శర్మ కాలక్షేపంకబుర్లు-పని గండం.

1పని గండం.

“అబ్బ సరిగా! పక్కకి తిరిగయినా పడుకోండి, లేదా బోర్లాపడుకోండి, ఏ పనీ తిన్నగా చెయ్యరుకదా! ఇంత స్థిరం లేని మొగుడితో కాపరం, నేను కనక చేస్తున్నా, మరొకత్తి అయితే ఈ పాటికి సంసారం వదలిపెట్టి పారిపోను. ఊ! ఎందుకు కదులుతారు! ఏమైనా అంటే నాకిద్దరమ్మలు అని గొప్పలు చెప్పుకోడం మాత్రం తెలుసు. అందులో కన్నమ్మ పద్నాలుగేళ్ళు పెంచి, పెంచుకున్నమ్మకి అప్పచెప్పింది. ఇహ! ఈవిడ, ప్రపంచంలో ఈవిడకే కొడుకున్నట్టూ, ‘నాకొడుకు ముద్దు మొహం వాడే, సున్నితమైనవాడే, సున్నితమైన మనసున్నవాడే, మొద్దు మొహందానా!’ అని గొప్పలు చెప్పుకుని, ‘నిన్ను ఇష్టపడ్డాడే’ అని నన్ను ఉబ్బేసి ఆరేళ్ళు పెంచి నా పాల పడేసింది, నా మెడకి కట్టింది, నాకంటకట్టింది. ఇదిగో ఏభై సంవత్సరాలుగా వేగుతున్నా! ఇక వేగలేనమ్మా!! నాకూ వయసొచ్చింది కదా!!! ఓపిక చాలింది, ఈ యనకి చాకిరీ చేసి. ఆ పాటి మీద బంగారమ్మని చేసుకోవలసింది, తిక్క తీర్చును.పల్లపు వీధి సత్తెమ్మయితే మరీ బాగుండును, అది రోజూ మొగుడికి తాళాధ్యాయం చేస్తుందిట, ఏంటో పిచ్చి మొహాన్ని, ఆ రోజులలో ‘నువ్వే నా ప్రాణం’ అని వెంటపడితే, ‘కళ్ళ లో పెట్టుకు చూసుకుంటాడే నా కొడుకూ’ అంటే పిచ్చిదాన్ని, నిజమేనని నమ్మి, ఈయనే శ్రీ మహావిష్ణువనుకుని, కన్నవాళ్ళనొదిలేసి, చిటికినవేలట్టుకుని నడిచొచ్చేశా. మోసపోయేనేమో సుమా! చిన్నపిల్లననుకున్నారా! మీకు ఏళ్ళొస్తే నాకూ వస్తాయికదా! నాకు మాత్రం ఓపికుంటుందనుకున్నారా?నా పనిలో కలగచేసుకోవద్దు, బట్టల దగ్గరకి రావద్దంటే విన్నారా? ఉద్యోగం లో ఉన్నప్పుడే మేలు నా పని నేను చేసుకునేదాన్ని, ఇదిగో రిటయిరైన తరవాత కుండల్లో గుఱ్ఱాలు తోలుకోడం వచ్చి ఇలా ప్రతి పనిలో అడ్డం పడిపోడం ఏదో ఒకటి మీదకి తెచ్చుకోడం, ఇప్పుడెవరు బాధ పడుతున్నారు? మీరు బాధ పడితే నాకు కాదా? చెప్పిన మాటవినకపోతే ఎలా? చిన్నపిల్లాడి చేష్టలొచ్చేసేయమ్మా! ఛస్తున్నాను.” ఇలా సాగిపోయిందండి ఇల్లాలి సాధింపు. ఇంతకీ ఏమయిందంటే

మొన్న నాలుగురోజులకితం కోడలికి నలతగా ఉండి పడుకుంటే వాషింగ్ మిషన్ లో, ఒక్కతీ బట్టలతో కుస్తీ పడుతోందని వెళ్ళేను, సాయం చేద్దామని, అది తప్పా చెప్పండి?

LORD KRISHNA 360

“మీకేనా నోరున్నది, మీరు చెబితే నేను చెప్పలేనా? మీవాళ్ళందరికి. బట్టలదగ్గరకొచ్చి మీరు చేసినదేంటి? నీళ్ళ గొట్టం తో ఆడుకున్నారు, చిన్నపిల్లాడిలాగా. కుళాయివాడు కట్టేసేడు తప్పించి, అక్కడ పడేసిన బట్టలు తడపలేకపోయారు, పూర్తిగా. ఆ తరవాత నీళ్ళు కుండీలోంచి తెచ్చుకుని, మిషన్లో పోసి, సబ్బేసి, ఒకతిప్పుతిప్పుతూ కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళొచ్చేలోగా అక్కడున్న కాళ్ళు తుడుచుకునే గుడ్డలు పడేసేరు మిషన్ లో.  మీరే చెబుతారు కదా! అన్ని పనులకీ ఒక పద్దతి ఉంటుందని, బట్టలుతుక్కోడానికీ ఉంది కదా! మీరు మిషన్ లో వేసిన ఆ గుడ్డలని ఆఖరున వేస్తాం మిషన్ లో, మీరు ముందేసి నీళ్ళన్నీ పాడుచేసేరు. ఆ తరవాత బట్టలు వదలకుండా తీసేసేరు, మరి ఎప్పుడు పట్టేసిందో నడుము, మీరు చేసిన ఆ విన్యాసాలలో, నన్ననుకుని ఏం లాభం? అదుగో, అప్పుడే వెంటనే ఆ పని అక్కడొదిలేసి, ఆటో పిలిచి డాక్టర్ దగ్గరకి తీసుకుపోయివచ్చానా? కూడూ నీళ్ళూ ముట్టుకునేటప్పటికి రెండయింది. నొప్పో అని అరిస్తే ఎలా? ‘దేనికయినా మూడురోజులు ముమ్మరం’ అని మీరే చెప్పేరుగా? డాక్టర్ ఆయింట్మెంట్ రాసి వదిలెయ్యమన్నారు, నాకు చెప్పేరు, మీకు వినపడలేదు, తోమితే నొప్పి పెరుగుతుందని చెప్పేరుకదా. ఓర్చుకోండి. ఇదిగో ఈ మంచం మీద పడుకోండి లేదా ఆ ఉయ్యాలలో జేరబడి కూచోండి. ఎలా బాగుంటే అలా చెయ్యండి. మందేసుకున్నారుగా తగ్గుతుంది” అంది. “మీ కన్నమ్మ చెప్పేది, ‘అమ్మాయి మావాడు ‘ఇంట్లో ఇనపశీల వీధిలో బంగారపుశీల” అని. మీవాళ్ళతో కబుర్లు చెప్పుకుంటే, ఈ తిప్పలు వచ్చేవి కాదుకదా! మీకూ, నాకూ కూడా. నేనేం చేతును. మీరు నన్ను చిన్నపిల్లాడిలా వదలక, చెయ్యట్టుకుని కూచోబెడితే, అవతల పనులెలా అవుతాయి. కాకపోయినా కోడలు నవ్వదూ? ‘ముసలాళ్ళకి దసరా పండగ’ అని, నడుం నెప్పి వంకతో ముచ్చట్లు చెప్పుకుంటున్నారని.” “నవ్వనీవోయ్! దానికీ తెలుస్తుందిగా ఇలా కబుర్లు చెప్పుకోవాలని మొగుడితో, ఏమయినా నువ్విలా సాధిస్తే బాగోలేదు, ఏమిచ్చాడేం!, నాకు మీనాన్న”. అన్నా, ఆవిడను అక్కడనుంచి వెళ్ళనివ్వకుండా ఉంచేదుకు తగువు కొన సాగేందుకు కొస అందిస్తూ. “మా నాన్న ఇంకా ఏమివ్వాలి? నన్నిచ్చాడు చాలలేదా?నేనేం తక్కువ చేసేను మీకు ” “అమ్మో! నీతో వాదించలేనుకాని, కాలక్షేపానికి నాకు దగ్గరగా పుస్తకాలెట్టు” అంటే భారత, భాగవత, రామాయణాలు ఒక పీట మీద పెట్టి వెళుతూ “అన్నట్టు, మీకు పని గండం ఉందని మా అత్తయ్య చెప్పేది లెండి, మరిచిపోయా” అని నవ్వుతూ పారిపోయింది, పక్కనుంచి కోడలు కిసుక్కున నవ్వినట్టు వినపడింది. “సరే! నాకేం! దానిపళ్ళే బయట పడ్డాయ”నుకుని అనుకుని పుస్తకం తీస్తే, అది భారతం అనుశాసనిక పర్వం, పేజీలు తిరగేస్తుంటే, పని గండం అంది, ఈ మాట ఎక్కడ విన్నాను అని జ్ఞాపకాలలోకి వెళితే

Grazyna Murawska

అవి కాకినాడలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రోజులు. మొత్తం ఆఫీస్ చక్రం మన చేతిమీద నడుస్తోందనుకున్న రోజులు. ఒక రోజు సాయంత్రం హుషారు కార్యక్రమం పెట్టుకుంటే ,ఆఫీస్ నుంచి మనిషొచ్చాడు, ‘మిమ్మల్ని అర్జంట్ గా జె.యి గారు తీసుకురమ్మన్నా’రని. ఇప్పుడే తగులుకుందే అనుకుంటూ వెళ్ళేను. జె.యి చాలా హడావుడిపడిపోతున్నాడు. వెళ్ళగానే పట్టేసుకుని ‘ఈ ఆటోమేటిక్ వోల్టేజ్ రెగులేటర్’ పని చెయ్యటం లేదు, వోల్టేజ్ షూట్ అవుతోంది చూడండి’ అన్నాడు, ఏడుపు మొహంతో. ‘ఇప్పుడు చూడలేనంటే’ మరి ‘ఇలా ఉంటే మొత్తం కాలిపోతాయేమో’ అన్నాడు, దానికి మందేస్తానని, పవర్ ఆపి, ఆ ఏ.వి.ఆర్ ని పక్కకి తప్పించేసి మళ్ళీ పవర్ ఇచ్చేసి, ‘దీని సంగతి రేపు చూస్తా’ అని చెప్పి పరుగులాటి నడకతో బయట పడ్డాను. ఆ రోజు సాయంత్రం కార్యక్రమమైంది. మర్నాడు ఉదయమే ఆఫీస్ కి వెళ్ళి దానిని చూదామనుకునేలోగా అప్పటికి డ్యూటీ లో ఉన్న ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి ,అదే సినీ కధ, మాటల రచయిత ‘ఆకెళ్ళ‘ ‘శర్మగారూ! ఆ టెక్నికల్ పనులు మీరు చెయ్యడమే కాని మరొకరికి నేర్పరా? నాకూ నేర్చుకోవాలని ఉంది’ అన్నారు. ‘అయ్యో! దానికేం భాగ్యం ‘కొడుకుని కంటాననే కోడలే ఉంటే వద్దనే అత్తగారుంటుందా’ అని రమ్మన్నాను.’ఏం చేయమంటా’రన్నారు. మోటర్ సైకిల్ బాగోకపోతే, మెకానిక్ దగ్గరకి తీసుకెళితే ఏ0చేస్తాడు? ‘ముందు కుర్రాడొచ్చి బండి పుచ్చుకుని, స్టాండేసి, వివరం కనుక్కుని దానికి కావలసిన రెంచ్ లూ వగైరాతెచ్చి అక్కడ పెట్టి, అప్పుడు మెకానిక్ ని పిలుస్తాడ’న్నారు. ‘మరదే చెయ్యండి’ అన్నా. పాపం ఆయన కావలసిన పనిముట్లన్నీ తెచ్చి అక్కడపెట్టేరు. నేను వెళ్ళి దానిని ముందుకులాగి, పై కవర్ తీసి లోపల ఏమయిందో చూసేను. ఆ చూడటం లో నాకు ఒక ఎలక్ట్రొలైటిక్ కండెన్సర్ ఉబ్బినట్లుగా కనపడింది. చూదామనుకుంటే దాని నిండా సంవత్సరాల తరబడి పేరుకుపోయిన దుమ్ము కనపడి, దానిని తుడవడానికి బ్రష్, గుడ్డ కోసం వెళ్ళేను, అక్కడినుంచి, ఆయనను పంపడం ఇష్టం లేక. నేను అలా వెళ్ళిన వెంఠనే ‘ఢాం’ మని శబ్దం వినపడింది. వెనక్కి తిరిగిచూస్తే ఆకెళ్ళ మీద ఆ ఎలక్ట్రొలైట్ చిందులు పడినట్లు కనపడ్డాయి. వెంఠనే దూది నీళ్ళు తీసుకుని, నీళ్ళలో దూది ముంచి, దానితో ఎక్కడెక్కడ ఎలక్ట్రొలైట్ పడితే  తుడిచేను. అదృష్టం ఆయనకి కళ్ళజోడుంది కనక కళ్ళలో పడలేదు. ఆ తరవాత ఆయనను కుళాయి దగ్గరకి తీసుకుపోయి ముఖం తతిమా పడిన భాగాలూ నీళ్ళతో కడిగి ‘ఎలా ఉందంటే?’ ‘చిమచిమలాడుతోంద’న్నారు. వెంఠనే వేన్ మీద జనరల్ హాస్పిటల్ కి తీసుకుపోయి వైద్యం చేయించి ఇంటి దగ్గర దింపడానికి తీసుకు వెళుతుంటే “ఏం చేసేరు మిత్రమా ! కండెన్సరు పేలింది ” అన్నా! అబ్బే ఏం చేయలేదు స్క్రూ డ్రైవర్ తో దాని ఇలా అన్నా అంతే” ‘మిత్రమా! మనిద్దరికి పని గండం ఉంద’న్నారు. ‘అదేమ’న్నా! ‘మీరు పని చేయలేకుండా ఉండలేని గండం, నేను పని చేస్తే నాకు ఎదో అయ్యే గండం’ అన్నారు. ఏమయినా కవి అనిపించుకున్నారనుకున్నా. ఆ పేరు చెప్పి రెండు రోజులు స్పెషల్ కేజుయల్ లీవ్ తీసుకున్నారు , మా మిత్రులు.

అలా నాలుగురోజులనుంచీ భోజనం టిఫిన్ అన్నీ ఉయ్యాలలోనే జరుగుతున్నాయి, చెప్పేను కదూ అనుశాసనిక పర్వం చదువుతున్నానని……

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పని గండం.

 1. పనిగండం అనే పద ప్రయోగం వెరైటీగా ఉందండి.

  మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

  పావురాయి చిత్రం చాలా బాగుంది…. బొమ్మలా.

  • @అనురాధ,
   ఆలస్యానికి మన్నింపు.
   పనిగండం లాటి పదప్రయోగాలు చాలానే ఉన్నాయి. సమయానికి కాని ప్రత్యేకంగా గుర్తు రావు. కోలుకుంటున్నా, అంతా శ్రీమతిగారి చలవే! అది పావురాయి కాదండి జావా తెల్ల చిలక
   ధన్యవాదాలు

  • @పద్మగారు,
   ఆలస్యానికి మన్నించాలి. నిజానికి అది సాధింపు కాదు. బాధ పడుతున్నవారి పట్ల వ్యక్తం చేసే ఒక ప్రేమ ప్రక్రియ. మీకు చెప్పక్కరలేదనుకుంటా. ఇది ఆడవారి సొత్తు. నిజంగా చాలా కమ్మగా ఉంటుంది. ఆమెను కూచోబెట్టుకుని దానిని పొడిగింపచేసుకోడానికి చేసిన ప్రయత్నం లో కనపడలేదూ ఆ విషయం. నిజానికి ఇది కావల్సినదే 🙂
   ధన్యవాదాలు

  • @వర్మాజీ,
   ఆలస్యానికి మన్నించాలి. అన్న మాట కాదండి ఉన్న మాటే
   ఇది నడుస్తున్న చరిత్ర 🙂
   ధన్యవాదాలు

 2. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  ‘అమ్మాయి మావాడు ‘ఇంట్లో ఇనపశీల వీధిలో బంగారపుశీల” ; కుండల్లో గుర్రాలు తోలుకోవడం – చాలా చక్కటి పదప్రయోగాలు. ఇప్పటివారికి వీటి అర్ధం తెలియకపోవచ్చును. ‘కుండల్లో …..” ఈ ప్రయోగం అర్ధమయ్యింది. రెండవది, ‘ఇంట్లో ఇనపశీల …..’ దీని అర్ధం తెలియచేయగలరు. మెత్తం మీద కథ బహు చక్కగా వున్నది.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • @మిత్ర్లు మాధవరావు గారు,
   ఆలస్యానికి మన్నించాలి. ఈ పలుకుబడుల గురించి ఒక టపాయే రాయాలి నిజానికి. ఇహ ఈ ఇంట్లో ఇనపశీల వీధిలో బంగారపు శీల అంటే ఇంటిలో వేలు వేసి పని చేయడు, ఊరికి ఉపకారి. .ఇది కధ కాదండి నడుస్తున్న చరిత్ర 🙂
   ధన్యవాదాలు

  • in circus you see some people drive motorcycles/Horses in a round well like thing. i think that is. in short he doesnt go out. its just for timepass/pleasure. even if you drive for 100km you dont go anywhere

   • @అటల్ జీ,
    ఆలస్యానికి మన్నించాలి. స్వాగతం నా బ్లాగుకు.
    విషయం గురికి బారెడు దూరం లో బాగానే చెప్పేరు
    ధన్యవాదాలు

  • @రమణాజీ,
   ఆలస్యానికి మన్నించాలి.అది కుండలలోకి గుర్రాలను తోలడం కాని వాడుకలో కుండలలో గుర్రాలను తోలడం అయి ఊరుకుంది. అంటే కూటి కుండ మీదకి దాడి చెయ్యడమే కాని పనీ పాటూ లేక కూఛోడమని ఈ పలుకుబడి అర్ధం. ఇప్పుడు ఇంట్లో ఖాళీ గా కూచున్నవాళ్ళకి సరిపోతుంది గా!అసలొక టపాయే రాయాలి ఈ పలుకుబడులగురించి..
   ధన్యవాదాలు

  • @ఉష గారు,
   అమ్మగారి సాధింపులు కమ్మగా ఉన్నయన్నదే నిజం, ఏభై ఏళ్ళనుంచి అలవాటు కదా:) బాధ పడుతున్న సమయంలో ఇవి ఒక టానిక్ లా పని చేస్తాయి. ఇవేవి కోపంతో చేసినవి కావు కదా! అభిమానం ఉన్న దగ్గర ప్రేమ ఉన్న దగ్గర ఇవి సర్వ సహజం కూడా. ఇవి లేకపోతే బాధ కలుగుతుంది.
   ధన్యవాదాలు

  • @ఫాతిమాజీ,
   పని చేస్తే కాని కష్టం తెలియదండి. ఇక్కడ బాస్ డే0జర్ కాదండీ! ఇలా సాధించకపోతే తోచదే! బాస్ దంతా మేకపోతు గాంభీర్యమే, మంచుకొండలా కరిగి ప్రవహిస్తుంది.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s