శర్మ కాలక్షేపంకబుర్లు-ఆ ఒక్కటీ అడక్కు

ఆ ఒక్కటీ అడక్కు

yamilette vergas

అమ్మాయిల తల్లి తండ్రుల వ్యధ ఏదేశం లో నైనా ఒకలాగే ఉంటుందేమో! కొద్ది కొద్ది మార్పులతో!! ఒక సగటు తండ్రి వ్యధ, తన కుమార్తెను ప్రేమించానన్న వానితోసంభాషణ!!!

పిల్ల తండ్రి.:-మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్ళి చేసుకుంటానంటావు, సంపాదన ఉందా?

పెళ్ళికొడుకు:-నాకేం లోటు, కావలసినంత సంపద వుందీ.

పిల్ల తండ్రి.:-అదే భయం, నీకిప్పుడు సంపద వుంది, రేపు వుండకపోవచ్చు, పోవచ్చు, అదేదో సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్లు, నీ స్వయంకృషితో చేయగలపని ఏదయినా వుందా? పైస సంపాదించగలవా? పెళ్ళానికి కూడెట్టగలవా? ఎవడేనా నీ పెళ్ళాం మీదకి వస్తే అడ్డుకుని పోరాడగలవా?పెళ్ళాన్ని రక్షించుకోగలవా? నీకు ఆ ధైర్యం ఉందా?సంసారం చెయ్యగలవా?పెళ్ళాన్ని ప్రేమించగలవా?

పెళ్ళికొడుకు:-నేను చదువుకుంటున్నాను, మీ అమ్మాయీ చదువుకుంటూంది కదా! నాకున్న ఆస్థి పాస్థులు పోయినా మీ అమ్మాయి నేను కలిసి సంపాదించుకుని బతికెయ్యగలం. మీ అమ్మాయిని రూపం చూసి ప్రేమించలేదు, గుణం చూసి ప్రేమించాను.ప్రేమ ఇంతని చెప్పలేను

పిల్ల తండ్రి.:-మా అమ్మాయి అందమయింది కాదని మాకూ తెలుసు, యూనివర్శిటీ ఫస్టు వస్తుందనీ తెలుసు, నీది ఆరాధనా? ప్రేమా? ఆరాధనకి ప్రేమకి తేడా తెలుసా?మళ్ళీ అమ్మాయి సంపాదనంటావు, అసలు అమ్మాయి సంపాదించదయ్యా, ఏం చేస్తావు?అమ్మాయి గుణం చూసి ప్రేమించాను, తెలివి చూసి ప్రేమించానంటున్నావు, అమ్మాయి సంపాదిస్తే, పట్టుకొచ్చి చేతిలో పోస్తే, తిని కూచుని గడిపేద్దామనుకున్నావా? కుదరదు. నీ సంపాదనతోనే కుటుంబం నడవాలి, అమ్మాయి సంపాదించదు.

పెళ్ళికొడుకు:-లేదండి, ఆరాధనకి ప్రేమకి తేడా తెలుసండి, తెలివయినదన్న ఆరాధనే ప్రేమగా మారి వదలిపెట్టలేనండి, నా మనసునడగండి, ప్రతి క్షణం మీ అమ్మాయి పేరే తలుస్తుందండి. మరో ఆలోచన లేదండి.మీ అమ్మాయిని మహరాణీలా చూసుకుంటానండి, ఇప్పటికే మీ అమ్మాయి గీచిన గీటు దాటనండి.మీ అమ్మాయిని గుండెలో గుడికట్టుకుని ఉంచుకున్నానండి.

1

పిల్ల తండ్రి.:-మరీ దేవతని చేసి, శిలాప్రతిమను చేసి, గుడికట్టి, నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టకు, ఆమెను మనిషిగా చూడు, ఆమెకూ అనుభూతి, స్వతంత్ర ఆలోచన ఉంటుందని అనుకో!మనిషిలా చూడు చాలు.ఈ విషయం నీ తల్లితండ్రులకి చెప్పేవా? వాళ్ళేమన్నారు?

పెళ్ళికొడుకు:-చెప్పేను వాళ్ళేం మాటాడలేదు. వాళ్ళు కాదన్నా వాళ్ళని వదిలేసి మీ అమ్మాయిని చేసుకుంటా.

పిల్ల తండ్రి.:-ఓర్నీ! చిన్నపటినుంచి కని పెంచిన తల్లి తండ్రులను ఒప్పించలేవా? వాళ్ళు కాదంటే వాళ్ళ ఖర్మకి వాళ్ళని వదిలేసి అమ్మాయిని చేసుకుంటావా? తల్లి తండ్రులనే ఒప్పించలేనివాడివి నువ్వేం చెయ్యగలవు? తల్లి తండ్రులనే వదిలేస్తానన్నవాడివి రేపు మోజు తీరిన తరవాత అమ్మాయిని వదిలెయ్యవని నమ్మకమేంటీ?  ఇప్పుడు నీకేం కనపడటం లేదు, కులం గోత్రం వగైరా. రేపు ఎక్కువింటి పిల్లను చేసుకుని బాధపడుతున్నాను, నువ్వు నీచు తినవు, నాకు వండిపెట్టవని అనవని నమ్మకమేంటీ? . తక్కువింటి పిల్లవు, నీకు మంచి గుణాలెలా వస్తాయని సతాయించవని నమ్మకమేంటి? అమ్మాయి కాఫీ కూడా తాగదు, వాసన కూడా కిట్టదు, నువ్వు మందు తాగవని నమ్మకమేంటి? మందు తాగేవాడంటే అమ్మాయికి నాకూ ఇష్టం వుండదు.పక్కచూపులు చూస్తే అసలు సహించలేదు.

పెళ్ళికొడుకు:-నేనూ నీచు తినటం మానేశానండి, మీ అమ్మాయికి తెలుసు నేను మందుకొట్టను,ఇంతకు ముందు ఒక అమ్మాయితో మాటాడేవాడినండి, మీ అమ్మాయి వద్దని చెప్పింది మానేశానండి.పరాయి స్త్రీని చూస్తే కళ్ళుపోతాయందండి, భయమేసి చూడటం మానేశానండి. మీ అమ్మాయి చిటికెన వేలు పట్టుకోవాలని ఆశండి. జీవితాంతం వదలకుండా వుండిపోవాలని కోరికండి.  మీ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతోంది.

పిల్ల తండ్రి.:-ఆమెను పువ్వులలో పెట్టి చూసుకుని కంటి వెంట కన్నీటి చుక్క కారకుండా చూడగలవా? నాకూతురు నాకుటుంబంలోని రాజకుమారి, ఆమెను ప్రేమించానని వెనకపడకు, నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది, నువ్వెక్కడ అమ్మాయిని వేధిస్తే నేనక్కడ ప్రత్యక్షమవుతాను, నీ తోలు తీస్తాను, ఒక వేళ నేను జైలుకి వెళ్ళాల్సివచ్చినా సరే! నువ్వు అబద్ధాలు చెబితే నాకు తెలిసిపోతుంది. అబద్ధం చెప్పకు, అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు చాలా మంట. అమ్మాయితో ఫోటో లు దిగకు, వాటిని ఎక్కడా సోషల్ నెట్ వర్కులలో పెట్టకు, నాకెక్కడేనా కనపడ్డాయా, నిన్ను ఖతం చేసేస్తా! అమ్మాయి ఇష్టపడుతున్నానంది కనకే ఇంతసేపు నీతో మాటాడటం,

పెళ్ళికొడుకు:-అన్నిటికీ ఒప్పుకున్నానండి మరి మీ అమ్మాయితో పెళ్ళి….

పిల్ల తండ్రి.:-నీది అమ్మాయిదీ చదువుకానీ, నీ సంపాదనేంటో చూపించు,నీ తల్లి తండ్రులని ఒప్పించు, అప్పటివరకూ  అఒక్కటీ…..అడక్కు.

పెళ్ళికొడుకు:-అన్నిటికీ ఒప్పుకున్నాను,అయినా, ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు,ఇంతోటి అందకత్తె, తెలివయినది నాకు దొరకదని, నేను కావాలనుకుంటే పెళ్ళి కూతుళ్ళు లయిన్ లో నిలబడతారని, మీ అమ్మాయే గొప్పదని అనుకోవద్దని………………………………అననండి.

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆ ఒక్కటీ అడక్కు

 1. ఇప్పటి తల్లితండ్రుల తీరు మీరు రాసిన విధంగానే ఉంది. అమ్మాయి కోరుకున్న,,,,ఆమె తల్లితండ్రులు కోరుకున్న కోరికలను తీర్చ గలిగే వాళ్ళకే వివాహం జరుగుతోంది. ఇప్పుడు అమ్మాయిలదే పైచేయి ప్రతీ విషయంలో…
  ఇప్పటి తరం అబ్బాయిలాగే అన్నీ చెప్పి నచ్చచెప్ప ప్రయత్నించాడు….మంచివాడే.

  • @అనూ గారు,
   స్వాగతం.
   మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. అసలు అమ్మాయి పెళ్ళి చేసుకుంటానంటే చాలనుకునే రోజులొచ్చేసేయి.
   ధన్యవాదాలు.

 2. శర్మగారూ,

  నమస్కారం. మీ బ్లాగు చాన్నాళ్ళుగా చదువుతున్నాను, కానీ వ్యాఖ్య పెట్టడం ఇదే మొదటిసారి. మీ టపాలో లాంటిదే, నా మిత్రబృందంలో ఒకడిగి జరిగింది. దాదాపుగా 17-18 సంవత్సరాల క్రిందటి మాట ఇది. నా చిన్ననాటి స్నేహితుడొకడు ఇంజనీరింగ్ చదివుతున్నప్పుడు తనకు ఒక సంవత్సరం జూనియర్ అయిన అమ్మాయిని ప్రేమించాడు. చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. సంవత్సరానికి అమ్మాయి కూడా చదువు పూర్తిచేసుకుని ఎం.టెక్. లో సీటు సంపాదించుకుంది, ఆంధ్రా యూనివర్సిటీలో. అలా కొన్నాళ్ళు దాటాకా అమ్మాయి చదువు పూర్తయ్యే సమయానికి మావాడు ధైర్యం కూడగట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారికి విషయం చెప్పాడు. ఆయన ఏమాత్రం తొణకు, బెణుకు లేకుండా, “లేదు బాబూ, మా ఇంట్లో అలా వీలుపడదు. నాకు ఇంకో చిన్నకూతురుంది. దానికి ఇబ్బంది కలిగించలేను”, అని చాలా మామూలుగా చెప్పారట. మావాడికి ఏమనాలో తెలియక “వెళ్ళొస్తాను” అని చెప్పి వచ్చేశాడు. మా వాడు హైదరాబాదు, ఆ అమ్మాయి వైజాగు…అప్పట్లో ఫోను సౌకర్యం ఇంత లేదు కదా, దానితో ప్రెమలేఖలతోనే ప్రేమాయణం సాగించేవారు. కొన్నాళ్ళు దాటాకా వెళ్ళి మాట్లాడితే మళ్ళీ అదే తంతు. అక్కడికీ తన ఉద్యోగం మంచిదనీ, తనూ బాగా చదువుకున్న వాడినని, అల్లరి చిల్లరి పనులు చేసే రకం కాదనీ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఆయన మాత్రం చాలా మామూలుగా, స్థితప్రఙ్ఞుడిలా కుదరదని చెప్పేశాడు. వీడికే చిరాకొచ్చి, “మీకు ఒక విషయం ఇంకా అర్ధం అయినట్లు లేదు. మీరు మాకిద్దరికీ పెళ్ళి చెయ్యకపోతే మీ అమ్మాయి ఇంకెవరినీ చేసుకోదు”, అని. దానికి ఆయన, “దానికేముంది బాబూ. ఎం.టెక్. పూర్తయితే మంచి ఉద్యోగం రాక మానదు కదా! దాని బ్రతుకు అది చూసుకుంటుంది, నాకు ఆ విషయంలో ఏమీ చింతలేదు” అని ఎదురు వీడికే దెబ్బకొట్టారట. వీడు మా దగ్గరకి వచ్చి ఒకటే గోల. “ఆయన ఏమైనా తిడితేనో, కోప్పడితేనో, నేను ఎదురుతిరిగి ఏమైనా అనడానికి అవకాశం ఉండేది. కానీ మరీ అంత బుద్ధావతారాన్ని ఎలా ఒప్పించేది”, అని. నెలకొకసారి అలాగే వెళ్ళి ఎక్కడో బయట అమ్మాయిని కలిసి వచ్చేసేవాడు. అలా ఒక సారి వెళ్ళినప్పుడు రోడ్డు మీద వీడు నడిచి వెడుతుంటే ఆయన ఎదురు పడ్డారట. ఇప్పుడెలారా దేవుడా అని వీడు అనుకుంటుంటే, \స్కూటరు వీడి పక్కన ఆపి, “ఏమిటి బాబూ, ఎలా ఉన్నావు? అంతా కులాసాయేనా? ఈ మధ్య బొత్తిగా కనపడటం లేదేమిటి?”, అని ఆయనే పలకరించారట. మొత్తానికి 3 సంవత్సరాలు ఇలాగే గడిచాకా ఆయనే పిలిచి పిల్లనిచ్చి పెళ్ళి చేశారు, దానితో కథ సుఖాంతం 🙂 ఎందుకొ సరదాగా పిట్ట కథలా చెప్పాలనిపించింది, చెప్పాను 🙂

  మీ బ్లాగు చాలా చక్కగా ఉంటుంది, శర్మగారూ. నాకు పాతరోజుల్లో విషయాలంటే మహాసరదా. అవి వినాలంటే మీ బ్లాగు ఒక బంగారుగని. వాటితోపాటే మీ జీవితపు అనుభవాల్ని పాఠాలుగా, సలహాలుగా మాకు అందిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  భవదీయుడు
  వర్మ

  • @వర్మాజీ,
   సుస్వాగతం. ఇన్నాళ్ళు అభిమానం ఇలా గుండెలలో దాచుకుని చెప్పకపోవడం అన్యాయం కదూ! 🙂 కామెంట్ల బాకీ వడ్డీతో ఒక సారే తీర్చేద్దామని ప్రయత్నమా? కుదరదుగాక కుదరదు, బాకీ చెల్లువెయ్యటం లేదు 🙂

   మీ స్నేహితుని కధలో అతను పట్టువదలని విక్రమార్కుడు. ఆ పట్టుదలకి వెనక బలమైన మనసున్న……..కదా!. ఇక పిల్ల తండ్రి చాలా ఘటికుడు. తన ఇతర ఇబ్బందులు? తీరేదాకాను, అబ్బాయిని వదలలేదు, పట్టుకోనూ లేదు, ఎవరు పట్టుకోవాలో వారు పట్టుకుని ఉండటం తెలిసినవాడు కనక పట్టుకోలేదు.అబ్బాయి ప్రేమనీ పరీక్షకి పెట్టేడు. నిజానికి అబ్బాయి నెగ్గి ఓడిపోయాడు, ఓడిపోయి నెగ్గేడు, కధ శుభం.మంచి జరిగిన కధ చెప్పేరు.
   ధన్యవాదాలు.

  • @ఫాతిమాజీ,
   మనం పెళ్ళికొడుకుల్ని చూస్తుంటే ఇన్ని ఇబ్బందులొస్తున్నాయని ఆడపిల్లలే స్వయంగా వరుణ్ణి చూసుకుంటున్నారు. కొంతమంది ఇంట్లో చెబుతున్నారు, కొంత మంది పెళ్ళి చేసుకున్న తరవాత చెబుతున్నారు, ఇది మొదటి తరహాది :)రోజులు మారాయి కదండీ, అవసరాలు మారుతున్నాయి, అన్నీ మారతాయి, తప్పదు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s