శర్మ కాలక్షేపంకబుర్లు- పెళ్ళిలో అలకపాన్పు.

పెళ్ళిలో అలకపాన్పు.

Gravity-Glue5

ఒకప్పుడు పెళ్ళి అంటే ఐదు రోజుల ముచ్చట.ఆ తరవాతది మూడు రోజులకి, ఆ తరవాత ఒక రోజుకి, ఇప్పుడు ఒక గంటకి పరిమితమయిపోయింది. బంధువులతో కొత్త వియ్యాలవారితో అచ్చట్లు, ముచ్చట్లు, అలకలు, బుజ్జగింపులు, విందులు, వినోదాలు, కొండొకచో శిగపట్లుగా సాగిపోయి రెండు కుటుంబాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం పెన వేసుకునేది. ఈ పెళ్ళిళ్ళలో మానసికంగా పెళ్ళికుమార్తె, పెళ్ళికొడుకు ఒకరికి ఒకరు దగ్గరవడానికి తగిన ఆటలూ వున్నాయి. పెళ్ళి అంటే రెండు కుటుంబాల కలయికగా సాగేది.

మొదటగా బావ మరిది కాశీ యాత్రలో కనపడతాడు. ఆ తరవాత లాజహోమంలో అవసరమవుతాడు. అలాగే మేనమామలు పెళ్ళికుమార్తెను గౌరీపూజనుంచి, పెళ్ళిబుట్టలో, పెళ్ళి పీటల మీదకి ఎత్తుకుని తీసుకురావడానికి అవసరమవుతారు. ఇప్పుడు నడిపించే తీసుకొస్తున్నారు లెండి. అసలు ఎత్తుకు తీసుకురావడంలో విశేషం ఏమంటే, అప్పుడు పెళ్ళికుమార్తె లక్ష్మీస్వరూపంలో గౌరీదేవిని సేవిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవిని నారాయణునితో చేర్చడానికి లక్ష్మిని నడిపించడం ఇష్టం లేక ఎత్తుకుని తీసుకువస్తారు. పెళ్ళిలో పెళ్ళికుమారుని ఆడపడుచు పాత్ర చెప్పక్కరలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వియ్యపురాళ్ళ ముచ్చట్లు బలే పసందుగా ఉంటాయి. ఆ తరవాత భోజనాలలో బూజం బంతి వేస్తే ఇంక ఆ అల్లరి పట్టుకోడం ఒక్కొకప్పుడు పెద్దలకి కూడా కష్టంగానే ఉండేది.

Amazing Pictures

పెళ్ళిలో అలకపాన్పు ఒక వేడుక. పెళ్ళి అయిపోయిన తరవాత నాల్గవరోజు,సదస్యం ముందు వేసేవారు.సదస్యం అంటే చెప్పాలికదూ, పెళ్ళి జరిగిన తరువాత లక్ష్మీనారాయణులు (పెళ్ళికొడుకు,పెళ్ళికూతురు) కొలువుతీరిన సభలో పండిత,నట,గాయకులు పాల్గొని తమ విద్వత్తును చూపి సన్మానం పొందేవారు.సదస్యపు పళ్ళెం అందుకోడం ఒక గొప్ప, కవులకు ఆరోజులలో. ఈ సన్మానానికి కూడా లెక్క ఉంది, పెళ్ళికుమార్తె తండ్రి రూపాయి ఇస్తే పెళ్ళికొడుకు తండ్రి రెండు రూపాయలివ్వాలి. అటువంటి సభకి రానని పెళ్ళికొడుకు మంచమెక్కుతాడు. అదే అలకపాన్పు. ఆడపడుచు పెళ్ళికొడుకు అలకపానుపు ఎక్కేడని ప్రకటిస్తుంది. ఇక్కడితో కధ మొదలవుతుంది.అవతల సదస్యానికి ఏర్పాట్లు జరుతుంటాయి. పెళ్ళికొడుకు లేకుండా సదస్యం ఎలా? అల్లుడు సదస్యానికి రాకపోతే అభాసవుతుందేమోనని మామగారి ఆదుర్దా. బావమరిది భార్యతో సహా వచ్చి “బావగారు! ఎక్కడా పెళ్ళిలో తెలిసి పొరపాట్లు జరగలేదు, ఎవరేనా తెలియక పొరపాటు చేసేరా? ఎక్కడేనా పొరపాటు జరిగితే వాటిని మన్నించండి” అని బతిమాలుతాడు.కూడా వచ్చిన బావమరిది భార్య “తమ్ముడూ! అవతల మామగారు సదస్యానికి ఏర్పాట్లు చేస్తున్నారు, పెద్ద పెద్దలందరూ వచ్చేస్తున్నారు, నువ్వు అలిగితే ఎలా? ఏంకావాలో అడుగమ్మా” అని కొస అందిస్తుంది. ఈ కార్యక్రమమమంతా పెళ్ళికూతురు చూస్తూ ఉంటుంది. అబ్బే! పెళ్ళికొడుకు ఉలకడు పలకడు. అత్తగారొచ్చి బతిమాలుతుంది, “అల్లుడుగారూ మీరు ఇలా అలిగితే, మా ఇల్లే చిన్నబోయింది, మీకు అలక తగదు, ఎక్కడేనా పొరపాటుంటే మా అల్లుడుగారు మన్నించాలి” అంటుంది. ఊహు! వినడు, “నీకోరికేంటొ చెప్పు బాబూ” అని అనునయిస్తుంది. అబ్బే మాటాడడు, బెల్లంకొట్టిన రాయిలాగా. అందరూ వెళ్ళి పెళ్ళికుమార్తె తండ్రితో చెబుతారు. ఇక ఆయన మొత్తం తన కుటుంబాన్ని వెంటబెట్టుకువచ్చి “అల్లుడుగారు!పెళ్ళిలో ఎక్కడా ఏలోటూ చెయ్యలేదు, ఏమయినా తక్కువొస్తే చెబితే సరి చేస్తాము.అనుకున్న కట్న కానుకలన్నీ అందచేశాము. ఎందుకు మీ అలక? అవతల సదస్యం సమయమవుతోంది,అలకమాని తయారవండి సదస్యానికి,” అలకవీడమని బతిమాలుతాడు. కుటుంబ సభ్యులంతా వేడుతారు. అప్పుడు పెళ్ళికొడుకు ఆడపడుచు కోరిక వెలిబుచ్చుతుంది, పెళ్ళికొడుకు తరఫున ” అన్నయ్య కారు కావాలంటున్నాడు”. అప్పుడు మళ్ళీ అమ్మాయి కుటుంబంవారంతా “అంత పెద్ద కోరిక తీర్చలేము ఇప్పుడు, మోటార్ సైకిల్ కొనిపెడతాము, పెళ్ళికి చాలా ఖర్చు పెట్టేము, ఇప్పుడిచ్చుకోలేము,మీ తాహతుకు తూగలేము” అని బేరమాడుతారు, పెళ్ళికొడుకుని బతిమాలుతారు,పెళ్ళికొడుకుని గొప్ప చేసి మాటాడతారు.. ఆఖరికి పెళ్ళికొడుకు అడిగిన కోరికకు మామగారు మన్నించి, అడిగిన దానిని ఇచ్చి కాని, అల్లుడు, మామగారి మాట మన్నించి, ఇచ్చినది పుచ్చుకుని కాని అలకపాన్పు దిగుతాడు. ఇందులో పెద్ద విశేషం ఏముందంటారా? ఉన్నదే ఆసలు విశేషం, కాని నేడు దానిని మామ గారినుంచి డబ్బులాగుకునేదిగా మారిపోయింది.ఈ సందర్భంలో కొంత మంది చేదా తాడూ ఇస్తారు. ఇది అల్లునికిచ్చే ఒక సంకేతం, నూతిలో ఎంత నీరున్నా అవసరానికి తగినట్లుగా తోడుకున్నట్లు, మామగారి దగ్గరనుంచి, తేటి పువ్వులో మకరందాన్ని జుఱ్ఱుకొన్నట్లు ఉండాలి కాని, ఒక సారి బాధ పెట్టి వసూలు చేసుకోడం కాదని.

#Amazing Gravity Glue

ఇది పెళ్ళికుమార్తెకు పుట్టింటివారిచ్చే భరోసా!అదేంటి పెళ్ళికొడుకుని బతిమాలుతుంటే పుట్టింటివారు అమ్మాయికిచ్చే భరోసా అంటారంటారా? ఈ అమ్మాయికి ఇక ముందునుంచి భర్త గొప్పతనం, భర్తను ఇతరులు, పుట్టింటివారితో సహా గొప్పగా చూడటం, అతని మాట మన్నించడం, అమ్మాయి ఆనందానికి కారణాలవుతాయి. ఇలా తన భర్తను తన పుట్టింటివారంతా బతిమాలితే, రేపు రాబోయే కాలంలో తననూ తన భర్తనూ పుట్టింటివారు వదిలేయరని, తమ మంచి చెడ్డ కనుక్కుంటూనే ఉంటారనే భరోసా అమ్మాయికి ఇవ్వడమే. ఇది అసలు కిటుకు. పెళ్ళితో అమ్మాయి వేరయిపోతున్నానేమో, అనే భావనకి రానివ్వకుండా ఉండేందుకు మానసికంగా చేసేప్రక్రియ. కాని నేడు మామగారి పీక పిండి సొమ్ముకాని కావలసిన వస్తువు కాని వసూలు చేయడంకాదు.

ప్రకటనలు

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- పెళ్ళిలో అలకపాన్పు.

  • @పద్మగారు,
   ఇప్పుడు పెళ్ళి చేసుకోడానికే సమయం లేదు, ఇంక అలకపాన్పు ఎక్కడ? కాకపోతే మామగారి దగ్గర నుంచి మాత్రం దీనికొరకు సొమ్ముగాని వస్తువుగాని గుంజటం మానలేదు, మరొకసంగతి విదేశాలలో ఉన్నవారు కూడా ఈ వరకట్న దురలవాటు మాన్చుకోలేకపోతున్నారు.
   ధన్యవాదాలు.

  • @సీతగారు,
   స్వాగతం. మనవారు మానవ మనస్తతత్వాన్ని ఆపోశన పట్టేశారు. అందుకే ఇటువంటివి పెట్టేరు. అధునికులకు నచ్చవనుకోండి. 🙂 లాజ హోమమని పేలాలతో హోమం చేయిస్తారు. లాజలు అంటే పేలాలని అర్థం.
   ధన్యవాదాలు.

 1. అప్పుడప్పుడు మన బ్లాగర్లు కూడా ఇట్లా ‘ఇక మీదట’ నో టపా అని అలక పానుపు ఎక్కేస్తుంటారు ! వారికి ఈ టపా వర్తిస్తుందా శర్మ గారు ! సవివరంగా వివరించ గలరు !!

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s