శర్మ కాలక్షేపంకబుర్లు-పిల్లికి చెలగాటమ్….

పిల్లికి చెలగాటమ్..…                                    వినాయక చవితి శుభకామనలు.

DSCN3720

పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటారు కాని అది అనుభవంలో కొస్తేకాని తెలియదు.మా ఇంటికి ఎదురుగా అరవై సెంట్ల కళ్ళం ఉంది. .కళ్ళం అంటే వరి మొదలైన ఆహార హాన్యాలు మాసూలు చేసుకునే చోటు. ఊరి మధ్య కళ్ళమేంటంటే, ఈ ఖాళీ స్థలాన్ని చదును చేసి గరుకుగా గచ్చు చేసి వదిలేస్తారు. ఇది ఉప్పుడు బియ్యం తయారు చేసే మిల్లువారిది. మాకు రోడ్ కి అవతల ఒక ఉప్పుడు బియ్యం మిల్లు ఉండేది.ఉప్పుడు బియ్యం అంటే మనం తినే ఇడ్లీలో వేసే ఉప్పుడు రవ్వను తయారు చేయడానికి తయారు చేసే బియ్యం. ధాన్యాన్ని తడిపి ఉడకబెట్టి వాటిని ఇలా కళ్ళం మీద ఆరబెట్టి మిల్లు పట్టేవారనమాట.  ఆ ఉప్పుడు బియ్యంలో గోల్డ్ అనే రకం బంగారంలా మెరిసిపోయేవంటే అటు కేరళవారు, ఇటు ఒడియా వారు పడి ఛస్తారు, రుచికి. దారి తప్పుతున్నాం కదూ! అలా ఉడకబెట్టిన ధాన్యం ఎండపోసే కళ్ళం పాతికేళ్ళ  పైగా ఉన్నది. కాని అప్పుడు ఖాళీ ఉండేది కాదు. నేను రిటయిర్ అయి ఇంటికొచ్చినది మొదలు మిల్లు పని చేయడం తగ్గింది .అదిగో ఆ సమయం లో నేను మొదటి అంతస్థు వేయడమూ, గాజు కిటికీ తలుపులు బయటి వైపుకు పెట్టడమూ జరిగిపోయింది.  కళ్ళమూ ఖాళీ గా ఉండేది. అదుగో అటువంటి సమయంలో మాకు దగ్గరలో వెనుకబడిన తరగతుల బాలులకు హాస్టల్ పెట్టేరు. ఇంకేముంది ఈ పిల్లలకి తోకలొక్కటే తక్కువ. దానికి తోడు క్రికెట్ బేట్ బాల్స్ ఇచ్చేవారు,కుర్రాళ్ళకి తిండి పెట్టినా పెట్టకపోయినా. . ఇదిగో ఇక్కడకి తయరయిపోయేవారు,సమయంలేదు, సందర్భమూ లేదు, శలవులేదు. ఎప్పుడూ కుర్రాళ్ళు ఈ కళ్ళం మీద క్రికెట్ ఆడుతూనే ఉండేవారు.  గవాస్కర్లు, తెండూల్కర్లు,  కపిల్ దేవ్ వగరాలుగా తయారైపోదామని. 🙂

DSCN3823

ఆ ఏ.సి యూనిట్ కి చిల్లుంది చూడండి.

ఆదివారమొస్తే శలవులొస్తే మాకు గుండెలలో రైళ్ళే పరిగెట్టేవి, ఉదయం నుంచి రాత్రి దాకా.

అటువంటి సుముహూర్తంలో ఒక గవాస్కర్ సిక్స్ కొట్టేడు. భళ్ళు మని గాజు పగిలిన శబ్దం వచ్చింది. మేం ఎక్కడా అని చూసేటప్పటికి కళ్ళం మీద ఒక్కడులేడు. పైకెళ్ళి చూస్తే ఏముంది, గాయపడిన సైనికునిలా ఉంది కిటికీ. హాస్టల్ కెళ్ళి అడిగితే మేము రానేలేదని సమాధానమొచ్చింది. మహానుభావుడు హాస్టల్ వార్దెన్ ఎప్పుడెళ్ళినా దొరకనే లేదు. ఏం చెయ్యాలో తోచలేదు. వడ్రంగి చుట్టు తిరిగి కిటికీ బాగు చేయించుకునేటప్పటికి పదిరోజులు ఐదు వేలు ఖర్చు అయ్యాయి. మిల్లు యజమానికి చెబితే నవ్వేసి కుర్రాళ్ళతోటీ ….తక్కువ వాళ్ళతోటీ గొడవ పడితే మనకే నామోషీ మిగులుతుందన్నాడు. పదిహేను రోజులకి మళ్ళీ తయారయిపోయారు. ఈ సారి ముందుగా హెచ్చరించాను. ఏమైనా తేడా వస్తే పోలీస్ కేస్ పెడతానని బెదిరించాను. నా మాట విన్నట్టే అనిపించింది. రెండు నెలల తరవాత మళ్ళీ మామూలే మరో కిటికీ అద్దం పోయింది. ఇలా గొడవపడుతూ బాధ పడుతూ మూడు సార్లు మూడు ఐదులు ఖర్చుపెట్టుకున్న తరవాత తెలివి తేటలు పుట్టి ఈ తలుపులన్నిటినీ లోపలికి పెట్టించేసేను, పదివేలు ఖర్చయింది.అప్పుడు బయట దోమల కోసం మెష్ తలుపులు పెట్టించా, దానికో పాతిక వేలయింది. మొత్తానికి చేత కానితనం ఖరీదు, చట్టం తనపని తాను చేసుకుపోతుందనుకున్న దాని ఖరీదు అక్షరాలా ఏబదివేల రూపాయలు.

అమ్మయ్య గొడవ ఒదిలిందనుకున్నా. ఈ సారి బాల్ దూసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళకే తగలడం మొదలయింది.ఇలా బాధ పడుతుండగా ఎదురుగా ఒక పెద్ద భవనం వచ్చేసింది, అదిగో అందులో ఒకరు స్ప్లిట్ ఏ.సి బయటికి పెట్టేరు. ఒకడు క్రికెట్ బాల్ తో దానిని బాదితే భళ్ళు మంది వీడి వీపు ఛెళ్ళుమంది.  మరి ఆ తరవాత ఒక్కడు వస్తే ఒట్టు, ఇదిగో ఈ పిల్లలు మళ్ళీ బంద్ మూలంగా మొదలెట్టేరు.

niagara

Courtesy: Dan Probert

దెబ్బకి దెయ్యం దిగొచ్చింది. నేనా పని చేయలేకపోయా. చట్టాన్ని చేతులలోకి తీసుకోలేని వారికి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటమే అయిపోతూంది…బలహీనులంతా ఇంతే…

పిల్లికి చెలగాటం ఎలకకి ప్రాణ సంకటమంటే ఇదే కదూ! మెత్తనివాళ్ళని చూస్తే మొత్తబుద్ధి… లోకువాళ్ళెప్పుడూ…బాధితులే…

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పిల్లికి చెలగాటమ్….

 1. శర్మ గారు,

  మీరు సామెతలు, జాతీయాలు, నానుడులు పెట్టి ఒక ఫుల్ టపా రాయాలి మరి ! (ఒట్టి వాటితో మాత్రమె సుమా! Then it will be the first such experiment I suppose ! probably as a conversation mode ? or you may know a better way to present !!)

  టపా అడిగి రాయించు కోవడం లో నూ ఆనందం ఉంది సుమీ !

  జిలేబి

  • @
   జిలేబి గారు,
   బలే ఉన్నాయి కోరికలు, షరతులూనూ, “ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్లు”. చాలా కష్టమండి. నాచేత అవుననిపించద్దు.
   ధన్యవాదాలు.

 2. బావుందండీ!అందరి బాధ మీ మాటల్లో చెప్పారు .బ్యాట్ బాల్ బారిన పడనివారు చాలా అరుదు.మా పరిస్థితి। మరీ కష్టం .మాఇంటికి రెండు ప్రక్కలా రోడ్డు ,శలవొస్తే చాలు మొదలు .బంతి ఎప్పుడూ మా దొడ్లోనే పడుతుంది .నిముషానికోసారి పిలుస్తారు ‘,ఆంటీ బాల్’అంటారు.లోపలికి రానిస్తే మొక్కలు తొక్కేస్తారు,అందుకని ప్రతీసారి। మేమే ఫీల్డింగ్ చేసి మొక్కల్లో వెదికి మరీ ఇస్తాం.అంతా ఇరుగు పొరుగు పిల్లలు .ఎవర్నీ ఏమీ అనలేము.

  • @నాగరాణి గారు,
   మాదీ అదే బాధండి. మొక్కలు తొక్కేస్తారని ఫీల్డింగ్ చేయగలం కాని మనుషులకి, కిటికీలకి దెబ్బలు తగిలితే భరించలేక,. మొన్ననో సారి బంతి అలా తగిలి చెయ్యి వాచిపోయింది.ఇది “పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం”అయిపోయింది
   ధన్యవాదాలు.

 3. శర్మ గారూ ,

  నమస్తే ,

  ఈ ప్రపంచం పంచన యిలాంటివెన్నో జరుగుతుంటాయని తెలుసుకున్న మన పూర్వీకులు వాళ్ళ అనుభవాలతో చెప్పిన నానుడులే నేటికీ మన నోళ్ళల్లో నానుతూనే వున్నాయి . ” మెత్తగ వుంటే వత్త బుధ్ధేస్తుందట . “

 4. బుల్లి గవాస్కర్ తన ఇంటర్వ్యూలో మీరు పంచుకున్న ఇదే అనుభవం తను కూడా ప్రపంచంతో పంచుకుంటే ఎలా ఉంటుందంటారు ??

 5. హమ్మయ్య శర్మ గారు,

  ఈ మారు ఒప్పేసు కోవాలి మీరు – మీ ప్రక్క న అపార్టు మెంటు ‘మేం సాహేబుల ‘ రాకడ మీకు మంచి కలిగించిం దని !!
  మనం కొంత సౌమ్యమైతే, మన చుట్టూతా ఇట్లాంటి వాళ్ళ ని పెట్టేసు కోవాలి మనకు ‘ప్రొటెక్షన్’ క్రింద ! హ్యాపీ గా అప్పుడు నిదుర పోవచ్చు మరి !

  జిలేబి

  • @జిలేబిగారు,
   మీ మాట ఎప్పుడు కాదన్నామని? ఒప్పేసుకున్నాను. గొప్ప మేం సాబ్ లు పక్కనుంటే మరికొన్ని చిక్కులున్నాయి, సుఖంగా నిద్ర కూడా పోనివ్వరు.దీన్నే “ముల్లు తీసి కొఱ్ఱడచుకున్న చందం” అంటారు 🙂
   ధన్యవాదాలు.

   • శర్మ గారు,

    మీ టపా లని రిసెర్చ్ చేస్తే ఐదు వందల పై బడ్డ ఇట్లాంటి ‘మణి’ మాణిక్యాలైన సామెతలు, చెణుకులు లభించక పోదని అనుకుంటా ! మీకున్న సామెతల్ లెక్క చూస్తే నిజ్జంగా హాశ్చర్యం వేస్తోంది ! ఇట్లాంటి వాణ్ణి ఎట్లా గుర్తు పెట్టుకుంటారు మీరు ?

    నాకు తీరు బడి ఐనప్పుడు మీ టపాల మీద రిసెర్చ్ చేసి శర్మ గారి చెణుకులు అన్న టపా ఒకటి పెడదా మన్న ఆలోచన చాలా కాలం నించి ఉన్నది ! ఈ పై “ముల్లు తీసి కొఱ్ఱడచుకున్న చందం” వాక్యం తో అది నిజంగా చేయాలని పిస్తుంది మరి !!

    చీర్స్
    జిలేబి

   • @జిలేబి గారు,
    మొదటగా మీకు ధన్యవాదాలు. జీవితమనే మాస్టారు చెప్పినవి. జీవితం నుంచి వచ్చినవి సామెతలు,నానుడులు, జాతీయాలూనూ. ఏది ఏది అన్నది వివరించడం పెద్దల పని. చెప్పాలంటే జీవితమంత కధ ఉంది. కొన్ని రాసాను. కొన్ని రాసి మూల పడేసాను, అనామకుని జీవిత చరిత్ర చెప్పాలా అని. సమయం సందర్భానికి చటుక్కున గుర్తొస్తాయి, సామెతలు, జాతీయాలు, నానుడులు. అంతే. వేరుగా గుర్తు పెట్టుకోడం జరగదు. ఈ సామెతలు, జాతీయాలు, నానుడులు ఇద్దరమ్మల బిక్ష, “ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల”. ఇదే టపా ఐపోతున్నట్లుంది. ఉంటా 🙂
    ధన్యవాదాలు.

 6. మామయ్య గారు, ఈరోజులలో ఎవరిని ఏమిఅనలేము. అరితాకు ముల్లుమీదపడ్డా,ముల్లు అరిటాకుమీదపడ్డా లొపం అరిటాకుదేకదా.ఇటువంటివాటికి భరించడం తప్ప వేరుదారేది

 7. సమస్యకు మూలం అల్లా పిల్లలకు ఆటస్థలాలు లేకపోవటమే. ఒక వేళ ఉన్నా అవి కబ్జాకోరుల చేతుల్లో పడి చిక్కిపోవటమో మాయం కావటమో జరగటమే. తూ.గో.జి. కొత్తపేటలో నేను చదువుకున్న స్కూల్లో చాలా పెద్ద ఆటస్థలం ఉండేది. పెద్దది కాబట్టి తరచూ గ్రిగ్ పేరున జరిగే స్థాయి ఆటల పోటీలకు వేదికగా ఉండేది. ఆ మధ్య కొత్తపేట వెళ్ళినప్పుడు చూస్తే ఆటస్థలం కాస్తా చాప చెడి చదర ఐన చందాన ఉంది. అంతా కబ్జా మహాత్మ్యం. ందుకే ఈ‌రోజుల్లో, పిల్లలు చేసేది లేక ఎక్కడ కాస్తం అవకాశం దొరికితే అక్కడ ఆడతారు. దానివల్లనే ఇలాంటి సమస్యలు. ఒకసారి ఒక గడుగ్గాయి కొట్టిన క్రికెట్ బంతి వచ్చి మా అమ్మగారికి కంటి దగ్గర తగిలి బాగా కమిలిపోయింది. నెలలు పట్టింది తగ్గటానికి. కేవలం అదృష్టవశాత్తు ఆవిడకు కన్ను పోలేదని సంతోషించ వలసి వచ్చిందంతే. ఇంకా ఘోరం ఏమిటంటే కొందరు పిల్లలు ఇంట్లోనూ పొరిగింటికి వెళ్ళినప్పుడు బుల్లి బ్యాట్లూ బంతులతో క్రికెట్ ఆడుతుంటారు హాల్లోనే. టీవీలు గట్రా భళ్ళుమనే‌ ప్రమాదాలూ‌ జరుగుతూ ఉంటాయి.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   నిజమే అంతా కబ్జానే. పిల్లలిలా వీధులబడి ప్రాణాలమీదకి తెస్తున్నారు.కొట్టడం లాటివి చెయ్యలేక ఇబ్బంది పడుతున్నాం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s