శర్మ కాలక్షేపంకబుర్లు-వీటిని మీ ఊళ్ళో ఏమంటారు?

వీటిని మీ ఊళ్ళో ఏమంటారు?

DSCN2049

అసూయ, ద్వేషం కవలపిల్లలు. ముందు అసూయ పడుతుం ది, అసూయ పుట్టడానికి కారణాలుండచ్చు, ఉండకాపోవచ్చు., దీనికి ముద్దుగా నేడు జాతివైరం అంటున్నారు. జాతివైరం అన్నది జంతువులలోనే కాని మనుషులలో ఉండదు, ఉండకూడదు. మరి ఇలా అంటున్నవారు ఆ జంతు స్థితికంటే కూడా దిగజారిపోతున్నారేమో!. జాతివైరంలో కూడా సింహం, లేడిని కనపడిన ప్రతిసారి చంపదు, కాని నేడు కనపడితే చాలన్నట్లు ఉంది స్థితి, చంపెయ్యడానికి. ఈ చంపెయ్యడం మనిషి ప్రాణాలు తీయడం మూలం గానే జరగక్కరలేదు, మాటలతో మానహాని కలగచేసి, కించపరచి,మానసికంగా హింసించి, వ్యక్తుల మాన హరణ చేసేప్రయత్నాలు చంపినదానికన్న ఎక్కువ బాధ కలిగిస్తాయి. చంపితే ఒక సారిదే, ఇలా మాటల ద్వారా వ్యక్తులను హింసించే వారికి పేరు కూడా పెట్టలేనన్నాడు భర్తృహరి. అసూయ ఎందుకు కలుగుతుందీ? ఒకరు అందంగా ఉన్నారు, మనకంటే, ఆనందంగానూ ఉన్నారు, కలిమిలేకపోయినా, మనకంటే తెలివయినవారు, బాగా చదువుకున్నారు,సమస్యలకి పరిష్కారాలు తొందరగా చూపగలరు, పదిమంది వారిని సంప్రదిస్తారు, వారి అనుభవాలడుగుతారు, భాగ్యం కలిగి ఉంటారు, భాగ్యం లేకపోయినా జరుగుబాటు ఆనందంగా జరుగుతూ ఉంటుంది, ఇలా ఎన్నెన్నో కారణాలు, కావలసినన్ని, అసూయకి.  ఇది కలిగినవారు తిన్నగా ఉండలేరు, కాదు అసూయ తిన్నగా ఉండనివ్వదు. ఏదో చెయ్యాలి కడుపులో ఉన్న అసూయను బయట పెట్టుకోడానికి. దీనికి మార్గాలనేకం. కొంత మంది మాటలతో, మరికొంత మంది చేతలలో చూపిస్తారిది. ఏ రకంగా బయట పడినా అసూయ అందంగా ఉండదు. అందుకే కొంత మరుగు కావాలన్నారు,ప్రతి విషయానికి, అలాగని భయపడితే? మిగిలేది ఆత్మ న్యూనత. ‘నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుంద’ని సామెత చెబుతారు.కొన్ని కొన్ని సందర్భాలలో ఎంతటివారయినా, ఎంత చిత్త స్థైర్యం ఉన్నా డీలా పడిపోతారు, ఇటువంటి వాటికి. చిన్న ఉదాహరణ, మొన్న ఉత్తర ప్రదేశ్ లో ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ దుర్గ విషయం చూస్తే, ఆ రాజకీయ నాయకుడు, ఆమె వ్యక్తిగత కుటుంబ చరిత్ర చెబుతానన్నాడు. ఇదిగో ఇటువంటి సమయంలో నే పాపం అటువంటివారు ఇబ్బంది పడిఫోతుంటారు. ఏమయినా ఆమె దేశ ద్రోహికాదు, ప్రజాద్రోహి అంతకన్నా కాదు. ఏదో ఒక కారణం సమాజంలో ఉన్నదానిలా ఉండకపోవచ్చు, ఆమె పట్ల, దానికి ఆమె కారణమూ, బాధ్యత కూడా ఉండి ఉండకా పోవచ్చు, కాని ఆ కారణం చెప్పి ఆమెను న్యూనత చెయ్యాలని చూసిన మహనీయులు మన నేతలు. ఎంత దౌర్భాగ్యం

oregonfalls don probert

Oregon falls Courtesy: Dan Probert

అసూయను బయట పెట్టుకునే మార్గాలలో ఒకటి మాట అనుకున్నాం కదా! ఈ సమయంలో మాటాడే మాట కత్తి కోతకంటే పదునుగాను, ఒడుపుగానూ ఉంటుంది. పలుకు దారుణాఖండల శస్త్రతుల్యమే. ఇలా వచ్చిన మాట కలగచేసే విధ్వంసం చెప్పనలవి కాదు. ఎదుటివారి మనసును కోస్తుంది, దూస్తుంది, బాధనూ కలగచేస్తుంది, మననానికి వచ్చినపుడల్లా. ఇంతకుమించిన దారుణం మరొకటి ఉండదు. చేత కాని తనం నుంచీ, ఆత్మ న్యూనతాభావం నుంచి కూడా ఈ రకమైన మాటలు ఉత్పన్నమయి, ఎవరి మీదనయితే సంధింపబడ్డాయో వారికి నరకం చూపించి, ‘ఇంతకంటే ఆత్మహత్య చేసుకుంటే మేలని’పిస్తాయి. దీనికి ఆడ మగ భేదం లేదు. ఈ అగ్ని భార్యా భర్తల మధ్యనే కనక రగిలితే, ఆ సంసారం నిప్పుల గుండమే, పిల్లలు బలి పశువులే. అసూయ పురుగు కుట్టినవారంతా ఒకలాగే బాధ పెడతారు, బాధ పడతారు. ఈ మాటలనుంచి వచ్చేది ఈర్ష్య, ద్వేషం,కసి,కార్పణ్యం. మనకో సామెత కూడా ఉంది “కాలుజారితే తీసుకోగలం, నోరుజారితే తీసుకోలేం” కాలు జారడం అంటే మరో అర్థమూ ఉంది, అది మాత్రం కాదులెండి. మాట జారిపోయిన తరవాత ‘నేనలా అనుకోలేద’న్నా కుదరదు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఇది రామ బాణం, ఒక సారి ఎక్కుపెడితే ధ్వంసం జరిగితీరాల్సిందే!. అందుకే మాటాడే ముందు ఆలోచించి మరీ మాటాడాలి. నోటికి తోచినది మాటాడితే ‘నోరా వీపుకి దెబ్బలు తేవద్ద’న్న సామెత నిజం కూడా చేస్తుంది. ఆ సావకాశం లేనపుడు పరువునూ తీస్తుంది. మాటపడినవారేమనకపోయినా మిగిలినావారు చూస్తూ ఊరుకోరు. బుద్ధి చెబుతారు. ఒకవేళ దానినుంచీ తప్పించుకున్నా, న్యూటన్ మూడవ సూత్రం పనిచేస్తూనే ఉంటుంది. మనమొకరిని దెబ్బ కొట్టడం కాని, మాట అనడం కాని చేయడం మూలంగా జరిగే విధ్వంసంలో మనకూ పాలుంటుంది. దెబ్బ ఎంత గట్టిగా కొడతామో అంత దెబ్బా మనకూ తగులుతుంది. కాని అది గుర్తించం. మాటంటే, ఆ సమయానికి మన మనసుకి బాగున్నా, ఆ తరవాత బాధ పెడుతుంది. ఇది పెరిగి పెరిగి మానసిక రోగిలా తయారవడం ఖాయం, మన మానసిక ఆరోగ్యానికి చేటు కూడా.

ఐతే విభేదమే చెప్పద్దంటారా అని ప్రశ్న రావచ్చు. విభేదీంచచ్చు, కాని దానిని చెప్పే పద్ధతి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందు విభేదం చెబుతున్నదీ చెప్పాలి, కారణాలూ చెప్పాలి, అది నిజమూ అయి ఉండాలి. మనకు తోచినది, తెలిసునదే నిజమనుకోడమూ తప్పే. అన్నీ మనకే తెలుసనుకోడమూ తప్పే. తాడితన్నేవాడి తలతన్నేవాడూ ఉంటాడు. అది మరిస్తే ఎలా? అసలిదంతా చెప్పడానికి నువ్వెవరూ? నీకెందుకూ అనేవారూ ఉన్నారు. ఒక్క మాట వినండి. ఇటువంటి సందర్భంగా రాక్షసుడయినా మారీచుడు రావణునికి చెప్పినమాట ఇది.

సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్య పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః

రాజా! మనం కోరుకున్నట్టు మనకు ఇష్టమయినట్లు మాటాడే వారు సులభంగానే దొరుకుతారు. నిజమైనది, పథ్యమైనది, అప్రియమైనా సత్యం చెప్పేవాడూ లేడు ఒకవేళ ఎవరైనా చెప్పినా, వినేవాడూలేడు, అన్నాడు. నేటికీ అది నిత్య సత్యమే. సీతను ఎత్తుకు రావాలనే నీ ఆలోచన మానుకో, అని చెప్పినా వినని రావణునితో, మారీచుడన్న మాట ఇది. రావణుడు వినలేదు, నేను చెప్పిన మాట వినకపోతే చంపుతానన్నాడు, మారీచుని జ్ఞాననాడి కదిలింది, ‘ఛీ! ధూర్తుడా!! నీ చేతిలొ కుక్క చావు చావడం కంటే పరమాత్మ చేతిలో చావు మేల’నుకున్నాడు, ఆత్మ సమర్పణ చేసుకున్నాడు. రామాయణ కాలం నాడే గొప్ప సత్యం చెప్పేడు. ఈ శ్లోకం పదే పదే చెబుతున్నా, వివిధ సందర్భాలలో, వద్దనుకుంటూనే, దీన్నేమంటారు మీ ఊళ్ళో!……..

పొరపాటుగా నోటికొచ్చింది మాటాడినా, తెలిసిన వారు అది తప్పని చెప్పినపుడు తప్పుదిద్దుకుని మనస్ఫూర్తిగా క్షమాపణ వేడేవారు బాగుపడతారు, జీవితంలో. మూర్ఖంగా ప్రవర్తించే వారిని ఆడించేవాటిని మా ఊళ్ళో అసూయ ద్వేషం అంటారు, మరి మీ ఊళ్ళో ఏమంటారూ?…….

ఈ పువ్వుల్ని మీ ఊళ్ళో ఏమనిపిలుస్తారో చెప్పండి. 🙂

DSCN3832DSCN3831

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వీటిని మీ ఊళ్ళో ఏమంటారు?

 1. టపా అదిరి పోయింది ! మాటలతో ఇతరులను కష్ట పెట్టే వారు కూడా చాలా మంది ఉంటారు ! కానీ వారు ప్రత్యేకించి చాలా సున్నిత మైన స్వభావం ఉన్న వారినే లక్ష్యం గా చేసుకుంటారు ! ఇతర దేశాలలో ఇట్లా మాటలతో హింస పెట్టే వారి మీద కేసులు పెట్టి అనేక లక్షల పరిహారం పొందిన వారున్నారు ! భారత దేశం లో శారీరికం గా పెట్టే హింస కే దిక్కు లేదు , ఇక మానసిక హింస గతి ఎవరికీ పట్టింది ? ప్రత్యేకించి, రాజకీయ నాయకులకు అసలే పట్టదు !
  తనువున విరిగిన అలుగుల
  పుచ్చంగ వచ్చునతి నిష్టురతన్ !
  మనమున నాటిన మాటలు
  మినుమెన్ను ఉపాయములైన వెడలునె అధిపా ? !
  (తాత్పర్యం : శరీరానికి గుచ్చుకున్న బాణాలను కూడా అతి జాగ్రత్త గా బయటకు తీయవచ్చును ! కానీ మనసుకు ‘గుచ్చుకునే’ మాటలను ఎన్ని ఉపాయముల తోనైనా తీయలేము కదా ! )

 2. బాగా వ్రాశారు.
  ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అసూయ, ద్వేషం, స్వార్ధపరుల చెప్పుడు మాటలు వినటం వంటి వాటి వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో స్పష్టంగా తెలుస్తోంది.
  ……………..
  పైన ఉన్న పుష్పాన్ని దేవ గన్నేరు లేక వనజ గారు వ్రాసినట్లు దేవ కాంచనం అంటారనుకుంటున్నాను.
  క్రింద ఉన్న పుష్పాలు ఉమ్మెత్త పువ్వులలా ఉన్నాయండి.

 3. మామయ్యగారు,-ఉమ్మెత్తపూలు మరియు దుత్తూర పువ్వులు అనికూడాఅంటారని అనుకుంటున్నాను].ఇప్పుడు రాస్ట్రంలో జరుగుతున్నదానికి [తమిల్నాడు,కేరళ,కర్నాటక,మధ్యప్రదేస్ వారిఅసూయలకు తెలుగు వారుమొత్తం వినాశనం అవుతున్నారు.మరి మీరేమంటారో

 4. శర్మ గారు ఏ మాట మీద టపా రాసినా అది వారికే చెల్లు ! సెహబాష్ !

  ఇంతకీ ఈ టపా లో ఏమైనా నిగూడ అర్థం ఉందా ?! జేకే !

  జిలేబి

  • @జిలేబి గారు,
   పొగిడేసి “ములగ చెట్టు ఎక్కించెయ్య”కండి.
   అంతరార్ధాలు పట్టెయ్యడం మీ తరవాతే. ఒక టపా, ఒక వ్యాఖ్య చదివేను,అక్కడ కనపడింది అసూయ, ద్వేషమున్నూ, నేడు జరుగుతున్నవి చూస్తుంటే కడుపు మండి, ఇలా టపా వచ్చేసిందండి.మరో సంగతి పెద్దవారెవరూ బ్లాగుల్లో రాయటం మానేశారు, అదే చెయి తిరిగినవారు, అందుకు నేనే”మాను దేశమందు ఆముదపు చెట్టు మహా వృక్షం” లా కనపడుతున్నాను మీకు.
   ధన్యవాదాలు.

 5. అసూయ,ద్వేషం మనుషులని ఎంతటికైనా దిగజారుస్తుంది అన్నది నిజం. ఏమిచేయలేక మూలాలని తవ్విన విధానం సిగ్గుచేటు .ఒకవిధంగా బ్లాచ్క్ మెయిలింగ్. లోపాలు లేనివారు ఎవరూ ఉండరు.
  ఏది ఏమైనా కడుపు మంట గురించి .. రెండు మూడు విషయాలతో కలిపి బాగా చెప్పారు. సంతోషం.

 6. శర్మ గారూ ,

  నమస్తే .

  మీరు వివరించిన ” అసూయా, ద్వేషాలు ” ఏ ఊళ్ళో అయినా , ఏ రకంగా పిలిచినా వాటి సహజ స్వభావాలు మారవు కదండి . కాకుంటే మీ ఊళ్ళో వీటినేమంటారు ? అని పర భాషా వాళ్ళను అడిగే వాళ్ళం యిది వరకు . కాని యిప్పుడు దురదృష్టకరంగా మన రాష్ట్రం వాళ్ళనే మనం అడగవలసిన పరిస్థితూళెఋఫాదాతాం భఢఖాఋఆంఘణె వూండీ .
  ఈఖా అ పూలు ” పున్నాగ పూలు ” కదండి .

 7. మాస్టారూ.. పోస్ట్ కి ఎగువ భాగమున ఉన్న పుష్పం దేవకాంచనం అంటారని ఇటీవలే తెలిసింది క్రింది భాగమున జత చేసిన పువ్వులు ..ఉమ్మత్త పువ్వులు అనుకుంటున్నాను . పోస్ట్ చదివి మళ్ళీ ..వ్యాఖ్యతో వస్తాను. 🙂

 8. నాకు తెలిసి ఇదేదో “కడుపుమంట” లాంటి రోగమనుకుంటాను, ఇంగ్లీష్ లో “Jealous ” అనుకుంటాను …..భాష మీద మీ అంత పట్టులేనిదాన్ని మన్నించండి 🙂

  • @పద్మగారు,
   మీరుభయ భాషా ప్రవీణులు కదా! ఇదివరకు సంస్కృతం తెనుగు అనే వారు. ఇప్పుడు ఇంగ్లీషు తెనుగు చెబుతున్నారు.మీరన్నది నిజమే 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s