శర్మ కాలక్షేపంకబుర్లు-నల్లి-జలూకం

నల్లి-జలూకం

మొన్నటి టపా ,నులకమంచం లో కామెంట్ లో మిత్రులు శ్రీశ్యామలరావుగారు, శ్రీ శర్మ గారు నల్లులగురించి ప్రస్తావించారు. టపా రాసేటపుడే స్ఫురణకొచ్చింది కాని విస్మరించా! దాని ఫలితమే ఈ టపా!!

images (1)

క్షీరదములు,అండజములు,స్వేదజములు అని మూడు రకాలు జీవుల పుట్టుక.క్షీరదములు అంటే పాలిచ్చి పెంచేవి, అండజములు అంటే గుడ్డు పెట్టి పొదిగి పిల్లని చేసేవి, స్వేదజములు అంటే చెమటనుంచి పుట్టేవి. నాకున్న పరిజ్ఞానంలో స్వేదజములు నల్లి, పేను మాత్రమే. ఈ మధ్యకాలం లో అంటే బహుశః పది సంవత్సరాలలోపునుంచి ఇవి పూర్తిగా కనుమరుగైపోయినట్లే ఉంది.

పాత రోజులలో ఈ నల్లి బాధ చాలా ఎక్కువగానే ఉండేది. విష్ణువు పాలకడనల్లి మీద శివుడు వెండి కొండ మీదా ఎందుకుంటున్నారయ్యా అంటే నల్లి బాధ భరించలేకేననిఒక కవి చమత్కారంగా పద్యం కూడా చెప్పేరు.మశక, మత్కుణాల బాధని ఈతి బాధగా చెప్పేరు తిరుపతి వేంకట కవులు.మత్కుణం బాధ వదిలింది కాని మశకం బాధ వదలటం లేదు. ఎన్ని మందులు కొట్టినా చిరంజీవిలాగా బతుకుతూనే ఉన్నాయి. సంతానాభివృద్ధి చేస్తున్నాయి.

images

సినిమాహాళ్ళు,లాడ్జీలు, బస్సులు, రైలు బెర్తులు వీటి సామాన్య నివాస స్థానాలుగా వర్ధిల్లేవి.ఇవి ఒక చోటినుంచి ఒక చోటికి బహు జాగ్రత్తగా మనిషి బట్టలలో దూరి వచ్చేసి కొత్తగా వచ్చిన చోట కాపరం పెట్టేసేది. ఇళ్ళలో వీటి స్థానాలు మంచాలు, పడక కుర్చీలు, కర్ర కుర్ఛిలని, క్లాసు బెంచీలని కూడా వదిలేవి కావు.

శలవులొస్తే ముఖ్యంగా శని ఆదివారాలలో మంచాలు ఎండలో పడెయ్యడం ఒక ప్రత్యేక కార్యక్రమం. ఎండలో పడేసి ఊరుకుంటే సరిపోదు. ఎండలో వేసి పట్టెమంచాల అడ్డపట్టె పట్టుకుని పైకెత్తి కిందకి వదిలేస్తే నల్లులు రాలేవి. అక్కడితో అయిపోలేదు. రాలినవాటిని రెండు కాళ్ళు రెండు చేతులతో సంహార కార్యక్రం, ఒక దాన్నీ వదిలిపెట్టకుండా. మళ్ళీ మంచం ఎత్తడం పడెయ్యడం కధ మామూలే. కొంత కాలానికి వాటికీ తెలివి పెరిగి రాలేవి కావు, అప్పుడు సన్నపాటి చీపురుపుల్ల పుచ్చుకుని మంచం సందులలో పొడిచి వాటిని బయటకు రప్పించి చంపడం. ఆ తరవాత వీటి నివాసం పట్టెకింద. నవారు పట్టెను జరిపి వీటిని పట్టుకుని చంపాలి. మొదటిలో సరదాగానే ఉండేది, రాను రాను విసుగొచ్చేది, మరెవరూ వచ్చేవారు కాదు, సాయానికి. ఇలా ఎర్రటి ఎండలో పడి ఉదయం పదినుంచి కొంచం ఇంచుమించు సాయంత్రం దాకా నాలుగైదు మంచాలకి ఈ కార్యక్రమం జరిపించాల్సివచ్చేది. ఒక్కొకప్పుడు కర్ర తీసుకుని మంచం మీద బాదితే రాలేవి. ఇలా రాలేవి తక్కువే. అందుకే ఒక సామెత కూడా ఉంది, “నల్లులకోసం మంచానికి పెట్లు” అని.కొంతమంది శీతకాలం లో నీళ్ళు వేడిగా మరగబెట్టి మంచమీద పట్టెల పైన పోసేవారు, ఆ తరవాత ఎండలో పడేసేవారు.ఇలా చేసినా చచ్చేవి కాదు, మళ్ళీ మామూలే. ఆఖరికి ఇంటి గోడలను అంటి పెట్టుకుని ఉండేవి.

full-1

ఇలా మత్కుణ సంహారం చేసిన రోజు భోజనం చేయబుద్ది వేసేది కాదు. ఎంత కడిగినా, ఎంత ఏమేసి  చేతిని రుద్దినా వాసన పోయేది కాదు. అందుకు మత్కుణ సంహారానికి వారానికి ఒకరికి డ్యూటీ. మొన్నటి వారం నేను వేసేనంటే నేను వేసేనని గొడవ చేస్తే అమ్మ గుర్తు తెచ్చుకుని ఎవరు వెయ్యాలో చెప్పేది, అప్పుడు నోరు మూసుకుని వేసేవారు.

leach

ఇవి ఎంత తొందరగా నిమిషాలలో పెరుగుతాయో చూశారా?నల్లి ఇతర జంతువుల రక్తం పీల్చి బతికేది. మరి ఇటువంటిదే మరొక జీవి జలగ. దీన్ని సంస్కృతం లో జలూకం అని అంటారు. ఇది ప్రతి జీవిని అంటి పట్టుకుని ఉండి రక్తంతాగుతుంది. రక్తం తాగే సమయంలో దీని నోటినుండి వెలువడే ఒక స్రావంమూలంగా ఎవరి రక్తమయితే తాగుతోందో వారికి నొప్పి కూడా తెలియదు. మరొక సంగతి కూడా ఒక సారి కనక పట్టుకుంటే దీనిని శరీరం నుంచి విడతీయడం కూడా చాలా కష్టం. ఇలా పట్టుకున్న జలగ వదలిపెట్టాలంటే పుగాకు నీళ్ళు కనక పోస్తే ఠక్కున వదిలేస్తుంది. ఇది నీటిలో జీవిస్తుంది. దీనిని ఉపయోగించుకుని పాత కాలం లో వైద్యం లో కురుపులలో రక్తాన్ని స్రవింపచేయడానికి వాడేవారట.

ప్రభుత్వంలో కుర్చీలో కూచుంటే అధికారమనే నల్లి కుట్టగానే నాయకులలో మార్పొచ్చేస్తుంది. ఎవరూ కనపడరు, మనుషులంతా ఓటర్ల లాగే కనపడతారు.వారిని బిచ్చగాళ్ళలాగా ఉంచేందుకు ఆహార భద్రతా పధకం,ప్రభుత్వ సారా దుకాణం పెట్టిస్తామని, ఓటేసినందుకు సొమ్మిచ్చి, అలా ఓట్లు వేయించుకున్న తరవాత జలగలలాగా  పీల్చుకుని తింటారు, సారాకి బానిసలని చేసి సోమరులుగా మారుస్తున్నారు.వారు నేరం చేసినా ఋజువయ్యే దాకా పదవిలో ఉండేలా చట్టం చేసుకోవచ్చు. సమాచార హక్కు చట్టం కిందకి తాము రామని చట్టం చేసుకోవచ్చు, తాము చెప్పినదే వేదమనీ చాటుకోవచ్చు,న్యామూర్తుల నియామకం కూడా రాజకీయం చేసేయచ్చు, ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలేసినా! పదవిని పట్టుకుని వేలాడే వారిని ఏమంటారు?…..జలగ. నల్లులు అంతర్ధానమయినట్లే స్వార్ధ రాజకీయనాయకులు కనుమరుగవుతారా? …

ఇంతా చదివేకా మీకెవరేనా గుర్తొచ్చారా? జలగ పార్టీకి జై!!!

DSCN3854

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నల్లి-జలూకం

 1. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు-నల్లి-జలూకం | Bagunnaraa Blogs

 2. మీరు ప్రస్తావించిన చాటు పద్యం:

  కం. శివు డద్రిని శయనించుట
  రవిచంద్రులు మింట నుంట రాజీవాక్షుం
  డవిరళముగ పాముపైన
  పవళించుట నల్లిబాధ పడలేక సుమీ

  తాత్పర్యం ఏమిటంటే, శివుడు కొండమీద పడుకోవటమూ, సూర్యుడూ చంద్రుడూ ఆకాశాన్నే ఉండిపోవటమూ, శ్రీమహావిష్ణువు పాముమీద పడుకోవటమూ చేస్తున్నారంటే వాటికి కారణం వాళ్ళు నల్లి బాధ పడలేకే అలా చిత్రంగా ప్రవర్తిసున్నారూ అనిట.

   • మరొక విషయం చెప్పటం మరచిపోయానండీ. “క్షీరదములు,అండజములు,స్వేదజములు అని మూడు రకాలు జీవుల పుట్టుక” అన్నారు. నాలుగోరకం కూడా ఉన్నాయి. వాటిని ఉద్భిజములు అంటారు. ఉద్భిజము అంటే భూమిని చీల్చుకుని పుట్టేది అని అర్థం. కాబట్టి ఉద్భిజములు అంటే చెట్లూ మొక్కలూ అన్నమాట.

   • @మిత్రులు శ్యామల రావు గారు,
    నిజమే. అసలు జీవులు రెండు రకాలు. జంగమాలు(కదిలేవి) స్థావరాలు( ఉన్న చోటునుంచి కదలనివి) మొదటిదానిలో క్షీరదాలు, అండజాలు, స్వేదజాలు, రెండవదానిలో ఉద్బుజాలు వస్తాయి కదా! నేను రెండవ బ్రాంచి అని అలా అని వదిలేశాననమాట.
    ధన్యవాదాలు.

 3. సర్, మా పాపకి మీ పోస్ట్ మొత్తం చదివి వినిపించాను, అసలు నల్లులు ఉంటాయనిగానీ మన కాలాన వాటిని బరించామని గానీ తెలీదు ఈ తరం వారికి. చాలా బాగా రాశారు

  • @ఫాతిమాజీ,
   మీరన్నట్లు ఈ కాలం వారికి మనం అనుభవించిన కొన్ని సుఖాలూ తెలియవు, కష్టాలూ తెలియవు. నల్లి అంతరించిపోతున్న/ అంతరించిపోయిన జీవజాతుల జాబితాలో చేరిపోయింది.
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్ ధాత్రి,
   చాలా కాలం తరవాత కనపడ్డావు, కుశలమే కదా! నీకే నల్లి తెలియదంటే, చూడలేదంటే ఇది అంతరించిపోతున్న జాతులలో కలిసినట్లే,కాని వీటి వారసుల్ని రోజూ చూస్తున్నాం కదూ!
   ధన్యవాదాలు.

 4. మామయ్యగారు,-రావణాసుర సంహార అనంతరం రామునితో రాక్షసులు మాప్రభువుని సంహరించినావు మేము రక్తానికి అలవాటు పడినవారము. ఇప్పుడు మా ఆహారం ఎలాగని అడగగా నల్లులు,పేలుగా ఫుట్టి మీఆకలి తీర్చుకోమని వరం ఇచ్చినాడట. కాని ఇప్పుడు మనరాజకీయనాయకులు ఆ రక్తమాంసాలు మాకే సొంతం. వేరేఎవరూ వాటిగురించి ఆశపదితే ఊరుకొనేదిలేదని దేవునివద్ద వరం పొందినారు.భగవంతుడు వీళ్ళకోరిక తీర్చక పోతే వీళ్ళు తనకు ఈమాత్రం నివేదన కూడా జరగనివ్వరని భయపడి వాటిని నిషేధించినాడు. లేనిచో వేంకటేస్వరస్వామి వారిని నీకు ఏడు కొండలెందుకు జోడుకొండలు చాలవా అన్న నాయకులను మనం చూసాము కదా.అందుకే వీళ్ళకు భగవంతుడు కూడా భయపడినట్లున్నాడు.

 5. శర్మ గారూ ,

  నమస్తే .

  కఱ్ఱ మంచాలు , కాటన్ నవారు మంచాలు దాదాపుగా కనుమఱుగైపోయాయి . సినిమా ధియేటర్లు కూడా ఏ సి కి మార్చటం , రైలు బెర్థ్లు , సీట్లలో నాణ్యత పెఱగటం వల్ల కూడా కనుమఱుగు అవటానికి కొన్ని కారణాలు కావచ్చు . అందువల్ల నల్లుల బెడద దాదాపుగా పోయినట్లే అనుకోవచ్చు . ఇప్పటికీ పల్లెల్లో కొన్ని చోట్ల అడపా , తడపా దర్శనమిస్తూనే వుండవచ్చు .
  నగరవాసులు నల్లుల బాధ నుండి విముక్తి కలిగిందనుకోకుండా , నాయకుల బాధ అంటుకున్నది . దీనికంటే నల్లులే నయమనిపిస్తోంది . ఎందుకంటే కనపడినప్పుడు చంపే అవకాశం మన చేతుల్లో వున్నది . ఈ అనామకుల నాయకుల వల్ల మనం ఎన్నుకోకపోయినా ఓట్లను పార్టీల పరంగా ముక్కలు చేసి ( 100 శాతంలో 65 నుంచి 75 శాతం పోలింగు జరిగితే . ఆ 75 శాతం ఓట్లని 5 , 6 పార్టీలు చీల్చి , వాళ్ళకు వచ్చిన ఆ కొంచెంలో 25 శాతం వచ్చినపార్టీ నాయకుడు ) ఈ 100 శాతం ప్రజలను పరిపాలించటతో వాడికి ముఖ్యులైన వాడి అనుయాయులకే కొంచెం మంచి జరిగే అవకాశం వున్నది . మిగిలిన జనాభా వాడి దుశ్చేష్టలకు నల్లుల్లా బలి అయి తీరవలసిందే .
  నల్లులకు , నాయకులకు బహు దగ్గఱ సంబంధం వున్నది . అంతే కాదు , బాగా తరచి చూస్తే ఈ నాయకులు ఆ నల్లుల వారసులై వుంటారన్న అనుమానం నాలో ఎక్కువగా వున్నది .

 6. శర్మ గారు,

  పొద్దుటే చాలా ‘చంపేశారు’ ! !
  “స్వేదజములు నల్లి, పేను మాత్రమే. ఈ మధ్యకాలం లో అంటే బహుశః పది సంవత్సరాలలోపునుంచి ఇవి పూర్తిగా కనుమరుగైపోయినట్లే ఉంది.”

  ఈ మధ్య కాలం లో జనుల సొగసు ఎక్కువై స్వేదజం తక్కువై పోయిందేమో మరి , నల్లులు తగ్గి పోయేయి !!

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s