కుంతిలాటి తల్లులు కావాలి.
మొన్న గాంధారిలాటి తల్లికావాలన్నారు, ఇప్పుడు కుంతిలాటి తల్లులు కావాలంటున్నారంటే, సమయం సందర్భం చెప్పాలికదా!.
దుర్యోధనుడికి పాండవులపొడ గిట్టదు. వారిని హతమార్చేందుకు కావలసినన్ని ప్రయత్నాలూ చేసాడు. కాశికి పంపేడు, లక్క ఇంట నివాసం ఏర్పాటూ చేశాడు. దాన్ని తగులబెట్టించాడు. విదురుని చాకచక్యం చేత ఆ గండం గడచి వారు ఏకచక్రపురం లో బ్రాహ్మణుని ఇంట తల దాచుకున్నారు.
అలా రోజులు గడుస్తున్నపుడు, ఒకరోజు ఇంట్లో కుంతి, భీముడు మాత్రమే ఉన్నారు, మిగిలినవారు భిక్షకిపోయారు. ఆ సమయంలో బ్రాహ్మణుడుంటున్న ఇంటివైపునుంచి గొల్లుమని ఏడుపులు వినిపించాయి. “ఏంటో! ఈ ఇంటిలో తలదాచుకుని కాలం గడుపుతున్నాం. ఈ ఇంటి బ్రాహ్మణుడికి ఏమి ఆపదవచ్చిందో! అవసరమెరగడం పుణ్యం, చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం మధ్యముల లక్షణం, ఆపద గడవబెట్టడం ఉత్తమం” అంటే భీముడు “అమ్మా! వీరికి వచ్చిన ఆపద ఎటువంటిదైనా అడ్డుపడదాం, కనుక్కో” అన్నాడు. కుంతి బ్రాహ్మణుని ఇంటి వైపుకు వెళ్ళి మాటాడక నిలబడింది, చూస్తూ.
ఇంటి యజమాని “భరిస్తానని, రక్షిస్తానని బాస చేసి కట్టుకున్న భార్యను పంపలేను, కన్న కూతురు, పెళ్ళి చేసి పంపవలసినదానిని పంపలేను, చివరివాడు, చిన్నవాడు, నాకు ఉత్తరక్రియలు చేయవలసినవాడిని ఎలా పంపగలను, అందుకునేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్తాను” అనుకుంటుంటే భార్య, కూతురు నేను వెళతానంటే నేనని ఏడుస్తూ, వాదులాడుకుంటుండగా, చిన్న కుర్రవాడు ఒక చిన్న కర్ర పుచ్చుకుని ”ఎందుకు ఏడుస్తారు? నేను వెళ్ళి ఆ రాక్షసుడిని చంపేసివస్తా”అని వచ్చీరాని ముద్దు మాటలంటే, అంత ఏడుపునూ అందరూ ఆపి, చూస్తున్న సందర్భంలో కుంతి కలగచేసుకుని, ”ఎందుకు ఏడుస్తున్నారు, అసలు విషయం చెప్ప”మంటే, ” తల్లీ! ఏం చెప్పమన్నావు, ఇక్కడ బకుడనే ఒక రాక్షసుడు ప్రజలను తినేస్తుంటే అందరు వాడితో ఒక ఒప్పందం చేసుకున్నాం. దాని ప్రకారం రోజుకు ఒక ఇంటినుంచి ఒక మనిషి, రెండెనుబోతులతో బండిలో ఆహారం పంపితే వాడు తీసుకుని తింటాడు, మనిషిని, ఎనుబోతులను,ఆహారాన్నీ. చాలా కాలం తరవాత మా వంతు వచ్చింది,ఈ దేశపు రాజు అశక్తుడు, రాక్షసుడిని ఎదుర్కొనే బలం లేదు,” అన్నాడు. ”అదా సంగతి, దీనికింత వ్యాకులపడటమెందుకు? మీకా ఒకడే కొడుకు వాడూ చిన్నవాడు, నాకు ఐదుగురు కొడుకులు, అందుచేత ఒకడిని మీకోసం పంపుతా”నంది. బ్రాహ్మణుడు ”శివశివా! ఎన్నిపాపాలు చేశానో తెలియదు, ఇక బ్రహ్మ హ్యత్యాపాపం కూడా మూట కట్టుకోనా తల్లీ! వద్దు వద్ద”న్నాడు. కుంతి ”మీరేం భయపడక్కరలేదు, నేను పంపుతున్న, నాకొడుకు ఇటువంటి వాళ్ళని చాల మందినే చంపిన బలశాలి,” అని భీముని పిలిచి సంగతి చెప్పి ”ఆ రాక్షసుడిని చంపి, వీరిని ఆపదనుంచి రక్షించి, నాకు ఆనందం కలగచేయవయ్యా” అంది. భీముడు ఆనందంతో ”సరే” అనిపోయి వీధరుగుమీద కూచున్నాడు.
ఇంతలో బిక్షకిపోయిన ధర్మరాజు మిగిలినవారు వచ్చి భీముడి వాలకం చూసి లోపలికిపోయి, ధర్మరాజు కుంతితో ” అమ్మా! ఏంటే భీముడు అంత హుషారుగాఉన్నాడు, ఎవరితో తగువేసుకున్నాడు” అనిఅడిగాడు. ఏకచక్ర పుర ప్రజలను బకాసురుడు తింటుండటం, ఇంటివారికి వంతురావడం, వారి తరఫున భీముడిని పంపిస్తున్నట్టు చెప్పింది, కుంతి. ”అమ్మా! ఇతరుల బిడ్డని రక్షించడానికి తనబిడ్డను త్యాగం చేసే వెర్రివాళ్ళుంటారా? భీముడు నీకు వదలివేయవలసిన కొడుకేనా?ఎంతసాహసం చేస్తున్నావమ్మా! అసలు వీడి అండతోనే కదా మనం ఇన్ని కష్టాలూ గట్టెక్కి ఇక్కడికి చేరగలిగినది,” అని పాత సంగతులన్నీ గుర్తుచేస్తాడు. ”నీకు వాళ్ళు ఆపదలో ఉన్నారన్న దానితో మతి భ్రమణం చెంది ఇటువంటి తప్పు నిర్ణయం తీసుకున్నా”వనీ అన్నాడు. దానికి కుంతి ”భయం, మోహం, లోభం,భ్రమలతో కొడుకును వదులుకునేటంత పిచ్చిదానినా? వీడి శక్తి నీకేం తెలుసు? నాకు తెలుసు, చెబుతావిను, వీడు పుట్టిన పదవనాడు పర్వతం మీద కూచున్నా, వీణ్ణి ఒడిలో వేసుకుని, హటాత్తుగా నా ఒడినుంచి కింద పడిపోయాడు,వీడికేమైనా అయిందేమోనని భయపడ్డా, తీరా చూస్తే వీడికేంకాలేదు కాని, వీడు పడిన చోట రాళ్ళన్నీ పిండిపిండి అయిపోయాయి, వీడు వజ్ర శరీరుడు, ఆ రాక్షసుణ్ణి చంపి వస్తాడు, ఈ పుర ప్రజలకి ఆనందం కలగచేస్తాడయ్యా” అని ఇంకా ధర్మాలు చెప్పింది. ”నీకు నీ తమ్ములకు ఈ బ్రాహ్మణ కార్యం నెరవేరుస్తున్నందుకు, బ్రాహ్మణ ప్రసాదంతో మీకు శుభం కలుగుతుంద”ని దీవించింది. అప్పుడు ధర్మరాజు కూడా ఒప్పుకుని బకాసురుని సంహరించిరమ్మని చెప్పేడు, భీమునికి.
ఆ సమయంలో భీముడు ”ఆకలికి రాత్రులు నిద్రపట్టటం లేదు, కడుపునిండా భోజనం పెట్టించ”మన్నాడా బ్రాహ్మణునితో. అంతే బ్రాహ్మణుడు తన బంధువులతో కూడి అన్నాలు వండేశారు, పప్పు ధప్పళాలు తాయరు చేశారు, పిండివంటలు తయారు చేశారు,భీముడికి పెట్టేరు,కడుపునిండా, బండి కెక్కించేరు. భీముడు బండెక్కేడు, బండితోలుకుంటూపోయి బకుడున్నచోట వాడిని పిలుస్తూ, వాడు వచ్చేలోగా బండిలో ఉన్న ఆహారం తినడం మొదలుపెట్టేడు.
ఇలా తింటుండగా బకుడు ”ఈ వేళ ఆలస్యంగా తేవడమే కాక నా ఆహారం నువ్వు తింటున్నవేంట్రా!” అని భీమునిపై పడ్డాడు. పెద్ద యుద్ధమే జరిగింది, చివరికి భీముడు బకుని నడుము పట్టుకుని వాణ్ణి చెరకుగడ విరిచినట్టుగా విరిచేస్తే నెత్తురు కక్కుకుని బకుడు చచ్చేడు. వాడు చస్తూ అరచిన అరుపు విని వాడి బంధువులొస్తే ”మీకూ ఇదేగతిపడుతుంది తిన్నగా ఉండకపోతే” అని హెచ్చరిస్తే వాళ్ళు భయపడి పారిపోయారు. భీముడు బకాసురుని శవాన్ని ఈడ్చుకువచ్చి కోట సింహద్వారం దగ్గర పడేసి ఇంటికొచ్చాడు, బకాసురుని చంపేనన్నదానికి సాక్ష్యంగా. బ్రాహ్మణులంతా సంతోషించారు, జరిగినది తల్లికి అన్నతమ్ములకి చెప్పేడు, ఊరు విరగబడింది భీముణ్ణి చూసేందుకు……..
అమ్మయ్య! చాలా పెద్ద కధని చాలా తగ్గించేను, పద్యాలు కూడా పెట్టకుండా. భీముడిని బక సంహారానికి పంపి కుంతి సాధించిన ఫలితాలు.
1. అన్నదమ్ముల మధ్య ఐక్యత పెంచింది, రాబోయేకాలంలో కావలసిన ఐక్యతకి పునాది వేసింది.
2.భీముని శక్తి సరిగా అంచనా వేసింది, అది ప్రజలకి ఉపయోగపడేలా చేసింది.
3.పాండవులలో ఆత్మస్థైర్యాన్ని పెంచింది.
4.ప్రజలకి చేరువ కావాలని హితబోధ చేసింది.కర్తవ్యమూ చెప్పింది.
5.పాండవులని, అప్పటికి ప్రజలకి తెలియకపోయినా, తరవాత కాలంలో పాండవులు ప్రజా రక్షకులే అనే మాట ప్రజలకు చేరేలా చేసింది. ప్రజలికి పాండవులను దగ్గర చేసింది.
6. ఆ దేశపు రాజు అప్పటికి పట్టించుకోకపోయినా వారు పాండవులని తెలిసిన తరవాత వైరి పక్షాన చేరే సావకాశాన్నీ తగ్గించింది.
ఒక మంచిపని చేసి అనేకమైన ప్రయోజనాలను పొందిన, పొందచేసిన కుంతి ఎంత ఆలోచనపరురాలు. నేడు సమాజానికి కావలసినది కుంతిలాటి, ధర్మమే జయిస్తుందని ఉద్భోధ చేసే గాంధారి లాటి తల్లులేకాని, పిరికివారు,బాధ్యతలేని అధికారం వెలగబెట్టమనే తల్లులు కాదు. ఏమంటారు?
ఇంకేమంటాం? ఔననే అంటాం .చిన్నప్పుడెప్పుడో చదువుకున్న కథ ,బాగా గుర్తు చేశారు బాబాయ్ గారూ !ఈ రోజుల్లో అలాంటి తల్లలను ఆశించడం అత్యాశ అవుతుందేమోనండీ!
అమ్మాయ్ నాగరాణి,
ఇది అత్యాశకాదమ్మా, నేటి అవసరం, అత్యవసరం కూడా. ఇప్పటికి ఇటువంటి తల్లులున్నారు. మీరంతా బిడ్డల శక్తిని అంచనావేసి వారిని సరిఅ అయిన దారిలో పెట్టటం లేదూ! అది ప్రజలకి ఉపయోగపడేదయితే పేరొస్తుంది.
ధన్యవాదాలు.
భీముడిని బక సంహారానికి పంపి కుంతి సాధించిన ఫలితాల గురించి చక్కగా వ్రాసారు.
అనురాధ గారు,
బిడ్డ శక్తిని మొదట గుర్తించగలిగినది తల్లే.
ధన్యవాదాలు.