శర్మ కాలక్షేపంకబుర్లు-దాలిగుంటలో కుక్క.

దాలిగుంటలో కుక్క.

1

పాలకొలను (పాలకొల్లు) ట్రాన్స్ఫర్ అయిన తరవాత (పెద్ద సెక్షన్ లో పని చేసి ఉన్నందున చికాకుతో) చిన్న సెక్షన్ ఇచ్చారని సంతోషించి పని లేనందుకు ఆనందించి, తినడం పడుకోడం చేశాను, రెండు నెలలు. ఆ తరవాత ఒక రోజు ఏంటిదీ! తిని పడుకోడానికేనా, ఈ జీవితం అనిపించింది. పనిలేని ఆరుగురు అసిస్టెంట్లకి ఒక పని లేని పై అధికారిని, ఏదో ఒకటి చేద్దామనిపించి, మనకిచ్చిన సెక్షన్ లో ఏమున్నాయో చూద్దామనిపించింది. సెక్షన్ లో చూస్తే కొంతకాలం వరకు పని చేసిన ఎనిమిది ఛానల్స్ ట్రాన్స్మిషన్ సిస్టం ఒకటి కనిపించింది, దుమ్ముకొట్టుకుపోయి. మరొక పాత సిస్టం కనపడింది మూడు ఛానల్స్ ది. వీటి తాలూకు అవతలి ఊళ్ళలో ఉండవలసిన ఎక్విప్మెంట్ బయట వరండాలో పారేసి ఉంది. ఎందుకో! అసలీ సిస్టం ఎలా ఉందో చూద్దామని బ్లోయరు పుచ్చుకుని దుమ్ము దులపడం మొదలెడితే, పని లేని అసిస్టెంట్, మజ్దూర్ వచ్చేసేరు. ఎందుకు సార్ ఇది పని చెయ్యదంటూ. మాటాడలేదు. మజ్దూర్ నా చేతిలో బ్లోయర్ పుచ్చుకుని సిస్టం దుమ్ము దులిపేడు.

చాలా కాలం కితం వదిలేసిందేమో, అన్నీ సరిచూసుకుని,పోయినవి బాగు చేస్తూ, బాగుంది అనిపించుకునేటప్పటికి మూడు రోజులు పట్టింది. చూస్తే ఆఫీస్ లో స్పేర్లు చాలానే కనపడ్డాయి, వాటి ఉపయోగం తెలియక వదిలేసేరు, లేకపోతే ఆ పాటికి కాళ్ళొచ్చి నడిచిపోయి ఉండేవి. ఈ స్పేర్లు ఉపయోగించాను. ఒక పక్క బాగుంది మరి రెండవపక్క? అని  సిస్టం బయట పడేసింది తెచ్చి దానిని కూడా చూసి అదీ బాగుందనిపించేటప్పటికి వారమూ పట్టేసింది.ఇదెందుకు చేసేనో చెప్పలేను. నా అసిస్టెంట్లు  ఉత్సాహం చూపిఈయనకి పని వచ్చును, ఇదో పిచ్చిలాఉందనుకున్నారు, నా వెనక.

ఇక్కడ ఈ సెక్షన్ గురించి కొద్దిగా చెప్పాలి. ఒకప్పుడు అనగా ఓ.ఫ్.సి కేబుల్ రాక ముందు బయట లయిన్లపై పనిచేసేదే కేరియర్, ఈ సెక్షన్ అంటే అందరికీ భయమే, పని చేతనయి ఉంటే ఇదొక ఆనంద స్వర్గం, లేకపోతే నరకం. చాకిరి తప్పించి పైస గిట్టుబాటు కాని సెక్షన్, అందుకు ఇదెవరికి అక్కరలేదు, దీనికి పోటీ లేదు, ఇక్కడకొచ్చినవాడు సోమరిపోతుగా తయారవటం ఖాయం, పని చేతకాకపోతే. ఎక్కువమందికి ఇదంటే భయమే, లెక్కలలో ఆల్జీబ్రాలాగా. మరి నువ్వేంటీ అంటే, మనకి ఇటువంటి ఛాలంజి అంటే ఇష్టం. టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేసినది వీటి మీదే, ఆ తరవాత జె.యిగా స్పెషలయిజేషన్ చేసి నాటి రోజులలో జబల్పూర్ ట్రయినింగ్ సెంటర్లో బేచ్ కి రెండవవాడిగా వచ్చిన వాడిని, వీటిని పని చేయించడం మందుకొట్టిన దానికన్న నిషా. నాకు బెస్ట్ ట్రాన్స్మిషన్ ఇంజనీర్ అని నా స్నేహితులంతా బిరుదిచ్చెసేరు.ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా నా దగ్గర వాలిపోయేవారు.ఇంతకు మించి చెప్పుకుంటే స్వంత డబ్బా కొట్టుకున్నట్లే వుంటుంది, అందుకు ఆపుతాను.

రెండు పక్కల సిస్టం బాగుందనుకున్న తరవాత ద్సీనిని ఏదో ఒక వూరికి తగిలిస్తే, కొద్దిగా శ్రమపడితే ఎస్.టి.డి ఆ వూరికి ఇవ్వచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చింది. అప్పటికి పల్లెలకి ఎస్.టి.డి లేదు, పాలకొల్లు నరసాపురాలకి తప్పించి. నా పై అధికారి దగ్గరకెళ్ళి మన దగ్గర తీసేసిన ఎనిమిది ఛానల్స్ system ఉందని ఏదో చెప్పబోతే, ఆయన చికాకు పడి, ‘అది పని చెయ్యదండీ, అనవసరం, మీవల్లకాదు, అందరూ చూసి వదిలేశారు పని చేయించలేమని, మీపని మీరు చూసుకోండ’ని కసురుకున్నట్లే చెప్పేడు. నేను నెమ్మదిగా ‘ఆ సిస్టం పని చేస్తోంద’న్నా! ఆయన్ పక్కలో బాంబ్ పేలినట్లుగా కంగారు పడి, ‘నిజమా!’ అని ఆశ్చర్యపోయాడు. ‘మీకు వీటి గురించి తెలుసా?’ అని కూడా ఆశ్చర్యపోయాడు. ‘ఒక సారి మీరే చూడండి’ అని చెపితే బయలుదేరి వచ్చి చూశాడు, నేనేదో పని మీద పక్కకి వెళితే నా అసిస్టెంట్లు ‘ఈ సిస్టం పని చెయ్యదని వదిలేశారండి, మా జెయి గారు దీన్ని బాగు చేశారండి, బాగా ఉందండి, పోడూరు కి ఎస్.టి.డి ఇస్తే బాగుంటుందండి, మా జెయి వల్ల అవుతుందండి’ అని పొగేసేడు,అప్పుడున్న అసిస్టెంట్ తన వూరికి STD ఇప్పుంచుకోవాలన్న తపనతో.. ఎస్.టి.డి ఇవ్వచ్చు అనేటప్పటికి ఆయనకి చెవులు మెదిలి సౌమ్యమైన గొంతుతో ‘పోడూరుకి ఎస్.టి.డి ఇద్దాం ఏమంటారు’ అన్నారు. ‘అలాగే కాని బయటి లైన్ లో రెండు రోజులు తిరిగి సరి చేయిస్తే కాని కాద’న్నా! ‘సరే మీరే చూడాలి, రండి’ అని తీసుకుపోయి, జిల్లా అధికారితో మాటాడి, ఒక సిస్టం ఉంది మా దగ్గర దానిని బాగుచేసేడు, మా జెయి, దానిని పోడూరుకి ఎస్.టి.డి ఇవ్వడానికి ఉపయోగించేందుకు మీ పర్మిషన్ కావాలంటే, ఎస్టిమేట్ కావాలంటే, ఆయన దాన్ని acceptance testing చేయించాలి అది మీ జెయి వల్లవుతుందా అని అడిగితే ‘ఆ! చేయించేస్తాడని భరోసా ఇచ్చేసేరు’. అల్లా ఆ సిస్టం పోడూరు అనే వూరికి లయిన్లో రెండు రోజులు ఎండలో మాడి మార్పులు చేయించిన తరవాత, ఆ వూళ్ళొ పెట్టి పని చేయించి, acceptance testing చేయించి, వూరి వారికి చెప్పి ఎస్.టి.డి ఇచ్చేము. అదిగో అది మొదలు ఆ సెక్షన్ జెయి అప్పుడే ప్రమోషన్ మీద వెళితే ఆ సెక్షన్ నాకు అంటకట్టేరు.మా పై ఆఫీసర్ తెలివయినవాడు, పని చేయగలవాడి చేత పని చేయించుకునేరకం. వెంటనే నన్ను ‘అన్ని పల్లెలకీ ఎస్.టి.డి ఇవ్వగలమా?’ అని కనుక్కుని కొన్ని కొన్ని మార్పులు చేస్తే ఇవ్వగలమనిపించుకుని,అయితే ఎస్టిమేట్లు వేయమంటే మరునాటికి అన్నిటికి ఎస్టిమేట్లు ఇచ్చేసేను. పోడూరుకి ఎస్టిడి ఇచ్చేమని తెలిసి మిగిలిన వూళ్ళ వారు కూడా మాకెప్పుడిస్తారని అడగడమూ అలవాటయింది, మా సిబ్బంది కూడా వూరి వాళ్ళకి ఈ జెయి గారు తలుచుకుంటే చెయ్యగలడని చెపుతుండటం, ఈ లోగా సిస్టం లు రావడంతో మొగల్తూరుకి ఎస్.టి.డి ఇచ్చాను, ఆ తరవాత చివరిది విసిరేసినట్లుండే పేరుపాలేనికి ఎస్.టి.డి ఇచ్చాను. అలా దగ్గులూరు, కొమ్ముచిక్కాల, పోడూరు, మొగల్తూరు, దొడ్డిపట్ల, ఎలమంచిలి, జెట్టిపాలెం, కొప్పర్రు,గుమ్ములూరు,అన్ని ఊళ్ళకీ ఎస్.టి.డి ఇచ్చేసేను. మా అసిస్టెంట్లకి నాకూ చేతినిండా పని, ఒక సెక్షన్ తో మొదలైనది చినుకుగా ప్రారంభమై,సెలయేరయి, వాగై, వరదై అన్ని వూళ్ళూ ఏస్.టి.డి తో అనుసంధింపబడిన సబ్ డివిషన్ గా ఆంధ్రాలో పేరొచ్చింది.అలా అన్ని సెక్షన్లూ నాకిచ్చేసేరు, ఆ సందర్భంలోదే మొన్న చెప్పిన టిఎ బిల్లు ప్రహసనం.

2013 - 1

చివరగా జెట్టిపాలెం ఒక్క వూరు ఉండిపోయింది. వస్తుందనుకున్న కొత్త సిస్టం రాలేదు, మార్చ నెలలో చివర ఐదురోజులు మిగిలేయి. ఏం చెయ్యాలి? సంవత్సరంలో అన్నిటికి ఎస్టిడి ఇచ్చిన ఘనత పోతోందని బాధ. పాత సిస్టం ఎప్పుడో వదిలేసినది పట్టుకున్నా, తిండీ నీళ్ళు మానేశా, మూడురోజుల ఏక దీక్షతో రైట్ చేశా. పట్టుకెళ్ళి పెట్టేశా. acceptance testing చేయిచా. మార్చ్ 31 వ తేదీకి ఎస్టిడి ఇచ్చేశా. ఇప్పుడు చెప్పండి ఇది పిచ్చి అవునా కాదా?

ఆ రోజులలో ఇలా unstable media మీద పని చేసే ఎస్టిడి ల వూళ్ళకి ఓ.ఫ్.సి కేబుల్ వేసి స్థిరమైన వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని డిపార్ట్మెంట్ అనుకుంది. అందుచేత నేను ఎస్.టి.డి ఇచ్చిన అన్ని వూళ్ళకి దశాబ్దం లోపలె ఓ.ఫ్.సి వేయడం జరిగింది. ఇలా పాలకొల్లు చుట్టుపక్కల పల్లెలన్నిటికి ఎస్.టి.డి ఇచ్చే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడెవరూ గుర్తుంచుకోకపోవచ్చు. గుడి మెట్ల గా వున్న రాయి, భక్తుని గుడిలో దైవాన్ని చూచేందుకు మెట్టుగా ఉపయోగపడినట్లు, నేను చేసిన పని ఉపయోగించిందేమో! నాకు ఒక మంచి పని చేసేనన్న ఆత్మ సంతృప్తినీ కలగచేసింది, జీవితంలో,.

ఇంతకీ మీరు చెప్పినదానికి దాలిగుంటలో కుక్కకీ సంబంధం ఏంటంటారా? అదే చెబుతున్నా! పూర్వం పాలు కాచుకోడానికి దాలిగుంట అని తవ్వెవారు పల్లెలలో. దాగరంత చుట్టుకొలతతో ఒక గొయ్యి తవ్వేవారు. ఆ గోతిలో పిడకలు పేరుస్తారు గోతి పయిదాకా చుట్టువారా, మధ్యలో కొద్దిగా ఖాళీ ఉంటుంది. అందులో నిప్పు వేస్తారు. దాని మీద పాలకుండ పెడతారు. దీనిని వరండాలో ఏర్పాటు చేస్తారు. పిడకలు అంటుకుని నెమ్మదిగా పాలు ఎర్రగా కాగుతాయి. మంచి తరక కడుతుంది, పాలపైన. ఇలా వేసిన పిడకలు నెమ్మదిగా కాలి బూడిదయి దాలి నెమ్మదిగా దిగి కుండ కూడా గుంటలో దిపోతుంది ఒరిగిపోకుండా. దాలి ఉదయమే వేస్తారు. పాలు కాగిన తరవాత దాలి వదిలేస్తారు, శీతాకాలం ఆ దాలి గుంట వెచ్చగా ఉంటుంది. అదిగో అందులో కుక్క ముడుచుకుని పడుకుంటుంది, వెచ్చగా, చలి నుంచి రక్షణకి. ఉదయమే ఇంటివారు కుక్కని, ఛీ ఛీ అని అదిలిస్తే, లేచి ఒక్కసారి ఒళ్ళు విదుల్చుకుని, సాగి బయటకు పోతూ, ‘ఉదయమే ఇంటివాళ్ళ చేత ఛీ ఛీ అనిపించుకున్నాను. రేపటి నుంచి దాలి గుంటలో పడుకోకూడదు,’ అనుకుంటుందిట, కాని సాయంత్రమయే సరికి మళ్ళీ దాలిగుంటకే చేరుతుంది, పడుకోడానికి.  దీనినే ‘పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతో కానిపోదనీ’ అంటారు, కుక్క తోక వంకరనీ, అలవాటు బలవత్తరమైనదనీ అంటారు. పని చెయ్యడమనేది కూడా ఒక వ్యసనమే! ఆ వ్యసనమే నా చేత ఆ పల్లెలకి ఎస్.టి.డి ఇప్పించేలా చేసింది. ఇప్పుడర్ధమయిందికదా! దాలి గుంటలో కుక్క

26 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దాలిగుంటలో కుక్క.

 1. “దాలిగుంటలో కుక్క” అన్న మాట, మొన్న టివిలో పాత “దేవుడు చేసిన మనుషులు”లో నిర్మలమ్మ తాగుబోతైన సత్యనారాయణని తిడుతూ అంటుంటే విన్నాను. ఇంతకుముందు కూడ విని ఉంటాను కాని పట్టించుకోలేదు.

  • @మిత్రులు బోనగిరి గారు,
   మాన్చుకోలేని అలవాటును దాలిగుంటలో కుక్క బుద్ధి అని అనేవారు. మీకు మళ్ళీ గుర్తుకు తేగలిగినందుకు సంతసం.
   ధన్యవాదాలు.

 2. మీకు మీరు పెట్ట్టుకున్న టైటిల్ సరిపోలేదు, పనిలో అంకిత భావం ఉన్న మీకు అది వర్తించదు.
  ఇకపోతే.. మిమ్ము ప్రశంసించిన ఇక్కడున్న అందరూ గొప్పవారు కావటం విశేషం.
  మీ ద్వారా వారి అనుభవాలను కూడా చదవగలిగే అవకాశం కలిగింది.
  సర్, బైటి ప్రపంచం తెలీని నా లాంటి వారికి మీ బ్లాగ్ విశ్వవీక్షణం.అభిమానంతో..మెరాజ్.

  • @ఫాతిమాజీ,
   చిన్న వాళ్ళతో పోల్చుకుంటే మంచిదని నా అభిప్రాయం. జీవిత టైటిల్ సరిపోతే చాలు లెద్దురూ, పది మందికి ఉపయోగపడే పని చెయ్యి, స్వార్ధం కోసం పని చెయ్యకు. చేసిన పని ఉపయోగపడే పది మందిలో మనమూ ఉంటాం కదా! మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

   • ఫాతిమా గారి మాటే… పట్టుదలతో చేసిన అంత మంచిపనికి, మిమ్మల్ని మీరు అలా పోల్చుకోవడం నప్పలేదు శర్మ గారూ.

   • @నాగార్జున గారు,
    పని చేయడం కూడా ఒక వ్యసనం. నేను ఆ వూరు వెళ్ళినపుడు పని చేయకూడదనుకున్నా, కాని మానలేకపోయా,రోజూ ఉదయమే ఛీ అనిపించుకున్నా, దాలిగుంటలో పడుకునే కుక్కలా. మీకు నచ్చలేదు పోలికన్నారు, మీ అందరి మాట కాదనడమేల ఒప్పేసుకుంటే సరి. 🙂
    ధన్యవాదాలు.

  • @జిలేబీ గారు,
   ఇటువంటి అనుభవాలు రాస్తే డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుందని భయం, మీరు తాటాకులు కట్టేస్తారేమోనని మరీ భయం.
   ధన్యవాదాలు.

 3. మా అమ్మమ్మ గారు ఊరు పేరుపాలెంకి ఎస్ టి డి ఇచ్చినందుకు కృతజ్ఞతాభినందనలు.
  15 ఏళ్ళు అయింది ఆ ఊరు వెళ్ళి. మళ్ళీ వెళ్ళడం ఎప్పుడు కుదురుతుందో?

  • @బోనగిరి గారు,
   పేరుపాలెం అంటే ఎందుకో నాకు అభిమానం. మొదటి సారి అక్కడికి కేంప్ వెళితే లైన్మన్ ని మంచినీళ్ళడిగితే కొబ్బరి నీళ్ళిచ్చాడు. నాకు మంచి నీళ్ళు కావాలంటే అవి మాత్రం అడగద్దు, కొబ్బరి నీళ్ళెన్నయినా ఇస్తానన్నాడు. నాతో సరదాగా అన్నాడేమో అనుకున్నా. నిజంగా వూరిమొత్తానికి ఒక మంచి నీటి నుయ్యి సముద్రపు ఒడ్డున చూసి ఆశ్చర్యపోయా! ఎందుకో తెలీదు కాని ఆవూరంటే నాకిష్టం, అందుకే మూడవదానిగా ఆ వూరు ఎంచుకున్నా. అది మీ అమ్మమ్మ గారి వూరని తెలిసి, నా మరో మనవరాలి వూరని తెలిసి ఆనందపడ్డాను, మళ్ళీ వెళ్ళలేకపోయా.
   ధన్యవాదాలు.

   • తాతగారు మా ఊరికి STD ఇచ్చినందుకు ధన్యవాదాలు..
    ఇంక మీ మూడో ఊరు అన్నారు కదా ఎంత ఆనందమో..:)
    టపా చదివాక పని చేస్తె ఇలా చేయలనిపిస్తుంది..:)

   • ధాత్రి,
    ముందు మూడు ఛానల్స్ తో ఇచ్చాను. లైన్ అస్తమానం పోయేది. నేను మరో సెక్షన్ కి వెళ్ళేకా అక్కడికి గాలిలో పనిచేసే సిస్టం పెట్టేరు, బాగా పని చేస్తుంది.సముద్రపు ఒడ్డు కనక గాలి వానలఒస్తే కేబుల్ కూడా పాడవుతుందని UHF System పెట్టేరు.ఇష్టపడి పని చెయ్యాలి కష్ట పడి కాదు.
    ధన్యవాదాలు.

 4. మీరు వివరించిన మీ ఉద్యోగ నిబద్ధత , అంకిత భావం, కార్య సాధన , వీటన్నిటినీ కలబోస్తే నే ‘ flow ‘ ఏర్పడుతుంది !
  అంటే , మీరు చేసే పని లో పూర్తి గా నిమగ్నమై ఆ పని పూర్తి చేస్తున్నారు ! ఫలితం , మీరు ఆనందం పొందడమే కాక ,
  మీరు చేసిన పని మీకు ఎంతో సంతృప్తిని కూడా ఇస్తుంది ! మీ విషయం లో అదే జరిగింది ! అది మీ పిచ్చి కాదు !
  ఇంత మంచి టపా వేసి పైన ఫోటో మాత్రం ఇంకో దేశానిది వేశారు ! ‘ దాలి గుంట లో దయ్యాల పోడు ‘ అని ఎందుకంటారు ?
  మీ టపా చదువుతూ ఉంటే , నాకో విషయం గుర్తొచ్చింది !
  నేను, మన ఆంధ్ర ప్రదేశ్ లో లో ఒక ట్రైబల్ ఏరియా లో మెడికల్ ఆఫీసర్ గా పని చేశాను కొంత కాలం. దానిని ఒక మంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ గా అన్ని సదుపాయాలతో నిర్మించారు ! ఒక మంచి ఎక్స్ రే యంత్రం కూడా ఏర్పాటు చేశారు ! మరి అది ఎందుకు పని చెయ్యట్లేదు ? అని అక్కడ ఉద్యోగులను అడిగాను ! నాతో అక్కడి రహస్యాలు దాచకుండా చెప్పే ఒక ఉద్యోగి ‘ ఇక్కడ పై సంపాదన ఏముంటుంది సార్ ! అందుకని ఎక్స్ రే టెక్నీషియన్ , ఇక్కడ ఉన్న ఎక్స్ రే ని పని చేయకుండా పాడు చేశాడు ! ఆ తరువాత , హైదరాబాదు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు , ఇక్కడ తనకు పని లేకుండా పోయిందని ! హైదరాబాదు లో గవర్నమెంట్ ఆస్పత్రి లో ఎక్స్ రే టెక్నీషియన్ గా చేరి ‘ నాలుగు చేతులా ‘ సంపాదిస్తున్నాడు ‘ అని చెప్పాడు !
  మన ప్రభుత్వం అంటే, మన ఉద్యోగులకే, అంత చులకన ! అంకిత భావం తో పని చేసే వారూ చాలా మంది ఉన్నారనే విషయం కూడా మనం మరువ కూడదు !

  • @సుధాకర్ జీ,
   మీరన్నట్లు ఫోటో మార్చేశాను. స్వార్ధానికి ఎక్సురే మిషన్ పాడు చేసినవాణ్ణి ఏం చేస్తే పాపముందంటారు? సంపాదించినదంతా పట్టుకుపోతాడా పోయేటపుడు? ఆలోచన లేనివాడు.అంకిత భావం ఉన్నవారు కొద్దిమంది ఉన్నారు అదే నేటి మన దౌర్భాగ్యం.
   ధన్యవాదాలు.

 5. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  శ్రమించటం, శ్రమదానం చేయటం ఎప్పటికీ వృధాపోవు అని మీద్వారా మరొక్కసారి నిరూపితమైంది. జహహో!!

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • @మిత్రులు మాధవరావు గారు,
   “తనకున్న పని తినకున్నా తప్పదని” అనేది అమ్మ. అది నా మనస్సులో నాటుకు పోయిందేమో చెప్పలేను. పని దైవం, పనిని ఆరాధిస్తే అంతా ఆనందమే. ఇష్టపడాలి, కష్ట పడద్దు అన్నది నా మాట.
   ధన్యవాదాలు.

   • “తనకున్న పని తినకున్నా తప్పదని” అనేది అమ్మ.
    సేమ్ డైలాగ్ మా అమ్మగారు కూడ అనేవారు.
    గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

   • @మిత్రులు బోనగిరిగారు,
    అమ్మ ఎక్కడయినా అమ్మే. అందరమ్మలూ మంచిమాటే చెబుతారు. మీకు మీ అమ్మగారి మాట మరలా గుర్తుకు తేగలిగినందుకు సంతసం.
    ధన్యవాదాలు.

 6. దాలిగుంట లో కుక్క, సోమరితనానికి గుర్తు.
  మీలాంటి కార్య సాధకులు, పని రాక్షసులు,
  అలాంటి ఉపమానం వాడ కూడదు.
  జబల్పూర్ నా మిలిటరీ జీవితం లో ఆఖరి మజిలీ.
  ఆ పరిసరాలు గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

  • @మోహన్జీ,
   పని రాక్షసుడని నాకు నా మిత్రులు, నా సిబ్బంది ముద్దు పేరు పెట్టేసేరు, అది మీకెలా తెలిసిందబ్బా! నా ముందే చెప్పేవారు నా సిబ్బంది, ఆప్యాయతతో.
   ధన్యవాదాలు.

 7. మీ జీవితానుభవాలు ఆసక్తికరంగా ఉంటాయి…మీరు చెప్పే విధానంకూడా బాగుంటుంది. తెలుసుకోవటం మాకుకూడా ఆనందదాయకంగా ఉంది. ధన్యవాదాలు.

  • @తేజస్వి గారు,
   నా జీవితానుభవాలౌ నచ్చినందుకు, నేను చెప్పే విధానం నచ్చినందుకు, మీకు ఏమివ్వగలను? అభిమానం తప్ప .
   ధన్యవాదాలు.

 8. Super.
  మీ గత స్మృతులు చదవడం మాకు చాలా సంతోషంగా ఉంది .
  మీ అనుభవాలు ఇలా మాతో పంచుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు .

  • @వెంకట్ గారు,
   చాలా రోజుల తరవాత కలిశాం కుశలమేకదా!నా అనుభవాలు మీతో పంచుకోవడం ఆనందాన్నిచ్చింది
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s