శర్మ కాలక్షేపంకబుర్లు- మంత్రం

మంత్రం

2

మంత్రాలకి చింతకాయలు రాలతాయా? దీనికి అవుననేవారు, తెలియదనేవారు, రాలవు అనేవారు ఉన్నారు. కాని మన సమాజంలో మంత్రాలున్నాయని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. చిత్రం ఏమంటే మన నిత్య వ్యవహారం లో దిష్టికి మంత్రం, బెణుకుకి మంత్రం, చప్పికి (సర్పికి) మంత్రం, తేలు కుడితే మంత్రం, పాము కరిస్తే మంత్రం, ఇలా చాలా విషయాలకి మంత్రాలు వేస్తారు. అలాగే ఈ మంత్రాలు జపించి చాతబడి, చిల్లంగి లాటి దుష్ట ప్రక్రియలు కూడా చేస్తారని నమ్మకం ఉంది. మంత్రాలున్నయని చెబుతూ లేవనేవారు, మంత్రాలు లేవని చెబుతూ ఉన్నాయని నమ్మేవారు కూడా ఉన్నారు, మన సమాజంలో. మాటే మంత్రమూ అన్నారొక సినీ కవి.

1961 వ సంవత్సరం,టెలిఫోన్ ఆపరేటరుగా ఉద్యోగంలో చేరి వారం కూడా అయి ఉండదు. ఒక రోజు రాత్రి డ్యూటీ చేస్తున్నా. సాధారణంగా రాత్రి పని చాలా తక్కువగానే ఉండేది. రాత్రులు పని ఉండదు పడుకోవచ్చు, ఎవరైనా ఫోన్ ఎత్తితే ఆలారమ్ వస్తుంది అది వెసుకుని పడుకోమన్నారు, సీనియర్లు. నాకయితే ఇది నచ్చలేదు, పుస్తకం పట్టుకుని కూచుని చదువు కుంటున్నా, అప్పుడప్పుడు సిగరెట్లు ఊదేస్తూ.

రాత్రి రెండు గంటల వేళ ఒక రైసుమిల్లు నుంచి ఫోన్ ఎత్తేరు. నేనున్నదే ఒక పల్లెటూరు, దానికి దూరంగా ఉన్న మరొక పల్లెలో ఉంది ఈ మిల్లు. ఆన్సర్ చేసేను. బహుశః ఈ తరానికి టెలిఫోన్ ఎక్స్ఛేంజి లో ఆపరేటర్ ఉండి ఫోన్ ఎత్తితే నంబర్ ప్లీస్ అనడం తెలిసిఉండదు. ఈ ఉద్యోగంలో, ఆ రోజుల్లో, ఆడవారు ఎక్కువగా ఉండేవారు. రాత్రులు వారికి ఉద్యోగం ఉండేది కాదు, మొగాళ్ళకి తప్పించి. వారిని పెద్ద పట్టణాలలో వేసి మాలాటి నిర్భాగ్యులను పల్లెలలో పారేసేవారు, మగాళ్ళం కనక.దారి తప్పిపోతున్నాం కదూ. రైస్ మిల్లు నుంచి అర్జంటుగా పక్క ఊరి రయిల్వే స్టేషన్ కావాలండి, ఒకరికి పాము కరచింది అన్నారు. నాకయితే విషయం బోధపడలేదు, పక్క ఊరి రయిల్వే స్టేషన్ కావాలన్నది తప్పించి,. నట్టువాంగం అంతా ఒకణ్ణే కనక, అనగా కాల్ బుక్ చేసేవాణ్ణి ఇచ్చేవాణ్ణి ఒకణ్ణే కనక అర్జంట్ అంటున్నారు కనక వెంఠనే పెద్ద ఉరికి పిలిస్తే వారు కావలసిన ఊరు లైన్ కలిపేరు. అదృష్టం ఇద్దరూ పలికేరు, వెంఠనే రైల్వే స్టేషన్ కనక్షన్ ఇచ్చాడు, మరో అదృష్టం స్టేషన్ మాస్టరు పలికేరు. ఆయనకి ఇలా పాము కరిచిన విషయం చెబితే ఏం చేసేడో తెలియదు కాని వచ్చి పాముల నరసయ్య గారు లేవమంటున్నారని చెప్పమని చెప్పి పెట్టేసేడు.    .

కాల్ అయిపోయిన తరవాత చివరి ఊరి ఆపరేటర్ లైన్ లోకి వస్తే అసలిదేంటని అడిగాను. అప్పుడతను” రైల్వే లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా నరసయ్య అనే ఆయన విజయవాడ డివిజన్ లో పని చేసేవారట. ఆయన పాము మంత్రం వేసేవారట. అలా ఆయన డ్యూటిలో ఉండగా వెయ్యడం చేసేవారట, ఆ తరవాత కాలం లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మరొకచోట ఉంటే కంట్రోల్ లో మాటాడి ఆయన డ్యూటీలో ఆక్కడ ఉంటే మంత్రం వేసేవారట, ఆ తరవాత ఇది కూడా కష్టమవడంతో కంట్రోల్ కి ఒకటి ఏదో కట్టి ఇటువంటివి వస్తే అక్కడ చేప్పి ఆ తరవాత రోగి చెవిలో పాముల నరసయ్య లేవమంటున్నారని చెపితే లేచి కూచునేవారట. ఇది అలా అలవాటయ్యింది అన్నాడు.

naturetree

కుతూహలం ఆగక ఊరిలోని మిల్లుకు ఫోన్ చేసి పాము కరచినతను ఎలా ఉన్నాడంటే వాళ్ళు ఇందాకానే రోగిని తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేడు. అతని ఆరోగ్య వివరాలు తెలియలేదు. కాని నా కుతూహలం మాత్రం పెరిగింది. మంత్రాలున్నాయా అని.ఆ తరవాత కూడా చాలా సార్లు ఇటువంటి కాల్స్ ఇచ్చాను. ప్రతివారు రోగిని బంధువులు తీసుకుని వెళ్ళేరని చెప్పేవారు తప్పించి తరవాత ఏమిజరిగింది తెలిసేది కాదు.

చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము:

వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II

మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

సామవేదం షణ్ముఖశర్మ గారి ఋషిపీఠం నుంచి

సాధారణంగా మంత్రమెప్పుడూ గోప్యమే! కాని ఇటువంటి మంత్రాలు ఎవరయినా పఠించచ్చు, అందుకు వీటిని ప్రముఖంగా చెప్పినా తప్పులేదు. అవసరాన్ని బట్టి ఉపయోగించుకోండి.  

దీన్ని పఠించే ముందు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుగుకోండి, తిలకం ధరించండి! దిష్టి తీయ్యాలనుకున్న పాపను చేతులోకి తీసుకోండి.విభూదిగాని, చందనంగాని చేతులో తీసుకోండి, మూడు సార్లు దీనిని పఠించండి, ఆ తర్వాత బిడ్డ ముఖాన, హృదయం, వీపు, చేతులు,ఇలా సర్వాంగాలమీద రాయండి.

3

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- మంత్రం

 1. మంత్రాలకు శక్తి ఉంటుందా లేదా అన్న విషయానికొస్తే ,
  మంత్రాలకు శక్తి ఉంటుంది ! ‘మనం కోరుకున్నవి జరుగుతాయి’ అనే మానసిక ధైర్యమూ , శక్తినీ కలుగ చేస్తాయనడం లో సందేహం లేదు ! ఉదాహరణకు ‘ రోజూ మంత్రోచ్చారణ చేస్తూ ,’ నేను పాసవుతాను ‘ అనే ఆశావాద దృక్పధం తో కనుక చదువుతూ ఉంటే , ఆ విద్యార్థి కి, ఆ దృక్పధం ఎంతో ధైర్యం కలిగించి , పరీక్షలో పాసయే అవకాశాలను పెంచుతుంది ! ఇక్కడ విద్యార్ధి కర్తవ్యానికి, మనోశక్తి కూడా తోడవుతుంది !
  ఇక పాము మంత్రం విషయానికి వస్తే,
  పాము విషం , పాము ను బట్టి ఉంటుంది ! ఉదాహరణకు , తాచు పాము కరిస్తే , బతికి బట్ట కట్టిన వారు ఉండరు, ఆ విషం విరుగుడు కు, ఇంజెక్షన్ కనుక వెంటనే చేయించుకోక పొతే !
  సాధారణం గా రాత్రులలో పాము కరిస్తే , ఆ పాము, ఏ పామో , తెలియదు , చాలా మందికి ! అంటే, అది విష పూరితమా , లేదా అనే విషయం ! అట్లాగే , రాత్రులలో చరించే పాములు విష పూరితమైనవి అయినా కూడా , వాటి ఆహారం కోసం , మిగతా చిన్న జంతువులను కాటేస్తే , ఆ సమయం లో వాటి విషం తగ్గి పోయి ఉంటుంది , ఆ విషం మళ్ళీ ఏర్పడడానికి కొన్ని రోజులు పడుతుంది ( పాము లో విష గ్రంధులు , వాటి జీవనం కోసం పరిణామం చెందిన లాలా జల గ్రంధు లే అన్న విషయం మనం మరువ కూడదు ! ) అట్లా విషం తగ్గిపోయిన పరిస్థితి లో కనుక , మానవులను కానీ , ఇంకో జంతువును కానీ మళ్ళీ కరిస్తే లేదా కాటు వేస్తే , అప్పుడు ప్రాణ హాని తక్కువ అవుతుంది ! ఆ సమయం లో,మంత్రాలు వేసే వారు, మహిమాన్వితులు గా చెప్పుకో బడతారు, అందరిచేతా ! ఇక వయసులో పెద్ద వారు, కనుక పాము కాటుకు గురి అవుతే , విపరీతమైన భయం వల్ల షాక్ కు లోనై కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది !
  అనేక విషపూరితమైన పాముల విషాన్ని విరుగుడు చేసే అత్యుత్తమ ఇంజెక్షన్ లను కనుగొన్నారు కూడా ! కానీ , ఆచరణ లో చిత్త శుద్ధి లేక పోవడం వల్ల , అత్యంత అవసరం ఉన్న చాలా ఊళ్ళ లో , ఆ ఇంజెక్షన్ అందుబాటు లో లేక , ప్రాణాలు కోల్పోయే వారు మన దేశం లో ఏడాది కి అక్షరాలా నలభై ఆరు వేల మంది ! ( The American Society of Tropical Medicine and Hygiene said in India 46,000 people are dying every year from snakebites against the official figure of only 2,000. ( source : http://articles.timesofindia.indiatimes.com/2011-12-06/india/30481201_1_anti-venom-krait-snake-bites ).

  • @సుధాకర్జీ,

   శబ్దానికి శక్తి ఉంది, మంత్రానికీ శక్తి ఉంది. కత్తిని మంచికీ ఉపయోగించుకోవచ్చు, చెడుకీ ఉపయోగించుకోవచ్చు. అది ఉపయోగించుకునేవారి విచక్షణ తప్పించి, తప్పు కత్తిది కాదు. అసలు మాంత్రాలు లేవనుకోవడం తప్పు. ఎలా ఉన్నాయి? అనే దాని మీద టపా రాద్దామనుకున్నా! ఎవరూ స్పందించలేదని మానేసేనప్పుడు. మీరు పాత టపా చదివి స్పందించారు, చాలా సంగతులూ చెప్పారు. ఇప్పుడు మంత్రాలు ఉన్నాయి అనడాన్ని నిర్ధారించాలని టపా రాయాలనే కోరిక పుట్టింది మీ కామెంట్ తో.
   ధన్యవాదాలు.

  • @మోహన్జీ,
   మంత్రాలకి చింతకాయలూ రాల్తాయండీ! శబ్ద శక్తి గురించి టపా రాయాలని ఉంది. మంత్రాలున్నాయి, అవి మన దేశానికి సంబంధించినవి కనక లేవంటున్నారు, అంతే.పరిశోధన చేసి లేవని ఖచ్చితంగా నిరూపిస్తే సంతోషమేకదా!
   ధన్యవాదాలు

  • @వర్మాజీ!
   ఆ చిత్రం నాది కాదు, ఎత్తుకొచ్చిందే! బాగుందని బ్లాగులో పెట్టేసేను. నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 2. మంత్రాల అంతరార్ధం మంచే . అయితే దానిని డైరెక్టుగా వెల్లడి చేయకుండా సంస్కృతంలో కట్టడి చేశారు మన ముందు తరాల వారు . కారణం భాషలన్నిటికీ మూలమైనది సంస్కృతమే నన్న భావనతో .
  ఆ తర్వాత కాలంలో సంస్కృతం నేర్చుకొన్న మరి కొద్దిమంది చెడుని కూడా మంత్రాల రూపంలో సంస్కృతంలోనే సృష్టించారు .
  ‘మాటే మంత్రమూ ” అన్న సినీ కవి మాట అక్షర సత్యమే . ఆ మాటలో దాగివున్న భావనే అసలు మంత్రానికి నాంది అన్నది ఎవరూ మరచిపోరాదు .
  ఈ నరసయ్య గారు ఆ రోజుల్లో పేరుమోసి , పాముల నరసయ్యగా స్థిరపడిపోయారు .
  భావన ఏ భాషలో చెప్పినా ఫలితాన్నిస్తుంది . అందుకే మన వాళ్ళు సంకల్పం బాగుంటే అన్నీ బాగుంటాయని అంటారు . కనుక సత్సంకల్పం మాత్రమే సత్ఫలితాలనిస్తుంది . దుస్సంకల్పం దుష్ఫలితాలనిస్తుంది అన్నది మనం ఎన్నటికీ మరచిపోరాదు .

  • @శర్మాజీ!
   మంత్రాలు లేవని కొట్టి పారేస్తున్నారు. ఉన్నాయి. శబ్దానికి శక్తి ఉందని నా అభిప్రాయం. చిత్రంగా చాలా మంది చదివేరు కాని ఒకరూ, మంత్రాలు లేవన్నవారు కనపడలేదు. శబ్ద శక్తి గురించి రాయాలని ఉంది కాని, దాన్ని పూర్తి చేయటం లేదు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s