యాదవ కులంలో ముసలం పుట్టింది.
”యాదవ కులంలో ముసలం పుట్టింద”ని సాధారణంగా, ఏదయినా బలమైన కుటుంబంలో కాని, పార్టీలో కాని, దేశంలో కాని కలతలు మొదలయితే, దీనిని ఉదహరిస్తారు. అలా పుట్టిన ముసలం అంటే ఇనుపరోకలి యాదవ కులాన్ని నిర్మూలం చేసినట్లే, ఈ కలతలూ ఈ సంస్థలని పాడుచేస్తాయని సోదాహరణంగా చెబుతారు. ఇనుపరోకలి పుట్టడమేమని అడగచ్చు, దీని మూలం తెలియాలంటే భాగవతం దగ్గరకిపోదాం.
శ్రీకృష్ణుడు తన యాదవ బలగాలతో, బలంతో రాక్షసులను తుదముట్టించారు. ఆ తరవాత కౌరవులను కూడా సాగనంపి ఉన్న సమయం, యాదవులు బలవంతులై కన్నూ మిన్నూ కానని పరిస్థితిలో ఉన్న సమయం. ఈ శక్తిని పరిమార్చాలంటే, మరో ఇంతటి శక్తి కావాలి, అంతకు మించి, ఆ శక్తే తనకు తానే అణగారిపోతే సరిపోతుందనుకున్నారు స్వామి. ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర,అసిత,కణ్వ,దుర్వాసో,భృంగి, ఆంగీరస, కాశ్యప, వామదేవ,వాలఖిల్య,వశిష్ఠ, నారదాది మునులంతా ఒక్కసారి పరమాత్మను దర్శించడానికి వచ్చి, పరమాత్మను దర్శించి, ఆయనచే అర్చింపబడి, గౌరవింపబడి, స్వామిని కొలిచారు. తమరంతా ఇక్కడికి రావడానికి విశేషం చెప్పమన్నారు, దేవదేవులు. దానికి మునులు స్వామిని దర్శించడానికి వచ్చామే తప్పించి వేరు పనిలేదని శలవిచ్చి, వారాతరవాత దగ్గరలోని ”పిండారకం”అనే పుణ్య తీర్థానికి చేరేరు.
ఇది చూసిన యాదవులు సాంబుడుకి ఆడవేషం వేసి, యాదవులు మూకగా కేకలేస్తూ, ముని సమూహం దగ్గరకు సాంబుని తీసుకుపోయి, ”ఈ గర్భవతికి కొడుకా లేక కూతురా పుడుతుంద”ని అని హేళనగా అడిగారు. దానికి మునులు వీళ్ళు మదంతో రెచ్చిపోతున్నారని అనుకుని, కోపించి కళ్ళలో నిప్పులు రాలగా, మాతో హాస్యమాడుతారా అనుకుని
వాలాయము యదుకుల నిర్మూలకరం బయినయట్టి ముసలం బొకటి
బాలిక కుదయించును బొండాలస్యము లేదటంచు నటపల్కుటయున్…భాగ…స్కం..11…..22
యదుకులాన్ని సమూలంగా నాశనం చేసే ఇనుప రోకలి పుడుతుంది ఆలస్యం లేదని చెప్పేరు.
అప్పటికి తెలివి తెచ్చుకున్న యాదవులు సాంబుని బట్టలు విప్పుతుంటే లోపలినుంచి ఒక ఇనుపరోకలి కింద పడింది. దానికి ఆశ్చర్యపోయి, ఆ ఇనుపరోకలిని పట్టుకుని శ్రీకృష్ణుని దగ్గరకి పోయి, జరిగినది చెబితే కులక్షయం తప్పదని తెలిసినవాడు కనక, ఈ రోకలిని సముద్రపు ఒడ్డున కల పర్వతం మీది, పెద్దరాతి మీద దీనిని అరగదీసి సముద్రంలో కలిపెయ్యమని చెప్పేరు. యాదవులా రోకలి పట్టుకుపోయి పర్వతం మీద అరగతీసి చిన్న ముక్క మిగిలితే దానిని ఉపేక్షచేసి సముద్రంలోకి విసిరేసేరు. దానిని ఒక చేపమింగింది. అలా ఆ రోకలి ముక్క మింగిన చేపను ఒక బోయవాడు వలలో పట్టి కోస్తే, రోకలి ముక్క దొరికింది. దొరికిన రోకలి ముక్కను అలుగు ములికిగా తయారు చేసేడు.
అలా యాదవ కుల నిర్మూలనానికి పధకం తయారయిపోయింది. మనం అనుకున్నట్లు యాదవకులంలో ముసలం పుట్టడం దాకా చాలు కాని మిగిలినది కూడా చెప్పేసుకుందాం.
ఆ తరవాత కొన్ని రోజులకి యాదవులంతా సముద్ర తీరానికి చేరేరు విహారం కొరకు. అక్కడ పూటుగా తాగి ఒకరినొకరు దెప్పుకోడం ప్రారంభించారు.మాటా మాటా పెరిగింది, ఒకరినొకరు దగ్గరలో ఉన్న రెల్లు పొదలు పీకి కొట్టుకుచచ్చేరు. ఇది చూసి బలరాముడు యోగావస్థలో తనువు వదిలేశారు. పరమాత్మ దగ్గరలోని లతానికుంజంలో కాలిమీద కాలు వేసుకుని పడుకుని కాలి బొటన వేలు ఆడిస్తుంటే, దూరంనుంచి చూచిన ముసలపు ముక్కను అలుగుగా వేసుకున్న బోయవాడు, ఆ కదులుతున్నది నెమలి కన్నుగా భ్రమించి బాణం వేసికొట్టాడు. ఆ తరవాత పరమాత్మ అవతారం చాలించారు.
ఇప్పుడు కధని విశ్లేషిద్దాం.
శ్రీకృష్ణుని ప్రాపున యాదవ కులం ప్రబల శక్తిగా మారింది. దానిని పరమాత్మ దుష్ట శిక్షణకు ఉపయోగించారు. కాని ఈ క్రమంలో ఈ యాదవవీరులు మదోన్మత్తులయ్యారు. అంతా తమదే శక్తి అనుకున్నారు. అది ఎంతవరకుపోయిందంటే మునులను కూడా ఎగతాళీ చేసే స్థాయికి చేరిపోయింది. అక్కడ మునులు కూడా వారు చేసిన హేళన వ్యక్తులకంటే ఎక్కువగా వారి విద్యను పరిహసించింది. అందుకు వారికి కోపం వచ్చి శపించారు. వారిని పరిహసిస్తే బహుశః కోపం తెచ్చుకునేవారే కాదు, కాని వారి తపోశక్తిని, విద్యా శక్తిని అనగా భగవానునే హేళన చేసిన సందర్భం గా భావించారు. జరగవలసినది జరిగింది. అక్కడ కూడా ఎత్తిపొడుపులు, పొటుకు మాటలు, ఉల్లికుట్టు మాటలే, మదిరాపాన మత్తులై ఉన్నవారితో, రెల్లు దుబ్బులను పీకి కొట్టుకునే స్థాయికి చేర్చింది. అందుకే ఏదయినా సంస్థ, కుటుంబం బలవంతమైనదవుతున్న కొద్దీ నోరు సంబాళించుకుని మాటాడవలసిన ఆవశ్యకత ఉన్నదని తెలుస్తున్నది కదా! ఇలా చేయకపోతే ఆ సంస్థలపని యాదవ కులం లాగే తయారవుతుంది.
మీరు బాగా కథలు జెబ్తారండీ !
జిలేబి
జిలెబి గారు,
ఇది భాగవతం లో ఉన్న కధ, ఆ నానుడి మన ఆంధ్ర దేశం లో ఉన్నదీను, బహుశః మీకీ కాలానికి సరిపోయిందేమో 🙂
ధన్యవాదాలు.