శర్మ కాలక్షేపంకబుర్లు-అజాగళస్తన న్యాయం.

Las Vegas 401-TWINKLE

Photo courtesy:- From a Grand daughter.  A street in Las Vegas. plz wait 4 a mom n see the beauty of the pic.

అజాగళస్తన న్యాయం.

అజము అంటే మేకపోతు, గళం అంటే గొంతు, స్తనo అంటే పాలిల్లు. మేకపోతుకి కుతిక దగ్గర రెండు పాలిండ్ల లాటివి వేలాడుతూ కనిపిస్తాయి. ఇవి నిరుపయోగమైనవి. మరి సృష్ఠి లో మేకపోతుకి ఇవి ఎలామిగిలిపోయాయో తెలీదు. ఐతే దీనిని ‘మేకమెడ చన్ను’ అన్నారు తెనుగులో. పాలిల్లు ఐతే బిడ్డకి పాలొస్తాయి, మరి ఇవి పాలిండ్లూ కాదు, వాటివల్ల మేకపోతుకు ఉపయోగమూ లేదు,ఏవిధంగానూ. ఇలా ఎందుకూ కొరగాని వ్యర్ధ జీవులను అజాగళస్తనాలంటారు. వీరు ఎందుకూ పనికిరారు, విగ్రహపుష్టి నైవేద్య నష్టి మనుషులు ఉంటారు, ఉపయోగమే ఉండదు. కావలసినవాడు పెద్ద పదవిలో ఉన్నాడని సవ్యమైన పనికోసమే వెళితే అబ్బే! నేను చాలా నిక్కచ్చి, ఇలా రికమండేషన్లు చెయ్యనని చెప్పి, లంచాలు పుచ్చుకుని వారికి పని చేసేవాళ్ళని, ఉపకార శూన్యులు, మాట సాయం కూడా చెయ్యలేరు, ఇలాటి వారిని  అజాగళస్తనాలని అంటారు.

అతి పరిచయ న్యాయం.

‘అతిపరిచయాదవజ్ఞతా’ అన్నారు. అంటే పరిచయం పెరిగినకొద్దీ ఎదుటివారిలో లోపాలు కనపడటమే. ‘దూరపు కొండలు నునుప’న్నట్టు.  దూరంనుంచి చూస్తే కొండ పచ్చని తివాచీలా కనపడుతుంది, కాని దగ్గర కెళితే, అంతా రాళ్ళు రప్పలు, ముళ్ళు, డొంకలే. జీవితంలో ఈ లోపం బాగానే అనుభవంలో కొస్తుంది. భార్యాభర్తలు, జీవిత కాలం కలసి బతకవలసినవారిలో ఇది కనక మొదలయితే ఆ ఇల్లు నిప్పుల గుండమే. ఈ అతి పరిచయాన్ని కూడా సాన్నిహిత్యంగా మార్చుకుని ఒకరిని ఒకరు వదలలేని, మానసికంగా, స్థితికి చేరుకుంటే బ్రహ్మానందం! స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, లేకపోతే అది నిత్య నరకం. ఇక బంధువులలో, మనం కనక పచ్చగా ఉంటే (సొమ్ములు గట్రా ఉండి కొద్దిగా పొజిషన్ లో ఉంటే ) అంతా మా వాడే, నాకు వేలువిడిన మేనమామకి తోడల్లుడి కొడుకు కదూ! అని ఊకదండు చేస్తారు. ఇక మిత్రులైతే, చెప్పడం కొద్దిగా కష్టం కాని మనమంటే అభిమానించినవారు, మనతో పరిచయం పెంచుకుని గుండెలో జేరిపోతారు, మరి మనమూ మనుషులమేగా, మనం కనక స్పందిస్తే, ‘ఏంటీ! ఈయన జిడ్డులా పట్టుకున్నాడని’ మొహం చాటేస్తారు.  జీవితంలో అనుభవాలు, చేదు అనుభవాలెన్నెన్నో!

గొప్పవారు ఒకరు, మనకు తెలిసినవారు, ఎప్పుడో ఒక సారి పలకరిస్తే, మన ఇంటికొస్తే గొప్పగా ఉంటుంది, ఫలానావారు, గొప్పవారు మా ఇంటికొచ్చారని గొప్పగా చెప్పుకోనూ వచ్చు. ఐతే వీరు మన ఇంటి పక్కనే ఉండి మనకు రోజూ కనిపిస్తూ ఉంటే చులకనే. అలాగే ఈ గొప్పవారు కూడా రోజూ కనపడితే, మాటాడితే చులకనైపోతారు, వారిలో గొప్ప గుణాలు మనకు మరుగునపడి, వారిలోని చెడ్డ గుణాలే కనపడతాయి. అందుకే అతి పరిచయాదవజ్ఞతా అన్నారు. అంటే ఎక్కువ పరిచయం ఉంటే అది కాస్తా లోపంగా కనపడుతుంది.

చుట్టం వస్తే మొదటినాడు మొహరీ చుట్టం, అన్నీ అగ్గగ్గలాడుతూ చేస్తారు, రెండవరోజు రాజా చుట్టం, చేతికందిస్తారు, మూడవరోజు మురికి చుట్టం ‘అక్కడే పెట్టేనండి! కనబడలేదూ!’ ఇదీ వరస.  కనక “అతి పరిచయాదవజ్ఞతా” ఇది అనుభంలో కి రావడం కోసమే మహా కవి భారవిని, తండ్రి ఆరునెలలు అత్తింట ఉండి రమ్మన్నది,తనను చంపబోయినందుకు.. 

కాకతాళీయ న్యాయం.

కాకం అంటే కాకి, తాళం అంటే తాడి చెట్టు. కాకి ఒకటి తాడి చెట్టుమీద వాలింది. అప్పటికే రాలడానికి సిద్ధంగా ఉన్న తాటిపండు ఒకటి నేల రాలింది. ఈ కాకి నేను వాలడం మూలంగానే తాటిపండు రాలిందనటం. ఇది తమకు కాని గొప్ప చెప్పుకోడం అనమాట. ఉదాహరణకి పారిశ్రామిక ఉత్పత్తి పెరిగిందనుకుందాం, దానికి మా అభివృద్ధి పధకాలు, మేము చేసిన కృషి కారణమని ప్రభుత్వంలో ఉన్న పార్టీ ప్రచారం చేసుకోడం భుజాలెగరెయ్యడమన మాట. ఇందులో వారు చేసినది శూన్యమనమాట.ఉద్యోగం వచ్చిందని ఊళ్ళో పెద్దవాడు కదా అని చెప్పడానికెళితే, నేనే చెప్పేను, వాళ్ళకి నీగురించన్నట్టు, అప్పటిదాకా మన మొహం ఎప్పుడూ చూడని వ్యక్తి.

గజస్నాన న్యాయం.

గజము అంటే ఏనుగు స్నానం తెలిసినదేకదా! నేను చాలా సార్లే చెప్పేను దీని గురించి 🙂 ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తుంది, నదిలో, గట్టుపైకి వచ్చి తడి ఒంటి మీద దుమ్ము జల్లుకుంటుంది. శుభ్రంగా స్నానం చేసి దుమ్ము జల్లుకోడం ఏంటీ! బాగున్న దానిని చేతులారా పాడు చేసుకోడాన్ని గజ స్నానన్యాయం అంటారు. మనం చెట్టుచేమలని నరికేసి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని ఏడవటం ఇలాటిదే.
నిజానికి ఏనుగు అలా చేసుకోడం మూలంగా ఒంటి ఉష్ణోగ్రతను సమతుల్యం లో ఉంచుకోవడం, బాధించే ఈగలనుంచి రక్షణ పొందుతుందనుకుంటున్నా!

స్తనశల్య పరీక్షా న్యాయం.

స్తనము అంటే పాలిల్లు, శల్యము అంటే ఎముక. స్తనంలో ఎముక ఉన్నదా? లేదన్నది జగమెరిగిన సత్యమే, కాని దీని పనిగట్టుకుని పరిశోధించాలనుకునే జనాభా ఉంటారు. దీనినే తెనుగులో ’కోడి గుడ్డుకి ఈకలు పీకడం’ అని కూడా అంటారు. దీనినే సంస్కృతంలో ’కాకదంత పరిక్షాన్యాయ’మని కూడా అంటారు. కాకి పళ్ళు ఉన్నాయా? లేవా? ఇది వ్యర్ధ పరీక్ష, ఎదురుగా కనపడే సత్యాన్ని కాదని మరొకరిని బాధించడమే, దీని పరమావధిగా కనపడుతుంది. ఇటువంటి ఒక ఆర్డర్ ఉండేది, పెన్షనర్ల గురించి. సంవత్సరానికి ఒక సారి బతికే ఉన్నాను బాబోయ్! అని ఒక గజిటెడ్ ఆఫీసర్ దగ్గర సర్టిఫికట్ తీసుకుని సమర్పించవలసివచ్చేది. ఇప్పుడు ఇది తీసేసి, నేను బతికే ఉన్నానని ఒక సర్టిఫికట్ స్వయంగా ఇచ్చుకుని పెన్షన్ పుచ్చుకుంటున్నాం. ఇదనమాట.

ఈ న్యాయాలన్నీ జీవిత సత్యాలు.మరిన్ని న్యాయాలు మరోసారి లేకపోతే అతిపరిచయాదవజ్ఞతా అయిపోయి…….. 🙂

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అజాగళస్తన న్యాయం.

 1. చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.

  మరిన్ని విశేషాలను తెలియజేయాలని అందరమూ ఆశిస్తున్నామండి.

 2. తాతగారు నమస్కారం,

  నా పేరు శిరీష. నేను మీ బ్లాగు ని చాలా రోజులుగ చదువుతున్నాను. మీరు రాసే విషయాల గురుంచి ఇంట్లొ కూడ చెప్తూవుంటాను. నేను మీ బ్లాగు లో ఒకసారి పిల్లలకు ద్రిష్ఠి తియ్యటనికి ఒక మంత్రం వుంది అని చదివాను. దాని కోసం ఇప్పుడు మీ బ్లాగు అంతా వెతికాను కాని దొరకలేదు. మీరు కొద్దిగ శ్రమ తీసుకుని ఆ మంత్రం ఏంటో చెప్పగలరు అని ఆశిస్తున్నాను.

  • (తనలో) ఈ అమ్మాయి తాతగారు అంటోంది, మన అలవాటు ప్రకారం అమ్మాయ్ అని సంబోధించచ్చా! అమ్మో! వద్దుగాక వద్దు, అనుభవాలు చాలవా? అందుకుగాను. (ప్రకాశముగా)

   @ శిరీష గారు,
   స్వాగతం, నా బ్లాగు చదువుతున్నన్నందుకు ఆనందపడిపోయాను.
   మీరడిగినది బ్లాగులోనే ఉందండి, మరి మీ దృష్టిలో ఎందుకుపడలేదో తెలియదు. ఈ లింక్ లో చూడండి
   https://kastephale.wordpress.com/2013/08/14/
   ( ఏంటి, ఇవాళంతా కొత్తవాళ్ళు పరీక్ష పెడుతున్నట్టుంది) ప్రకాశముగా:- శ్రద్ధగా మంత్రం వేయండి.

   ధన్యవాదాలు.

   • తాతగారు, తప్పకుండ అమ్మాయీ అని సంభోదించవచ్చు. నేను మీకన్న చాలా చిన్నదాన్ని కాబట్టి “మీరు” అని కుడా అనకండి. మీరు లింకు పంపినందుకు ధన్యవాదములు.
    ఇక పయిన తరుచుగ కలుస్తుంటాను.
    ఆశీర్వదించండి.

 3. గురువు గారు, పనిలో పని – బక బంధక న్యాయం, భ్రమర కీటక న్యాయం మొదలైన వాటి గురించి కూడా రాస్తే, చక్కగా ఒక ఫైలులొ పెట్టుకుంటాం కదా….

  • @నిమ్మగడ్డ చంద్రశేఖర్ గారికి,
   స్వాగతం, నా బ్లాగు, మీరు మొదటి సారి చూసినట్టనిపించింది 🙂 కొద్దిగా వెనక్కి వెళితే
   శర్మ కాలక్షేపంకబుర్లు-ఘోటక బ్రహ్మచారి. 23.01.2014
   శర్మ కాలక్షేపంకబుర్లు- మార్జాల కిశోర న్యాయం 17.01.2014
   చెప్పిన చోట మరికొన్ని ఉన్నాయి, చూడండి. అన్నప్రాశన రోజే ఆవకాయి పెట్టరు కదండీ! మరికొన్ని మరోసారి తప్పక,సరేనా! ఊ అనండి, మరి.
   ధన్యవాదాలు.

   • ఈ వారాంతంలో మీ బ్లాగు లోకి దూరి కష్టపడి ఫలితం సాధిస్తాను.

 4. అబ్బో ఎన్నెన్ని న్యాయాలో?
  సామాజిక నగ్న సత్యాలు,
  చాలా బాగుంది.ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s