ఘోటక బ్రహ్మచారి.
బ్రహ్మచారి అనగా బ్రహ్మమునందు చరించువాడని అర్థం, బ్రహ్మమనగా పరమాత్మ. ఇది అందరికి తెలిసినదే, మరి ఘోటక బ్రహ్మచారేంటీ అని కదా అనుమానం. ఘోటకము అనగా అశ్వము అనగా గుఱ్ఱము, గుఱ్ఱం బ్రహ్మచారి ఏంటీ? గుఱ్ఱంలాటి బ్రహ్మచారి అని పిండితార్థం. మనం సామాన్యంగా బ్రహ్మచారి అంటే వివాహం కానివాడు అనే అర్థంలో వాడుతాము. అంటే గుఱ్ఱంలా ఉన్న బ్రహ్మచారనా? బ్రహ్మచర్యానికి గుఱ్ఱానికి లంకేంటీ? ఇదీ అసలు ప్రశ్న. “అమ్మయ్య! గుండుగొమ్ముల అనుమానం తీరింద”నిపించారు గుఱజాడవారు.
ఇప్పుడొక పద్యం చెప్పుకోవాలి అశ్లీలమని నన్ను తిట్టద్దు, తప్పదు కనక చెబుతున్నా.
యతికి మరి బ్రహ్మచారికి
నతులితముగ విధవముండ కశ్వంబునకున్
సతతము మైధున చింత యఖం
డితకుంద కవి చౌడప్పా!
సన్యాసికి, బ్రహ్మచారికి, విధవ అనగా మగడు చనిపోయినదానికి, గుఱ్ఱానికి ఎప్పుడూ మైధున చింతే ఉంటుందంటారు కవి.
ఇప్పుడు సరిపోయింది కదా ఘోటక బ్రహ్మచారి అంటే గుఱ్ఱంలాటి బ్రహ్మచారి అనగా ఎప్పుడూ మైధున చింత చేసేవాడు అని అర్థం. బ్రహ్మమునందు సతతమూ చరించవలసిన బ్రహ్మచారి మైధున చింతలో తగుల్కొనడం మూలంగా అతనిని ఘోటక బ్రహ్మచారి అని ఎద్దేవా చేసేరనమాట.
ఈ ఘోటకబ్రహ్మచారి పదాన్ని అటువంటి కుహనా బ్రహ్మచారులను హేళన చేయడానికి వాడిన మాటగా తలుస్తాను.మరొక నానుడి కూడా ఉన్నది లోకంలో, దానిని న్యాయంగా చెబుతారు, అదే “బ్రహ్మచారీ భగన్యాయం”. తప్పయితే దిద్దుకుంటాను. భీష్ముడు బ్రహ్మచారి మాత్రమే అన్నా మొన్ననో కామెంట్ లో, అందుకే.
భీష్మ పితామహుల అసలు పేరు దేవవ్రతుడు, తండ్రి శంతన మహారాజు సత్యవతీ దేవిని వివాహం చేసుకుంటానంటే, ఆయనకు పిల్లనివ్వడానికి దాశ రాజు, సత్యవతీ దేవికి కలిగిన వారికే రాజ్యాధికారం రావాలంటే, అసలు వివాహమే చేసుకోక బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేసేరు కనక భీష్ములని తరవాత ను 0చి పిలువబడ్డారు, ఇది పౌరుషనామం. అందుకే భీష్ములు మాత్రమే అసలు బ్రహ్మచారి.
ఇన్నాళ్ళు ఘోటక బ్రహ్మచారి అంటే గొప్ప బ్రహ్మచర్య నిష్టగలవాడు
అనే భ్రమలో ఉన్నాను ,శర్మగారు నన్నీ విషయంలో అజ్ఞానాంధకారం
నుండి బయటకు తెచ్చినందుకు ధన్యవాదములు.
@శ్రీ దేవిగారు,
చాలా మాటలు వాటి అసలు అర్ధాన్ని పోగొట్టుకుంటున్నాయి.ఉదాహరణకి స్వాహా చేసేరు,గోవిందా కొట్టించారు వగైరాలు..
ధన్యవాదాలు.