శర్మ కాలక్షేపంకబుర్లు-కునుకుతీయండి!

                 జయనామ సంవత్సర తెనుగు యుగాది శుభకామనలు

vagbhatudu

http://en.wikipedia.org/wiki/Vagbhata

”వాగ్భటుడు” ఐదువేల సంవత్సరాలకితం ఆయుర్వేదాన్ని గురించి వివరించినవారు,కొన్ని గ్రంధాలూ రాశారు, అవి ఇప్పటికీ ప్రామాణికాలే, చరకుని శిష్యులు.నూటికి ఎనభైఐదు రోగాలు ఎవరిమటుకువారు తగ్గించుకోవచ్చనీ మిగిలిన పదిహేనుమాత్రం నిపుణుల అవసరం ఉంటుందనీ చెప్పిన మహానుభావుడు.

అబ్బా! పండగపూటా ఇదేం గోలంటారా? శరీరమాద్యం ఖలు ధర్మసాధనం కదా! అటువంటి శరీరం ఆరోగ్యంగా ఉన్నరోజే కదా పండగ. ఆరోగ్యమే మహభాగ్యంకదా!. వాగ్భటుని గ్రంధాలనుంచి, రాజీవ్ దీక్షిత్ అనేవారు కొన్ని సూత్రాలు తీసుకుని చెప్పేరు, ఏడుగంటల  ప్రసంగాలు తెనుగులో, మద్రాసులో ఇచ్చినవి, దొరికేయి. వీటిని అప్లోడ్ చెయ్యాలని ఉందికాని, చెయ్యచ్చోలేదో తెలియదు, చేసే విధానం తెలియక, మానవుని ఆహార దినచర్య ఎలా ఉండాలన్న విషయం మీద ఈ టపా, రాజీవ్ దీక్షిత్ గారి భాషణ నుంచి. రాజీవ్ దీక్షిత్ గారు చాలా విషయాల మీద సప్రమాణంగా చేసిన ప్రసంగాలు, యు ట్యూబ్ లో ఉన్నాయి, హిందీలో, వీలున్నవారు ప్రయత్నించండి.

ఎక్కడనివసించే జనులకు అక్కడ శీతోష్ణ స్థితికి సరిపడిన ఆహార పదార్ధాలు పండుతాయి, అక్కడే. వాటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, వీటిని ఓషధులు అంటారు, అదే నిత్యం తీసుకునే ఆహారమే. ఏ కాలం లో వచ్చే ఫలాలు ఆ కాలంలో తినాలి.

ఉదయమే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి, నాలుగనుకోండి. లేచిన వెంటనే ఉషాపానం చేయాలి, అనగా రాగిచెంబునుంచి, రాత్రి నిలువవుంచిన నీరు పూర్తిగా తాగేయాలి. నీరు తాగడం పరగడుపునే చేయాలి, ముఖప్రక్షాళణ కాకముందే. నీరు తాగేటపుడు గటగటా తాగద్దు, గుటక గుటక తాగాలి, అనగా నోటిలోని లాలాజలంతో కలిసి నీరులోపలికి పోవాలి. ఆ తరవాత అనుమానం లేకుండా విరేచనం అవుతుంది. మలబద్ధమే చాలా మందికి ఉన్న పెద్ద జబ్బు. రాగిచెంబులో నీరు లేకపోతే గోరువెచ్చని నీరు తాగచ్చు. ఉదయమే విరేచనం సాఫీగా కాని వారికి ఒక సూచన, వారుకనక ఫ్రిజ్ లో ఉంచిన చల్లని నీరు తాగుతున్నట్లయితే మానెయ్యండి. ఈ చల్లని నీరు లోపలి పేగులను సంకోచ పరచి విరేచనం కాకుండా ఇబ్బంది పెడతాయి. చల్లని నీరు ఎప్పుడూ తాగద్దు. మరి వేసవిలో అని అడగచ్చు, ప్రకృతి సిద్ధంగా చల్లబడిన నీరు తాగచ్చు, అనగా కుండలో పోసినవి, వగైరా. సుఖవిరేచనం తరవాత, వ్యాయామం, స్నానసంధ్యలు పూర్తి చేసుకుని ఉదయం సూర్యోదయం తరవాత రెండు గంటలలోగా కడుపు పట్టినంత తినండి. తినేటపుడు నీరు పరిమితంగా తీసుకోండి. ఉదయ భోజనం తరవాత గంట గంటన్నరకి కడుపు పట్టినన్ని నీళ్ళు తాగండి, ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగద్దు. ఇక మధ్యాహ్నం ఉదయం తీసుకున్న ఆహార పరిమాణం లో రెండు వంతులే తీసుకోండి, ఒక వంతు తగ్గించండి. భోజనం అయిన తరవాత కొద్ది సేపు కునుకు తీయండి, ఇది చాలా అవసరమన్నారు, వాగ్భటులు. గంటల తరబడి కాదు కాని ఒక అరగంట ఎడమపైపుకు తిరిగి పడుకోమన్నారు. భోజనమైన గంటన్నర తరవాత కడుపు పట్టినన్ని నీళ్ళూ తాగండి. సూర్యాస్తమయానికి, గంట ముందు సాయంత్ర భోజనం చేయండి. ఉదయం తీసుకున్న ఆహార పరిమాణంలో మధ్యాహ్నం రెండు వంతులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక వంతే తీసుకోండి. నీరుకూడా గంటన్నర తరవాత తీసుకోండి. మీకింకా ఆకలిగా అనిపిస్తే రాత్రివేళ పళ్ళ రసాలు తీసుకోండి, పాలు తాగండి. రాత్రి పెందలకడనే శయనించండి. ఇది నా మాట కాదు ఐదువేల సంవత్సరాల కితం వాగ్భటులు చెప్పినది, మధ్యాహ్న నిద్రతో సహా.ఆరోగ్యం ఎందుకుబాగోదో చెప్పండి.

ఎట్టి పరిస్థితులలోనూ బయట తయారు చేసిన ఆహారపదార్ధాలు స్వీకరించకండి. అతి వేడి, అతి చల్లని పదార్ధాలు తీసుకోవద్దు. ఆహారం వేడిగా ఉండగానే తీసుకోండి. ఇది సత్వ గుణాన్ని పెంచుతుంది. చల్లబడిన ఆహారం రజోగుణాన్ని పెంచుతుంది. ఇక నిలువ ఉన్న ఆహారం తమో గుణాన్ని పెంచుతుంది. మీరు తీసుకునే ఆహారాన్ని బట్టే మీ మనసుంటుంది, దాని బట్టి మీ చర్యలుంటాయి.  ఈ సందర్భంగా ఒక మాట. యుద్ధభూమిలో అంపశయ్యమీద ఉన్న తాతగారిని చూడటానికి వెళ్ళినపుడు పాండవులు ”తాతా! గంగా పుత్రుడివి, స్వఛ్ఛంద మరణం వరంగా కలవాడివి ఇలా యుద్ధభూమిలో అంపశయ్యమీద ఉండవలసిన దురవస్థ ఎందుకొచ్చిందం”టే ”నాయనలారా! దుష్టుడైన దుర్యోధనుని కూడు కుడిచిన పాపానికి ఇలా ఉండాల్సివచ్చిందయ్యా!! దుష్టుని చేతికూడు ఇంతపని చేసింద”ని చెబుతారు. దీనిని బట్టి అర్ధమయిందా, మనం తినే కూడు ఎటువంటి వాని ద్వారా వస్తూందో అవే బుద్ధులు మనకూ వస్తాయి, ఆ తర్వాత పరిణామాలూ అలాగే ఉంటాయి.  

మధ్యాహ్న భోజనం తరవాత అరగంట నిద్ర గురించి విదేశాలలో రిసెర్చ్ చేస్తున్నారట. దాని పై వారికి వచ్చిన అనుభవం ప్రకారంగా అలా భోజనం తరవాత నిద్రించిన తరవాత చేసే పనిలో నిపుణత్వం ఉందని తెలుసుకుని ఆచరిస్తున్న దేశాలలో ఆస్ట్రేలియా, మెక్సికో, అమెరికా, కెనడా, యూరప్ దేశాల కంపెనీలున్నట్లు వార్త. మనదైనదానిని విదేశీయులు అనుభవంలోకి తెచ్చుకుని లాభపడుతున్నారు, మనం అసలు మొదటిలో కూడా లేము, రేపు వారు చెబితే నేర్చుకుంటామేమో తెలియదు. ”After dinner sleep awhile and after supper walk a mile” is the old English saying.

మీకు అనుమానలొస్తున్నాయి కదూ! చెబుతా వినండి. కింద కూచునే భోజనం చేయండి, సుఖాసనంలో, అంటే రెండు కాళ్ళు దగ్గరకి తీసుకుని మఠం వేసి కూడచోమంటారు, అలా. భోజనానికి భోజనానికి మధ్య ఏమీ తీసుకోవద్దు. ఉదయం టిఫిన్ అలవాటండి, ఉదయమే వేడిగా ఇంటిదగ్గర భోజనం చేసే అలవాటుచేసుకోండి. మధ్యాహ్నం ఆఫీస్ లో హాట్ పేక్ లో పట్టుకుపోయినది వేడిగా తినండి. సాయంత్రం సూర్యాస్తమయంలోపు భోజనం కుదరదండి. ఆ సమయానికి అనగా సూర్యాస్తమయ సమయానికి ముందుగా పళ్ళు ఆహారంగా తీసుకోండి, భోజనం మానెయ్యండి. రాత్రి పళ్ళరసాలు తీసుకోండి, పాలు తీసుకోండి. మనసుంటే మార్గం ఉంది…. ఆ ఇవన్నీ ఎవరు ఆచరించగలరంటారా? తెలిసినది చెప్పడం నా ధర్మం, శరీరం మీదికదా మీ ఇష్టం……

ఈ వేళ పండగ కదా దీని గురించి చెప్పలేదంటారా? ఈ పండగ అసలు ఆరోగ్య సూత్రం మీద ఏర్పడినదే! ఇప్పటివరకు చలి కదా! ఋతువు మారుతోంది కదా! వేడి పెరుగుతోంది అరోగ్యం సమతుల్యం పోతుంది అందుకు గాను ఋతువు ప్రారంభంలోనే అనగా శిశిర ఋతువులోనే హోళికా పున్నమి మరుసటి రోజు చూత కుసుమ భక్షణం చేయాలి. చూత కుసుమమంటే మామిడిపువ్వు తినాలి. ఇది చాలా కాలంగా మానేసేం. ఇంకా పాతకాలపు పంచాంగాలు రాసేవారు మాత్రం హోలీ మరుసటిరోజు చూతకుసుమ భక్షణం అని ఉగాదిరోజు నింబ కుసుమ భక్షణం అనే రాస్తున్నారు.మనమే చూడటం మానేశాం. మరి పదిహేనురోజులకి వసంత ఋతువు ప్రారంభంలో ఈ రోజు నింబ కుసుమ భక్షణం చేయాలి. అంటే వేపపువ్వు తినాలి. మనం ఇదీ అదీ కలిపి ఒక రోజే మామిడి, వేపలతో బాటుగా మిగిలిన నాలుగు రుచులూ కలుపుకుంటూ పచ్చడి చేసుకుని సేవిస్తున్నాం. ఇదీ బాగానే ఉంది ఆరోగ్యానికి, ఇంకా చెప్పాలంటే శ్రీరామనవమి దాకా ఈ పచ్చడి తినాలి, ఆయుర్వేద ప్రకారం….మనం ఈ రోజు చేసుకునే, తినే పచ్చడి ఒక ఔషధం తెలుసునా? ఇప్పుడు రాబోయే వేడికి శరీరాన్ని అలవాటు చేసే ప్రక్రియకి నాంది…

 ప్రకృతికి దగ్గరగా జీవించండి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి.

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కునుకుతీయండి!

 1. భలే వారండీ దీక్షితులు గారు మీరు !

  అసలు తిండి తినడానికే సమయం దొరకటం లేదు ! మరి మీరేమో తిండి తిన్నాక కూసింత సేపు నిద్ర పొండి అంటున్నారు ! వీలయ్యే పనే నా ఇది ? వేరే మాటే దైనా చెప్పండి ! ఈ మధ్య మరీ ను – అన్నీ corporate working lunch మరీ ఎక్కువై పోయేయి తిండి తినే సమయం లో కూడా ఎంత గా బిజినెస్స్ లేక వర్క్ గురించి మాట్లాడితే అంత గోప్పోళ్ళం అన్నట్టు అయిపోనాది కార్పోరేట్ వరల్డ్ మరి మీరేమో మరీ చాందస ఐదు వేల సంవత్సరాల ముందటి మాట అమ్తున్నారాయే మరి !! జేకే !

  ఇంటిల్లి పాది అందరికీ ఉగాది శుభాకాంక్షల తో

  జిలేబి

  • జిలేబిగారు,
   పదిహేనేళ్ళ కితమే వర్కింగ్ లంచ్ తో పని చేసిన అనుభవం ఉంది.
   కొద్దిగా టెన్షన్ ఇవ్వడం మూలంగా పని నెరవేర్చడం ఒక టెక్నిక్. కాని ఎల్ల వేళలా సత్ఫలితాలివ్వదు. పని అప్ప చెప్పి దానికి సమయమిచ్చి బాధ్యతలు నియమిస్తే పనులు జరుగుతాయి. వర్కింగ్ లంచ్ డిస్కషన్ మూలంగా పెరిగేది టెన్షన్.
   నేడు నేను చెప్పిన దేశాలలో కొన్ని కంపెనీలు ఈ విధానంలో భోజనానికి నిద్రకి సమయం కేటాయించి, వసతులు ఏర్పాటు చేస్తున్నాయట. రిసల్ట్ బాగుందంటున్నారు. వర్కింగ్ అవర్స్ 8-12 మళ్ళీ 2-5. లంచ్ బ్రేక్ 12-2. బాగుంటుంది. అక్కడి కంపెనీలకి సజెస్ట్ చేసి చూడండి. రిసల్ట్ బాగుంటుంది.
   శుభకామనలకు ధన్యవాదాలు. మీకుటుంబానికందరికి నూతన తెనుగు సంవత్సర ఉగాది శుభకామనలు, శ్రీ జయ జయాన్నివ్వాలని……
   ధన్యవాదాలు.

  • Sireesha గారు,
   స్వాగతం, మీరిదివరకె పరిచయమున్నవారైతే క్షమించండి, నా మతి మరపుకు.
   మీకు జయ విజయాన్నివ్వాలని కామన. ఉగాది శుభాకాంక్షలు
   ధన్యవాదాలు.

 2. బాబాయ్ గారూ ! ఉగాది శుభాకాంక్షలు .పెద్దవారు కదా! గారు అనే అనాలనిపిస్తోంది. చాలా మంచి విషయాలు చెప్పారు .మీరు చెప్పిన వాటిల్లో కొన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను,గత పది సంవత్సరాలు గా.ఫలితాలు బావున్నాయి.ఆరోగ్యం కూడా బావుంది. మీరు చెప్పినట్లు అన్నీ ఆచరించగలిగితే ఇంకా బావుంటుంది .ఈ రోజుల్లో అది సాధ్యపడుతుందంటారా?

  • అమ్మాయ్ నాగరాణి,
   నీ ఇష్టం తల్లీ! మరేమీ అనను.పదేళ్ళనుంచి అమలు చేసి ఆరోగ్యం కాపాడుకుంటున్నారనమాట. బాగుంది. కొన్నిటికే అలా ఉంటే ప్రయత్నం మీద మిగిలినవి కూడా అమలు చేసుకుంటే ఇంకా మంచిది కదమ్మా!
   కృషితో నాస్తి దుర్భిక్షం
   జపతో నాస్తి పాతకం
   మౌనేన కలహోనాస్తి
   నాస్తి జాగరతో భయం
   ధన్యవాదాలు.

   • నమస్తే బాబాయ్ గారూ ! మీరు చెప్పిన నాలుగు లైన్ల లోనూ ,మొదటి లైన్ పదే పదే వింటుంటాం, మగతావి ఇప్పుడే విన్నాను మీ ద్వారా .మన అరచేతుల్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని ,వివరించే శ్లోకము ఎక్కడో చదివాను ,కానీ మరచిపోయాను. మీ ద్వారా తెలుసుకుందామని ఆశిస్తున్నాను .దయచేసి తెలుపగలరు .

   • అమ్మాయ్ నాగరాణి,

    కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
    కరమూలేతు గోవిందా ప్రభాతం కరదర్శనం

    ధన్యవాదాలు

 3. రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసాలు తెలుగులోనివి నేను కూడా విన్నాను శర్మగారు. వాటిలో రిపిటీషన్ ఎక్కువగా ఉంది. మీరు సంక్షిప్తంగా, చక్కగా వివరించారు. ఇది చదువుతుంటే ఈ రోజునుంచే పాటించాలని అనిపిస్తుంది. ప్రయత్నిస్తాం! చక్కని టపా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  • వర్మాజీ,
   రాజీవ్ గారిది తపన, అన్ని సార్లు చెబితే ఒకటయినా ఎదుటి వారిలోకి చొప్పించలేకపోతానా అనేదే అది. నేను ఆ ఉపన్యాసాలు విన్న దగ్గర నుంచి అమలు చేస్తున్నా! ఆరోగ్యం బాగుంది, ఊరికనే చెప్పడం కాదు, అనుభవంలోకొస్తే బలే బాగుంటుంది. మొదటిలో ఉదయమే పరగడుపున నీరు తాగడం ఇబ్బందిగా ఉండేది, అలా తాగితేనే బాగుంది, ఆకలి పుడుతోంది సమయానికి.
   ధన్యవాదాలు. ఈ టపా ఒకరికి ఉపయోగపడినా సంతసమే
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s