శర్మ కాలక్షేపంకబుర్లు- లక్కంటి తల్లి.

cute krishna Bhaavana Patel

Courtesy:- Bhavana Patel

లక్కంటి తల్లి.

రావయ్యా! రా సత్తిబాబూ!! కూచో అంటూ కుర్చీ చూపించా. సత్తిబాబు కూచుంటూ నిన్న లక్కంటి తల్లి గురించి చెబుతానన్నాను కదూ!!! వినండి,ఒక జీవిత కధ క్లుప్తంగా చెబుతున్నా! అసలు పేర్లు మార్చాను లెండి అని మొదలు పెట్టేడు.

బతకలేని బడిపంతులు రామయ్యమాస్టారి పెద్దకూతురు లలిత. ఆ తరవాత మరో నలుగురు, ముగ్గురు ఆడ ఒక మగ సంతానం.  ఆస్థిపాస్థులు లేకపోయినా పిల్లలికి చదువు మాత్రం చెప్పించాడు మాస్టారు. ఆ వరసలో లలిత జూనియర్ లెక్చరర్ గా పని చేస్తూ వచ్చింది, కుటుంబానికి ఆర్ధికంగాతోడు, ఆదాయంలో.  మాస్టారు పాతికేళ్ళొచ్చిన లలిత పెళ్ళి మాట మరచాడనే కంటే, కట్నం ఇవ్వలేకపోయాడంటే సమంజసంగా ఉంటుందేమో, లేదంటే ఆదాయం పోతుందనుకున్నాడన్నా తప్పులేదేమో! నాటిరోజులలో. నలభై ఏళ్ళకితం, గంతకు తగ్గబొంత అని సాటి మాస్టారి కొడుకు, గుమాస్తాగా పని చేస్తున్నవాడికి లలితను కట్టబెట్టి చేతులు దులుపుకున్నాడు, ఎట్టకేలకు. లలితకి ఒక ఆడపిల్ల కలిగితే నవ్య అనిపేరు పెట్టుకుంది, తరవాత లలిత మొగుడు దేశాలు పట్టిపోయాడు, తండ్రి గతించాడు. లలిత మొగుడికోసం వెతికి వెతికి వేసారిపోయారు, కాని లలిత భర్త ఆచూకీ తెలియలేదు, ఎవరివల్లా. ఏళ్ళు గడిచాయి, లలితను ‘నీకేం, వయసు తక్కువ కాదు, సంపాదనా పరురాలివి, ఉన్నాడో లేదో తెలియని మొగుడుకోసం ఎదురు చూడటం తెలివి తక్కువ మళ్ళీ పెళ్ళి చేసుకో’మన్నారు, కులంలో అలవాటు లేకపోయినా.. ‘పిల్ల అడ్డమనుకుంటే ఏ అనాధాశ్రమంలోనో వదిలేయ’మన్నారు. లేదా ‘ఎవరికైనా పెంపకం ఇచ్చి, పెళ్ళి చేసుకో’మన్నారు.

లలిత దేనికీ ఇష్టపడలేదు. తండ్రి వదలిన సంసారం ఒక కొలిక్కి తెస్తూ, పిల్లని చదివించుకుంటూ, ఒక ఇల్లు కట్టుకుంది. తండ్రి వదలిన సంసారం ఒక కొలిక్కి రావడంతో, తను తల్లితో స్వంత ఇంటికి చేరింది. . నవ్యకి చదువు బాగానే వచ్చింది, కాలేజి చదువయిన తరవాత, యూనివర్సిటీ కి పక్క రాష్ట్రానికి పంపి చదువు చెప్పించింది, తెలివయిన నవ్య బాగానే చదువుకుంది. ఇక్కడ చదువుతుండగా ఒక మిత్రుడు కలిసాడు, సహాధ్యాయి. అతని ప్రోద్బలంతో, ఇద్దరూ విదేశాలలోని ఒక యూనివర్సిటీ కి చేరారు,బేంక్ రుణంతో, ముందు చదువుల కోసం. ఇక్కడ పరిచయం, అక్కడికెళ్ళిన తరవాత మిత్రునితో ఘనీభవించింది, నవ్యకు. చదువులు సాగుతున్నాయి, అక్కడి విషయాలేమీ తల్లికి చెప్పలేదు, నవ్య. చదువులయిన తరవాత ఒంటరిగా వెళ్ళిన నవ్య జంటగానే విమానం దిగింది, మొగుణ్ణి చెంగున కట్టుకుని, కాదు బొడ్లో దోపుకుని. ఇక్కడికొచ్చాకా వివాహ ప్రయత్నం చేయబోతే, అప్పుడు చెప్పింది,మిత్రుని గురించి, ఆ సంబంధం కోసమే వెళ్ళి చెప్పబోతే, వరుని తల్లి తండ్రులు కులగోత్రాలెంచారు, లలిత ఎదుటనే కొడుకునూ ప్రశ్నించారు, ‘ఇంతకంటే అందమయిన పిల్లలు, కట్నం బాగా తెచ్చేవారు, వరుసలో నిలబడతారు, మన కులంలో. ఈ పిల్లను ఏమిచూసి ప్రేమించావో తెలియదు,అందమూలేదు, కట్నమూ లేద’ని ఈసడించారు. నవ్య తీసుకున్న ముందు జాగర్త మూలంగా, వారిద్దరూ సహజీవనం చేస్తున్న ఆధారాలు,  ఫేస్ బుక్ లో పెట్టడం మూలంగా, అబ్బాయి మాత్రం మరో మాట మాటాడటానికి లేకపోయింది. ఎట్టకేలకు వివాహం జరిగింది. ఇద్దరికి ఒక చోటే ఉద్యోగాలూ వచ్చాయి, అక్కడికి చేరేరు, కొత్త దంపతులు. కొద్దికాలం గడవటం తో లలితకు రిటయిర్మెంట్ వయసువచ్చింది. కూతురు అల్లుడు వచ్చారు, ‘ఇక మీరు ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు కనక మా దగ్గరకొచ్చెయ్య’మన్నారు, కూతురూ అల్లుడూ. లలిత తల్లి, తాను కొడుకు దగ్గరకు వెళతానని చెప్పడంతో, ఇల్లు అద్దెకిచ్చి, నవ్యతో బయలుదేరింది లలిత. అల్లుడింటికి చేరిన తరవాత చేసేపని లేక వంట పని కల్పించుకుంది. కొత్త దంపతులకు ఇల్లు కుశలంగానే కనపడింది, లలిత రాకతో.

‘ఇక్కడ ఉంటాము కనక, ‘ఇల్లు కొనుక్కుంటేనో’ అనే ఆలోచన వచ్చింది, దంపతులలో. అల్లుడు అత్తగారి దగ్గర ఇల్లు కొనుక్కునే సంగతి ప్రస్తావించాడు. అదే విషయం నవ్య కూడా ప్రస్తావించడంతో లలితకు తానేదో చేయవలసింది ఉండిపోయిందనుకుని తాను రిటయిర్ అయిన తరవాత వచ్చిన సొమ్ము అల్లుడు చేతిలో పెట్టింది, ఇంటి నిమిత్తం. సొమ్ము తీసుకుంటూ ‘ఇల్లు మీ పేర రాయిస్తా’నని చెప్పేడు అల్లుడు. లలిత మాటాడలేదు. మిగిలిన సొమ్ము బేంక్ లోన్ పెట్టాలనుకున్నారు. ఉన్న సొమ్మును మంచి ఇల్లు చూసి బేరం కుదిరితే అడ్వాన్స్ ఇచ్చేసేరు. తరవాత బేంక్ కి వెళితే, చదువుకోసం చేసిన అప్పులు మిగిలున్నవి చూస్తే లోన్ వచ్చేందుకు ఇబ్బందులొచ్చాయి. అల్లుని తల్లి తండ్రులనుంచి సహాయం అందే సావకాశం లేదని తేల్చి చెప్పేసేడు. ఇల్లు రాయించుకోకపోతే, ఇచ్చిన అడ్వాన్స్ పోయేలా ఉంది. ఏమి చెయ్యాలో తోచని స్థితి ఏర్పడితే, తన ‘ఇల్లు అమ్మేసి సొమ్ము సద్దుతాన’ని చెప్పింది లలిత. అలాగే ఇల్లు అమ్మేసేరు, వచ్చిన సొమ్ముతో కొత్త ఇల్లు కొన్నారు. ఏమయిందో తెలియదు కాని అత్తగారి పేర రాయిస్తానన్న ఇల్లు, అల్లుడు తన పేర రాయించుకున్నాడు. దీనికీ లలిత మాటాడలేదు. కొత్త ఇంటి గృహ ప్రవేశానికి అల్లుడు తల్లి తండ్రులొచ్చారు., అల్లుడుకి అత్తగారొండి పెట్టే చప్పిడి కూరల మీద మొహంమొత్తి తల్లిని కూర వండమన్నాడు. దానితో వంటిల్లు అల్లుడు తల్లి అధీనంలోకి వెళ్ళిపోయింది. కంచం వేరయింది, కాపీ వాసన కూడా సహించని నవ్యకి, లలితకి కూడా ఇది సంకటంగానే పరిణమించింది. నవ్య భర్త అప్పుడప్పుడు సోషల్ డ్రింక్ అని మొదలుపెట్టిన వాడు ‘ఇప్పుడు రోజూ తాగుతున్నా’డని తల్లి దగ్గర వాపోయింది. అలా మంచానికి దూరమయింది, నవ్య. పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, వియ్యపురాలినుంచి సూటిపోటీ మాటలూ ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులలో నవ్య భర్తతో గొడవపడుతోంది రోజూ. ఇంటి వాతవారణం మారిపోయింది. నవ్యభర్త తాను మారనని అందరూ అందుకు సరిపెట్టుకోవలసినదేనని తెగేసి చెప్పేసేడు. ఇప్పుడు లలితకి అక్కడ ఉండటమే కష్టమయిపోయింది. రోజూ గొడవలతో భార్యా భర్తలు ఎడముఖం పెడ ముఖమయ్యారు. కొంతకాలానికి నవ్య తల్లితో కలసి స్వంత ఊరుకి బయలుదేరిపోయే పరిస్థితి వచ్చేసింది. తన మూలంగా కూతురు కాపరం చెడే కాలమొచ్చిందేమోనని భయంతో ‘తమ్ముని, అమ్మను చూసి వస్తా’నని కూతురికి చెప్పి స్వంత ఊరు బయలుదేరి వచ్చేసింది. స్వంత ఇల్లు లేదు, తమ్ముడింటిలో ఎక్కువ కాలం ఉండే సావకాశం లేదు, మళ్ళీ కూతురింటికి చేరే మార్గమూ లేదు.

1

ఎందుకంటే, వచ్చేసిన తరవాత తల్లి ఎక్కడున్నదీ, ఎలా ఉన్నదీ కూడా కనుక్కోలేదు, నవ్య. తల్లి మనసు ఉండబట్టక మాటాడితే, తన అత్తగారు వెళ్ళిపోయినట్టూ, భర్తకి కొద్దిగా అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరకెళితే తాగుడు మానకపోతే మరేదో జరుగుతుందని భయపెట్టించడం మూలంగా తాగుడు మానేశాడని, తాము కులాసాగా ఉన్నామని చెప్పింది కాని తల్లి గురించి మాటాడలేదు. ఆ తరవాత కూడా కొన్ని సార్లు పలికి, కొన్ని సార్లు పలకక, పలికినా పొడిమాటలతో “బిసీ” అని, “బానే ఉన్నాము,” చెప్పి పెట్టేస్తూ వచ్చింది నవ్య. కొన్నాళ్ళకి ఫోన్ నంబర్ కూడా  మార్చేసింది. దానితో తల్లి లలితకి కూతురుతో మాటాడే సంబంధం కూడా తెగిపోయింది.

ఏమిచెయ్యాలో తోచని లలితకు ఊళ్ళోని వృద్దాశ్రమం గుర్తొచ్చి  అందులో చేరిపోయింది.  

చెల్లెళ్ళు, తమ్ముడు కోసం, కూతురు కోసం ఆ పిచ్చి తల్లి లక్కలా కరిగిపోయింది, కొవ్వొత్తిలా కాలిపోయింది.ఇప్పుడు చెప్పండి నవ్య లాటి కూతుళ్ళు తక్కువతిన్నారా!

ప్రకటనలు

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- లక్కంటి తల్లి.

 1. మరొక్కమాట.
  పెద్దవాళ్ళు తమను తాము లక్కతోటో కొవ్వొత్తితోటో‌పోల్చుకుని సెల్ఫ్ పిటీలోకి దిగజారి పోవటం వలన ప్రయోజనం లేదు.
  వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ఆయుశ్శేషాన్ని జీవించాలి తప్పదు.
  అలాగే పిల్లలమీద అతిప్రేమలతో మంచాలెక్కటమూ మానుకోవాలి గుండెలు రాయి చేసుకుని.
  ఆదినిష్ఠూరం మేలు కదా అంత్యనిస్ఠూరం కన్నా?

  • @మిత్రులు శ్యామల రావుగారు,
   నిజమే! ఎవరి పని వారు చేస్తున్నారు. చేయాలి. మనుషులమనుకుంటున్నాం కనక కొంత రాగం తప్పదు. యాంత్రికమైపోతోంది కనక అది మృగ్యమైపోతోంది. ఇక ఉన్నంత కాలం ఏడుస్తూ కూచో కుండా లలిత మంచి నిర్ణయమే తీసుకుంది. వృద్దాశ్రమం లో చేరిపోయింది, తన పెన్షన్ డబ్బులతో. పది మందికి ఉపయోగపడుతోంది. ఆమెను దగ్గర ఉంచికోలేని వారిదే ఆ దురదృష్టం ఆమెది కాదు. ఇక సెల్ఫ్ పిటీ సమస్య లేదు.
   ధన్యవాదాలు.

 2. ఈ రోజుల్లో ఎవరికివారికి తమతమ జీవితాలే ముఖ్యం.
  అమ్మానాన్నలు వాళ్ళ డ్యూటీవారు చేసారు కాని దానికే పెద్దగా ఋణపడిపోవటాలూ వగైరా ఏమిటనేది నేటి వారి నీతి.
  కొత్తతరంవారి ఆలోచనాధోరణి పసిగట్టి జాగ్రత్త పడలేని పెద్దల జీవితాలు నడిసముద్రంలో చుక్కాని లేని నావలౌతున్నాయి.

 3. కొన్ని కథలు సంఘటనలు వింటుంటె చాలా భాథ కలుగుతుంది. మా దగ్గరి భందువు నాన్నకు తల కొరివి కూఢ పెటలేదు పెళ్ళం అడుపడినందుకు.కాలం యెటుపొతుందొ అర్ఠమవుతుంది.మరి ఎవరికి ఇలాంటి పరిస్ఠితి
  రాకూదదు. ఎన్ని ఇఛినా తల్లి తండ్రుల ఱునం తీర్చలేము.

  • @సర్వారాయుడు గారు,
   స్వాగతం నా బ్లాగుకు. మీరన్నమాట నిజమే కాని అదే అమలు చేసేవారు తక్కువైపోతున్నారు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s