శర్మ కాలక్షేపంకబుర్లు-అట్ల తద్దె అనే ఉమాచంద్రోదయామా వ్రతం.

అట్ల తద్దెఅనే ఉమాచంద్రోదయామా వ్రతం.

_MG_0179 mono lake hunters moon 10.18.13 flat 1600 by kurt harvey

Courtesy: kurt Harvey

అట్ల తద్దె అనే చంద్రోదయ ఉమా వ్రతం ఆశ్వయుజ బహుళ తదియ రోజు జరుపుకోవడం ఆచారం.  ఈ రోజు చంద్రుడు చాలా స్వఛ్ఛమైన తెల్లని కాంతిని ఇస్తాడు. ఆ పున్నమి వెళ్ళిన మూడవ రోజూ అలాగే ఉంటాడు.ఆ రోజు జరుపుకునే పండగే అట్లతదియ అనే అట్లతద్దె అనే అట్లతద్ది.  దీనినే అట్లతద్దె అనికూడా అనడానికి కారణం, ఈ తదియరోజు ఉమాదేవికి పూజ చేసి అట్లు వాయనంగా ఇవ్వడం, అట్లు ఫలహారంగా తీసుకోవడం. అట్లలోకి ‘తిమ్మనం’ అని వండుతారు, నంజుడికి, తియ్యగా బాగుంటుంది… పల్లెలలో ఈ వ్రతాన్ని చాలా వేడుకగా చేసేవారు. ఇప్పటికీ కొన్ని పల్లెలలో దీనిని ఆచరిస్తున్న దాఖలాలు కనపడుతున్నాయి, నేటికీ.

ఈ వ్రతం ముందురోజుతో ప్రారంభవవుతుంది. కన్నెపిల్లలు నోచే ఈ నోము తదియరోజు ఉదయమే తెల్లవారుగట్ల లేచి రాత్రివండిన చద్ది అన్నాన్ని ఉల్లిపాయ పులుసుతో తిని పెరుగుతో భోజనం కానిచ్చి అప్పుడు బయటికి బయలుదేరి చెలికత్తెలను ఆటకు పిలుస్తూ పెద్దగా ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అని పాడుకుంటూ చెలికత్తెలను లేపి, ఊరి మధ్యలో ఉండే చింత చెట్టు లేదా మరొక చెట్టు వద్దకు చేరిన తరవాత ఆటలు ప్రారంభమవుతాయి. పద్నాలుగు పద్దెనిమి సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లలు, పరికిణీ రెపరెపలతో రెండు జట్లుగా విడిపోయి ఆడుతూ పాడే పాట వివాహ సంబంధమయినది, ‘బుజబుజరేకుల పిల్లుందా బుజ్జారేకుల పిల్లుందా స్వామీ దండల పిల్లుందా స్వరాజయమిచ్చిన పిల్లుందా?’ ఇదొక బృందం పాడితే జవాబుగా మరొక బృందం ‘బుజబుజరేకుల పిల్లుందీ, బుజ్జా రేకుల పిల్లుందీ’ అని సమాధానమిస్తారు. ఇలా వివాహ సన్నివేశమే కాక దాగుడు మూతలు, ఉప్పట్లు, ఇతరమైన ఆటలు.  వెన్నలలో ఆడుతూ ఉండగా, పోతు పేరంటాడ్రలాగా మగ పిల్లలు దూల గొండి, పల్లేరు కాయలు ఆడపిల్లల మీద విసిరి పారిపోతుంటే, పెద్దలు తిడుతుంటే, ఆడపిల్లలు మెటికలు విరుస్తూ, మూతి విరుస్తుంటే ఆ అందం చూడాలి, వెన్నెల నీడల మధ్య. అలా వుదయందాకా ఆటలాడి ఇంటికి వెళ్ళేముందు నీటిలో కాళ్ళు కడుక్కుని అస్తమించే చంద్రుని చూడటం తో వ్రతం ప్రారంభం. ఇంటికి చేరి అట్లు వేసుకోడానికి తగిన ఏర్పాట్లు చేసుకుని, సాయం కాలానికి అట్లు వేసుకుని, ఈలోగా ఊరి మధ్యలో వేసిన ఉయ్యాలలో ఊగి, పై అంచులు చూసి, చెలికత్తెలతో సాయం సమయానికి అట్లు సిద్ధం చేసుకుని,చంద్రోదయ సమయానికి ఉమాదేవి పూజ చేసి,  అట్లు వాయనంగా ఇవ్వడంతో ఈ వ్రతం ముగుస్తుంది.

atla 3

బొమ్మ ’శ్రీ’ గారి బ్లాగునుంచి తీసుకున్నా. బొమ్మ వేసినవారికి కృతజ్ఞతలు.

http://trishnaventa.blogspot.in/2013/10/blog-post_21.html

అట్లతద్ది పాటలు ఈ లింక్ లో చూడండి, వినండి.తృష్ణ గారికి ధన్యవాదాలు.

ఈ పండగలో విశేషం చూద్దాం. ఈ పండగలో ముఖ్యమైనది ఉయ్యాల ఊగడం. ఉయ్యాల ఊగడం లో వైద్య, పరమార్ధిక రహస్యాలున్నాయంటారు పెద్దలు. ఈ వయసులో పిల్లలలో వచ్చే ఋతు సంబంధ వ్యాధులకు ఊయల ఊగడం ద్వారా, వాటిని సరిచేసే హార్మోన్లు విడుదలవుతాయట. ఈ ఉయ్యల ఊగడం లో, జీవితం కూడా కష్టము సుఖము అనే రెండు అంచుల మధ్య ఊగుతూ ఉంటుందని, మన ఉయ్యలను మరెవరో ఊపాలని తెలియచేయడమేనంటారు. ఉయ్యల పై అంచుకు చేరినపుడు ఎలా అక్కడే నిలవదో, అలాగే కష్టమూ నిలవదు, సుఖమూ నిలవదు అని చెప్పడమే ఉయ్యల ఊగడం లో పరమార్ధం.  ఉయ్యల ఎక్కడం తేలిక కాని దిగడమే కష్టం, జాగ్రత్తగా దిగకపోతే పడతాం, దెబ్బ తగులుతుంది. జీవితంలో కష్ట సుఖాల ఉయ్యలలో ఊగే మనం స్థిరమైన చిత్తానికి రావాలంటే ఉయ్యలను ఆపుకున్నట్లుగానే కొద్దికొద్దిగా వీటినుంచి విడిపడి భగవంతుని చేరడమనే స్థిర స్థితికి చేరాలని ప్రతీక, ఈ ఉయ్యల ఊగటం అంటారు.

The Dairy (1)

నేటి కాలానికి ఆడపిల్లలే కనపడటంలేదు. ఇదివరలో ఇంటి కి కనీసం ఇద్దరేనా ఉండేవారు. ఇప్పుడు పిచికగూళ్ళలో నివాసంతో ఉయ్యల వేసేందుకు చోటూ లేదు చెట్టూలేదు.

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అట్ల తద్దె అనే ఉమాచంద్రోదయామా వ్రతం.

 1. చక్కటి వివరణ ఇచ్చారు , మరుగున పడుతున్న తెలుగు సంప్రదాయ వ్రతం గురించి !

  ఉమా చంద్రోదయం !
  ఉట్టి పడుతున్న తెలుగు తనం !
  ఊయల లూగుతున్న కన్నె తనం !
  వన్నెల వనితల ఆనందం !
  వెన్నెల లో పల్లె సౌందర్యం !
  అదే సుమా, చంద్రోదయం !

  • @సుధాకర్ జీ,
   తెనుగు సంప్రదాయాలు చాలా మరుగున పడుతున్నాయి. అందులో ఇది కూడా ఒకటి. తలుచుకోనయినా తలుచుకుందామని. ఇప్పుడు ఇరవిలోపు పిల్లలు లంగా ఓణీ వేయటం లేదు, జీన్స్ తో గడుపుతున్నారు రాత్రి పగలూ కూడా. ఇరవై దాటిన వారు లంగా ఓణీ చీరలు కడుతున్నారు. లంగా ఓణీ వేసుకున్నామనిపిస్తున్నట్లు.
   ధన్యవాదాలు.

  • @తృష్ణగారు,
   నిజానికి ఈ టపా మీ టపా చూసేకా రాయలనిపించింది. అంతకు ముందు అనుకున్నా కాని మరచాను. మీ టపాలో ఈ సంగతులుంటే రాసేవాణ్ణి కాదు. మీ టపా లింక్ ఇస్తే పూర్తిగా అంతా ఒక చోట ఉంటుందని, బొమ్మ ’శ్రి’గారి బ్లాగ్ నుంచీ తెచ్చాను.నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 2. అట్ల తద్దె అనే ఉమాచంద్రోదయామా వ్రతం. గురించి ఎన్నో విశేషాలను తెలియజేశారు.

  చిత్రాలు కూడా బాగున్నాయండి.

  • @అమ్మాయి అనూరాధ,
   కుశలమా! ఇంకా రాయవలసినదే ఉండిపోయింది. అందరికి తెలిసినది కదా అని ఉపేక్ష చేశా ! మళ్ళీ సారికి చూద్దాం.
   ధన్యవాదాలు.

 3. తాతగారు,
  నిన్న మీ బ్లాగులో అట్లతద్ది టపా వేస్తారేమోనని చూసా..ఆశాభంగమయ్యింది.. 😦
  మా తాతగారు ఈ రోజు వేసేసారు.. 🙂
  మీ టపా చిన్ననాటి విషయాలను మధురంగా గుర్తు చేసింది.:)
  మీకు తెలుసు కదా పేరుపాలెంలో సపోటా తోటలు ఎక్కువ..
  చిన్నప్పుడు అట్లతద్ది రోజున కొతికొమ్మచ్చి,ఉయ్యలలూ ఎన్ని ఆటలో.:)
  పెళ్ళి అయిన తర్వత తద్దులు తీరుస్తారు అది పెళ్ళి కంటే ఎక్కువ హడవుడే..:)

  • @అమ్మాయి ధాత్రి,
   పొరబడ్డాను అనేకంటే మరచిపోయాననటం నిజం. వారం కితం అమ్మమ్మతో మాటాడి టపా రాయాలనుకున్నా. మాటాడేను కూడా టపా రాయాలనుకుంటే ఏదో అడ్డొచ్చి ఆగిపోయింది. నిన్న తృష్ణ గారి బాలగ్ లో చూశాక గుర్తొచ్చింది. అప్పటికప్పుడు రాశా.
   సపోటా తోటల్లో, వెలుగు నీడా మధ్య,కొబ్బరితోటల్లో, గోదావరి ఇసకతిన్నెల్లో,ఆడపిల్లల ఆటలు ఎంత బాగుండేవి. ఊరి లక్ష్మీ కళ అంతా అక్కడే ఉన్నట్టుండేది.ఇప్పుడు చూద్దామంటే చెట్టే కనపడటం లేదు. ఉయ్యాలెక్కడమ్మా!మరే కదా ఈ వ్రత ఉద్యాపన పెళ్ళి తరవాత పెళ్ళంతది. 🙂
   ధన్యవాదాలు.

 4. > ఆశ్వయుజ పున్నమిని రాకాపున్నమి అంటారు.
  రాకా అంటేనే పౌర్ణమి అని అర్థం అండి!

  >నేటి కాలానికి ఆడపిల్లలే కనపడటంలేదు.
  అవునండీ. ఊళ్ళో ఉన్న ఆ గుప్పెడుమంది అమ్మాయిలూ పాంట్లూ చొక్కాలూ వేసుకుంటున్నారు!

  >ఇదివరలో ఇంటి కి కనీసం ఇద్దరేనా ఉండేవారు.
  నా కైతే తొమ్మండుగురు చెల్లెళ్ళండి.

  >ఇప్పుడు పిచికగూళ్ళలో నివాసంతో ఉయ్యాల వేసేందుకు చోటూ లేదు చెట్టూలేదు.
  అవునండి

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   పొరబడ్డాను, సరి చేశాను.నిజం చెప్పేరు. ఇరవిలోపు పిల్లలిప్పుడు జీన్స్ తప్పించి వేయటం లేదు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s