దుర్యోధనుడికి పాండవులంటే మొదటినించీ కిట్టదు. దానిని అతను దాచుకోనూ లేదు. వారిని మట్టు పెట్టడానికి కావలసినన్ని ఉపాయాలూ, ప్రయత్నాలూ చేశాడు. కాని వాటన్నిటినీ వారు అధిగమించారు, పరమాత్మ కృపచేత, ధర్మ పాలన చేత. తండ్రి పాలు, అర్ధరాజ్యం ఇవ్వమని కోరితే, కుదరదుగాక కుదరదని చెప్పేడు, దుర్యోధనుడు. తల్లి తండ్రులు చెప్పేరు, ఆకాలంనాటి పెద్దలంతా చేరి, చెప్పేరు, కాని దుర్యోధనుడు వినలేదు. నిజానికి రాజు ధృతరాష్ట్రుడే, కానీ పరిపాలనంతా దుర్యోధనుడే చేశాడు.( ఇప్పటి సంగతి గుర్తుకొస్తే నాకు సంబంధం లేదు 🙂 ( ప్రభుత్వంలో ఒకరుంటే అధికారం మరొక దగ్గరుంటుంది చూడండి.తొమ్మిది సిలిండర్లకి బదులుగా పన్నెండు ఇవ్వాలంటే కుదరదుగాక కుదరదన్నవారు, అబ్బాయిగారు కోపపడితే ఎలా ఇవ్వగలుగుతున్నారు? అధికారం ఎవరి దగ్గరున్నట్టు? ) పాపం గుడ్డి తండ్రి కూడా గట్టిగా కొడుకుని మందలించలేకపోయాడు. తను తెగించి తమ్ముని కొడుకులకు సగపాలివ్వలేకపోయాడు, ఎంతసేపు దుర్యోధనుడు వద్దంటున్నాడన్నాడు, చెప్పిన మాట వినటంలేదన్నాడే కాని, ‘నేను ఇవ్వమంటున్నా’నన్న మాట ఎక్కడా పలకలేదు. చివరికి రాయబారంలో పరమాత్మ మంచి చెడ్డలన్నీ చెప్పి కలసి బతకడం మేలని చెప్పినా దుర్యోధనుడు ’వాడిసూది మొన మోపినంత చోటుకూడా పాండవులకు ఇవ్వనని’ ఖరాఖండీ గా తేల్చి చెప్పేసేడు. చివరి నిర్ణయం జరిగింది. యద్ధము తప్పదనే పరిస్థితి వచ్చేసింది. యుద్ధానికి బయలుదేరుతూ దుర్యోధనుడు తల్లికి నమస్కారం చేస్తాడు, విజయం కోరుతూ. అప్పుడు గాంధారి పుత్రుని విజయోస్తు అని దీవించలేదు ’యతోధర్మస్తతో జయః’ అని మాత్రమే దీవించింది, అంటే ధర్మం ఎటుంటే విజయం అటే ఉంటుందని అంది. ఇది ఆమె స్వయంగా పరమాత్మకే చెప్పిన మాట, దుర్యోధనుని శవాన్ని యుద్ధరంగంలో చూసి పరమాత్మతో అన్నమాట.
ఈతడు రణంబునకునెత్తి చనుచుండియును నెంతయు భక్తిగని నాకుం
బ్రీతియెసగం బలికి ప్రేమ మెలయం బొగిడి పెద్దయు వినీతినిరతుండై
చేతులు మొగిడ్చి జయసిద్ధియుగ దీవన విశిష్ట దయ నిమ్మనిన ధర్మం
బేతల ననూనమగు నిద్ధ జయమాతలకు నెట్లయిన సిద్ధమగునంటిన్…స్త్రీ పర్వం..ఆశ్వా..2..29
ఇట్లేలయంటేని
జూదమునప్పుడు సర్వజనంబులు చూచి భయంపడి యిప్పని యి
మ్మెదిని సేనలకు గురుకోటికి మృత్యువు గాని నిజం బలతిం
బోదని యాడరె యిమ్మెయి నాదగు బుద్ధికి దోచిన సత్యము దా
మోదర పాటిలదే కొడుకంచు బ్రియోక్తులు వల్కిన బెంపు సెడున్…31
కొడుకు శవాన్ని చూపిస్తూ గాంధారి కృష్ణునితో ” వీడు యుద్ధానికి బయలు దేరుతూ నా దగ్గరకు వచ్చి చేతులెత్తి నమస్కరిస్తూ ’తల్లీ! ’విజయోస్తు’ అని దీవించమని అడిగాడు. అందుకు నేను ధర్మం ఎటుపక్క ఉంటే అటే జయం ఉంటుందన్నా. అలా ఎందుకన్నానంటే,జూదం జరిగినపుడు జనులందరూ చూసి భయపడి ఈ పని వల్ల సేనకు, గురువులకు మృత్యువే,అనుకున్నారు. నిజం తేలికగా కొట్టి పారెయ్యలేమని నాబుద్ధికి తోచినది, కొడుకు కదా అని ప్రియంగా మాటాడితే విలువపోతుంది కదా!” ఆ రోజు గాంధారి నిజానికి నిలబడింది, పుత్ర ప్రేమ చాటలేదు, యుద్ధమూ వద్దన లేదు, నిర్ణయం జరిగిపోయింది కనక. ‘ధర్మం నీ పక్షాన ఉంటే జయం నీదే’ అన్నది. కొడుకు మరణిస్తాడని తెలిసినా, ఆ తల్లి ధర్మం కోసం నిలబడింది. కొడుకుని ‘విజయోస్తు’ అని దీవించలేదు. నేటి కాలానికి తల్లులే, పుత్ర ప్రేమతో చేయకూడని పనులు చేస్తున్నారు. భయము, పక్షపాతము లేని విధంగా కొడుకుల్ని తయారు చేయలేక, స్వార్ధంతో ‘గెలిస్తే మా వాడు ప్రధాని, ఓడితే పాపం మీదే’ అనే తల్లిది వీరత్వమా? ధర్మమా? ఆ తల్లి ‘మావాడే ప్రధాని అభ్యర్ధి’ అని నిజంగా ఎందుకు ప్రకటించలేకపోయింది, పార్టీ వారు అడుగుతున్నాకూడా, కారణం ధర్మం తనపట్ల లేదని, అధర్మం గెలవలేదని తెలిసికదా! దీన్ని మరుగు పరచుకోడానికి కావలసినన్ని తడిమిట్లు, పాపం 🙂
భారతంలో సంఘటనలు నేటికి నిత్య నూతనమే కదా!నేటికాలానికీ వర్తిస్తాయి.
ఆదివారం ఏదో ప్రోగ్రాం చూద్దామని చానల్స్ తిప్పుతుంటే మా …టీవీలో మహాభారతం వస్తోందండి. అక్కడ సరిగ్గా గాంధారి వివాహం గురించిన ఎపిసోడే వస్తోంది.
మా .. టీవీలో మహాభారతం నేను చూడటం లేదు. అనుకోకుండా చూడటం అదీ వ్యాఖ్యలో వ్రాసిన గాంధారి గురించిన విషయాలను చూడగలగటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.
అంతా దైవం దయ.
@అనురాధ గారు,
యాదృఛ్ఛికంగా కొన్ని జరిగుతాయి. కారణాలు చెప్పలేం! కనక దైవానిదే ఇఛ్ఛ అనుకుందాం!!
ధన్యవాదాలు.
భలే పోల్చారండి!
@మిత్రులు బోనగిరి గారు,
భారతం లో ఉన్నది ప్రతీది మన ప్రపంచం లో ఉంది, ప్రస్తుతం లో కూడా, వాటిని మనం ఇప్పటికి సమన్వయం చేసుకోడం లోనే ఉంది.
ధన్యవాదాలు.
బాగా వ్రాసారండి.
ఆశ్చర్యమేమిటంటే, గాంధారి గురించి నేను టపా వ్రాయాలనుకున్నాను. ఇంతలో మీరు వ్రాశారు. నేను టపాలో వ్రాయాలనుకున్న కొన్ని విషయాలను ఇక్కడ రాస్తున్నానండి.
……….
గాంధారి యొక్క భర్త అంధులు కాబట్టి తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుందని అంటారు.
సహజంగా అంధులు అయితే చేయగలిగిందేమీ లేదు. తనకు తానుగా అంధత్వాన్ని తెచ్చుకోవటం అనేది పాతివ్రత్యం అని ఆమె అభిప్రాయం కావచ్చు కానీ, అందువల్ల మంచి కన్నా చెడే జరిగిందని కూడా కొన్ని అభిప్రాయాలున్నాయి.
ఉదా… నేను ఒక పత్రికలో చదివిన దాని ప్రకారం గాంధారి కళ్ళకు గంతలు కట్టుకోకుండా ఉండి ఉంటే భర్తకు మరింత సేవ చేసే అవకాశం ఉండేదని , ఇంకా పిల్లల పెంపకం గురించి కూడా మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు చదివినట్లు గుర్తు.
గాంధారి సంతానం అధర్మపరులైనారు. పిల్లలు తప్పులు చేస్తే తల్లితండ్రుల బాధ్యత కూడా ఉంటుందని అంటారు. ఈ కోణం నుంచి చూస్తే గాంధారిలా పిల్లలను పెంచకూడదు అని కూడా చెప్పుకోవచ్చు.
( అయితే , మంచివారైన తల్లితండ్రులకు కూడా తప్పులు చేసే పిల్లలు ఉండటం కొన్నిసార్లు జరుగుతుంటుంది. అది ఆ తల్లితండ్రుల ప్రారభ్దం అనుకోవచ్చేమో ? )
ఇంకా గాంధారికి ధృతరాష్ట్రుని చేసుకోవటం ఇష్టం లేదని అందుకు నిరసనగా తానూ కళ్ళకు గంతలు కట్టుకుందనే వాదనను కూడా చదివినట్లు గుర్తు. గాంధారి యొక్క వివాహం ఆమెకు ఇష్టమయ్యే జరిగిందా లేక ఇష్టం లేకుండా జరిగిందా అనే విషయం గురించి భారతంలో ఏమి ఉందో నాకు తెలియదండి.
గాంధారి సోదరుడైన శకుని మాత్రం కౌరవ వంశనాశనం కోసం ….. దుర్యోధనుని పాండవులకు వ్యతిరేకంగా ప్రేరేపించారనే వాదనలు కూడా ఉన్నాయి.
ఏది ఏమైనా గాంధారికి కుమారుడైన దుర్యోధనుడంటే ఆప్యాయత ఉండటం సహజం. చెడ్డవాడైనా సరే కొడుకు అంటే తల్లికి ఆప్యాయత ఉంటుంది అంటారు .
అయితే, యుద్ధంలో విజయాన్ని సాధించమని కొడుకును దీవించకపోవటం గాంధారి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ కోణం నుంచి చూస్తే మీరన్నట్లు …..గాంధారిలాటి తల్లులు కావాలి.
@అనురాధ గారు,
గాంధారు కళ్ళకు గంతలు కట్టుకోకపోతే పిల్లల్ని బాగా పెంచేదేమో అన్నదానికి చెప్పలేను.
ఇక గాంధారి నాటి పాతివ్రత్యాన్ననుసరించి కళ్ళకు గంతలు స్వయంగానే కట్టుకుంది.
ఆమెకీ పెళ్ళి ఇష్టం లేదు, శకుని పగ తీర్చుకోడానికే ప్రయత్నం చేసేడు ఇవన్నీ పుక్కిటి పురాణాలు, కొన్ని సినిమా వారి కల్పనలు తప్ప నిజాలు కావు.
కొడుకుపై ఆప్యాయత సహజమే కాని ధర్మం దగ్గరకొచ్చేటప్పటికి ఆమె ఆచరించి చూపింది అదీ ఆమె గొప్పతనం. నిజానికి ఆమె గురించి ఒక టపాయే రాయాలి.
నా ఉద్దేశం సత్యానికి ధర్మానికి కట్టుబడే తల్లులు కావలనే!
ధన్యవాదాలు.