి. ఆదర్శం అనుకోలేదు, అవసరమే అలా నడిపించిందనుకున్నా.
   ధన్యవాదాలు

 6. మిత్రులు శర్మగారు,
  ఆదర్శాలు వల్లెవేసే వాళ్ళూ వాటి గురించి ఉపన్యాసాలు దంచేవాళ్ళూ లోకంలో చాలా మందే‌ కనిపిస్తారు.
  కానీ, ఆదర్శవంతమైన పనికి సాహిసించేవాళ్ళు అరుదు.
  అలాంటి ఆదర్శకార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేర్చే మీలాంటి వాళ్ళింగా అరుదు.
  మీరు చేసింది నిస్సందేహంగా గొప్పపని.
  మీ ఈ టపా నాకు చాలా సంతోషం‌ కలిగించింది.
  టపాను శ్రీకందుకూరి వీరేశలింగం పంతులుగారి చిత్రపటంతో అలంకరించటం సముచితంగా ఉంది.
  ఆదర్శవివాహం తాలూకు ఛాయాచిత్రం కాలక్రమంలో దొరుకుతుందని ఆశిస్తున్నాను.
  అప్పుడు తప్పక ఈ టపాను పునఃప్రకటిస్తూ ఆ ఛాయాచిత్రాన్నీ జోడించండి.
  మీకు శ్రీరామచంద్రులవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉందని విశ్వసిస్తున్నాను.
  నాకు ఒక విషయం గుర్తుకు వస్తోంది. మామిత్రులు ఒకాయనగారి సోదరి విధవరాలు, ఇరవైల్లో ఉన్న అమ్మాయి. ఆయన కుటుంబమూ, నేనూ, మా ఆమ్మగారూ నలభై సం॥ క్రిందట కాశీ వెళ్ళివచ్చినప్పటి మాట. మా అమ్మగారు మహాఛాందసురాలని నా అబిప్రాయం. అటువంటి ఆవిడ ఆ అమ్మయిని చూసి, అమ్మా జరిగిందేదో‌జరిగింది, నీతప్పు లేదు గదా, నువ్వేందుకు సిగ్గుపడుతూ బొట్టూ అలంకారాలు వదలాలీ, లక్షణంగా అన్నీ‌పెట్టుకో, ఎవరికీ భయపడవలసింది లేదు అని సలహా ఇచ్చారు. నాకూ మా మిత్రుడికీ చాలా సంతోషం కలిగింది.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   నిజానికి అవసరం ఆదర్శం నేర్పిందేమో! మీ సూచన గమనించా.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s