శర్మ కాలక్షేపంకబుర్లు-తాతా! ఊతునా!!

తాతా! ఊతునా!!

నిన్నటి నా టపామీద జిలేబి గారి వ్యాఖ్య చదివిన తరవాత నవ్వొచ్చి, ఈ టపా రాయాలనిపించింది.

“శర్మ గారి టపాలు ఈ మధ్య మరీ ‘బే-వారస్’ గా ఉన్నాయి !!”

“జిలేబి”
“(పరార్!)”

నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పొరయు రసజ్ఞు లూహ తెలియంగ లేఖక పాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచయింపుమటన్న శక్యమే!

కవిత చెప్పాలంటే, పెద్దనగారు ఆత్మకింపయిన బోజనము, ఊయలమంచము, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెము, రసజ్ఞులైన విమర్శక, పాఠాకోత్తముల్ లేక ఊరకే కృతుల్ రచయింపుమటన్న శక్యమే ఏరికిన్ అన్నారు. నాది అంతటి మాట కాదు కాని, నేడు, ఉదయమే లేచినది మొదలు, ఎలకో, చిలకో పట్టుకుని కూచోకతప్పటంలేదు కదా! చిలక పట్టుకు కూచుంటే ఏ ఛానల్ లో చూసినా త్వం అంటే త్వం మాత్రమే కనపడుతోంది. నిన్న నా టపాలాగే దెప్పులూ కనపడుతున్నాయి, వినపడుతున్నాయి. ఇదొద్దుగాని, పేపర్ చూదామని విప్పితే నిన్నటి చద్దివార్తలు మసాళా దట్టించి కనపడుతున్నాయి. ఎంతసేపు ఇవి మాత్రం చూస్తామనిపించి, బ్లాగులోకొస్తే అమ్మో! మంటలు, మంటలు. ఎవరు, ఎవరిని, ఎందుకు, ఏమంటున్నారో బోధపడని పరిస్థితి కనపడుతోంది, ఏ బ్లాగులో చూసినా. విభజన న్యాయమా? ముఖ్యపట్టణమెక్కడ? మా ఊళ్ళో ఎందుకు పెట్టకూడదు? కేంద్ర రాజకీయాలేంటి? అబ్బాయిగారి ఓపికెంత? ఏ పార్టీ అధికారంలోకొస్తుంది, మోడీ ప్రధానిగా పనికొస్తాడా? ఆప్ ఏమవుతుంది, అమ్మ మాట చెల్లటం లేదా? మూడో ఫ్రంట్ అప్పుడే ముక్కలయ్యిందిట, సీట్ల పంపకం దగ్గరే, జయమ్మతో వేగడం కష్టమే, తెలుగుదేశం రెండు రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందిట, కాంగ్రెస్ కి కె.సి.ఆర్ చెయ్యిచ్చేరట, తెలంగాణా లో కూడా కాంగ్రెస్ ఢమాల్, ఆంధ్రాకి కూడా అసెంబ్లీ ఎన్నికలుంటాయా? ఇలా అన్నీ ప్రశ్నలు, ఇవే కనపడుతున్నాయి, ఎక్కడ చూసినా. మరి ఇటువంటి సందర్భం లో ఎంతటివారికైనా టపాలు ఎలా ఉంటాయి? వీటినుంచి తప్పించుకో సాధ్యమా? మొన్ననొక మిత్రులు మీ బ్లాగులో ”రాజకీయ రక్తపు మరకలు” అన్నారు. ”గొంగడిలో తింటూ వెండ్రుకలు లెక్కపెట్టుకున్న చందం” కావటం లేదా? ఈ పరిస్థితులలో స్పందనలేక జడంగా ఉండడం సాధ్యమా? పోనీ కొంతకాలం బ్లాగునుంచి శలవు తీసుకుందామనుకుంటే, ఎలా? ఎలా?ఎలా తెలుపనూ?

పాటలకేం గాని, ఈ సందర్భంగా ఒక చిన్న చాటుకధ, గుర్తుకొచ్చింది! తిమ్మనగారు, రామలింగకవి సమకాలీకులవునో కాదో చెప్పలేనుకాని, వీరిమీద చెప్పుకునేదే యీ సరదా చాటు కధ. తిమ్మనగారు వయసులో పెద్దవాడు, రామలింగకవి వయసున చిన్నవాడు కావడంతో తిమ్మనగారిని ”తాతా!” అని సంబోధించేవారు. ఒక రోజు  తిమ్మన గారు భోజనానంతర కునుకు తరవాత ఉయ్యలమీద కూచుని కావ్యం చూసుకుంటున్న సమయంలో, మన కధానాయకుడు, కొంటెవాడయిన రామలింగకవి ప్రవేశించారు. తాత గారికి  నమస్కారంచేసి, ఆగిపోతున్న ఉయ్యాల దగ్గరకొచ్చి ”తాతా! ఊతునా!!” అన్నారు. దానికి తిమ్మన సరేనని తలవూచితే, కొంటె కవి తుపుక్కున ఉమ్మివేశాడు, తిమ్మనగారి మీద. ఇదేమి ఇలాచేశాడని తిమ్మనగారు సాలోచించి ఫక్కున నవ్వారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం, కొంటె రామలింగ కవి వంతయింది.

నవ్వింది ఎందుకో చెప్పగలరా? …………..చెబుతున్నా అవధరించండి.

రామలింగకవి తాతా! ఊతునా? అన్నదానికి తిమ్మనగారు తీసుకున్న అర్ధం ”ఊపమన్నావా?” అని, అంటే ”ఉయ్యల ఊపమన్నావా?” అని,అనుకుని బుర్ర వూపేరు. రామలింగని ఉద్దేశం ఎగతాళీ చేయడం,” ఉమ్మివేయనా?” అని. ”ఊతునా” అన్న పదానికి ”ఊపనా అని, ఉమ్మివేయనా?” అనే రెండర్ధాలూ ఉన్నాయి,  రామలింగకవి చేసిన శ్లేషకి, పనికి, పెద్దనగారు నవ్వేరు. అదండి సంగతి. మరి జిలేబి గారి వ్యాఖ్యకి నాకు అలాగే నవ్వొచ్చి……..

 ఎండాకాలం, ’ఎన్ని?”కల’కాలం పూర్తయే దాకాశలవు తీసుకోవాలని…….

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తాతా! ఊతునా!!

 1. విజ్ఞులు , ఎన్ని కల ( ల ) సమయం లో మీ ‘ కల ‘ సన్యాసం చేయడం ఉత్తమం కాదు !
  అన్యాయం , అవినీతి మీద ,ముందుండి మహా భారత సంగ్రామం చేయించ వలసిన వారు !
  కనీసం, బ్లాగు సంగ్రామం అయినా చేసి, మార్పు కోరుకోవడమూ, అందుకు ప్రయత్నించడమూ చేయాలి మీరు !

  • సుధాకర్జీ,

   యదాయదాహి ధర్మస్య
   గ్లానిర్భవతి భారతః
   అభ్యుత్థానమధర్మశ్చ
   తదాత్మానాం సృజామ్యహం.

   పరిత్రాణాయా సాధూనాం
   వినాశాయచ దుష్కృతాం
   ధర్మ సంస్థాపనార్ధాయ
   సంభవామి యుగే యుగే………భగవద్గీత..కృష్ణ పరమాత్మ.

   ధన్యవాదాలు.

 2. ’ఎన్ని?”కల’కాలం

  ”కల’…జరిగినది అంతా కల.

  మీరు టపాలను వ్రాయాలని అందరమూ కోరుకుంటున్నామండి.

  • అనురాధ గారు,
   కల నిజం, ఈ బంధాలు, బంధనాలు, అనుబంధాలు, చుట్టరికాలు, ఈ జగత్తే మాయ, అశాశ్వతం అన్నారు శంకరులు,దేనికీ బాధాలేదు, దేనికీ ఆనందమూ లేదు, నందో రాజా భవిష్యతి
   ధన్యవాదాలు.

  • ఉషగారు,
   ఏమో ఏం చెప్పాలో అర్ధం కావటం లేదండి. బయటి వాతావరణం కూడా మన మనసు మీద ప్రభావం చూపుతుంది కదా! ఏమో ఏమి జరగనున్నది చెప్పలేను, డోలాయమాన స్థితి,
   ధన్యవాదాలు.

 3. శర్మ గారి టపా కి ‘తరుగు’ , తిరుగు,లేదు ! ‘తనువూగ టపా మాటల కబుర్లు’ !

  ఏమిటి మరో మారు ఎన్నికల నెపం బెట్టి ‘విరామం’ అంటున్నారు !

  ఇట్లా అయితే మాకు పొద్దు గడవటం ఎలా? మరి మీరేమో మా ‘చానల్’ వజ్జుల వారూ కాదూ ?!

  శుభోదయం
  చీర్స్
  జిలేబి

  • జిలేబి గారు,
   కొద్దికాలం శలవు మంచిదేమోనని….ఎంత రెండు నెలలేగా. పాత రోజుల్లో ‘for laugh leave’ అని ఉండేది, నవ్వుతాలికి శలవు, అని అర్ధం.
   ధన్యవాదాలు.

  • atalగారు,
   ఊతునా అంటే వీచనా అని సంస్కృతార్ధమన్నారు, బాగుంది, ఉయ్యల ఊపితే విసిరినట్టు ఉంటుదనుకుంటా 🙂
   ధన్యవాదాలు.

 4. I read that, after that peddana broke his teeth with shoe. So ramalingadu took few days leave and covered them with Duppi horn made teeth… And some body made fun of him siting daksha yagnam suryudu…

  • atal గారు,
   నిజానికి మీకు సంజాయిషీ ఇచ్చుకోవాలి.
   అది తిమ్మనగారితో జరిగిన సంఘటన అని నాకు తెలియదు, విషయం కొద్దిగా తెలుసుకనక అల్లిక చేశాను. తప్పు దిద్దేను. చివర ముగింపు మాత్రం అలాగే ఉంచేను. అక్కడ ఆయన నవ్వలేదు చాచి తన్నేడూ, పన్ను ఊడేలాగా, ఉమ్మివేసినందుకు, నాకోసం మార్పు చేసేను, నవ్వినట్లు.
   మీరిచ్చిన లింక్ లు చూసి విషయం తెలుసుకున్నాను, నిజానికి మీకు చాలా ధన్యవాదాలు.
   నాకు మనుచరిత్ర రాసిన పెద్దనగారంటే ప్రేమ, అందుకు ఆయనను ఇందులో ఇరికించేసేను. తప్పు దిద్దుకున్నాను, ముగింపు మార్చకపోయినా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s