శర్మ కాలక్షేపంకబుర్లు-కుశల ప్రశ్నలు.

కుశల ప్రశ్నలు.

ఎవరితో మొదలెట్టాలీ, అనుకుంటే ఆంగ్లేయులతో, అనిపించింది, వారు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్,గుడ్ నైట్ చెబుతారు. ఈ మధ్య దీనికి గుడ్ నూన్ కూడా కలిపేరు, మనవారే లెండి. ముసల్మాను లయితే ‘ఖుదా హాఫిస్, సలామాలేకుం’ అంటారు. అంటే భగవంతుడు గొప్పవాడు, నమస్కారం స్వీకరించండి, అనుకుంటా. మా ఫాతిమాజీ చెప్పాలి, పొరపాటయితే. ఎంత గొప్ప భావన. భగవంతుడు గొప్పవాడు కనకనే మన ఇద్దరిని కుశలంగా ఉంచాడు, ఇద్దరిని కలిపేడని అనుకుంటా. సిఖ్ఖులు ‘సస్త్రియకా ‘అని సంబోధించుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాలవారికి కుశల ప్రశ్నలకి పెద్ద తేడా లేదు కాని గుజరాతీ వారిది మాత్రం ప్రత్యేకం. వారు ఇద్దరు కలవగానే, ఒకటే మాట ఇద్దరూ ఒకేసారి అంటారు, ‘జైరాంజీ’కి, అని. ఫోన్ సంభాషణ కూడా, మనవారంతా హలో అని మొదలెడితే వీరు జైరాంజీకి తో మొదలెట్టి అదే మాటతో సంభాషణ ముగిస్తారు. టెలిఫోన్ ఆపరేటర్ గా పని చేసిన కాలం లో నేను గమనించినది.

మన తెనుగునాట బావున్నావా?/బావున్నారా? ఇది సాధారణ కుశల ప్రశ్న. బావా మరదుల మధ్య ఈ సంభాషణ మరికొంత రాణిస్తుంది. భారతం లో ఒక ఘట్టం లో పరమాత్మ సాయం కోరి దుర్యోధనుడు, అర్జునుడు వస్తారు,రాబోయే యుద్ధం లో సాయం చేయమని అడగడానికి. పరమాత్మ నిద్రలో ఉన్నారు, దుర్యోధనుడు స్వామి తలవైపున కల సింహాసనం మీద కూచున్నాడు, అర్జునుడు కాళ్ళ దగ్గర నిలబడ్డాడు. స్వామి కనులు తెరచి చూచినవెంటనే అర్జునుని చూశారు, అడిగిన మొదటి మాట “ఎక్కడనుండి రాక” అన్నాడన్నారు తిరుపతి వేంకట కవులు, ఉద్యోగ విజయాలలో. కుశల ప్రశ్న తరవాత దుర్యోధనుని చూసి “బావా ఎప్పుడు వచ్చితీవు” అని పలకరించేడన్నారు. నాకు చాలా కాలం దుర్యోధనుని, కృష్ణుడు, ‘బావా’ అని సంబోధించడం గురించే.

https://kastephale.wordpress.com/2012/11/22/

మొన్ననీ మధ్యనే దానికి సమాధానం దొరికింది. దుర్యోధనుని కూతురు కృష్ణునికి కోడలు. మరి అలా బావ అయ్యాడు కదా. తెనుగునాట వియ్యంకుడిని బావా అని పిలవడం అలవాటే. ఇదంతా భారతం లో లేదు కాని భాగవతం లో ఉంది,పై లింక్ లో చదవండి.

ఎక్కడనుమండి రాకయిటకుఎల్లరునున్ సుఖులే కదా! యశో

భాక్కులునీదు అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములున్
చక్కగనున్నవారే? భుజశాలి వ్రుకోదరుదుఁడగ్రజాజ్ఞకున్
చక్కగ నిల్చి శాంతుగతి చరించునె తెల్పునమర్జునా!

ఎక్కడినుంచి వస్తున్నావయ్యా! అన్నాడు. పాపం పాండవులు అడవులు పట్టి తిరుగుతున్నారు కదా! అందుకు ఎక్కడినుండి రాక అన్నాడు,  ఆ తరవాత  అంతాబావున్నారా? అని నీ అన్నలు, తమ్ముళ్ళెలా ఉన్నారు? అన్నట్టు మీ చిన్నన్నయ్య  పెద్దన్నయ్య మాట వింటునాట్టయ్యా? ఇలా మనం మామూలుగా నేడు మాటాడు కున్నట్టుగానే అడిగేసేడని అన్నారు తిరుపతి వేంకట కవులు, చూడండి ఎంత హృద్యంగా, ఆత్మీయంగా ఉంది పలకరింపు, అదీ కావలసిన వారిని. 

బావా ఎప్పుదు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్భ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
నీ వంశోన్నతికోరుభీష్ముడును,నీమేల్కోరుద్రోణాదిభూ
దేవుల్ సేమంబై మెసంగుదురేనీతేజమంబుహెచ్చిమంచున్

ఆ తర్వాత చూసిన దుర్యోధనుని ఎలా పలకరించేరో చూడండి.బావా! ఎప్పుడొచ్చావయ్యా! నీ తమ్ముళ్ళూ, కొడుకులూ, చూట్టాలూ బావున్నారా? నీ స్నేహితుడు కర్ణుడు బావున్నాడా? నీ మన్నీలు అనగా సామంతరాజులు,బావున్నారా? నీ వంశోన్నతి కోరే భీష్ముడు,నీ మేలు కోరే గురువులు క్షేమంగా ఉన్నారా? అని అడిగేరు. ఇందులో ఉన్న సంగతి చూడండి, కుశల  విచారణ అంతా దుర్యోధనుని చుట్టే తిరుగుతుంది,అది కూడా దుర్యోధనుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారిగురించే అడిగాడన్నారు. అక్కడ చూడండి, మీ నాన్న అమ్మ ఎలావున్నారయ్యా అనాడా? లేదు కదా! అర్జునిని పలకరింపులా కాక. 

తిరుపతి వేంకటకవులు పలకరింపులో ఎంత తెనుగు తనం చూపించారో చూడండి, నాటి రోజుల్లో, పై పద్యాలు రాని తెనుగు బిడ్డ లేడంటే అబద్ధం కాదు. మరి నేడు ఎంతమందికి ఇవి వచ్చునో తెలీదు. పాండవ ఉద్యోగ విజయాలు నాటకం ప్రతి పల్లెలోనూ వేసేవారు. అందులో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడొ కృష్ణుడు అని ముగ్గురు ఒకే పాత్రని వేసేవారు. మొదటి కృష్ణుడు కొంత నాటకం నడిచాకా తప్పుకుంటే రెండవ కృష్ణుడు ”పడక సీన్” నటించే వారు. దీనిని పడక సీన్ అనేవారు. ఇక మూడవ కృష్ణుడు ”రాయబారం సీన్” నటించే వారు. ఒక్కో సీన్ కి ఒక్కొకరు ప్రత్యేకత ఉండేది. నాటకాన్ని చూడటానికి బళ్ళు కట్టుకుని వచ్చేవారు, పక్క ఊళ్ళనుంచి.  కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఐదు సంవత్సరాలలో ముగ్గుర్ని మారుస్తూ ఉండేది. అందుకు ఒకటో కృష్ణుడా రెండో కృష్ణుడా అనేవారం.

ఏమయింది మీకివాళా? ఉండి ,ఉండి కుశలప్రశ్నల మీద పడ్డారంటారా? ఏం చెప్పను? మొన్నీ మధ్య ఒక తెలిసిన అమ్మాయికి బాగోక హాస్పిటల్ లో చేరిందిట, ఇంటికొచ్చేసింది, నేను, ఆ అమ్మాయి తన ఇంటి దగ్గర కనపడితే” ఏమ్మా! బావున్నావా?  నీ వొంట్లో బాగోలేదని తెలిసింది” అన్నా. అంతేనండి, సత్య ప్రమాణంగా చెబుతున్నా! ఆ అమ్మాయి దిగ్గున లేచి, భళ్ళున నా మొహం మీద తలుపులేసుకుని లోపలికెళిపోయింది. ఎందుకో అర్ధం కాలేదు, ”తప్పు చేశానా?” అని విచారించా? అర్ధం కాలేదు. పోనీ చేసిన తప్పేంటో చెప్పి తిట్టినా, తలుపులేసుకుని వెళిపోయినా, అందంగానే ఉండేదండి, ఇలా భళ్ళున తలుపులేసుకుని లోపలికి పోవడం కంటే! అప్పటినుంచి ఎవరినైనా సరే ”బావున్నారా?” అని పలకరించడానికి భయమేస్తోంది సుమా!

ఏమంటారు? 

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కుశల ప్రశ్నలు.

  • @వర్మాజీ,
   బావున్నారా?
   మీదయ,
   ఎంతమాట,అంతా భగవంతుని దయ,
   అదేనండి, తమలాటి పెద్దలలో దైవం లేడూ?
   ఇలా సాగిపోయే సంభాషణ కి బదులు నేడు హాయ్ లు, బాయ్ లు వచ్చేసేయి. అసలు అంత సేపు మాటాడు కోడానికి సమయం లేదేమో! ఒక ఐదు నిమిషాలు ఎదురువారితో మాటాడితే ఐదు డాలర్లు నష్టం వస్తుందేమో

   ధన్యవాదాలు.

 1. ఏమ్మా! బావున్నావా? నీ వొంట్లో బాగోలేదని తెలిసింది” ….ఆ అమ్మాయి దిగ్గున లేచి, భళ్ళున నా మొహం మీద తలుపులేసుకుని లోపలికెళిపోయింది

  పెద్దలపట్ల వినయం కలిగి వర్తించటం అనేది సంస్కారలక్షణం. పెంపకంలోపం వలన కావచ్చును, వయోరూపకులధననపదవుల వంటి స్వల్పవిషయాల వలన గర్వం‌ కలగటం కారణంగా ఏర్పడే వ్యక్తిత్వంలోపం వలనకావచ్చును, సంస్కారసువాసన లోపించిన మనుష్యులు ఇటువంటి ఆయుక్షీణం‌ పనులు చేస్తుంటారు. దానివలన పెద్దలగౌరవానికి లోపం కలుగదు. మీరు విచారించనవుసరం లేదు.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   బావున్నారా? కుశలమేనా? బహుకాల దర్శనం 🙂

   మీరన్నది నిజమే కాని దుర్యోధనుడు అలా అనుకోలేదు. ఒక సందర్భం లో వాళ్ళు నా తమ్ముని కొడుకులు, సగపాలిచ్చి, కలిసి బతుకు అని చెబుతాడు, ధృతరాష్ట్రుడు, దానికి దుర్యోధనుడు యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతలా ఇందులో ఎవరయ్యా! నీకు తమ్ములు అని దుర్యోధనుడు. పాండవులను అన్నదమ్ములుగానే భావించలేదు దుర్యోధనుడు, అందుకు అలా అన్నాననమాట 🙂 దానికంటే యీ బంధం బాగా దగ్గరది కదా వియ్యంకునిగా!

   యవ్వనం,విద్యాగర్వాలు చాలా ఇబ్బందులు తెచ్చి పెడతాయి కదండీ, అందులో భాగమే, పోనిద్దురూ! 🙂
   ధన్యవాదాలు.

 2. కూతురు కృష్ణునికి కోడలు. మరి అలా బావ అయ్యాడు కదా. తెనుగునాట వియ్యంకుడిని బావా అని పిలవడం అలవాటే.
  శర్మగారూ అంతదూరం పోనక్కరలేదు. పాండవుల తల్లి కుంతీదేవిగారు శ్రీకృష్ణుడికి మేనత్త, అందుచేత బావ వరస వచ్చింది కదా. దుర్యోధనాదులు పాండవులకు పెత్తండ్రి బిడ్దలై సోదరులు కావటం చేత, దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణస్వామికి బావ వరసే కద!

 3. శర్మగారూ,

  “బావున్నారా?” అన్న పలకరింపులో ఉన్న ఆప్యాయత దేనిలోనూ కనపడదు. దురదృష్టవశాత్తు ఈ మధ్య అది వినిపించడం లేదు. చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ “హాయ్” అనేవాళ్ళే! అలాగే వెళ్ళేడప్పుడు ఎంత ఆప్యాయమైన వీడ్కోళ్ళుండేవో! “వెళ్తాను” అనకుండా “వెళ్ళొస్తాను” అని ఎందుకు అనాలో ఇంచుమించు ప్రతీ తల్లీ పిల్లలకు నేర్పేది. ఇప్పుడన్నీ “బై” లే! మా అమ్మమ్మ, నాన్నమ్మ వారి ఈడు బంధువులు ఎవరికైనా వీడ్కోలు చెప్పేటప్పుడు హృదయపూర్వకంగా కళ్ళు కళ్ళు కలుపుకుని, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని “దయ ఉంచండి” అనుకునేవారు. ఆ దృశ్యాలన్నీ నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. అలాంటివన్నీ కనుమరుగై పోతుంటే చాలా బాధగా ఉంటుంది. మంచి విషయాలు జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఙతలు.

  భవదీయుడు,
  వర్మ

  • @వర్మాజీ,
   అటువంటి సంఘటనలు, ఆప్యాయతలు, పిలుపులు, అన్నీ కనుమరుగైపోతున్నాయి. మీ వ్యాఖ్య నన్ను మరో టపా రాసేటంతగా కుదిపింది 🙂
   ధన్యవాదాలు.

 4. …. ఆ అమ్మాయి దిగ్గున లేచి, భళ్ళున నా మొహం మీద తలుపులేసుకుని లోపలికెళిపోయింది. ఎందుకో అర్ధం కాలేదు,…….

  కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి.

  ఇలాంటివి బాధగానే ఉంటాయి కానీ, వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండటమే మంచిదనిస్తుందండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s