శర్మ కాలక్షేపంకబుర్లు-భోజనం చేయడం ఒక కళ

భోజనం చేయడం ఒక కళ

Dan probert

 

Courtesy: Dan probert

భోజనం చేయడం నిజంగా ఒక కళ. ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని కావలసినవి పెట్టుకుని గాని లైన్ లో నిలబడి ముష్టి వేయించుకున్నట్లు వేయించుకుని కాని తినేది కాదు. పెళ్ళిళ్ళలో ఇతర చోట్ల భోజనాలకి వడ్డనకి ఒక ప్రోటోకోల్, భోజనానికి ఒక ప్రోటోకోల్, చివరికి విస్తరిలో ఏది ఎక్కడ వడ్డించాలో అన్నదానికి కూడా ఒక ప్రోటోకోల్ ఉంది. దానినిని అమలుచేసేవారు కూడా. భోజనం కూడా అందరూ కలిసి హరి హర నామ స్మరణ చేస్తూ, వడ్డింపులో చెణుకులు విసురుకుంటూ భోజనం చేసేవారు. ఇదంతా ఇదివరలో వివరంగా చెప్పేను ఇక్కడ చూడండి.

https://kastephale.wordpress.com/2011/11/30/

భోజనం చేస్తున్న సమయంలో మధ్యలో పాటలు పద్యాలు, ఈ మూలనుంచి ఒకరు చదివితే ఆ మూల నుంచి మరొకరు పోటీగా మరొకటి అందుకోవడం.వందలమంది ఒకసారి భోజనం చేసేవారు. అదేగా కాక వియ్యపురాలి విందు పాటలు, అబ్బో చెప్పుకుంటేనే కడుపు నిండిపోతుంది. ఆ తరవాత అసలు చెప్పుకోవలసినది బూజం బంతి, బంతి కాదు అది పంక్తి వాడుకలో బంతి అయిపోయింది. అసలు బూజంబంతి అంటే మీకు తెలుసా? నిజంగా చెప్పండి. ఎంతమంది మీరు బూజం బంతిలో భోజనం చేసేరో చెప్పండి. ఈ బంతిలో వదినా మరదళ్ళు, అత్తా కోడళ్ళు, బావా మరుదులు, మామా అల్లుళ్ళు, వదినా మరదులు, బావా మరదళ్ళు, ఇలా బంధువులు మాత్రమే భోజనాలు చేసేబంతి. ప్రత్యేకంగా బూజంబంతి అని చెప్పి వేసేవారు. భోజనాలు చేస్తూ వరసయినవారు ఒకరిని ఒకరు దెప్పుకోడాలు, మూతి విరుపులు, చెణుకులు,ఎగతాళీ చెయ్యడాలు, ఒకరి విస్తరిలోనుంచి ఒకరు దొంగిలించడం, మరొకరి విస్తరిలో వీరు దొంగతనంగా వేయడం, బూరెలు వగైరాలు విసురుకోవడం, హాస్య రసం వరద గోదారిలా పారేది. సమయజ్ఞత ఉన్నవారిది పై చేయిగా ఉండేది. నవ్వులు పువ్వులై విరిసేవి.ఇలా సాగిపోతూ ఉండేది. కొందరు సరదాగా తీసుకోలేక ఉడుక్కునేవారు, అదొక సరదా! ఇది ముదిరి ఒకప్పుడు రసాభాస అయ్యేది.ఈ బంతి వేస్తే పెద్దలయినవారు వడ్డన చేసేవారు. పరొస్థితి అదుపు తప్పి శిఖపట్లకి పోతున్న సందర్భం వస్తే అందరిని మందలింపుతో పూర్తి అయ్యేవి.అసలు భోజనమన్నది ఎలా చేయాలో శ్రీపాదవారి కధ “జోడు” లో చదవండి.

నేటి రోజులలో ముని వేళ్ళతో భోజనం కలుపుకు మూతికి నాలుగు మెతుకులు రాసుకుంటున్నారు. వేళకి ఆహారం తీసుకోవడం, తగినంతగా తీసుకోవడం, తగిన పరిశ్రమ చేయడం లేదు. కూర్చున్న చోటినుంచి కదలటమే లేదు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఏమయినా అంటే జీరో సయిజు లు, నా తలకాయ లేదా సిక్స్ పేక్ లూ ఇలా రకరకాలుగా మాటాడుతున్నారు. తినేది ఎంత తింటున్నారో తెలియకుండా తింటున్నారు లేదా మానేస్తున్నారు.భోజనానికి అర్థమే మారిపోతూ ఉంది, భోజనం చేసేరంటే స్వాహా చేసేరు అని, నిజానికి స్వాహా అనేది దేవతలకి అర్చన చేసి అగ్నిలో వేసినపుడు అనే మంత్రం, దానినీ బ్రష్టు పట్టించారు, భోంచేసేరంటే దొంగతనం చేసేరని నేటి అర్థంగా మారిపోయింది, దీని గురించి మరో సారి ముచ్చటించుకుందాం.

jodu

jodu-1

jodu-2

jodu-3jodu-4

jodu-5

original (1)

 

Courtesy: From a griend by mail

ప్రకటనలు

30 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భోజనం చేయడం ఒక కళ

 1. నమస్తే శర్మగారు ;
  మీ పోస్ట్ చాలా బాగుందండీ
  బూజం బంతి వినలేదు ఈ పదం ఎప్పుడూ , బంతి భోజనాలు మాత్రం తిన్నాను , ఇప్పటికీ తింటూనే ఉన్నాము 🙂
  మాది పెద్ద కుటుంబం అవ్వటం వల్ల ఏదైనా పండుగో ,పబ్బమో వస్తే , లోపలల ఎలకలు రన్నింగ్ రేస్ చేస్తున్నా అందరం కలిసి తిందామని ఎంత లేట్ అయినా ఒకరి కోసం ఒకరు ఎదురుచూసి , ఆఖరికి కలిసి తింటూ తినేది తక్కువ , అల్లరి ఎక్కవ ఐనా అదేంటో , ఏదో బోలేడు లాగించేసామన్న తృప్తి

  ఈ బంతి భోజనాలు గురించి చెప్పి , నాకు బంతి ఆకలి పెంచారు …మీకు కృతజ్ఞతలు 🙂

  • @ప్రియా కిషోర్ గారు,
   స్వాగతం. ఆదర స్వాగతం, నా బ్లాగుకు,.ప్రియ మనవరాలుంది, మీపేరూ ఆ పేరుకు దగ్గరగా ఉంటే ముందు పొరబడ్డాను.
   ఈ మాట ఒకటే కాదు, చాలా అలవాట్లు, ఆలోచనలు కూడా మరుగునపడిపోతున్నాయండి.మీ పెద్ద కుటుంబం లో ఒకరికోసం ఒకరు ఎదురుచూస్తూ వారొచ్చిన తరవాత భోజనం చేయడం లో నే ఆప్యాయత కనపడుతోంది కదా! చాలా అదృష్టవంతులు.అప్పుడు ఎంత తిన్నామన్న దానికన్న కావల్సినవారితో తిన్నామన్న తృప్తి గొప్పది కదండీ.
   ఆకలేస్తోందా! బంతిభోజనాలు పెట్టించెయ్యండి. పిలిస్తే నేనూ వచ్చేస్తానండోయ్! 🙂
   ధన్యవాదాలు.

 2. ఆహా… భోజనం చేయడం ఒక కళ… ఎంత వీనులవిందుగా ఉందీ మాట! అది 65వ కళ కాబోలు. కానీ ఆ పసందైన కళ కాస్తా… నేడు కలగా మారిపోవడం బాధాకరం. అవును మీరన్నట్టు ఇప్పుడంతా ముష్టి, ముదన్నష్టపు బూఫేల కాలం. ఆ పదాన్ని బూఫే అనాల్ట. బూఫేల్ని కనీవినీ ఎరుగని నా టెన్త్ క్లాసులో ఈ పదం విషయమై పెద్ద పోస్టుమార్టం జరిగిన పిమ్మట కూడా నేను బఫెట్ అని నోరిజారినందుకు నా వీపు విమానమ్మోత మోగించాడు మా హెడ్మాస్టరు అనబడు ఆంగ్లేయ రాక్షసుడు. అందుకే నాకు బఫే అంటే కోపం, కసి, పగ వగైరా! మా భోజనాల టైంలో పెద్దన్నయ్య నోరు వృత్తాకారంలో పెట్టి అంటూంటేవాడు… ఉరే బడుద్దాయ్, ఆంధ్రా శాకాంబరీ దేవీ వర ప్రసాదం ఏదిరా? అని. మేమేమో పగలబడి నవ్వేవాళ్లం. భోంచేయడం ఒక యోగం, భోంచేయలేకపోవడం ఒక రోగం అని కూడా అంటుండేవాయన. మునుపటి కాలం భోక్తల్లాగా చక్కగా, సుష్టుగా, కడుపు నిండా పదిమందితో కలసి ఖాద్య వస్తువులు ఆరగిస్తూ ఉంటే ఆహా… ఆ ఆనందమే వేరు. మాయాబజార్ లో ఘటోత్కచుడు ఎస్వీఆర్ గుర్తుకొస్తున్నాడు బాబోయ్! మీ పోస్టు పసందుగా ఉంది. 🙂

  • @నాగరాజ్ గారు,
   లేని దానికోసం మానవుడు తాపత్రయ పడిపోతాడు కదా! అదనమాట. ఇప్పుడు తృప్తిగా భోజనం చేసే సమయమే లేదండీ, పది మంది మాట దేవుడెరుగు 🙂
   ధన్యవాదాలు.

 3. అప్పటి రోజులు ఇక తిరిగి రావు. దిక్కుమాలిన నాగరికత ముందు అవి దిక్కులు దాటేశాయి. మీరన్నట్లు ఈ బఫే పద్దతి ముస్టిలాగే ఉంటుంది. ఇకపోతే బ్రాహ్మణ కుటుంబాలలో వారి బొజనాపద్దతి ఆ ఆహారపదార్దాల వివరాలు మంచి సంబాఅషణల ద్వారా అప్పటి కథలు చదవాలని అనిపిచేవి. ఇప్పుడు అన్నాన్ని అవహేళణ చేస్తున్నారు. సర్, మీ పోస్ట్ మరీ, మరీ చదివాను.

  • @ఫాతిమాజీ,
   మన సంస్కృతిని మరిచిపోతే ఎలా? శ్రీపాదవారి కధని మొత్తం చదివింది మీరొకరే. మూడవ పేజీ ఎవరూ చదవలేదు. అన్న ద్వేషం, బ్రహ్మ ద్వేషం పనికిరావన్నారు. బ్రహ్మ అంటే భగవంతుడు ఏ పేరుతో పిలిచినా. ఈ రెండిని ద్వేషించినవారు సుఖపడరండి.టపా చాలా సార్లు చదివారు, గుర్తించాను.
   ధన్యవాదాలు

 4. భోజనం చేయడం ఒక కళ. ఇప్పుడు 90% ఆకులో పాయసం వడ్డిస్తే అది తినడం రానివారే. అదిసేవిస్తూ వారు చేసే విన్యాసాలు కడు విచిత్రంగా ఉంటాయి చూడండి.:-) చాలా చక్కగా చెప్పారు.

 5. బూజంబంతి అనే పదం దాని అర్థం రెండింటి గురించి విడమరచి చక్కగా చెప్పారు. ఎంతైనా మీరు చెప్పే కబుర్లు కడు చదవసొంపుగా ఉంటాయి. కనువిందు చేసే పిక్స్ అదనపు ఆకర్షణ

  • @పద్మగారు,
   బూజం బంతి తెలిసిందిగా, వేయించండి సరదాగా. నా కబుర్లు నచ్చేయంటే అబ్బో! ఏనుగెక్కినంత సంబరం. ఈ పిక్స్ నాకు మిత్రుల దగ్గర నుంచి వచ్చినవి, నేను చూసినవి, మీతో పంచుకోవాలని, ఇలా పెడుతుంటాను.
   ధన్యవాదాలు

 6. * నిజమేనండి, భోజనం చేయడం ఒక కళ. చక్కటి విషయాలను తెలియజేసారు.
  * నిదానంగా తింటూ పదార్ధాల రుచిని ఆస్వాదించటానికి కూడా ఇప్పటి వారిలో చాలామంది తమకు సమయం ఉండటం లేదంటూ ఆదరాబాదరాగా నోటిలో కుక్కుకుంటున్నారు.
  * చాలామంది బడికి వెళ్ళే పిల్లలు కూడా కూడా కంగారుగా నోటిలో కుక్కుకుని వెళ్తున్నారు.
  * నిదానంగా భోజనం చేస్తే చక్కగా అరుగుతుంది. మనసుకు తృప్తిగా ఉంటుంది.
  * కష్టపడి సంపాదించి, కమ్మగా వండుకుని తీరికగా తినటానికి కూడా సమయం లేదనుకోవటం ఎంతో దురదృష్టకరం.

 7. హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు “భోజనపదేశం” అనే పేరుతో విందు భోనజనానికి వెళ్ళినవాడు ఎలా ప్రవర్తించాలో ఎందులో ఏది కలుపుకు తినాలో (ర్‌డ్‌విత్ “Read With” మన జీవోలు అవ్వి అని అంటారు చూడండి) ఎలా తింటూ వెడితే ఎక్కువగా తినవచ్చో వడ్డించేవాడు ఏమరుపాటున సరిగ్గా వడ్డించకపోయినా వాణ్ణి ఎలా అదిలించి ఎక్కువగా వేయించుకోవాలో ఇలా అనేకం వివరిస్తూ ఉపదేశం చేశారు,చక్కగా అద్భుతమైన హాస్యంతో ఒక వ్యాసం వ్రాశారు. నిజమే! తినటం కూడా ఒక కళే. అన్ని కళల్లాగానే, ఈ కళా అంతరించిపోతున్నది అని అనుకోవటానికి దిగులేస్తున్నది. మీరన్న బూజంబంతి ఒకే ఒక్క సారి 1970లో మా దగ్గర బంధువులమ్మాయి పెళ్ళిలో చూశాము. ఆ విశేషాలు ఇప్పటికీ సరదాగా నలుగురూ కలిసినప్పుదు చెప్పుకు ఆనందిస్తూ ఉంటాము.

  ఈ ఫుడ్ బిల్లు వచ్చేసినాక మన ఎకానమీ అంతా దానికే సరిపోయి, అందరూ ఆకులు పట్టుకుని లైన్లల్లో నిలబడి గవర్నమెంట్ గుమాస్తాలు విదిలించిన కబళం నాక్కుంటూ తినాలో ఎమిటో చివరికి ఖర్మ.

  • @ శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTUగారు,
   ఇప్పటికి ఒకరు నేను చూశాను అన్నవారిని చూశానండి బాబు. దీని సంగతే చాలా మందికి తెలియదు. మిథునం లో ఈ మాట మాత్రం విన్నారంతే.
   రాబోవు కాలాన మీరు చెప్పినట్లు లైన్ లో నిలబడి ప్రభుత్వ గుమాస్తాలు విదిలించే మెతుకులు కతికే రోజులొచ్చేస్తున్నాయి.
   ధన్యవాదాలు

 8. సత్యం శంకరమంచి గారు కూడా అమరావతి కథల్లో భోజనాంతే అనే కథ రాశారు. బాగా తినేవాళ్ళని చూస్తే సరదాగా ఉంటుంది. కానీ, మీరన్నట్టు అలాంటి వాళ్ళు ఇప్పుడు అరుదుగానే కనిపిస్తున్నారు. బూజం బంతి బాగుంది.

  • @వర్మాజీ,
   పాతదంతా మంచిదీ కాదు, పూర్తిగా చెడ్డదీ కాదు. మంచిని తీసుకుని ప్రస్తుతంలో జీవితానికి అన్వయించుకోవడమే.

   ధన్యవాదాలు

 9. ఎప్పుడో వ్రాస్తానన్న టపా ఇప్పుడు వ్రాసారన్న మాట.
  బూజం బంతి అన్న మాట మిధునం సినిమాలో వినడమే తప్ప అంతకు ముందు తెలియదు.
  మంచి ఐడియా..
  ఈ సారి దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళిలో పెట్టించడానికి ప్రయత్నిస్తాను.

  • @మిత్రులు బోనగిరిగారు,
   టపా అప్పుడే రాసిపెట్టేను. స్కేన్ చేయడానికి ఆలస్యమయింది. ఆ తరవాత కొన్ని టపాలు వేయాల్సి వచ్చి ఇది పాసింజర్ లాగా లూప్ లైన్లో ఉండిపోయింది. సరదాగా పెళ్ళిలో ఈ బంతి వేయించండి, బాగుంటుంది.

   ధన్యవాదాలు

 10. దేని గురించి చెప్పినా శ్రీ పాద వారిని వెనకేసుకు రావడం మానరు సుమీ దీక్షితులు గారు !

  (పుస్తకం జేపీజీ చదవడం కొద్దిగా కష్టం గా ఉన్నందువల్ల రసస్వాదం చెయ్యలేక పోయా ! కళ్ళు కనబడి చావవు ఓల్డ్ ఏజ్ ప్రొబ్లెమ్స్ యు నో ) ఈ పుస్తకము ఏమైనా పీడీఎఫ్ రూపము లో లభ్యమగునా !?

  ఈ మధ్య బులుసు వారు ఏమైపోయారుస్మీ అస్సలు పంచ దశ లోకం లో అజాపజా లేకుండా పోయేరు మరి ?!

  జిలేబి

  • @ జిలేబి గారు,
   శ్రీపాద వారిని తలుచుకోకపోతే అమ్మో! ఊహించలేను. పుస్తకంతో స్కేన్ చేయడం మూలంగా కొంత ఇబ్బంది కలిగి ఉండచ్చు. ఇది పి.డి.ఎఫ్ లో ఉందేమో తెలియదు. బులుసువారి ఆచూకీ తెలియలేదు.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s