శర్మ కాలక్షేపంకబుర్లు- చూసుకు దూకండి (Look before you leap)

philomina minj Courtesy Philomina minj.         Pl wait n see waterfall in action

”చిరకారి” కధ అనేది (భారతంలో శాంతి పర్వంలో అశ్వా.5 లో 264 నుండి289 వరకు)భీష్ముడు ధర్మ రాజుకు చెప్పినది. స్వేఛ్ఛానువాదం, అవధరించండి.

మేధాతిధి అనే మునియొక్క కుమారుడు చిరకారి. చిరకారి అనగా ముందువెనుకలు ఆలోచించికాని ఏపనీ చేయనివాడని అర్ధం.ఈ కుర్రవాడు చిన్నప్పటినుంచి ఈ అలవాటు వున్నవాడు కనక అందరూ అతనిని చిరకారి అని పిలిచేవారు.

 చిరకారి తండ్రి, భార్య మీద కోపించి, అమెను చంపెయ్యమని చిరకారికి చెప్పి, బయటికి వెళ్ళిపోయాడు. ఏ పని అయినా కంగారుపడి చేసే తత్వం లేనివాడు కనక, చిరకారి తండ్రి మాటమీద ఆలోచనలో పడ్డాడు. తండ్రి ఆజ్ఞతో తల్లిని చంపకపోతే, తండ్రిని ధిక్కరించినట్లవుతుంది, దానికి నరకం తప్పదు. తల్లిని చంపడం మహా పాపం, నరకమే గతి. ఎలా చూసినా నరకమే గతిలా వుంది. తల్లి క్షేత్రం, తండ్రి బీజం, ఇరువురూ కావలసినవారే, వారిరువురిలో ఎవరు లేకపోయినా నేను లేను, ఎవరిని వదులుకోవాలనే సంశయంలో పడిపోయి ఆలోచనలో పడ్డాడు. తండ్రి వైపునుంచి ఆలోచిస్తే, నా జన్మ కారకుడు, తపస్సు, విద్య, బుద్ధులకు గురువు,దైవ సమానుడు. తండ్రి మాట జవదాట తగనిది.తండ్రి మాట పాలించని వాడు అధోగతి పాలవుతాడు. ఇక తల్లి వైపు ఆలోచిస్తే, ఈ శరీరం తో ఉండటానికి తల్లి కారణభూతురాలు. నేను భూమి మీద పడే దాకా తను కష్టాన్ని అనుభవించి కని పెంచింది. సర్వ జంతువులకు, సర్వ ప్రాణులకు తల్లి శరీర కారకురాలు పోషకురాలు, పూజనీయ. నేను అసమర్ధుడనయిన సమయంలో కూడా, తల్లి సాయమే నా ఉనికికి కారణం, అటువంటి తల్లిని చంపడమా? తల్లిని చంపడానికి చేతులాడవు. ఇలా ఆలోచిస్తూ తండ్రి మాట అమలు చేయక ఉండిపోయాడు చిరకారి,ఏమిచేయడానికి తోచక.

Virupaksha_Temple_in_Hampi భార్యను చంపమని చెప్పి బయటికి పోయిన మేధాతిధి కొంత కాలానికి , తను చేయమన్న పని ఎంతటి ఘొరమైనదో తలుచుకుని, ఊహించుకుని కళ్ళనీళ్ళు తిరుగుతుండగా , ‘అయ్యో! చంపని చెప్పివచ్చేసేను, చిరకారి ఆలోచించి కాని ఏపనీ చేయడు, ఏమో తొందరపడి చంపేడేమో’ అని భయపడుతూ తొందరగా ఆశ్రమం చేరతాడు. వచ్చేటప్పటికి చిరకారి చేతిలో వధకు తగిన ఆయుధం పట్టుకుని ఉంటాడు. ఆ అయుధాన్ని విడిచి తండ్రి కాళ్ళు పట్టుకుంటాడు. మేధాతిధి కొడుకునూ, కొడుకు చంపక వదలిన భార్యను గుచ్చి కౌగలించి, కొడుకుతో ‘నా తపస్సుకు, నాకు నిందరాకుండా, నీవు ఆలోచనతో తల్లిని వధించక జాప్యం చేసినందుకు, నీకు చిరకారి అనేపేరు స్థిరంగా ఉండాల’ని అభిలషిస్తాడు. చివరగా మిత్రత్వము శత్రుత్వము,బాత్రతయు నపాత్రతయును బరికించు సుచారిత్రుడు చిరతరగణనా సూత్రితముగ దాన నెల్ల శుభములనొందున్… శాంతి.ప…అశ్వా..5…289

కధ చాలా చిన్నదే కాని ఆలోచించవలసిన సంగతి చాలానే ఉంది.కధని బట్టి మనం తెలుసుకోవలసినది, ’చేసే పని ఫలితం కూడతీసుకోగలదా? లేనిదా అని” ఆలోచించి మరీ చెయ్యాలి. ఫలితం కూడ తీసుకోలేనిదయితే నిదానించాలి. ఫలితం కూడ తీసుకోగలదయితే వెంటనే చేసినా బాధ ఉండదు. ఇక్కడ కొడుకు తల్లిని చంపి ఉంటే మరల బతికించలేరు కదా!   అందుకే జీవిత నిర్ణయాలు తీసుకునేటపుడు విషయం మనది కానట్లుగా నిష్పక్షపాతంగా ఆలోచించించి నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరగవు, తరవాత బాధ పడక్కరలేదు.మన జీవితాలను శాసిస్తున్న పాలకులను ఎన్నుకునేటపుడు కూడా ఇది అవసరమేమో ఆలోచించండి.

మరొక చిన్న కధ, ఒక కుటుంబంవారు ఒక ముంగిసను పెంచుకుంటున్నారు. అది ఎంత మాలిమి అంటే యజమాని, యజమానురాలి బుజాలపై ఎక్కి ఆడుకునేది, ముంగిసనే బిడ్డగా భావించేవారు. ఈ దంపతులకు ఒక బిడ్డ పుట్టేడు. ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. ఒక రోజు యజమానురాలు బిడ్డ నిద్రపోతుంటే ఉయ్యలలో వేసి మంచి నీరు తెచ్చుకోడానికి బిందె పుచ్చుకుని బయటకు పోయింది. తిరిగి వచ్చేటప్పటికి వీధిలో ముంగిస మూతిని ఒంటిని రక్తంతో కనపడింది. బిడ్డను ఉయ్యలలో ఉండగానే ముంగిస కొరికి చంపి ఉంటుందనుకుని యజమానురాలు నీళ్ళ బిందెను ముంగిసపై పడవేసింది. నీటి బిందె మీద పడటం తో ముంగిస మరణించింది. భయపడుతూ లోపలికి వెళ్ళిన యజమానురాలికి కనపడిన దృశ్యం చూసి అవాక్కయిపోయింది. బిడ్డ క్షేమంగా ఉయ్యలలో నిద్రపోతున్నాడు, ఆ కింద ఒక త్రాచు ముక్కముక్కలుగా కొరికి చంపబడింది. ముంగిస త్రాచును చంపి బిడ్డను రక్షించింది, కాని యజమానురాలు పొరపాటుగా ముంగి తన బిడ్డను చంపిందను కుని ముంగి ప్రాణం తీసింది, తరువాత విచారించింది, కాని లాభం లేకపోయింది కదా! తన బిడ్డ ప్రాణాదాత ప్రాణాలు తిరిగి రావు కదా! చనిపోయిన ముంగిని యజమానురాలు బతికించగలదా? చంపేయగలిగింది కాని. ప్రాణం పోయడం మనవల్ల కాదు, ప్రాణం తీయడం కష్టం కాదు.

బోర్ కొట్టేనా?

images

తాజా కలం , ఒక చిన్న ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును తిరస్కరిస్తున్నామని తీర్మానించి ఎవరిని మోసం చేస్తున్నారు? అసలు, బిల్లును మొత్తంగా తిరస్కరిస్తే, బిల్లు పై చర్చ ఎందుకు చేశారు?దానికి సవరణలెందుకిచ్చారు? అంటే సవరణలు చేస్తే బిల్లును ఒప్పుకుంటారనేగా అర్ధం. ఏమంటారు?

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- చూసుకు దూకండి (Look before you leap)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s