శర్మ కాలక్షేపంకబుర్లు-బాల నేరస్థులు?

images

బాల నేరస్థులు?

ఎవరు బాల నేరస్థులు? ఏ వయసువారు బాలలు, అన్న విషయాల మీద ఈ మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. దీని గురించి ఆలోచిస్తే భారతం లో ఒక కధ కనపడింది, ఇదిగో మీకోసం అవధరించంది. భారతం..ఆది పర్వం. ఆశ్వా..4లో 260 నుండి 270 వరకు స్వేఛ్ఛానువాదం.

మాండవ్యుడు అనే బ్రహ్మర్షి ప్రపంచంలోని అన్ని తీర్థాలూ సేవించి వచ్చి, ఒక నగరానికి కొద్ది దూరంలో ఉన్న ఒక అడవిలో ఒక పర్ణశాల వేసుకుని, ఆ పర్ణశాల ముందున్న చెట్టుకింద చేతులు పైకి ఉంచి మౌన దీక్షలో తపస్సుచేసుకోడం మొదలు పెట్టేరు. నగరంలో రాజుగారింట దొంగతనం జరిగితే, భటులు తరుముకు వస్తుండగా, దొంగలు పారిపోయివచ్చి మాండవ్యుని ఆశ్రమం లో నక్కేరు, దొంగ సొమ్ముతో సహా. వచ్చిన భటులు మాండవ్యుని ’దొంగలు సొమ్ముతో ఇలా పారిపోయివచ్చారు, చూశారా?’ అనిఅడిగితే మౌనంలో ఉన్న ముని పలుకకకపోతే ఆశ్రమంలో చొరబడి, వెతికి దొంగలని సొత్తును పట్టుకున్నారు. ముని దగ్గరకొచ్చి ’మౌన వేషంలో, తపస్సు పేరు చెప్పి దొంగలను దాచావ’ని నిందించారు. ఇక్కడొక మాట నన్నయగారు వాడినది, “దాపికాడు”అంటే దాచినవాడనే అర్ధంలో వాడేరు, పదం బాగుంది కదూ…”తాన చోరులకును దాపికాడై…”261.

అప్పుడు రాజభటులు దొంగలను,దొంగసొమ్ముతో సహా మాండవ్యుని తీసుకుపోయి రాజు దగ్గర హాజరు పరిస్తే, రాజు దొంగలకు మరణ శిక్షవేసి, మునికి శూలం వేయించాడు, నగరం బయట.   దీనికీ చలించని ముని తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఇది చూసిన ఋషులు ‘మహామునీ మీకు ఇలా జరిగిందేమని, దీనికి కారణమేమని’ అడుగుతారు, రాత్రిపూట పక్షుల రూపంలో వచ్చి. దానికి ముని

ఎఱిగియెఱిగినన్నడుగంగనేల దీని,సుఖదుఃఖంబు బ్రాప్తించుచోట నరుడు
దగిలి తనకర్మ వశమున దనకుదాన,కర్తగాకన్యులకు నేమి కారణంబు….265

తెలిసి,తెలిసి నన్నడుగుతారెందుకు, సుఖ,దుఃఖాలకి మానవుడు తనకు తాను కర్త, తప్పించి మరొకరు కారణం కాదుకదా! అంటాడు. ఈ మాటలు విన్న భటులు రాజుకు వివరం చెబితే, రాజు పరుగునవచ్చి, మన్నించమని వేడుకుని శూలం తీయించబోతే అది కాస్తా పుచ్చిపోయి రాకపోతే, కోయించితే, గొంతుపక్క లోపల శూలం చివరి ముక్క ఉండిపోయింది. ఆ తరువాత ఆయన అలాగే తపస్సు చేసుకున్నాడు. కంఠంలో శూలం మొన ముక్క ఉండడం మూలంగా ”అణి” మాండవ్యుడు అన్నారు ఆయనను.

చాలాకాలం తపస్సు చేసుకున్న తరవాత ఆయన ఈ లోకాన్ని వదలి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేరు. అక్కడ యమధర్మరాజుతో నేను బ్రహ్మఋషిని, నాకు ఇటువంటి శిక్ష ఎందుకు వేశావని, నేను చేసిన తప్పేమిటని అడిగితే,

సొలయక తూనిగలం గొఱ్ఱుల బెట్టితి నీవు నీ చిఱుత కాలము త
త్ఫల మిప్పు డనుభవించితి, తొలగునె హింసాపరులకు దుఃఖప్రాప్తుల్….269.

అనిన మాండవ్యుండలిగి జన్మంబు మొదలుగా బదునాలుగు వత్సరంబులు దాటునంత వరకు బురుషుండు బాలుండు, వాడెద్ది సేసిన బాపంబుం పెద్ద పొరయండు,వానికి నొరు లెగ్గు సేసిన బాతకులగుదురిది నా చేసిన మర్యాద…….270

నువ్వు చిన్నతనంలో తూనీగలను పట్టుకుని వాటిపీకలలో ముళ్ళుగుచ్చేవాడివి, ఆ పాప ఫలం ఇప్పుడు అనుభవించావు,హింసాపరులకు దుఃఖం తప్పదుకదా అంటే, మాండవ్యుడు కోపించి, పుట్టినది మొదలుగా పదునాలుగేళ్ళు పూర్తి అయేదాకా మానవుడు బాలుడు, అప్పుడు చేసిన పనులకు శిక్ష తగదు,వానికి ఇతరులు అపకారం కనక చేస్తే వారికి ఆ పాపం చెందుతుందని చెప్పేరు. ఇది నేను చేసిన నియమం అని చెప్పేరు. అప్పటి నుంచి యముడు అది అమలు చేసేడు.

మనకు ప్రస్థుతానికి సంబంధించి కధ అయిపొయింది కాని మంచి సంగతి ఉంది చెప్పేసుకుందాం. అలా నియమం చేసిన మాండవ్యుడు యమునికి ”శూద్రయోనియందు జన్మిస్తావ”ని శాపమిచ్చాడు, ఆ ఫలితంగానే విదురుడుగా జన్మించాడు యమ ధర్మరాజు.

కధ చాలా చిన్నదే అయినా మనకు చాలా మంచి విషయమే చెబుతుంది, ఆలోచించుకోడానికి, ప్రస్థుతపరిస్థితులకు అన్వయించుకోడానికీ, అదెలాగో చూదాం.

download

యముని చట్టం లో ఉన్నవారు ఒకరే నేరస్థులు. ఆయన వారిని విభాగించలేదు, స్త్రీలా, పురుషులా, పిల్లలా అని. నేరం చేసినవారెవరైనా ఒకటే ఆయనకు, అందుకే ఆయనకు ”సమవర్తి” అని పేరు కూడా. మాండవ్యుడు తనకు జరిగిన దానితో కొత్త ఒరవడి పెట్టేరు. అది పదునాలుగేళ్ళు నిండేదాకా చేసే నేరాలకి బాలలకి శిక్ష ఉండకూడదని. నాటిది సత్య కాలం, మరినేడు పదునాలుగేళ్ళవాడు ఇరవై ఏళ్ళ అమ్మాయిని బలాత్కారం చేసి పాడు చేస్తే బాలనేరస్థుడుగా మూడేళ్ళ శిక్షతో తప్పించుకుంటూ మళ్ళీ సమాజం మీద పడుతున్నాడు. మరి ఈ బాల నేరస్థుల వయసును పద్దెనిమిదిగా చెబుతున్నాం. ఇది నేటి కాలానికి సబబా? బాల నేరస్థులసలు లేరన్నారు, యముడు, పద్నాలుగేళ్ళు నిండేకా వారు  నేరస్థులన్నారు మాండవ్యులు, మరి ఇప్పుడు బాల నేరస్థులవయసు పదమూడు కావాలని నా ఊహ.

 

 

నేరం చేసినవారికి నేడు శిక్ష పడటానికే సమయం తీసుకుంటోంది, ఒక్కొకచో శిక్ష కూడా పడటం లేదు, చాలా కారణాలకు గాను. అందుచేత బాల నేరస్థుల వయసును ఎంతగా నిర్ణయించి చట్టం చేయాలో చెప్పండి, ఇది మనందరి సమస్యా సుమా!

download (1)

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బాల నేరస్థులు?

  1. నేరం చేసినవాడికి శిక్ష తప్పకుండా పడాలి, చిన్నవాడైతే చిన్న శిక్షా, పెద్దవాడైతే పెద్ద శిక్షా కాదు, చిన్న నేరానికి చిన్నదీ, పెద్ద నేరానికి పెద్ద శిక్షా వెయ్యాలి.
    చిన్నా నాడే పెద్దగా ఆలోచించి స్త్రీల ఎడల తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకు పెద్దగానే దంఢన వేయాలి (ఊచకోత కోయాలి )

    • @ఫాతిమాజీ,
      నిజమే, మన దేశం లో బాల నేరస్థుల చట్టం వారిని విచారించేందుకు వేరు కోర్టూ, బోర్టల్ స్కూలూ వగైరా వేరేగా ఉన్నాయి. వారికి శిక్షలు తక్కువగా ఉంటాయి. మొన్న నిర్భయ కేస్ లో బాల నేరస్థుడని రేప్ చేసిన వానికి మూడేల్లూ శిక్షతో తప్పించుకున్నాడు. మన దేశం మీద తుపాకులతో ముంబై మీద దాడి చేసి పౌరులను పొట్టన పెట్టుకున్న కసబ్ కూడా బాల నేరస్థునిగా తప్పించుకోవాలని ప్రయత్నం చేసేడు. అందుకే ఈ బాల నేరస్థుల వయసును పదునాలుగేళ్ళకి సవరించే చట్టం చేయాలని నా ఉద్దేశం.
      ధన్యవాదాలు.

    • గంగరాజు గారు,
      నేను సినిమా చూసి దగ్గరగా నలభై సంవత్సరాలయిందేమో! నూరేళ్ళ పండగ చేసుకున్న తెనుగు సినిమాకు నూరేళ్ళూ ముఫై ఏళ్ళకితమే నిండాయి. సినిమా ఇప్పుడు కులం, కొద్ది కుటుంబాల ఏకఛత్రాధిపత్యంలో నడుస్తోంది. కళ ఎప్పుడో చచ్చిపోయింది. అసలు నటన అంటే తెలియని వారసులొచ్చాకా దరిద్రమే పట్టుకుంది. ఇంతకుమించి వివరాలు చెప్పలేను, అన్నీ మీ అందరికీ నాకంటే బాగా తెలుసు.
      ధన్యవాదాలు.

  2. కాలమానపరిస్థితులబట్టి,చట్టాన్ని మార్చవచ్చును.నా అభిప్రాయంప్రకారం 15 సంవత్సరాలు పూర్తి ఐనవారిని యువకులుగాపరిగణించి వారు చేసిననేరాలకు పెద్దవారివలెనే(adults)శిక్షలు అమలుచేయాలని.,అనుకొంటున్నాను.

    • మిత్రులు రమణారావు గారు, ప్రసాద్ గారు,

      మీరన్నట్లు పదిహేను నిండితే మరీ ఎక్కువనుకుంటున్నా. పద్నాలుగేళ్ళవాళ్ళలోనే నేరస్థులు ఎక్కువమంది కనపడుతున్నారు, ప్రసాద్ గారన్నట్టు పది సంవత్సరాలు మరీ తక్కువేమో! నిజంగా మాండవ్యులు చేసిన నిర్ణయం పద్నాలుగు నిండినవారంతా బాలలు కారన్నదే బాగుందేమో కదా! ఆలోచించండి.
      ధన్యవాదాలు.

Leave a reply to గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు స్పందనను రద్దుచేయి