శర్మ కాలక్షేపంకబుర్లు- రాయంటి బిడ్డ.(తనదాకా వస్తే కానీ…….)

రాయంటి బిడ్డ.(తనదాకా వస్తే కానీ…….)

నిన్నటి తరవాయి.

జరిగిన కధ:- పేద తల్లి తండ్రులకు ఒకడే కొడుకు, బాగా చదివించారు, తాము తినడానికి లేకపోయినా. మంచి ఉద్యోగమే సంపాదించాడు. విదేశం వెళ్ళొచ్చాడు, పెళ్ళి చేసేరు. దేశం లో ఉద్యోగానికి వెళ్ళినది మొదలు తల్లి తండ్రులతో మాటా పలుకు లేదు. తల్లి తండ్రులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.కొడుకు పుడితే చెప్పలేదు . ఆ తరవాత..

1

కాలం గడిచింది కుర్రాడి బాబాయి ఒకరు కాలం చేసేరు, కబురు చెప్పేరు, స్నేహితులు, విని ఊరుకున్నాడు. కొంతకాలానికి బామ్మ చనిపోయింది, ఎత్తుకు పెంచినది, మళ్ళీ కబురు చెప్పేరు, ‘ఇటువంటి విషయాలు నాకు చెప్పద్ద’ని చెప్పినవారిని కసరినట్లు తెలిసింది. కాలం గడుస్తోంది, దంపతులు బాధకి అంతులేదు, తల్లి ఆవేదనకి హద్దే లేదు. మిత్రులు ‘రాకపోతే రాకపోయావు, తల్లి తండ్రులతో మాటాడచ్చుగా’ అన్నా, ‘తల్లితండ్రులపై ఇంత వైరం కూడద’న్నా, ‘కారణమేమ’ని అడిగినా, ఎవ్వరడిగినా మాటాడడు, సమాధానం లేదు. ‘తల్లి తండ్రులు చేసిన తప్పేమిటో చెప్ప’మన్నా ఉలకడు, పలకడు. కాలం ఆగదు కదా దగ్గరగా పన్నెండు సంవత్సరాలు దొర్లిపోయాయి. కుర్రాడి తండ్రికి అరవై దాటాయి, ఉండి ఉండి, ఒకరోజు చెమటలు పట్టేసి అనారోగ్యం చేస్తే, మిత్రులంతా కలసి పక్క పట్నం లో, హాస్పిటల్ లో చేర్చేరు, వైద్యం జరిగింది, కొడుక్కి కబురు చెప్పేరు, ఊళ్ళోనే ఉన్న వియ్యాలవారికీ కబురు చేసేరు, మిత్రులు, ప్రమాదం జరుగుతుందేమోననే భయంతో. అబ్బాయికి చెప్పినతను ప్రమాదం వివరించి, ‘నేను చెప్పవలసినది చెప్పేను, ఆ తరవాత నీ ఇష్టం’ అని ఫోన్ పెట్టేసేడు. మరి వియ్యాలవారి దగ్గరనుంచి కబురో,మిత్రుడి మాటో మొత్తానికి కోడలిని, మనవడిని తీసుకుని బయలుదేరి వచ్చాడు. తల్లి కొడుకుని పట్టుకుని ఏడ్చింది, తండ్రి ‘నీ తల్లి బాధ చూడలేకున్నాను, నీ తల్లితోనయినా మాటాడి, నీ యోగక్షేమాలు చెప్పు,తరచుగా.’ అని కాళ్ళు పట్టుకుని బతిమాలినట్లు, బతిమాలేడు, కొడుకుని. సమాధానం లేదు కాని, ఒక గంట ఉన్నాడు, ‘మీరు ఇంకా ఈ వయసులో కష్టపడటం బాగోలేదు, పని చేయడం మానెయ్యమ’ని ఉచిత సలహా ఇచ్చేడు, పెళ్ళాన్ని, పిల్లడిని తీసుకుని ఉడాయించాడు. వెళ్ళిన తరవాత కబురు లేదు, ‘ఎలావున్నార’ని అడిగిన పాపాన పోతే ఒట్టు. తల్లిని పట్టుకోలేకపోతున్నాం. ‘నాకొడుకో’ అంటుంది, ఎవరు మాత్రం ఏం చేయగలరు? భర్తతో ‘నా కొడుకు నాతో మాటాడడా?’ అంటుంది. తండ్రి  ఏం చేయగలడు, కళ్ళలో నీళ్ళు తిరగడం తప్పించి, ఆ తల్లికి ఓదార్పు ఇవ్వలేని మానసిక చిత్ర వధ అనుభవిస్తున్న ఆయనను, ఆ దంపతులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది,

2

తల్లితండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ.

తల్లితండ్రులంటే దయ, ప్రేమ లేని కొడుకు, పుట్టీ ఉపయోగం లేనివాడు, ఎటువంటివాడంటే పుట్టలో చెదలు పుట్టవా? చావవా? ఈ కొడుకూ అటువంటివాడేనని వేమనతాత భావం.

ఈ మాటంటే ఆ తల్లితంద్రుల్లకు కోపం వస్తుంది, తల్లి అయితే శాపనార్ధాలే పెడుతుంది,’నా కొడుకుని ఇంత మాటాంటారా?’ అని.. అదీ వారి ప్రేమ కొడుకు మీద.” అని ఆగి ఊపిరి తీసుకున్నాడు.

సత్తిబాబూ ఇటువంటి వారుంటారంటావా? నిజమేనా! రాయంటి బిడ్డ లక్కంటి తల్లి అన్నారు, లక్కంటి బిడ్డ, రాయంటి తల్లి ఉండవంటారు. నువ్వు ఇది చెప్పిన తరవాత నాకో కధ గుర్తుకొచ్చింది చెబుతావిను.

3

“ఒక పల్లెలో ఒక తల్లి,తండ్రి, కొడుకు కోడలు ఒక పెంకుటింటిలో నివాసం ఉంటున్నారు. యువ దంపతులకు ఒక కొడుకు, వృద్ధ దంపతులకు మనవడు. వేసవి కాలం వచ్చింది, కిందటి వర్షాలకి పెంకుటిల్లు కారింది కనక పెంకు నేయాలనుకున్నారు, తల్లీ, తండ్రీ. ఇక్కడ కొద్దిగా పెంకుటిల్లు, పెంకు గురించి, నేత గురించి చెప్పాలి, తెలియని వారికోసమే!. ఇంటిగోడలు ఏటవాలుగా కట్టి వాటిమీద దూలాలు వేసి వాటి పైన “కొడిశ”అనే కర్ర వాసాలు వేసి, వీటి మధ్య వెదురుతో తడకలా అల్లి ఆ పైన పెంకు అనే దొప్పలా ఉండే ఆరంగుళాల పొడుగున్న మట్టి తో చేసికాల్చిన దొప్పలాటి దానిని ఒకదాని కొసపైన ఒకటి ఉండేలా నీరు ఒక దానినుంచి మరొకదానికి పోయేలా వరుసలలో పెట్టుకు రావడాన్ని “నేత”అంటారు. దీనినే స్థూలంగా ‘పెంకు నేత’ అంటారు. ఆ మాట విన్న కొడుకు, పెద్దవాడయిన తండ్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, మర్నాడు ఉదయమే చల్ది తిని ఇల్లెక్కి నేత మొదలుపెట్టేడు, తండ్రిని రావద్దన్నాడు. పొద్దెక్కుతోంది, ఎండ ముదిరింది, మిటమిటలాడుతోంది. తల్లి ‘నాయనా! కిందికి దిగివచ్చెయ్యి, సాయంత్రం మళ్ళీ నేత నేద్దువుకాని,ఎండగా ఉందయ్యా ” అని చెప్పింది. కొడుకు వినలేదు, కొద్ది సేపు పోయాకా తండ్రి దిగివచ్చేయమని చెప్పేడు, “ఎండ ఎక్కువగా ఉంది బాబూ” అని బతిమాలేడు. కొడుకు వినలేదు, ‘ఈ పెణక నేసి దిగివస్తాన’ని చెప్పేడు తప్పించి, దిగలేదు. కొంతసేపు తరవాత తండ్రి చికాకు, కోప పడ్డాడు, కొడుకుమీద దిగిరానందుకు, కొడుకు వినలేదు. తండ్రికి చికాకు కలిగి, కొడుకు, చెప్పిన మాట విననందుకు, ఎండలో పని చేస్తున్నాడన్న బాధతో, ఏమి చెయ్యలో తోచక దిక్కులు చూస్తుంటే ఉయ్యాలలో మనవడు కనపడ్డాడు. ముసలతను మనవడిని తీసుకుపోయి, కాలుతున్న గచ్చుమీద ఎండలో మనవడిని నిలబెట్టి,  తనుపోయి నీడలో కూచున్నాడు. ఇప్పుడు ఇంటి పైనున్న కొడుకు తన కొడుకు ఎండలో కాళ్ళు మాడుతూ ఏడుస్తుండడాన్ని చూసి, తండ్రిని తిడుతూ రెండు అంగలలో కిందికి దిగివచ్చాడు,కొడుకుని ఎండలోంచి తీస్తూ, తండ్రిని తిట్టేడు, ‘చిన్న కుర్రవాడిని ఎండలో నిలబెడతావా? నీకు బుద్ధి ఉందా?’ అంటూ! తండ్రి నవ్వుతున్నాడు. ‘ఎందుకు నవ్వుతావంటే?’ ‘నాయనా! నీకొడుకుని ఒక క్షణం ఎండలో నిలబెడితేనే నీ మనసు అంత విలవిలలాడిందే, ఉదయమనగా ఇల్లెక్కి ఎర్రటి ఎండలోపని చేస్తున్న పాతికేళ్ళ నా కొడుకు అంటే నాకు అంత ప్రీతి, బాధా ఉండదా చెప్పు’ అన్నాడు. దానికి కొడుకు చలించిపోయి, తల్లి తండ్రులబాధ ప్రేమ అర్ధం చేసుకుని, తల్లి తండ్రులకు నమస్కారం చేసాడు.”

    ‘నాటిరోజుల్లో   మానవ  సంబంధాలలాఉండేవి  నేడిలాఉన్నాయి. ఇటువంటివారుంటారా? అని కదా అడిగారు, ఇది జరిగిన కధ, జరుగుతున్నది. హాస్పిటల్ నుండి క్షేమంగా తిరిగొచ్చినందుకు దేవుని కొలుద్దామని నిర్ణయం చేసుకుని, కొడుకుకు చెప్పడానికి ప్రయత్నం చేసేరు, షరా మామూలే, మిత్రులతో చెప్పించారు, అంతా విని ఊరుకున్నాడట,ఇంతయినా ఆ రాతి మనసు కరగలేదు, వీరి ఆశ చావలేదు.  ఏం జరుగుతుందో తెలియదు’ అన్నాడు.   

‘ఏమోనయ్యా! మగపిల్లలు ఇలా తయారయ్యారు, నేటి కాలంలో ‘ అన్నా!

‘ఏంటన్నారూ! మగపిల్లలేకాదు ఆడపిల్లలూ ఇలాగే ఉన్నారండి. రేపు చెబుతా ‘లక్కంటి తల్లి’ గురించి’ అని కాఫీ తాగి వెళిపోయాడు.

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- రాయంటి బిడ్డ.(తనదాకా వస్తే కానీ…….)

 1. ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలను బాగా తెలియజేసారు.

  నిజమేనండి, తనదాకా వస్తే గానీ తెలియదన్నది నిజం.

  • @అనూరాధ గారు,
   చరిత్ర పునరావృతం అవుతుంది. ఇప్పుడు తల్లి తండ్రులను బాధ పెడుతున్న కొడుకు ఆ తరవాత తన కొడుకు తనని అలా బాధ పెట్టిన రోజున గుర్తిస్తాడు.అందుకే మనవారు తాత తాగిన బోలి తలవాకిట్లో ఉందంటారు.
   ధన్యవాదాలు.

 2. శర్మ గారూ,
  మీరు ఎవరి గురించి చెబుతున్నారో వారు నాకు తెలుసు అని అనిపిస్తోంది.

  ఆయన వాడిని ఎంత కష్ట పడి చదివించారో నాకు తెలుసు.మొదటి నించీ ప్రేమగానె ఉండేవాడు.ఇలాగ అయిపోతాడని అసలు ఊహించలేదు.మనవడు పుట్టాడని ఎవరో చెప్పగా తెలిసి ఎంత ఆనంద పడ్డారో అదే సమయంలో వారికి కనీసం చెప్పనందుకు ఎంత బాధ పడ్డారో నాకు తెలుసు.వారి ఫోటోస్ ఎలాగో ఫేస్ బుక్ లో సంపాదించి చూసారని తెలిసి నేను చాలా బాధ పడ్డాను.నేను ఇండియా వెళ్లినప్పుడు వాల్లని కలిసినప్పుడు వారి అబ్బాయి గురించి అడిగి బాధపెట్టడం ఇష్టం లేక ఆ విషయం అసలు అడగను.వాడు మా అందరితో కూడా మాటలాడడం మానేసాడు.

  వాడు గిట్టనేమి లాంటి మాట నేను అనలేను కాని వాడు తిరిగి ఇది వరకటి లాగ మారతాడని ఆశిస్తాను.

  • @వెంకట్ దశిక గారు,
   నిజంగా మీకు కూడా తెలిసు కనుక, నా మాట నిజమని నమ్మినందుకు సంతసం.

   చాలా విషయాలు చెప్పలేదు, నిజానికి తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు అన్న మాట నాకూ అనాలని లేదు కాని అతనికి తెలిసేదెలా అనేదే నా ప్రశ్న. అంతా అయిపోయిన తరవాత భోరు మని ఏడ్చినా గడచిన కాలం తిరిగిరాదని అతనికి తెలిసేదెలా? ఆ తల్లి తండ్రులకు స్వాంతన కలిగేదెలా? అతనికి సంగతి తెలిసేదెలా? ఇవే ప్రశ్నలు నా మనసును దొలుస్తున్నాయి, ఏమీ చేయలేమా అన్నదే నా సందేహం.కొడుకు కోడలు మనవడిపోటోలు ఫేస్ బుక్ లో చూసుకుని ఆనందించవలసిన రోజులొచ్చేసేయా? మీకు తెలిసుంటే ఒక మాట మరో సారి చెప్పలేరా? దయచేసి నాకోసం. అతనిలో మార్పురావాలనుకుని ఊరుకుంటే సరిపోదని నా ఊహ.
   ధన్యవాదాలు.

 3. ఇవన్నీ అక్షర సత్యాలు,
  తిరిగి వారికే తగిలే గోడకు కొట్టిన బంతులు,
  తాత కోసం ఉంచిన ముంతను తామే ఉంచుకోవాల్సిన తరుణాలు.
  సర్, మీవి మాటలు కావు ముందుతరాలకు భవిత బాటలు.

 4. ఇది చదివాక….ఇలాంటి పిల్లలు పుట్టనేమి గిట్టనేమి అనేదే కరెక్ట్ అనిపిస్తుంది కష్టమైనా…..ఇలా మనసుని ధ్రవింపజేసే విషయాలు చెప్పడంలో మీరు సవ్వ్యసాచి, అందుకే మీ కబుర్ల కోసం ఎప్పుడూ కాచుకుని ఉంటాం. _/\_

  • @పద్మగారు,
   జీవిత సత్యాలని చిన్న మాటలలో వేమన తాత ఎప్పుడో చెప్పేడు. అది నిజమని తేలింది. తల్లి తండ్రులను బాధ పెట్టే కొడుకు శత్రు పుత్రుడు.
   ధన్యవాదాలు.

  • @ధాత్రి,
   అందుకే నేను కావలసిన వారితో తీరిక చేసుకుని ఒక ముక్కయినా మాటాడండి అని చెబుతాను.అదే తల్లి తండ్రులయితే ఏ పని అయినా మానుకునయైనా మాటాడాలి. వారు కోరేది మన క్షేమమే. బాధ పడద్దు, జీవితంలో అన్నీ తెలుసుకోవాలి కదా!
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   చాలాకాలాని కి కనిపించావు, అంతా కుశలమే కదా! ఇది నిజంగా జరుగుతున్న సంగతి, నేను స్వయంగా ఎరిగున్నది, పేర్లు చెప్పడం ఇష్టం లేక మానేసాను.ఇదేంటో నిజానికి నా బుర్రకి అర్ధం కాలేదంటే నమ్ము.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s