కిఱ్ఱు జోడు/పొన్ను కఱ్ఱ.
Courtesy : google
జోడు అంటే తోడని, రెండని, జతని అర్థం. ఇది కంటిజోడు కావచ్చు, కాలిజోడు కావచ్చు, జీవితపు తోడూ కావచ్చు. ఇప్పుడు కాలి జోడు గురించే మాటాడుకుందాం. ఈ కాలి జోడు పాదాలని రక్షించడం కోసం ఉద్దేశించబడింది. ఇందులో రకాలు మళ్ళీ, పాత కాలం లో పాముకోళ్ళని వాడేవారు. వీటిని కఱ్ఱతో చేసేవారు. కాలి పాదం ఆకారంలో ఉండి ఒక బుడెప ఉండేది ముందు. అది కాలి బొటనవేలు మొదటి వేలు మధ్య పెట్టుకుని నడిచేవారు. చాలా బాగా నడిచేవారు కూడా. నేటి రోజులలో స్వాములు, సంన్యాసులు వాడుతున్నట్లున్నారు. వీటి వాడకం లో ప్రత్యేకత చెబుతారు. వీటిని జీవితం లో ఒకేసారి వేసుకుంటున్నాం , పెళ్ళిలో స్నాతకంలో, అప్పుడు తొడిగి కాశీ బయలు దేరితే, బావమరది సైంధవుడులా అడ్డుపడి ’మా సోదరిని వివాహం చేసుకుని సుఖపడవయ్యా’ అని అంటు కడితే, జీవితాంతం ఆవిడతో పడే బాధ వాడికేం తెలుసు? ఆ ఒక్క రోజు గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బతిమాలేడని పడిపోతే ఇదిగో ఇప్పుడిలా ఏకు మేకయికూచుంది కదా! ఆ పాముకోళ్ళు గొడుగు, కఱ్ఱ ఆరోజే పట్టుకుపోయేరు, ఉపరి సన్యాసం కూడా మిగలలేదు, ఉభయ భ్రష్టత్వం మాత్రం జరిగింది, జోడు కుదిరిపోయింది జీవితం లో.
Courtesy: K.raghavendra Rao
ఈ పాముకోళ్ళు కాక నాటిరోజులలో చనిపోయిన పశువుల చర్మాలనుంచి జోళ్ళు తయారు చేసేవారు. సాధారణంగా తెలిసినవారెవరూ, పెద్దలు జోడు వేసుకునేవారు కాదంటే మీరు నమ్మలేరు. తోలుజోడు వేసుకోకూడదు అనేవారే తప్పించి కారణం చెప్పేవారు కాదు. ఆలోచిస్తే చనిపోయిన పశువుదయినా, చర్మం కాలికింద వేసి తొక్కి ఆ జంతువును అవమాన పరచడం ఇష్టంలేక వాడేవారు కాదనుకుంటా. ఎంత దూరమయినా, ఎండలో నయినా జోడు లేకనే తిరిగేవారు. నేనూ పద్నాలుగు సంవత్సరాల దాకా కాలి జోడు వేసుకోలేదు. కాలిజోడులో ఆకు చెప్పులని, గూడ చెప్పులని, కిఱ్ఱు చెప్పులని రకరకాల పేర్లతో పిలిచేవారు, తయారు చేసేవారు. ఇప్పుడు చేతి వృత్తులు పోయాయి, పల్లెలలో కూడా. ఇప్పుడన్నీ కంపెనీ చెప్పులు, సింథటిక్ చెప్పులే. షోలాపూర్ ఆకు చెప్పులు చాలా తేలికగా ఉండి చాలా ప్రసిద్ధి, ఒక పెద్ద పాట కూడా ఉందనుకుంటా. ఇవి తోలు చెప్పులే. గూడ చెప్పులని, కిఱ్ఱు చెప్పులని తయారు చేసినవి పేరుకు తగినట్లుగా మొత్తం పాదం లో సగం పైగా ఆక్రమించి ఆఛ్ఛాదనిచ్చేవి. వీటికి గూడ చివరనుంచి ముందుకు తోలు ముక్కలు కుచ్చులా వేలాడుతూ ఉండి అవి ముందుకీ పక్కలకీ పడుతూ ఉండేవి. వీటిలో ఒక రకమే కిఱ్ఱు చెప్పులు. వీటిని వేసుకుని నడుస్తుంటే కిర్, కర్ మని శబ్దం రావడం చేత వీటిని కిఱ్ఱు చెప్పులన్నారు. వీటిని పల్లెలలోనే తయారు చేసేవారు. నడిచేటపుడు శబ్దం ఎందుకురావాలీ? ఇది అసలు ప్రశ్న. వీటిని, గూడ చెప్పులను రైతులు వాడేవారు. పాత కాలపు రైతు ఆహార్యం, పంచ, కంటె మెడ జుబ్బా, లేదా బనియను పక్క జేబుతో, కిఱ్ఱు చెప్పులు, తలపాగ, పొన్ను కఱ్ఱ తో బహు ఠీవిగా నడిచేవాడు. నేటి రైతు నడుం వంగిపోయి నడుస్తున్నాడు, అదే తేడా. దారి తప్పుతున్నాం కదా! నడిచేటపుడు శబ్దం ఎందుకురావాలి దగ్గర కదా మొదలెట్టాలి, పాత కాలంలో చేలో పాములుండేవి. ఇప్పుడులేవు, పురుగు మందులు చల్లడం మూలంగా, ముందు అవి చచ్చిపోయాయి. పాము చేలో తిరిగితే రైతుకు మంచిది. అదేంటి పాము చేలో తిరిగితే ప్రమాదంకదా అని మీ ఆలోచన. కాదు పాము చేలో తిరిగితే ఎలకుండదు. ఎలక లేకపోతే దిగుబడి తగ్గదు. మరిప్పుడు చెప్పండి, పాముండాలా చేలో, ఎలకుండాలా?. మరి ఆ పామునుంచి రైతుకు రక్షణ కోసమే కిఱ్ఱు చెప్పులు. ఈ కిఱ్ఱు చాలా దూరం నుంచి కూడా వినపడుతుంది, ఆ శబ్ద తరంగాలు కూడా భూమికి దగ్గరగా ఉంటాయి, అవి అలా ముందుకు ప్రసరిస్తూ పాముని చేరితే, పాము తనకు ప్రమాదం పసికట్టి పక్కకు తప్పుకుంటుంది, రైతుకి రక్షణా ఉంటుంది, అందుకే కిఱ్ఱు చెప్పులేసుకుని పొలమే వెళ్ళేవారు, ఇంకెక్కడికీ ఈ చెప్పులతో వెళ్ళేవారు కాదు. మన రైతులు తెలివయినావరవునా కాదా?
Courtesy:Jendhamuni-Sos
ఇక పొన్ను కఱ్ఱ గురించి చెప్పాలండి. వెదురు లో రెండురకాలు బోలు వెదురు, గట్టి వెదురు. ఈ గట్టి వెదురు కఱ్ఱని ‘చేపాటి కఱ్ఱ’ అనేవారు. చేతికి అనువుగా ఉండేది. ఇది కూడా ఎలా
ఉండాలో చెప్పేరు, గుప్పెడలో పట్టేటంత లావుండాలి, సాధ్యమైనవరకు మొదలు చివర ఒకే లావులో ఉండాలి, కఱ్ఱ పొడుగు వాడేవారి ముక్కు దగ్గరికి రావాలి, నేలను నిలబెడితే. ఈ కఱ్ఱకి నేలను తాకే చోట ఇత్తడితో తయారు చేసిన రింగ్ వేసేవారు. దీని ని “పొన్ను” అనేవారు. అది పొన్ను కఱ్ఱంటే, పొన్ను కఱ్ఱ పాడవకుండేందుకే. ఈ కఱ్ఱని నడిచేటపుడు అడ్డంగా పట్టుకునేవారు. నడక సరిగా సాగుతుంది తొట్రుపాటులేక, వేగంగా కూడా. గరిమనాభి దూరం పెరుగుతుంది కనక, భూమినుంచి తక్కువ దూరం లో ఉంటుంది కనక. ఇక చేలో కెళ్ళిన తరవాత దీనిని నిలువుగా పట్టుకుంటారు. ఎందుకూ? చేను మడులుగా ఉంటుంది. ఇలా విభాగింపబడిన పొలం కి గట్టు ఉంటుంది. అది కొద్దిగా ఎత్తుగానూ ఒక కాలుతో నడవడానికి వీలుగానూ ఉంటుంది. రైతు చేలో తిరిగేటపుడు గట్టును కాదు, చేను చూస్తాడు,కాదు చూడాలి, మరి నడక ఎలా? అదిగో అప్పుడే కఱ్ఱ ఉపయోగం, కఱ్ఱ బోటు పెట్టుకుంటూ కిఱ్ఱు చెప్పులు చప్పుడు చేస్తుండగా నెమ్మదిగా కఱ్ఱ ఊతం తో నడుస్తాడు, చేను పరిశీలించుకుంటూ. ఇదండి కిఱ్ఱు చెప్పులు పొన్నుకఱ్ఱ కధ. ఇంకా చాలా చెప్పాలి మరోటపాలో మరోసారి….
ఈ టపా ఒకలా మొదలెడితే నా ప్రమేయం లేక ఇలా సాగింది, ఏమీ మార్పు చేయలేదు. ఇప్పుడు చెప్పండి నాటి రైతు తెలివయినవాడా కాదా?
చాలా బాగుంది.
కిఱ్ఱు చెప్పుల గురించీ, పొన్ను కఱ్ఱ గుఱించీ చాలా బాగా చెప్పారు!
మీకు, కీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
@చందుగారు,
వినాయకచవితి శుభకామనలు. టపా నచ్చినందుకు
ధన్యవాదాలు.
మామయ్య గారు వినాయకచవితి శుభాకామనములు. రైతుకు ఎప్పుడూ ంఓసగిస్తూనే ఊన్నారు.ఎలుకలమందు కూడా కల్తీలమయము.పూర్వ కాలములో వానపాములుఉండేవి.భూమిని గుల్లపరచి ఉపకారిగా ఉండేవి. ఇప్పుడు అవికూడా లేకుండాపోయినవి.ఇప్పటికే వానపామంటేయేమిటని అడిగేరోజులొచ్ఛినవి
@s.venkataramayya
అల్లుడుగారు,
పురుగు మందులికి పామే చచ్చిపోతుంటే వానపామెక్కడండీ! పురుగు మందులు మానేస్తేకాని వ్యవసాయం బాగు పడదు. ఆ పురుగు మందులు కూడా కల్తీయే!! మన దౌర్భాగ్యం. వ్యాఖ్యకి
ధన్యవాదాలు.
వామ్మో !
శర్మ గారి మేధో భాండాగారం లో ఇంత ‘ పొన్ను ‘ ‘కిర్రు’ దాగి ఉందా !
సూపెర్బ్ టపా అండి దీక్షితులు గారు !
(దీన్నే కదా అంటారు జీవితాన్ని కాచి వడబోయటం అంటే మరి !)
గణేశ చతుర్థి శుభాకాంక్షల తో !
చీర్స్
జిలేబి
@జిలేబి గారు,
వినాయక చవితి శుభకామనలు,
వజ్రోత్సవానికి దగ్గర పడుతున్న వయసులో చూసినవెన్నో! అనుభవాలు, అనుభూతులు ఎన్నెన్నో, వాటిదొంతరల్లో కొన్ని దొరుకుతుంటాయి, అప్పుడపుడు, ఇలా. చాదస్తం పెరిగిపోయి…….
ధన్యవాదాలు
మీ బ్లాగులో మీరు పొందుపరిచిన అంశాలు చాలా చాలా విషయాలు తెలియచేస్తున్నాయి.
ధన్యవాదములు మహాశయా (thank you sir)….
@సాగర్ జీ,
వినాయక చవితి శుభకామనలు,
ఏమనగలను, ధన్యవాదాలనడం తప్పించి
ధన్యవాదాలు
శర్మ గారూ ,
నమస్తే .
రైతు అవసరాలను గుర్తించి , ఆ వస్తువులను తయారుచేసి ఆ రైతులకు అర్ధమయ్యేటట్లుగా తెలియజెప్పిన వాళ్ళు అసలు తెలివైనవాళ్ళు .
@శర్మాజీ,
వినాయక చవితి శుభకామనలు,
నిజం చెప్పేరు
ధన్యవాదాలు
నాగరాణిగారన్నట్లు సామాన్యుని గూర్చి ఎలా తెలియాలి? నిత్యం మనకు తిండిపెడుతున్న అన్నదాత జీవన విదానం మనకు, మన ముందుతరాలకూ తెలీదు, ముఖ్యంగా ఇప్పటి పిల్లలకి రైతు ఎలాంటి కస్టానికోడ్చి వ్యవసాయం చేస్తున్నాడో తెలీదు, పుస్తకాలల్లో వివిద రకాలైన ఫుడ్ గురించి రాస్తున్నారు కానీ ఫార్మర్ అంటే ఏమిటో వివరించటం లేదు. రేపు ఇదే పిల్లలు పరిపాలనా యంత్రాగాన్ని చేపడితే… రైతుకు ఏమిచేయగలరు (ఇప్పుడూ గతి లేదు అనుకోండీ)చూశారా నేను కూడా టాపిక్‌ని ఎక్కడికో తీసుకెళ్తున్నాను. ఇకపోతే జంతువులని చంపటమూ, లేదా చనిపోయిన వాటి చర్మము ఉపయోగించటమూ అప్పటి పరిస్థితి, రబ్బరూ,సింతటిక్ లాంటివి లేకపోవటం అయిఉండవచ్హు, తోలు చెప్పులు వాడవద్దు అనటమ్లో వారు శాకాహారులు కావటం ఒక కారణం కావచ్హు. సర్, ఇంకా చదవాలనిపించింది చక్కగా రాశారు.
@,ఫాతిమాజీ,
వినాయక చవితి శుభకామనలు,
పాలకుల దుర్నీతితో రైతు పూర్తిగా చితికిపోయాడు, మరు సంవత్సరం నుంచి వ్యవసాయం చెయ్యలేడు, దుస్థితి పొంచి ఉంది.మన తరవాతి తరంవారికి కొంతయినా చరిత్ర తెలియాలనేదే నా తపన.చెప్పులు ధరించకపోవడానికి చాలా కారణాలు ఉండి ఉండచ్చు, మీరు ఊహించినదీ ఒకటి కావచ్చు.
ధన్యవాదాలు
నమస్కారం శర్మ గారూ !ఎంత ఓపిక గా చెబుతున్నారండీ మరుగున పడిపోతున్న వస్తువుల గురించీ !రాజులు। ,జమీందార్లు వాడిన వస్తువులు మ్యూజియంలలో భద్రపరుస్తారు.మరి గతంలో సామాన్య ప్రజలు వాడిన ఇలాంటి। వస్తువుల గురించి। భావితరాలకు తెలిసేది ఎట్లా ?అని ప్రశ్నించుకుంటే ,మీ బ్లాగు ద్వారా సమాధానం దొరుకుతుంది .
@నాగరాణి గారు,
వినాయకచవితి శుభకామనలు,
నా తరవాతి తరం వారికి కొంతయినా తెలియాలనే నా తాపత్రయం. సామాన్యుల గోడు ఎప్పుడూ, ఏకాలంలోనూ పెద్దలకు పట్టలేదు.
ధన్యవాదాలు
పొన్ను గర్ర, కిర్రు జోళ్ళ కధ బాగుంది ! గమనించ వలసినది , రెండూ , పర్యావర ణాన్ని సమతుల్యం చేయడానికి ఉపయోగించినవే ! నడక సౌకర్యం తో పాటుగా , ఇతర జంతువులను కూడా అప్రమత్తం చేసి , తప్పుకోవడానికే ! బహుశా జింక చర్మం తో చేసిన యజ్ఞోపవీతం, శివుడు జింక చర్మం ధరించడం వలన వచ్చిన ఆనవాయితీ అయి ఉంటుంది , లేదా మానవులకు అనాది నుంచీ ఉన్న భూత దయ కు తార్కాణం గా కూడా అయి ఉండ వచ్చు ! ఇంకో విషయం : జంతువుల చర్మాలూ , గోళ్ళూ , ధరించడం , వాటి వస్తువులను వాడడం కేవలం ఆ యా జంతువులను చంపే చేసే వారనుకో కూడదు, కనీసం మన పూర్వీకులు అట్లా చేసి ఉండరు. ఎలుకలు , కలుగులు చేసుకుని , భూమిని సారవంతం చేస్తాయి ! కానీ, అవి అసంఖ్యాకం గా పెరగ కుండా నివారించ డానికి పాములు ! పాములను నియంత్రించడానికి గ్రద్దలు ! రాను రానూ , ఈ సహజ సమతుల్యం చాలా వరకూ దెబ్బ తిన్నది ( అనడం కంటే మానవులు నాశనం చేశారు అంటే బాగుంటుందేమో ! ) కాల క్రమేణా , ఆ యా జంతువులను చంపడం జరిగింది , జరుగుతూ ఉంది కూడా ! ఉదాహరణ కు , ఇప్పుడు అరుదైన జంతువులను పోచింగ్ చేస్తున్నట్టే , తెల్ల వారి పాలన లో , అనేక వేల పులులనూ , ఏనుగులనూ చంపి ట్రోఫీలు గా పట్టుకు పోయారు, వాటిని ! కొన్ని సందర్భాలలో కేవలం ఒక ( తెల్ల ) వ్యక్తే ,అనేక వందల పులులను చంపినట్టు కూడా చరిత్ర చెబుతుంది ! కొందరు భారత దేశం లో రాజాలు కూడా ఈ పని చేశారు !
@సుధాకర్జీ,
వినాయకచవితి శుభకామనలు,
ప్రకృతి సమతుల్యం, జీవ జాతుల సమతుల్యం దెబ్బతింటున్నది, ఇది పాలకుల పాపం. ఎలక చేనిలో ఉంటే నష్టమే ఎక్కువ. పాముండటమే దాని సరియయిన విరుగుడు.
ధన్యవాదాలు
శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతుంటే అది అందించే ఫలాలను అనుభవిస్తూ మనిషి పురోగమిస్తాడు.మీకే కాదు ఆ రోజుల్లో ఏ పిల్లలకీ నూటికి తొంభై తొమ్మిది మందికి కాళ్లకి చెప్పులుండేవి కాదు.దీనికి కారణం ఏ సదాచారమూ కాదు. నాటి సమాజపు ఆర్థిక దుస్థితీ,నాగరికత పెరగక పోవడమూ.మన పెద్దలు ఆ రోజుల్లో తోలు జోడు వేసుకోక పోవడానికి కారణం చనిపోయిన జంతువునైనా అవమానించకూడదని మాత్రం కాదు. అమాయకమైన కృష్ణ జింక చర్మం మీద కూర్చొని పూజ ధ్యానం తపస్సు చేసుకోవడం పుణ్యమని భావించే వారు కదా. ఇదే కాదు ఉపనయనం సమయంలో జింక చర్మంతో చేసిన యజ్ఞోపవీతాన్ని ఇప్పటికీ లాంఛనంగా వేస్తుంటారంటే చాలా కాలం క్రింతం దానిని ధరించే వారనే అర్థం.అవసరాలూ అవకాశాలూ మనిషి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మా తాత గారి కాలంలో టీవీ కంప్యుటర్లు ఉండి ఉంటే ఆయన కూడా భాగవతం పుస్తకాన్ని పక్కన పెట్టి వీటి ముందు తిష్ట వేసి ఉండేవారనడానికి నాకు ఏ అనుమానమూ లేదు. మార్పుల నెవ్వరం ఆప లేము. మనం చూసుకోవలసినది ఆ మార్పు మనకీ సమాజానికీ చెడు చేయకుండా జాగ్రత్త పడటమే.
@మిత్రులు గోపాలకృష్ణగారు,
వినాయకచవితి శుభకామనలు,
నేను అలా ఊహించా, మీరు చెప్పినట్లు నేను, నాడు డబ్బులు లేక జోడు వేసుకోలేదు.వైరుధ్యాలు చాలా ఉన్నాయి. నేటి నాగరికత, పురోభివృద్ది, వెర్రితలలే వేస్తోందని బాధ. శాస్త్రవిజ్ఞానం దురుపయోగమే ఎక్కువగానూ అవుతున్నది.మార్పులను ఆపడం, ఆపాలనుకోవడం తెలివి తక్కువే.
ధన్యవాదాలు