న్యాయాలని సంస్కృతంలో చాలా ఉన్నాయి, అవన్నీ జీవిత సత్యాలే, వాటిలోకొన్నిటి గురించి చూదాం.
1.మార్జాల కిశోర న్యాయం
మార్జాలం అంటే పిల్లి కిశోరం అంటే పిల్ల.పిల్లి పిల్ల న్యాయం. అనగా పిల్లి పిల్లని చూసే విధానం గురించి చెప్పబడినది. పిల్లి మాంసాహారి. పిల్లల్ని పెట్టి వాటిని ఒక చోటనుంచి మరొక చోటికి తిప్పుతూ ఉంటుంది. ఆ తిప్పడం లో తన నోటితో పిల్ల పీకి పట్టుకుని మరొక చోటికి తీసుకుపోతుంది. నిజానికి చూస్తే పిల్ల చచ్చిపోతుందనుకుంటాం. కాని అలా కాదు. పిల్లికి నోటిలో కింద రెండు పైన రెండు కోరలుంటాయి, చాలా సూదిగా. కాని పిల్లని పట్టుకుని వెళ్ళే సందర్భం లో పిల్లకి ఆ కోరలు కూడా హాని చేయకుండా పట్టుకుని తీసుకుపోతుంది. ఇందులో పిల్లి పిల్ల యొక్క ప్రమేయం ఏమీ ఉండదు, అంతా పిల్లి చూసుకుంటుంది. దీనిని మనం భగవంతునికి అర్పణ చేసుకునే విధానానికి చెబుతాం. స్వామీ పిల్లి పిల్ల లాటివాళ్ళం ఏమీ తెలియని వాళ్ళం, పిల్లి తన పిల్లను ఎలా కాపాడుకోడానికి నోటితో పట్టి హాని జరగకుండా చూసి తీసుకుపోతుందో నీవూ మమ్మల్ని అలాగే కాపాడి రక్షించమని వేడుకోడానికి చెబుతాం. ఈ న్యాయాన్ని. ఇది శరణాగతికి పరాకాష్ఠ.
2.మర్కట కిశోర న్యాయం
మర్కటం అంటే కోతి. కోతి తనపిల్లని తీసుకుపోయే విధానం గురించినది. ఇది మార్జాల కిశోర న్యాయానికి పూర్తిగా వ్యతిరేకం. కోతి పిల్ల తల్లి కోతి కడుపును చేరి వీపు పట్టుకుని ఉంటుంది. తల్లి కోతి ఒక చోటి నుంచి మరొకచోటికి గెంతేటపుడు పిల్ల కోతి పట్టుకుని ఉండాలే తప్పించి, తల్లి కోతికి బాధ్యత లేదు.,తనపని తని చేసుకుపోతూ ఉంటుంది. తల్లిని అంటి పెట్టుకుని ఉండవలసిన బాధ్యత పిల్లదే, తల్లిది కాదు.మార్జాల కిశోర న్యాయం లో ఇది పూర్తి వ్యతిరేకం కదా!
తల్లి జాగ్రత్త తీసుకుంటుంది పిల్ల గురించి.
3.శ్వానమకర న్యాయం
శ్వాన మకర న్యాయం. శ్వానం అంటే కుక్క, మకరం అంటే మొసలి. మొసలి నీటిలో ఉండగా ఏనుగునయినా బంధించగలదు, కాని అదే నీరు విడిచి బయటికి వచ్చిన మొసలిని కుక్క కూడా భయపెట్ట గలదు. దీనిని తెనుగులో స్థానబలిమి కాని తన బలిమి కాదయా అన్నాడు వేమన తాత.
4.యవ వరాహ న్యాయం.
తెనుగులో దీనిని ఏదుపంది తప్పుచేస్తే ఊరపందికి శిక్షపడినట్టు అంటారు. క్లాసులో కలవారబ్బాయి అల్లరి చేస్తే లేనివారబ్బాయిని మాస్టారు దండించినట్లు. ఇంకా చెప్పుకోవాలంటే కలవారబ్బాయి తాగి కారు నడిపి ప్రాణం తీస్తే కారు డ్రైవరు ఆ ప్రమాదం తానే చేశానని ఒప్పుకుని శిక్ష అనుభవించడం.
5.భ్రమర కీట న్యాయం.
భ్రమరం అంటే తుమ్మెద. ఈ తుమ్మెద ఒక కీటకాన్ని పట్టుకొచ్చి తన గూటిలో బంధించి ఆ గూటి చుట్టూ ఝుమ్మని రొద చేస్తూ తిరుగుతుందిట. కొంతకాలానికి ఆ కీటకం తుమ్మెదగా మారుతుందంటారు. దీని తెనుగులో ఆరు నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారని అంటారు.
ఇంకా చాలా ఉన్నాయి. మరికొన్ని మరోసారి….ఇవన్నీ నిత్య సత్యాలు, వీటిని ఒక్కొకదానిని నేటి కాలానికి వివరించాలంటే ఒక్కోటపా సాయించాలి మరి…
చివర ‘న్యాయం’ అని అనడానికి గల కారణం ?
విజయ రాఘవేంద్రగారు,
స్వాగతం.
న్యాయం అనే మాటకి నిఘంటుకారుడిచ్చిన అర్ధం…
న్యాయః..= పధ్హతి, తర్కశాస్రము,తగవు, మర్యాద, చట్టము,వ్యాజ్యము, పుణ్యము, తీర్పు,పోలిక, సూత్రము, నీతి.
మనం తెలుగులో జనసామాన్యంలో సామ్యాని సామెత అంటాం అంటే పోలిక. ఇది సంస్కృత శబ్దం …. తెనుగులో సామెతని సంస్కృతంలో న్యాయమన్నారనుకుంటా.
ధన్యవాదాలు.
చక్కటి విషయాలను తెలియజేసారు.
@అనురాధ గారు
ధన్యవాదాలు.
నాకు కోతి , పిల్లి గూర్చి మాత్రమే తెలుసు . మిగిలినవి తెలిపినందుకు సంతోషం శర్మగారు .
@శ్రీదేవిగారు,
ధన్యవాదాలు.
వార్తాపత్రికల్లో నానుడులుగా ఈ న్యాయాల గురించి చూస్తూ ఉంటాం. ఇప్పుడు అవి మరింత బాగా అర్థం అవుతాయి. మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.
@వర్మాజీ,
ధన్యవాదాలు.
చక్కటి వివరణ !
@సుధాకర్జీ,
ధన్యవాదాలు.