శర్మ కాలక్షేపం కబుర్లు-కర్రీ పాయింట్

కర్రీ పాయింట్

నోట్లోని ముఫ్ఫైరెండు పళ్ళలో ఇరవైపోగా, పన్నెండు చుక్కల్లా మిగిలాయి, అక్కడక్కడ. వాటి ఆధారంగానే నములుతున్నా, నెమ్మదిగా. అదుగో! ఆపళ్ళకి వచ్చాయి తిప్పలు. ఒకటే పోటు, ఏపనీ చేయబుద్ధికాదు,వేమన తాత అన్ని పోట్లగురించి చెప్పేరు కాని, పన్నుపోటు గురించి చెప్పలేదెందుకో! తెలీదు, మందు వేసుకుని, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి, వాటిని ఆరారగా పుక్కిటపడుతూ, బయట కుర్చీ వేసుకుని, ఎండ, నీడ పొడలో కూచున్నా, పుక్కిట పట్టిన నీళ్ళు ఉమ్మేస్తూ, కొత్తవి పుక్కిటపడుతూ, నిన్న ఉదయం.

ఆ సమయంలో ఒక కుర్రాడు సైకిల్ దిగి, పక్కగా ఒబ్బిడిగాపెట్టి, ఒక సంచి పుచ్చుకువస్తూ, గేట్ తీసి, మళ్ళీ వేసి, నా దగ్గరకొచ్చి, నమస్కారం చేసి నిలబడి, ఒక కాగితం చేతిలో పెట్టేడు. ’చస్తూంటే సంధ్యమంత్రమని’ ఇదేంటో! అని చూద్దామంటే, కళ్ళజోడు కనపడలేదు. కుర్చీకింద ఉన్నది తీసి నాచేతికిచ్చాడు. పెట్టుకుని చూస్తినికదా! అదొక కర్రీ పాయింట్ అడ్వర్టైజ్మెంట్. ఈలోగా ఇల్లాలొచ్చింది. ఆవిడకి ఒక కాగితం ఇచ్చాడు.

ఆవిడ ఆ కాగితం చూస్తూ ”నువ్వు సర్వయ్యగారి పెద్దాడివి కదూ? డిగ్రీ చదివి ఇదేంపని?” అడిగింది.  ఆ కుర్రాడు ”నేను మీరన్నవారి పెద్దబ్బాయినే. డిగ్రీ చదివిన మాట నిజమే. పెద్ద తెలివయినవాడిని కాదు, పై చదువులకి తాహతు లేదు, ప్రభుత్వం వారు ’నువ్వు ముందుపడిన కులం వాడివి, అందుకునీకు ఉద్యోగం లేద’న్నారు. ’అదేమి కొన్ని ఉంటాయంటే, అవన్నీ ఉత్తరం, దక్షిణం ఉన్నవాళ్ళకి, నీలాటి తలమాసినవాడికి కాద’న్నారు.”

”ఇక్కడ దగ్గరలో ఫేక్టరీలు పెట్టేరట” కదా అంటే ”వారినీ ఆశ్రయించి తిరిగేను, అవును, అనరు, కాదు, అనరు, తెలిసినవారొకరు చెప్పేరు, వారి కులం వారికి తప్పించి మరొకరికి అందులో ఉద్యోగం దొరకదు, తిరగడం అనవసరమని.” ”కొంతమంది వ్యాపారస్థులు పెట్టుకుంటున్నారు” కదా! అంది.  ”అవునండి ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది, పదకొండుదాకా పనిచేయించుకుని ఇచ్చేదెంతండి, నాలుగువేలు. అదీ అయిందండి.   ఇలా రెండేళ్ళు గడిచాయండి! ఇంట్లో, వీధిలో చులకనైపోయాను, అంతా జులాయిగా తిరుగుతున్నానన్నారు. నా గోడెవరికి చెప్పుకోనండి.”

అదుగో అటువంటి సమయం లో పక్కింట్లో ఉన్న టీచర్ దంపతులు ‘స్కూల్ టైమ్ అయింది, కూర కాలేదని’ గుంపుచింపులు పడుతున్నారు. అది విన్న నేను అమ్మ వండిన కూరలో సగం అరటాకులో కట్టించుకుని పట్టుకెళ్ళి వారికిచ్చాను. ”కర్రీ పాయింట్ ఎప్పుడు పెట్టేవయ్యా?” అన్నారు. ”ఈ రోజేనండి! మీదే బోణీ బేరం అన్నా”నండి.వారు ఏభయి రూపాయలు చేతిలో పెడుతూ ”రోజూ తెచ్చిపెట్టు” అన్నారండి. కాని ”నాదో విన్నపమన్నానండి, ‘చెప్పమన్నారండి,’ మీకు తెలిసిన పది మందికి చెప్పాలన్నా నండి, సెల్ నంబరిచ్చానండి, వారిని, ‘వారి పేరు అడ్రస్, ఎంతమందికి ఎన్నిపూటలకి కూర కావాలో, నాకు ఎస్.ఎమ్.ఎస్ ఇవ్వమనండి’ అన్నానండి. మధ్యాహ్నానికి నాకు మరో పది మందినుంచి ఎస్.ఎమ్.ఎస్ లు వచ్చాయండి. ఊళ్ళో కూరలు దొరకవని ఉదయమే తొమ్మిదికి బయలుదేరి సైకిల్ మీద కడియం పోయి కూరలు తెచ్చుకున్నానండి. నాన్నని వప్పించి డబ్బులు తీసుకున్నానండి. అదిగో అలా నా కర్రీ పాయింట్ వ్యాపారం నెల కితం మొదలయిందండి. అందరూ వద్దని తిట్టేరండి. నేను వినలేదండి. ఇప్పటికి ఏభయి మంది దాకా ఉన్నారండి, నా కస్టమర్లు, ఈవేళ మరికొంతమందిని చేర్చాలని బయలు దేరేనండి, అందుకు మీదగ్గరకొచ్చానండి,” అని ఆగాడు.

”నాయనా! వంట చాకిరీ ఎవరిదన్నా!” ” మొదటిరోజు అమ్మ చేసిందండి. ఒకరికెంత పెట్టాలి, ఇద్దరికెంత పెట్టాలి చెప్పిందండి. మరుసటి రోజునుంచి నేనే వంట చేస్తున్నానండి,.అమ్మచుట్టూ తిరుగుతూ నేర్చుకున్న వంటచేయడం ఇప్పుడు ఉపయోగపడిందండి.  రుచిగా ఉన్నాయంటున్నారండి,” అని ఆగాడు.
”మిగిలిన పని, మిగిలిపోతున్న కూరా!” అన్నా. ”మాకు ఇంట్లో నలుగురికి కూర ఖర్చులేదండి, కూర కొద్దిగా మిగిలితే ఎదురుగా ఉన్న పిల్లల తల్లికి పెడుతోందండి, అమ్మ. ఆవిడ ”ఊరికే రాలేదు కదమ్మా, మీకుమాత్రం. నేను డబ్బులివ్వలేను కాని నాకు చేతనయిన పని, ‘అంట్లు తోమి పెడతా’ ‘’నందండి, ఆ పని అలా తప్పిందండి. కూరలు, పచారి సరుకులు తెచ్చుకోడం, కూర తరుక్కోడం, వంట, నా పని అండి. అమ్మ పైపైన చూస్తుందండి. నాన్న జమా ఖర్చులు రాస్తున్నారండి. తమ్ముడేమో కాలేజి మానేస్తానంటున్నాడండి. నేనే ఈ సంవత్సరం పూర్తి చేసెయ్యమన్నానండి. టిఫిన్ సెంటర్ పెట్టి ఇంటికి టిఫిన్ అందించమంటున్నారండి. తమ్ముడు పరిక్షలయ్యాకా అది మొదలు పెట్టాలనుకుంటున్నానండి. మిమ్మల్ని కూడా కలుపుకోవాలని వచ్చానన్నాడు. దానికి ఇల్లాలు ”ప్రస్తుతానికి మాకు అవసరం లేద”ని చెప్పింది. 

నేను, ”అబ్బాయి! నువ్వు చేస్తున్నపనిని నేను మనఃస్ఫూర్తిగా అమోదిస్తున్నాను. జీవితం లో రెండు పనులు చేయకూడదు, ఒకటి లంజతనం, రెండవది దొంగతనం. నువ్వు కష్టపడి పని చేసి ఒకరి అవసరం గడిపి నీ పొట్టపోసుకుంటున్నావు, శ్రమించడం తప్పెలా అవుతుంది?. ఎవరేనా నిన్ను ఇలా మాటాడితే ఊరుకోకు, పై రెండిటి కంటే తప్పు పని కాదని చెప్పు, ఒకరి కింద ఊడిగం చేయడం కాకుండా, నలుగురిని పోషించే స్థితికి ఎదిగావు, ఇంకా ఎదుగుతావు, భయం లేదు, నాకానమ్మకం ఉంది.” అన్నా ఆవేశంగా.

”తాతగారు! ఈ కూర పొట్లం ఉంచండి” , పొట్లం నాఇల్లాలి చేతులో పెడుతూ. “వద్దయ్యా!”” అంది ఇల్లాలు, ‘అలా అనకు, తీసుకో’ అని కేషియరు కోడలమ్మని పిలిచి ‘అబ్బాయికి ఏభయి రూపాయలు నాచేతితో ఇవ్వబోతే’  ”వద్దండి, నాకు మీరిచ్చిన ధైర్యం చాలా విలువైనదండి.నన్ను ఆశీర్వదించారు, అదే పదివేల”న్నాడు. ‘సరేఒకమాట విను, ఇది దాని ఖరీదు కాదు, అది, నీదగ్గరనుంచి మేము తీసుకున్న బహుమతి. ఇది నేను నీకిచ్చే ప్రోత్సాహం, నీవు చేస్తున్న పనికి, ‘ అని ఆ కుర్రాడి చేతులో పెట్టి, ”నీవు అభివృద్ధిలోకి వస్తావు, కృషిని నమ్మినవాడు చెడిపోడని” మళ్ళీ ఆశీర్వదించి, ‘నాకు తెలిసినవారికి చెబుతా’నని హామీ ఇచ్చి పంపేను. అప్పుడు గుర్తొచ్చింది, నా అభిమాన రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కధ ”నలుగుర్ని పోషిస్తున్నానిపుడు” చదవండి. అదేకధ ఇక్కడ జరుగుతోంది! అవధరించండి. చిత్రం కాలం మారలేదు.

kadha

kadha1kadha2kadha3

10 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-కర్రీ పాయింట్

  • sivaaniShivani గారు,
   నాకు ఆ కుర్రాడు చేసిన పని నచ్చింది. ప్రతివారిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, దానిని వెతికి పట్టుకుని, జీవితానికి ఉపయోగించుకోవడమే తెలివి కదా!!!
   ధన్యవాదాలు.

  • మిత్రులు మాధవరావు గారు,
   నిజం, కష్టపడకుండా వచ్చేదాని విలువ తెలియదు. కష్టపడాలి తపించాలి, సాధించాలి, అనుభవించాలనే ధ్యేయం కావాలి.
   ధన్యవాదాలు.

 1. చదువులకూ చేసే ఉద్యోగాలకూ ఏమీ సంబంధం ఉండకపోవచ్చును చాలా సందర్భాల్లో. ఉదాహరణకు నా తోడి సైన్సు విద్యార్థ్లులు హెచ్చుమంది బ్యాంకు ఉద్యోగులుగా స్థిరపడ్డారు. కానిష్టెబుల్ ఉద్యోగాలకు కూడా డాక్టరేట్లు ప్రయత్నించవలసిన రోజుల్లో ఉన్నా మసలే. ఒకరిపొట్ట కొట్టకుండా తనపొట్టపోసుకునేవాడు యోగ్యుడే. కాలిఫోర్నియాలో నేనున్న ప్రాంతంలో ఒక హోటల్ యజమాని నాతో కొంచెం స్నేహంగా ఉండేవాడు. ఆయన సైన్సు విద్యార్హి. అమెరికాకు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ మిత్రుల ప్రొద్బలంతో ఒక హోటల్‌ను వారిభాగస్వామ్యంతో ప్రారంభించాడు. వారి దగా చేయబోవటంతో‌ దాన్ని టేకోవర్ చేసి క్రమేణా హోటల్ వ్యాపారంలో స్థిరపడిపోయాడు. ‘మోసం జోలికి వెళ్ళని వృత్తి ఏదైనా మంచిదే’ అనాడాయన ఒకసారి నాతో.

  • మిత్రులు శ్యామలరావు గారు,
   చదువు విజ్ఞానానికి కాదు, ఉద్యోగానికి అనే ఆలోచన కల్పించారు. దాని మూలం గా చదువుకున్నవారు ప్రతివారు ఆఫీసులో ఉద్యోగమే చెయ్యాలనే దురభిప్రాయానికీ వచ్చేశారు. స్వతంత్ర వృత్తులున్నాయనీ, వాటితో జీవితం ఆనందంగానే గడుస్తుందనీ, నిబద్ధత ముఖ్యమనీ చెప్పటం లేదు. అందరి తెలివి స్థాయి ఒకలా ఉండదనీ తెలుసుకోలేకున్నారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే అవుతారా? అలా చదువు’కొన్న’వారెలా ఉన్నారో చూస్తున్నాం కదా!
   ధన్యవాదాలు.

 2. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి ‘మార్గదర్శి’ కథ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందనుకుంటా!

 3. మరే నండీ,

  మన దేశం లో ఇంట్లో కిచను మూసేస్తే, మల్టి బిలియన్ డాలర్ బిజినెస్స్ తయారవు తుందండీ . దాంతో బాటు బోలెడంత మంది కి ఉపాధి కూడాను ! అసలు ఈ ‘ఆండోళ్లు’ ఇంట్లో వంట చెయ్యటం ఎప్పుడు వదిలి పెడతారో అప్పుడే నండీ దేశాభివృద్ధి !!

  జేకే

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   మీరన్నది నిజమే. ఇంటిలో ఆడ, మగ ఇద్దరూ కష్టపడాలి కదా! ఏ కుటుంబం వీలువారిది ఏమంటారు?
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s