విధవా వివాహం-అనంతర కష్టాలు.
నిన్నటి టపాలో, మొన్న చనిపోయిన చెల్లాయి విధవా వివాహం గురించి చదివారు కదా! తదనంతర కష్టాలు, నాటి సమాజం,బంధువులు ప్రవర్తించిన తీరు చదవండి.
ఏదయినా ఆదర్శం గురించి చదవడం బాగానే ఉంటుంది కాని ఆచరణలోనే కష్టాలొస్తాయి. అది అచరించేటపుడొచ్చే కష్టాలు చూసి తోటివారు నవ్వినపుడు ఉండే బాధ చెప్పనలవికాదు. పైకి ఆహాహా! అని మాట్లాడి వెనక చేరి చెవులు కొరుక్కునేవారిని చూసి బాధపడటం మినహా చేయగలది లేదు. ఇది కావలసినవారే అయితే పుండు మీద కారం చల్లినట్లే ఉంటుంది.ఈ వివాహం జరిగినప్పటి కాలానికి సంఘం ఇంకా ఇంత మారలేదు. ఆనాటికది చాలా సాహసకార్యం. కుటుంబ సభ్యులు, చుట్టాలు, కావలసినవారు, తెలిసినవారు, అంతా వెలి వేసేరు, అప్రత్యక్షంగా. ఎదుట ఓహో! అనేవారు, వెనక చెవులు కొరుక్కునేవారు. “ఈ నాటికి ఒక అప్రాచ్యుడు బయలుదేరేడు వంశంలో” అని తిట్టిన వారు, “ఈ తరవాతవారికి వివాహాలవుతాయా?” అని నిలదీసినవారు, మొహం మీదే తలుపులేసుకుని లోపలికెళ్ళిపోయినవారు, గుమ్మంలో కెళితే మంచినీళ్ళు కూడా ఇవ్వనివారు ఎంతమందో,నా ఇంటికొచ్చినవారు లేరు, ఎన్ని రకాల అగచాట్లో!,ఎన్ని అవమానాలో!
ఆదర్శమో, ఏమో కాని వివాహం జరిపించాలునుకున్నా, ఆ అమ్మాయి జీవితానికి ఒక దారి ఏర్పాటు చేయాలనుకున్నా, చేశాను. కాపరానికి వెళ్ళింది, కనిపెట్టి చూస్తూనే ఉన్నాను. రెండేళ్ళు గడిచాయి. ఒక రోజు హఠాత్తుగా చెల్లాయి తనకు పెట్టిన బంగారపు నగలన్నీ పెట్టుకుని, నా ఇంటికి అర్ధరాత్రి వేళ వచ్చేసింది. ఏమయిందని అడిగితే “నేనీ కాపరం చేయలేన”ని చెప్పింది. వివరాలు తెలుసుకోవచ్చనుకుంటుండగానే ఉదయమే బావగారొచ్చేసేరు, నా మీద యుద్దానికి. ఆయనను కూచోబెట్టి అసలు ఏమి జరిగినది తెలుసుకోవాలని ప్రయత్నం చేశా. ఆయనెంతసేపు ఈ అమ్మాయి తప్పులు చెప్పుకొచ్చాడు. అమ్మాయి లోపలనుంచి రంకెలేసింది. మీరిద్దరూ ఇలా చేయడం బాగోలేదని చెబితే ఆయన “నా బంగారమంతా తెచ్చేసిందని” ఏదో ఏదో మాట్లాడి పోలీస్ కంప్లయింట్ ఇస్తానని రంకెలేసేడు. “మీరేం చేయదలచుకున్నా వద్దని నేను బతిమాలను కాని నేను చేయవలసినది కూడా చేస్తాను. సమస్య వుంటే పరిష్కారం ఆలోచించాలి తప్పించి, ఆవేశం కూడ”దంటే తగ్గేడు. “మీరు బంగారం తెచ్చిందన్నారు కనక అదంతా మీకు చూపుతున్నా,ఇదంతా మీరు పెట్టినదేకదా, ఈ బంగారానికి, మీ భార్య రక్షణకి నాది హామీ, కావాలంటే కాయితం రాసిస్తానని” బంగారం ఏమి తెచ్చినది వివరంగా రాసి అది నా అధీనం లో ఉన్నట్లు హామీ రాసి ఇచ్చేను.అమ్మాయి ఎప్పుడు మీతో నిర్భయంగా కాపురం చేయగలననుకుంటుందో అప్పుడు పంపుతాను, ఈ నగలన్నిటితో సహా, కాలం కోసం వేచి ఉండమని చెప్పేను. పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరూ వారి వారి పట్టుదలల నుంచి సడలలేదు. ఇంక కావలసినవారు, తెలిసినవారి దగ్గరనుంచి ఓదార్పులు, పరామర్శలు, ఎత్తిపొడుపులు ఎన్నెన్నో! సహించాం, ఇవన్నీ నా ఇల్లాలు కూడా సహించింది..కావల్సినవారంతా, కుటుంబ సభ్యులతో సహా మమ్మల్ని వెలే వేశారు. మా బాగా జరిగిందని లోపల సంతోషించినవారు, పనిగట్టుకు వచ్చి పుండు కెలికినట్లు విషయం మాట్లాడినవారు, తమ ఇళ్ళలో తగవులే లేవన్నట్లుగా చెప్పుకొచ్చిన వారు,ఇంతకంటే గోదావరిలో పడిఛస్తే మేలని దీవించినవారు, రకరకాల మనస్తత్వాలనూ చూశాం, రక రకాల పీడముఖాల్నీ చూశాం,.ఇలా చేసినవారంతా బంధువులే!
దగ్గరగా రెండు సంవత్సరాలు నడిచాయి. ఒక నాడు బావగారి దగ్గరనుంచి చెల్లాయికి ఉత్తరం వచ్చింది. “వచ్చెయ్యమంటున్నారు” అని చెప్పింది. “నీకు ఇష్టమయితే వెళ్ళు, వద్దని చెప్పలేద”ని చెప్పేం. తాను ఇక్కడనుంచి ఉత్తరం రాసింది, వచ్చేస్తాను, వచ్చి తీసుకు వెళ్ళమని. ఒక రోజు బావగారు వచ్చేసేరు. భార్యా భర్త ఇద్దరూ చిలకా గోరింకల్లా కబుర్లు చెప్పుకున్నారు,బజారు కెళ్ళేరు కావలసినవేవో కొని తెచ్చు కున్నారు. నిజంగా నాకే ఆశ్చరమనిపించింది, భయమూ వేసింది, ఇదేమయినా కుట్రేమోనని. భోజనాలయిన తరవాత వెళ్ళొస్తామని చెప్పేరు. మీరు అలా వెళ్ళాడానికి వీలు లేదని అడ్డగించా. ఈ అమ్మాయి నా దగ్గరకొచ్చినప్పుడు తెచ్చిన నగలు దగ్గరగా 50 తులాల బంగారం నా దగ్గరుందని హామీ రాసిచ్చేను, మీరు మళ్ళీ తీసుకు వెళుతున్నట్లు నాకు రశీదివ్వలేదు, అదీకాక ఈ అమ్మాయి ఒకప్పుడు తనకు ప్రాణహాని ఉందని నాదగ్గర వాపోయింది, అందుకని ఆ అమ్మాయి ప్రాణానికి హామీ, మీ బంగారం ముట్టినట్ళు రసీదు రాసిచ్చి తీసుకువెళ్ళమన్నాను. అలాగే హామీ పత్రం రాసిచ్చి తీసుకు వెళ్ళేరు. వీరిని పరిశీలిస్తూనే వచ్చేను, ఇద్దరు పాలూ నీరూలా కలిసిపోయారు. అదృష్టం తలుపు తట్టింది, ఆయన సంపాదన పెరిగింది. బంగారం కొనుక్కునారు,ఇళ్ళు వాకిళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బాగా నడుస్తోదనుకుంటూ ఉండగా ఒక రోజు నన్ను అర్జంటుగా రమ్మని ఉత్తరమొస్తే భయపడుతూ వెళ్ళేను. బావగారు నన్ను కూచోపెట్టి “నాకున్న ఆస్థి పాస్థులనీ మీ చెల్లాయికి రాసేద్దామనుకుంటున్నాను, ఆ ఏర్పాట్లు చూడ”మన్నారు. “తొందరపడుతున్నారేమో ఆలోచించమన్నా”. “కాదు ఇది నా నిర్ణయం, మారద”ని చెప్పేరు మొత్తానికి ఆయన స్వదస్తూరితో తనకున్న ఆస్థి పాస్థులన్నిటినీ చెల్లాయి పేర రాసి రిజిస్టర్ చేయించారు.ఈ చెల్లాయికి పిల్లా పాపా కలగలేదు.
ఎప్పుడు సంపదకలిగిన
నప్పుడె బంధువులువత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెఱువునిండిన
గప్పలు పదివేలు చేరు కదరా సుమతీ!
అది మొదలు చెల్లాయి నాతో పలకడం తగ్గించేసింది. పోనీ తను బాగుందికదా అని సరిపెట్టుకున్నా. కొన్నాళ్ళకి పూర్తిగా మాటాడటమే మానేసింది, నా గుమ్మంలోకీ రాలేదు…
ఇంతకు మించి చెప్పలేను.కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది, పెదవి కొరుక్కుంటే, కొరకబడిన పెదవీ నాదే, పన్నూ నాదే, ఏమనుకోగలను? .దగ్గరగా ఆరేళ్ళకితం బావగారుపోయి నప్పుడు ఉత్తరం రాస్తేవెళ్ళి పలకరించి, బట్ట పెట్టి వచ్చా! తన వివరాలేం చెప్పలేదు. అదిగో ఆ తరవాత మళ్ళీ మొన్న అన్నయ్య పోయినపుడు వచ్చింది, పలకరించా! కొద్దిగా అనారోగ్యంగా ఉంది కాని ఇలా జరుగుతుందనుకోలేదు. పెద్దక్కగారి పెద్దబ్బాయి దగ్గర ఉంటోందిట.హటాత్తుగా కాలం చేసింది..
రెండేళ్ళక్రితం మనవరాలు చి. రసజ్ఞ ఈ అనుభవం సవివరంగా అక్షరబద్ధంచేయమంది, కాని చేయలేకపోయా, ఇప్పటికీ పూర్తిగా చేశాననుకోను.!
బాధ్యతని,ఆదర్శాన్నీ ఎంత గొప్పగా ఆచరణలో పెట్టారో తాతగారు.
మీ టపా చదివిన తర్వాత
ఎన్ని సమస్యలొచ్చినా బాధ్యతని ఎలా నెరవేర్చుకోవాలో?నమ్ముకున్న సిద్దాంతాలకు ఎలా కట్టుబడి ఉండాలో తెలుసుకున్నాను..
మీ అడుగుజాడల్లో నడిచిన మామ్మగారు కూడా ఆదర్శప్రాయులు ..
@ధాత్రి,
ఆరంభింపరు నీచమానవులు పద్యం చదువుకోవాలి, కర్తవ్యం నిర్వర్తించాలి. కష్టాలంటావా మనుషులకు కాకపోతే మానులకొస్తాయా అంటారు మనవారు.మంచి మనసుతో పని చేస్తే ఫలితం కూడా బాగానే ఉంటుంది. నా ఇల్లాలు, పెంచిన తల్లి, నా మేనత్త ధైర్యం ఇవ్వకపోతే నేనేం చేయగలను?అంటే శక్తి ఎవరూ? స్త్రీ…….లలితాదేవి, మరువకండి.
ధన్యవాదాలు.
శర్మ గారూ ,
నమస్తే .
ఎవెరెట్లాగున్నా , ఏమన్నా నీరు చేయదలుచుకున్నది , చేయవలసినది ఓ తోడబుట్టినవాడిగా బహు చక్కగా , భేషుగ్గా నిర్వర్తించటంలో చాలా ఆనందదాయకం , ఆత్మసంతృపి వున్నాయన్నది నిజం .
ధర్మో రక్షతి రక్షతి అన్నదే మనం తీసుకోవాలి . ధర్మాన్ని అనుసరిస్తే ( ఆచరిస్తే )అది మనల్ని అనుక్షణం నీడలా వెన్నంటే వుంటుంది అన్నది అనుభవయోగ్యమే .
@శర్మాజీ,
మీరన్నట్లు నా విధి నేను నిర్వర్తించాను, జీవితంలో ఆ ఆత్మ తృప్తి మిగిలింది.
ధన్యవాదాలు.
SARMA GARU MEE JEEVITAME OKA CHARITRA. MEE ANUBHAVALU ENDARIKO MARGADARSAKALU.
@ఉషగారు,
ప్రతివారి జీవితంలోనూ అన్ని సంఘటనలూ జరగవు. ఎదుటివారి జీవితం నుంచి పాఠాలు నేర్చుకుంటే సుఖపడతాం.
ధన్యవాదాలు.
బంధువులు రాబందులు ఆత్మబంధువులు ఇలా రకరకాలుగా ఉంటారు. మీరు చేయాల్సింది చేశారు. మీరు చేసింది మనిషిగా చేయాల్సింది. సమాజమెప్పుడు ఆయా కాలమాన పరిస్తితులలోని నీతిని మాత్రమే అనుసరించేందుకు ప్రయత్నిస్తుంది. వాటి పరిధి దాటి చైతన్యవంతంగా ఆలోచించగలిగేవారు, ఆచరణలో ఆటుపోట్లను తట్టుకోగలిగేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అది వీరేశలింగమైనా , మన శర్మ గారైనా… అలా కొందరే… ఆ కొందరే సమాజ మనుగడకు శ్రీరామరక్ష లాంటి వారు. అభినందనలు శర్మ గారు.
@మిత్రులు కొండలరావుగారు,
నిజమేనండి. నాకు చేయాలనిపించింది చేశాను. నా ఇల్లాలు, పెంచిన తల్లి, మేనత్త సహకరించారు, అందుకు అదృష్టవంతుడిని.
ధన్యవాదాలు.