శర్మ కాలక్షేపంకబుర్లు-శరీరమాద్యం……

                 http://kasthephali.blogspot.in

శరీరమాద్యం……

ఇది 600 టపాగా రాశాను కాని, వేయబుద్ధికాక మూలపారేశాను. మిత్రులు రత్నం గారు రెండేళ్ళకితం టపా చదివి వ్యాఖ్యపెట్టేరు. మరి కదలిక వచ్చింది, సమాధానంగా టపా రాస్తానన్నా! అదీ సంగతి. అందుకు ఈ టపా ముందుకు తెచ్చి స్వంత డబ్బా తగ్గించి …..వద్దు తిట్టకండి!

”శరీరమాద్యం ఖలు ధర్మసాధనం”అన్నారు, అంటే ‘ధర్మం మొదలుగా కలిగిన పురుషార్ధ సాధనకు శరీరం ముఖ్యమైనది’ అని. ఏంటి! మోక్ష సాధనకి శరీరం అవసరమా? అవును, అవసరమే. కర్మ పరిపాకం పూర్తి చేసుకోడానికి, కూడా తెచ్చుకున్న మూట విప్పుకోడానికి (సంచితం) చేసిన కర్మ ఫలం అనుభవించడానికి, మంచిదైనా చెడ్డదయినా సరే, (కర్మ రాహిత్యం కావాలి కదా!), కొత్తగా మూట (అగామి) కట్టుకోకపోడానికి, మానవ శరీరమే అత్యవసరం. అందుకే శంకరులేo చెప్పేరు? ”జంతూనాం నర జన్మ దుర్లభం” అని కదా! అంటే ”ప్రాణులలో నరజన్మ దొరకడమే అదృష్టం,” దీనిని ఉపయోగించుకుని ముక్తి పొందవయ్యా! అని కదా చెప్పేరు.(ముక్తి అంటే విడుదల, దేనినుంచి? జనన మరణ చక్రం నుంచి, పరమాత్మలో కలియడానికి) మానవ జన్మచాలా విశిష్టమైనది.కర్మఫల రాహిత్యం పొందటం, ఈ నరజన్మలోనే సాధ్యం, మరే జన్మలోనూ సాధ్యంకాదు,అందుకు మానవ శరీరం అవసరం. ధర్మసాధనం అని అందులో చెబితే మీరు మోక్షం గురించి చెబుతున్నారు.

అవును ధర్మసాధన అంటే, ధర్మం మొదలుగాగలిగిన చతుర్విధ పురుషార్ధాలూ అని అర్ధం. ఇవి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు కదా! ధర్మమైన అర్ధం సంపాదించు, అంటే ”నీకు ఇతరులు ఏమిచేస్తే బాధ పడతావో, అది ఇతరులకు చేయకుండటమే ధర్మం” అంది భారతం. అందుచేత ఇతరులను హింసించి, దొంగిలించి, బెదిరించి అర్ధం సంపాదించకు. అలా సంపాదించినా అనుభవించేదెంత? ఆలోచిద్దాం. ఆరుడుగుల నేలచాలు, బతికిన, చచ్చినా సరే…. మరెందుకింత అత్యాశ? పోయినవాడెవడైనా, చిన్నమెత్తయినా పట్టుకుపోగా చూశావా? నీ కూడా ఏదీ రాదుకదా, అలా రానిదానికోసం ఎందుకీ పాకులాట? ఇది మాయ! దీనిని ఛేదీంచు. జీవితానికి అవసరమైనదే సంపాదించు. తరాల తరబడి కూచుని తిన్నా తరగనిది సంపాదించకు, అన్యాయంగా. వ్యర్ధం. అదికారం కోసమంటావా? ”రాజ్యాంతే నరకం ధృవం” అధికారం తరవాత మిగిలేది నరకం, అయ్యో! అంత ధర్మ బద్ధంగా పరిపాలించిన ధర్మరాజు కూడా నరకాన్ని చూశాడు, కొద్ది సేపయినా, తెలుసునా!”  అధికారంతమునందు చూడవలె కదా ఆ అయ్య సౌభాగ్యముల్” తెలియదా! కుక్కకూడా విరిగిన కాలి మీద, ఉచ్చకూడా పోయ్యదు. అందుచేత సత్కర్మలకోసం శరీరమాద్యం….

ధర్మమైన మైన అర్ధంతో కామం తీర్చుకో! కామం అంటే స్త్రీ, పురుష సంబంధం మాత్రమేననే తప్పు అర్ధం చెబుతున్నారు. కామం అంటే కోరిక, ధర్మబద్ధమైన అర్ధంతో ధర్మబద్ధమైన కోరిక తీర్చుకో! కనపడిన ప్రతిది కావాలనుకుంటే మిగిలేది కష్టాలే,కన్నీళ్ళే!, అర్హత సంపాదించు, అప్పుడు అనుభవించు, అది ధర్మం. ”మింగమెతుకులేక మీసాలకు సంపెంగనూనె” అంటే ఎలా? అయిందా? ధర్మబద్దమైన అర్ధం, ధర్మబద్ధమైన కామం పూర్తయితే నీవు నిష్కళంక యోగివే! అదెలా అంటే!

మన కర్మ చేత మళ్ళీ జన్మ పొందటం, లేదా మళ్ళీ మళ్ళీ జన్మ పొందటం, మన చేతిలోనే ఉంది,మానవునిగానే పుడతాననుకోకు.. పాపకర్మలు చేస్తే దాని ఫలితం అనుభవించడానికి పుట్టాలి, సుకర్మలు చేసినా ఫలితం అనుభవించడానికి పుట్టాలి. ఐతే మరేం చెయ్యాలి? ఏమీ పెద్ద కష్టపడక్కరలేదు. రెండుపూటల సాత్వికాహారం తీసుకో, కష్టానికి సుఖానికి లొంగిపోకు, కష్టానికి సుఖానికి సమంగా స్పందించు, కష్టం వచ్చింది, ఏడు కాసేపు, మళ్ళి నీపనిలో పడు. సుఖం వచ్చింది అనుభవించు, పంచిపెట్టు పెరుగుతుంది, ఇదే వుండిపోవాలనుకోకు. ఏదివస్తే దానిని అనుభవించు, ఇది జీవితం, కాదు, ఇదే జీవితం. కష్టంలో అమ్మను తలుచుకో కష్టం మోకాలి లోతులో దాటిపోతుంది. అమ్మెవరు? “జన్మమృత్యుజరా తప్త జన విశ్రాంతి దాయిని” ఇది అమ్మ నామం, అర్ధం                    పుట్టుక,చావు,ముసలితనంతో, పునరపి జననం, పునరపి మరణంతో, వేగిపోతున్న జీవులకు వీటినుంచి విశ్రాంతిని కలగచేసే తల్లి! సుఖంలో అమ్మను తలుచుకో నీ సుఖం రెట్టింపవుతుంది,ఏదీ నిలవదు, అది గుర్తుంచుకో!. నీ భార్య/భర్తయందే నీ కోరికలు తీర్చుకో. నమ్మినవారిని ముంచకు. ఇంట్లో వారిని, బంధువులను, మిత్రులను సమయంలో ఆదుకో, చేయగలిగిన సాయం చెయ్యి. చేతనయితే ఒకరికి ఉపకారం చెయ్యి. లేకపోతే నోరు మూసుకు కూచో! ఇలా బతికితే, నీ పని నువ్వు చేసి భగవంతుని పై భారం వేస్తే చాలు, ముక్తి వచ్చినట్లే. ఇదంతా జరగాలంటే, కర్మ చెయ్యాలి, చేతులు ముడుచుకు కూచుంటే భగవంతుడు తినిపించడు. మంచి పని చేయాలంటే శరీరం కావాలి. అందునా అరోగ్యవంతమైన శరీరం అత్యావశ్యకం. అందుచేత శరీరమాద్యం ఖలు ధర్మసాధనం.

లోపలికి చూడు అంటే ఎమిటి? రమణులేమన్నారు? ”నాన్ యార్” ”నేనెవరిని?” తెలుసుకోమన్నారు. దైవం ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. అదే ఎక్కడ? ……పద్మకోశప్రతీకాశగుం హృదయంచాయధోముఖమ్, అధీనిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరితిష్టతు….హృదయానికి కింద బొడ్డుకు పైన పద్మంలో వెలుగుతున్నాడు. ఎలా ఉన్నాడు? తస్యమధ్యే వహ్ని శిఖ అణీయోర్ధ్వా వ్యవస్థితః. నీలతోయధమధ్యస్థా ద్విజుల్లేకే వ భాస్వరా! నీవార సూకవర్తన్వీ పీతాభా స్వస్త్యణూపమా. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః… అయ్యా అలా నీలో, నివ్వరి ధాన్యపు ముల్లులా ఉన్నవాడు, నీకంటే వేరువాడు కాని వాడు అయిన పరమాత్మనీవే!, నిన్ను నువ్వు తెలుసుకో! పరబ్రహ్మను తెలుసుకున్నట్లే. పరబ్రహ్మ నీకంటే వేరుగాలేడు… ఇదంతా ఇదివరకు చెప్పినదేగా? అవును రోజూ తినే అన్నమే మళ్ళీ మళ్ళీ ఎందుకు తింటున్నాం? అలాగే ఇదీనూ…..

మరందుకే 73 సంవత్సరాలనుంచి ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినది. ఇక మిగిలిన కాలం కొద్దే!, ఇది నిజం, కాదు,ఇదే నిజం. ఈ కాలం సద్వినియోగం చేసుకోవాలని కదా తాపత్రయం. మరి మూడు నెలల నుంచి చలి మూలంగా బాధపడి, నలతతో కష్ట పడిందికదా, ఈ శరీరం, ఇప్పుడు బాగుంది కదా, కర్మ చెయ్యి….ఏమయిందీవేళ మీకు ? బావున్నారా?…బానే ఉన్నా… ఇదిగో ఇది నేటికి బ్లాగు మొదలుపెట్టిన రెండు సంవత్సరాల మూడు నెలలలో రాసిన టపాల లో 600 వది, అదీ సంగతి. ఐతే!… ఆగండి! ”కొద్దిగా డబ్బా కొట్టుకుందామని… ”ఘటం భిత్వా, పటం చిత్వా” కదా! ఇదేంటో? నాలుగురోడ్ల కూడలిలో కుండ బద్దలు కొట్టు, లేదా చొక్కా చింపుకో నలుగురు దృష్టీ నీ మీద పడుతుంది కదా!” అందుకు …. నలుగురు దృష్టీ ఆకర్షించాలని 🙂 సరెలె చెప్పుకో!…ఈ గుర్తింపు సమస్య ఉంది చూశారూ! ఓరి బాబోయ్! మహానుభావా!!, ఆపండి మమ్మల్ని చంపకండి,సుత్తి కొట్టకండి, మిమ్మల్ని గుర్తించేశాం ఎప్పుడో!!!, (గుర్తించక ఛస్తామా? చంపేస్తుంటే, కురుపులా సలిపేస్తుంటే 🙂 )

ఇంకా చాలా రాశాను కాని తీసేశాను, ”రక్షించేరు!”… ”ఆ! ఎవరదీ?”

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శరీరమాద్యం……

 1. మీ’ వయసులో ‘ ఇంత మంచి టపాలు !
  ఆలోచింప చేసే ఆరు శతకాలు !
  ఆచరించే వారికవి, మీరిచ్చే బంగారు పతకాలు !
  ప్రతి జీవితం లో, ఉషస్సు ను నింపే ‘అభినవ ఉషశ్రీ’ !
  అందుకోండి మా అభినందనలు !
  పూయించండి ఇంకా, మీ టపా నందనాలు !

  • @సుధాకర్జీ,
   ఇది ఆరువందలవ టపాగా రాశాను అప్పుడు వేయలేదు, మీ అభిమానానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s