శర్మ కాలక్షేపంకబుర్లు-ముందరి కాళ్ళ బందం

http://kasthephali.blogspot.com/

ముందరి కాళ్ళ బందం

ముందరి కాళ్ళ బందం అనే మాట వాడుతాము. ఇది కూడా పశువుకు సంబంధించినదే. దీనిని అసలు రూపం ముందరి కాళ్ళ బంధం, కాని గ్రామీణుల నోటిలో అది కాస్తా బందం అయి ఊరుకుంది. కొంత మంది ముందర కాళ్ళ బందం అని కూడా వాడుతున్నారు కాని ఇది సరికాదు. ముందరికాళ్ళ బంధమే సరి అయినది. ”డుర్! ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం 
నీ బుంగమూతి చందం నా ముందరికాళ్ళ బందం” పాట గుర్తొచ్చిందా?

ఇదెలాగో చూదాం. పశువులు పారిపోకుండాను,పరుగులు పెట్టకుండాను ఉండటానికి గాను ఆ పశువు ముందు కాళ్ళు రెండిటికి కలిపి ఒక ”పలుపు” దీనినే మనం తాడు అంటాము, దానితో కట్టేసి వదిలేస్తారు. ఇలాకట్టడం మూలంగా పశువు నడవటం కష్టం. కాలు ముందుకు సాగదు. ముందరి రెండు కాళ్ళు పైకి ఎత్తి దూకాలి. ఇలా దూకుతూ ఎక్కువ దూరం పోలేదు. ఇది అసలు సంగతి.

ఇది మన వాడకంలో కి ఎలా వచ్చింది మరి? పశువు ముందు కాళ్ళకి బంధం వేయడం మూలంగా ఎలా ముందుకు సాగలేదో, అలాగే మాటలు కాని, పని కాని చేసి ముందుకు సాగనీకపోవడమే ముందరి కాళ్ళ బంధం. ముందర కాళ్ళ బంధం అంటే ముందుగా కాళ్ళకి బంధమనీ ముందరి కాళ్ళ బంధం అంటే ముందు కాళ్ళకి బంధమనీ అర్ధంకదా! ముందరి కాళ్ళకి బంధం వేసేస్తున్నావోయ్! అంటే ముందుకు సాగనివ్వటం లేదోయ్ అని కదా అర్ధం.

కట్టు తప్పిపోవడం

 కట్టుతప్పడం అంటే ఉన్న కట్టుబాట్లు తెంచుకోడం అని కూడా అర్ధం.కట్టు తప్పిపోవడం అంటే బంధం నుంచి తప్పించుకోవడం. పశువును కట్టుకొయ్య అనే వంపు కర్రకి పలుపుతో కట్టేసారు. కట్టుతాడుని పలుపు అంటారు, కట్టే కొయ్యని కట్టుకొయ్య అంటారు. ఈ వంపు కర్రని దగ్గరగా రెండడుగుల పైన లోతు గోతిలో కప్పెడతారు. కొన్ని కొన్ని పశువులు తాడుతో సహా ఈ కట్టుకొయ్యను పెకలించుకుని పారిపోతాయి. ఇలా కట్టు వదల్చుకుని పోవడాన్నే కట్టు తప్పిపోవడం, లేదా మందనుంచి తప్పిపోవడం అంటారు. మరి మన వాడుకలో కట్టు తప్పిపోవడం అంటే ఉన్న సంప్రదాయాల్ని వదిలేసిపోవడం గా వ్యవహరించబడుతోంది.

దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోడం.

ఈ మాట ఈ మధ్య చాలా సార్లే వింటున్నాం. దీని వివరం చూదాం. ఒక దొంగలగుంపు ఊళ్ళ మీద పడి దోచుకునేది. ఇదే బాగుందని మరొక గుంపు బయలు దేరి ఊళ్ళ మీదపడి దోచుకోవడం మొదలెట్టింది. ఇలా ఈ గుంపు ఆ గుంపు దోచుకోవడం లో ఒక ఊరిలోనే రెండు గుంపులూ దోచుకునే సరికి దొరికినది తగ్గిపోయింది. అందుకని ఆ రెండు గుంపుల నాయకులు కలిసి ఒక ఏర్పాటు చేసుకున్నారు. ”మన పరగణాలో మరొక దొంగల గుంపు రాకుండా చూసుకోవడమూ, ఆ తరవాత ఈ ఉన్న రెండు గుంపులూ ఊళ్ళు పంచుకున్నాయి,” దోచుకోడానికి, ఒకరితో మరొకరికి విరోధం రాకుండా ఉండేందుకు. సరదా గా చెప్పుకోడం కాదుగాని ఈ వ్యవస్థ బిచ్చగాళ్ళలో కూడా ఉందట. ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతానికి బిచ్చానికి రావడానికి లేదు, అలాగే ఒకచోట కూచుని అడుక్కునేవాడికి ఆ చోటుపై హక్కు భుక్తాలు వగైరా చాలా నిబంధనలున్నాయట. అడుక్కోడం అంత తేలికయిన విషయం కాదు. 🙂 ….నేడు రాజకీయాలలో కూడా ఇది చెల్లుబాటులో ఉన్నట్లే ఉంది. 🙂

 వీధులుకట్టి విస్తళ్ళెయ్యడం.

”వీధులుకట్టి విస్తళ్ళేస్తావా? పెళ్ళయితే మాత్రం” అని ఒక మాట వాడతారు మన తెనుగునాట. అంటే ”ఊరందరికి భోజనాలు పెడతావా?” అని అర్ధం. మా ఊళ్ళో ఈ మధ్య పెళ్ళిళ్ళు చాలా జోరుగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా వీధులు కట్టేస్తున్నారు, అడ్డంగా, పెళ్ళిళ్ళకోసం, భోజనాలకోసం. ఒక కిలో మీటర్ దూరం వెళ్ళడానికి సందులుగొందులు వెతుక్కోవలసివస్తూంది. వీధులు కట్టడమంటే ఊరందరికి భోజనాలు పెడితే వీధి కట్టేసి బంతి వేసి వడ్డించక తప్పదు, అంతకంటే విశాలమైన చోటు దొరకదు కనక, ఇంటి దగ్గరలో, అందుకు ఈ మాట పుట్టింది.

కలిబోసిపెట్టినా ఉట్టివంకచూసినట్టు.

ఒక పిల్ల తల్లి చనిపోతే సవతి తల్లి పెంపకంలోకి వచ్చింది. ఈ సవతి తల్లి సవతి కూతురుకి చద్ది అన్నంలో ‘కలి’పోసి పెట్టింది( కలి, అంబలి,తరవాణి, లచ్చించారు వీటన్నిటిని అన్నం వార్చిన గంజితో తయారు చేస్తారు. కలో అంబలో తాగి బతుకుతామని నానుడి) . పాపం ఈ పిల్లకి తల్లి ఉండగా ఉట్టి మీద ఉన్న పెరుగు పోసేది. అందుకుగాను కలిపోసి అన్నం పెట్టినా ఆశగా అలవాటుగా ఉట్టికేసి చూసింది. జరిగే అన్యాయం జరుగుతున్నా, ఇంకా ఏదో మంచి జరుగుతుందనే ఆశనే కలిపోసిపెట్టినా ఉట్టివంక చూడటమనే సామెతతో చెప్పేరు.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ముందరి కాళ్ళ బందం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s