శర్మ కాలక్షేపంకబుర్లు-బహుమతి

బహుమతి

      original   Photo coutesy: Sri.K.Raghavenra Rao                                          

బహుమతి అంటే అర్థం ఏమని చూస్తే కానుక, కట్నం, నజరానా వగైరా వగైరా చెప్పేడు నిఘంటు కారుడు.బహుమతి ఇవ్వడం తీసుకోడం అనేది అన్ని దేశాలలోనూ ఆచారమే. మన దేశంలో గురువుని,దేవుని,పిల్లలను గర్భిణిని చూచేందుకు వెళ్ళేటప్పుడు బహుమతి తీసుకువెళ్ళాలని చెప్పేరు కూడా.

ఒక ప్రత్యేక సందర్భంగా దానికి గుర్తుగా మనం ఇచ్చేకాని తీసుకునే ఒక వస్తువే బహుమతి. దీనికి విలువతో సంబంధం లేదు, కాని విలువ కూడా అంటగడుతున్నాం, నేటి రోజుల్లో. ఈ బహుమతులకు సందర్భాలు పెళ్ళి, పుట్టిన రోజు, సత్యనారాయణ వ్రతం వగైరా వగైరా…ఐతే పెళ్ళిలో దీనికి ప్రత్యేకంగా కార్యక్రమమే ఉండేది, దానిపేరు ’ప్రోలు’. ఇప్పుడు దాన్ని తీసేసేరు తప్పించి. ఇది పెళ్ళిలో నాలుగో రోజుకార్యక్రమంలో ఉండేది. ఆ రోజులలో తెచ్చిన కానుకను బ్రహ్మ గారికి చదివింపులు కార్యక్రమంలో ఇస్తే ఆయన మంత్రం చెప్పి చివరగా ఆ కానుక ఇచ్చినవారి పేరు, ఇచ్చిన కానుక, ఎవరికిస్తున్నదీ చెప్పి వారికి అందచేసేవారు. ఆ రోజులలోనూ ఇప్పుడూ కూడా ఈ కానుకలు పెళ్ళికుమార్తెకు, పెళ్ళికొడుకుకు, ఉభయులకూ,కన్యాదాతకు కూడా ఇచ్చేవారు.ఇప్పటికి ఈ ఆచారం నడుస్తోంది కాని రూపు మారింది. ఒకరెవరో కావలసినవారు పుస్తకం పుచ్చుకుని కూచుంటారు. ఈ కానుక తెచ్చినాయన అది ఎవరితాలూకో కనుక్కుని ఆ కానుక అక్కడ ఇచ్చేసి పక్కనే ఉన్న చోట ఏర్పాటు చేసిన భోజనం చేతిలో పట్టుకుని తినేసి ప్లేట్ అవతల పారేసి వచ్చేస్తున్నాం. అమ్మయ్య పెళ్ళికి వెళ్ళివచ్చినట్లే అయిపోయింది. పాత రోజులలో దీనిని కట్నం, కానుక, బహుమతి అని అన్ని పేర్లతోనూ పిలిచేవారు. ఆ ఇచ్చే బహుమతి కూడా ఘనం గానే ఇచ్చేవారు, బంగారపు వస్తువులు, వెండి వస్తువులు కూడా.సాధారణంగా బట్టలు పెట్టడమే సామాన్యుల ఆచారంగానూ స్థిరపడింది. తరవాత రోజులలో కొత్త కాపరానికి కావలసిన వస్తువులు చదివించడం అలవాటుగా మారింది. ఆ తరవాత కాలంలో పుస్తకాలు, డివీడిలు బహుమతులుగా ఇచ్చేఆచారం కూడా వచ్చింది. పెళ్ళిలో బహుమతులు అలా వెండి బంగారు వస్తువులుగా ఇవ్వడం లో ఒక సహకారం ఉండేది. ఇలా బహుమతి పుచ్చుకున్నవారు ఆ వస్తువు పెళ్ళి కూతురుకి పెట్టుకుని మరల చెయ్యి కాలు కూడ తీసుకుని అంతే ఖరీదులో వస్తువు కాని మరొకటికాని చేయించి తిరిగి బహుమతిగా అవతలవారి అమ్మాయి పెళ్ళికి ఇచ్చేవారు. ఎవరేమి ఇచ్చినది లిస్ట్ రాసుకోడం పాతకాలం నుంచి ఉన్న ఆచారమే. మరి ఇవన్నీ చిన్న చిన్న అప్పులుగానే లెక్క. ఈ ఆచారం మూలంగా తప్పని సరిగా కార్యక్రమాలకి హాజరయేవారు, టేలిగ్రాం కొట్టేసి ఊరుకోక. ఇది పరస్పర సహకారం కింద ఉండేది.

ఆ రోజులలో నేటి డాక్టర్లలాగా వైద్యులు ఇంటి దగ్గర కూచుని వైద్యం చేసేవారు కాదు. వైద్యుడు రోగి దగ్గరకే వెళ్ళేవాడు, వైద్యమూ చేసేవాడు. ఇలా వైద్యం చేసినందుకు డబ్బులు తీసుకునేవారు కాదు. సంవత్సరానికి ఒక సారి సత్యనారాయణ వ్రతమని పెట్టుకుని ఊరందరిని పిలిస్తే వారంతా వ్రతానికి వచ్చి భోజనం చేసి కట్నం చదివించేవారు, వారు పొందిన సేవలకుగాను. ఇది కూడా ఒక రకపు కోఆపరేషన్ గానే లెక్క. అటువైద్యుడూ బతికేవాడు, ఇటురోగి ఇబ్బంది పడేవాడు కాదు. ఇంత ఇవ్వాలని వక్కాణించే పని లేదు కనక రోగి తాహతును బట్టి బహుమానం ఇచ్చుకునేవాడు. ఇక పుట్టిన రోజులు వగైరా కార్యక్రమాలలో బట్టలు బహుమతిగా ఇవ్వడమే రివాజుగా ఉండేది.

steven krohn

photo courtesy: steven krohn

నేటి  బహుమతులు చాలా తేడాగా ఉంటున్నాయి. నాకు గవర్నమెంట్ నుంచి నాలుగువందలెకరాలు భూమి ఇప్పిస్తే, చవకగా కాని, ఊరకనేకాని, నీ కంపెనీ షేరు పది రూపాయలది నాలుగు వేలకి కోంటానంటున్నారు. మరి ఇదీ బహుమతి కిందికి రాదా అని అనుమానం. ఇటువంటివే మరికొన్ని కూడా ఉంటున్నాయి. పెద్ద అధికారి లంచం తీసుకోరు, పెద్ద పేరు, కూతురికి పెళ్ళి చేసేడు, ఉపకారం పొందినవారు నగలు కానుకగా ఇచ్చేరు పెళ్ళి కూతురికి, మరి ఇదీ బహుమతేకదా!ఇలా బహుమతుల చిత్ర విచిత్రాలు జరిగీపోతున్నాయి నేటి రోజులలో.ఫలానా వస్తువు, లేదా సొమ్ము బహుమతిగా ఇచ్చితీరాలనే బలవంతమూ కనపడుతోంది,  నేడు.

నాటిరోజులలో పెళ్ళికి వచ్చిన వారు తిరిగి వెళ్ళేటప్పుడు మిఠాయి, సున్ని ఉండలు ఇచ్చి బట్టలు పెట్టి పంపేవారు. అదే అశుభ కార్యక్రమాలకి కూడా ఒక వస్తువు గ్లాసో, చెంబో ఇస్తూ దాని మీద ఫలానా వారి మరణం ఫలానా రోజు జ్ఞాపకార్ధం అని ఇచ్చేవారు. ఆ వస్తువు వాడుకున్నప్పుడల్లా వారి జ్ఞాపకం వచ్చేది. కిందటి నెల లో ఒక పెళ్ళి జరిగింది, నేటి రోజుల పెళ్ళిలా కాక పెళ్ళికొడుకువారు మమ్మల్ని పెళ్ళి సమయానికి వచ్చి వధూవరులను ఆశిర్వదించమన్నారు. పెళ్ళి అర్థరాత్రి, ఆ సమయానికి వెళ్ళి ఆశీర్వదించి వస్తుంటే ఒక పుస్తకం బహుమతి ఇచ్చారు, చూస్తే అది వివేకానందుని గురించినది. నాకు చాలా ఆనందం కలిగి పెళ్ళి పెద్దను కలిసి ఈ రకమైన బహుమతి ఇవ్వాలని అనిపించినందుకు అభినందించి వచ్చాను. దీని వలన సమాజంలో పుస్తకం చదవాలనే అభిలాష పెంచడం, రచయితకు సహకారం కూడా అందుతుంది కదా! నాకు ఈ రకమైన బహుమతులను ప్రొత్సహించడం అవసరమే అనిపించింది. నేనయితే చాగంటి వారి రామాయణం డీవీడి ని పెళ్ళిలో వధూవరులిద్దరికి కానుకగా ఇవ్వడాన్ని అలవాటు చేసుకున్నాను, నేను అలా బహుమతి ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది ఆ డి.వీ.డి విన్నారో తెలియదు కాని….

ఇక అల్లుడికి కూతురికి పండగలకి బహుమతి ఇవ్వడం అనేరివాజు ఒకటి ఉంది.

“మీ నాన్నేం బహుమతి ఇవ్వలేదోయ్” అన్నాడో భర్త భార్యతో, దానికి భార్య.
“మా నాన్న కష్టపడి కని,పెంచి నన్ను మీకిచ్చాడు,నేనే ఒక పెద్ద బహుమతి , ఇంతకంటే ఏమిస్తాడు, బహుమతి” 🙂 అంది భార్య.

ఇలా చెప్పుకుంటూ పోతే……అంతులేదు.

భారత ప్రభుత్వంవారు భార్యకిచ్చిన బహుమతికి కూడా పన్ను వసూలు చేస్తున్నారు

వివాహంలో బహుమతులగురించి శ్రీపాదవారి మాట ఇక్కడ చదవండి

bahumati bahumati-1

 

ప్రకటనలు

21 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బహుమతి

   • @రోహిణి కుమార్ గారు,
    వినాయకచవితి శుభకామనలు,
    నా బ్లాగుకు స్వాగతం,సుస్వాగతం.
    శ్రీపాదవారొక మహా సముద్రం. మాది బాదరాయణ సంబంధం, వారి స్వగ్రామం పొలమూరు దగ్గరలో నేను ఉంటున్నానంతే!వారి రచనలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. మీరు లింక్ ఇచ్చినంధుకు ధన్యవాదాలు.
    పాత టపా చదివి మెచ్చుకున్నందుకూ ఆనందం.
    ధన్యవాదాలు

 1. కను విందు చెసే ఫొటోలను బహుమతి గా ఇచ్చే
  మీకు మేము ఏ కానుకను ఇవ్వగలం?
  ధన్యవాదాలు తప్ప?చాలాచాలా కృతఙ్నతలు.

  • @మోహన్జీ,
   చక్కగా పెట్టికూడా ఏమీ పెట్టలేకపోయామనటం గొప్పవారి పద్ధతి. చక్కటి మాట కానుకగా ఇచ్చి కూడా ఏమివ్వగలమనటం తమ గొప్ప కదా!
   ధన్యవాదాలు.

 2. మామయ్యగార్కి, పూర్వపు రొజులలో అయ్య వారికి చాలు ఐదు వరహాలు.పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అన్టూ ఉపాధ్యాయులకు దసరా బహుమతులు వుండేవి. ఇప్పుడు అవి కుడా మరిచిపోయినారు

  • @అల్లుడు గారు, నాడు విద్య దానం, నేడు వ్యాపారం. అప్పుడు బతకలేక బడిపంతులు, నేడు బతకడానికే బడి పంతులు. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము జీతాలుగా పుచ్చుకుని స్వంత ఊళ్ళో ఉద్యోగాలు చేస్తూ, వడ్డీ వ్యాపారాలే చేస్తున్నారు. విద్య నాస్తి, సొమ్ము అస్తి.
   ఇక ఐదు వరహాలెందుకు?
   ధన్యవాదాలు.

 3. పాతికేళ్ళక్రితం సంగతి.
  మా నరసాపురంలో ఆచంట కేశవరావుగారని ఒక డాక్టరు ఉండేవారు.
  ఆయన ఫీజు నెలకి ఒక రూపాయి మాత్రమే.
  ఏడాదికోసారి సత్యనారాయణవ్రతం చేసేవారు. అప్పుడు ఎవరి తాహతునిబట్టి వాళ్ళు బహుమతులు చదివించేవారు.

  • @మిత్రులు బోనగిరి గారు,
   నేను నరసాపురం లో పదిహేనేళ్ళ కితం ఉన్నప్పుడు వారి పేరు విని ఉన్నాను. వారు వైద్యం చేసి ఉన్నవారి దగ్గర పుచ్చుకున్నారు,వారి తాహతుబట్టి ఇచ్చేవారు కాని చేసిన సేవలకు కాదు. ఇదొక రకపు వైద్య దానం, ఇపుడంతా తారు మారు, సొమ్ముంటేనే వైద్యం.
   ధన్యవాదాలు.

 4. ఏమోనండీ శర్మ గారు,

  రోజూ మీ టపాలు చదివి కామెంటులు రాస్తున్నాం మాకేమన్నా బహు ‘మతి’ ఉందా !?
  కాణీ పరకా ఉంటే కొంత ప్రోలు చేసి ఓ వీసెడు పోయగలరు !

  చీర్స్
  జిలేబి

   • @ఫాతిమాజీ,
    మమతకు లోటులేదు తల్లీ! ఆదర స్వాగతం సకుటుంబంగా, మా కుటుంబం తరఫున మీకు ఆహ్వానం. దయ ఉంచండి.
    ధన్యవాదాలు.

  • @జిలేబిగారు,
   మీకు మాకుటుంబం ఆదర స్వాగతమెప్పుడో అంద చేసింది. తమ దయ మా మీద లేదంతే!. మరొక సారి ఆదర స్వాగతం, “కూచుండ మా ఇంత కురిచీలు లేవ”న్నట్టు, పేదలం, మీకు మమత పంచిపెట్టగలం, గౌరవం చేయగలం, వచ్చిన ఆడపడుచుకు పసుపుకుంకుమలు ఘనంగానే సమకూర్చగలం, తల్లి అనుగ్రహమే కావల్సినది.
   ధన్యవాదాలు.

   • మాస్టారూ .. ఆత్మీయత అనే పెద్ద బహుమతి కన్నా వేరే బహుమతులు ఉండవేమో! పైన చెప్పిన బహుమతులు పుచ్చుకున్నాం కదా ! ఈ సారి చాగంటి వారి ప్రవచనాల CD బహుమతి అడిగి పుచ్చుకుంటాను మరి 🙂 ధన్యవాదములు.

    ఇంతకీ నాకో సందేహం అండీ! జేలేబీ గారు .. మీ ఇంటికి వెళ్లామని చెప్పారు కదా ! బహుమతి పుచ్చుకునే ఉంటారు కదా … అని ..
    మళ్ళీ అడుగుతారేమిటి చెప్మా !!!!!!!!!

   • వనజ గారు,
    వినాయకచవితి శుభకామనలు
    అభిమానం.ఆత్మీయతా, మమత ల కన్న గొప్ప బహుమతి ఉండదండి. మనం కావాలనుకున్నవారు జీవితంలో అదృష్టం ఉంటేకాని దొరకరండి. వారిని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదండి,.జిలేబి గారెలా అంటే అలాగే, అదే నా మాట.
    ధన్యవాదాలు

 5. శర్మ గారూ ,

  నమస్తే . బహుమతి యివ్వటం పుచ్చుకోవటం పాత కాలంలో మర్యాదను యిచ్చి పుచ్చుకున్నట్లే .
  నిజానికి శ్రీమతిని తెచ్చుకొంటూ బహుమతిని కోరుకోవటం బాగుందదనుకున్నట్లున్నారు ఈ కాలం వాళ్ళు , వాళ్ళ మనసు యిష్టపడ్డవారికే బహుమతులు యిచ్చి పుచ్చుకొంటున్నారు .
  పాత కాలంలో సక్రమ పధ్ధతి కనపడేది వాళ్ళ ప్రవర్తనలో . నేడు అహంభావం కనపడ్తుంది . ” అహ నీకిస్తే నాకేంటి ” అన్న ప్రశ్న కనపడ్తున్నది . మరుగున పడ్తున్న మంచి విషయాలను మన బ్లాగు పాఠకలోకానికి అందిస్తున్నందులకు మీకు న మనఃపూర్వక ధన్యవాదములు .

  • @శర్మాజీ,
   బహుమతి ఇవ్వడం, తీసుకోడం తప్పు కాదు కాని మనుషుల ప్రవర్తనలో మార్పొచ్చింది, మీరన్నట్లు. పురోగమనమో తిరోగమనమో కాలమే నిర్ణయించాలి.
   ధన్యవాదాలు.

  • @ఫాతిమాజీ,
   పెళ్ళి ఐదు రోజులు జరిగేది. ఈ “ప్రోలు” అనేది వధూవరులకు బంధువులిచ్చే బహుమతుల కార్యక్రమం. అదికూడా ఉండేది. నేదు మరో రూపు సంతరించుకుంది.
   ధన్యవాదాలు.

 6. సర్,(మన్నించాలి ఇక ముందుకూడా మిమ్మల్ని ఇలాగె సంభోదిస్తాను, మీరు వద్దన్నారు, కాని తప్పదు మీరు అలవాటు పడాలి.) ఇకపోతే ఎన్ని బహుమతులో..,ఎన్ని సందర్బాలో..(మీ వివరణలో) కానీ నాకు తెలీని విషయం ఒకటి ప్రస్తావించారు డాక్టర్ సత్యనారాయణ వ్రతం చేయటం కానుకలు స్వీకరించటం. కానీ మాస్టారూ… ఇవి మనస్పూర్తిగా ఇస్తున్నారని నేను అనుకోను, తీసుకున్నవారు అదో అప్పుకింద బావిస్తున్నారు, తిరిగి ఇవ్వటానికి విలువల బేరీజు వేసుకుంటున్నారు. మీరన్నట్లు ఆ పెళ్ళి భోజన గొడవలో పడి ఎవరో అనామకుల చేతిలో పెట్టి వస్తున్నారు. కానీ ఈ కానుకల సంప్రదాయం మద్యతరగతి వారికి కొంత వెసలుబాటే…ఎప్పటిలా మీకు మీరే సాటి.

  • @ఫాతిమాజీ,
   నాటిరోజుల్లో ఊరికి ఒక వైద్యుడుండేవాడు. సంవత్సరమంతా కుటుంబానికి వైద్యం చేసేవాడు. అతనూ బతకాలిగా! అందుకు ఈ వ్రతం పెట్టుకుంటే, అప్పుడు కూడా కలిగినవారిచ్చేవారు, లేనివారు సకుటుంబంగా భోజనం చేసిపోయేవారు. ఇవ్వనందుకు వారికి తిరస్కారం ఉండేది కాదు. ఇదొక రకపు కో ఆపరేషన్. రోగం వచ్చినపుడు రోగిని సొమ్ము కోసం నేడు పీడించుకు తింటున్నారు, నానా రకాలుగా.

   ఇక పెళ్ళిళ్ళకెళితే ఆహ్వానం లేదు, మమత లేదు, మన్నింపులేదు, పట్టుకెళ్ళినది ఎవరో అనామకుని చేతికిచ్చి, ముష్టి చిప్పలో భోజనం చేసి వస్తున్నాం. కాలం మారిందా? కాదు మనుషుల ఆలోచనలు మారాయి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s