ఈతిబాధలు.
చెళ్ళపిళ్ళవారు తమ ”కథలు-గాధలు” పుస్తకంలో ’ఈతిబాధలు’గురించి చెప్పేరు. ఎప్పుడో ఏభై ఏళ్ళకితం చదివేను, మళ్ళీ చదువుదామంటే పుస్తకమే దొరకలేదు. ఇప్పుడు నా ఈతిబాధలేమంటారా?
ఎండలు,ఎన్నికలు,పరిక్షలు, ఉపనయనాలు, వివాహాలు,పునస్సంధానాలు (నవ దంపతుల మొదటిరాత్రి మహోత్సవం, వివరం తెలియని వారికోసమే,),కరంట్ పోవడాలు,దత్తత, సాంవత్సరీకాలు, కంప్యూటర్లు పనిచేయకపోవడం,ప్రయాణాలు,అన్నీ జమిలిగా అనారోగ్యంతో , బద్ధకంతో కలిసి దాడిచేస్తే నాలాటి అర్భకుడు తట్టుకోడమెలా సాధ్యం చెప్పండి?
ఎండలు ప్రతిసంవత్సరంలాగే కాస్తున్నాయి, వయసుపెరుగుతోంటే ఓపిక తగ్గుతోందన్న మాట మనసు ఒప్పుకోటం లేదు, అదీ తిరకాసు. ఎండలకి అనారోగ్యంకి చుట్టరికంకదా! వేసవి తట్టుకోలేక బాధలు. పోనీ ఏ.సి లో కూచుందామంటే జ్వరం వచ్చేస్తుంది, పోనీ ఎలాగో భరిద్దామనుకుంటే కరంటేదీ? మరి బాధ కదా!!
”మా అక్క మనవడి ఉపనయనం, ఎప్పుడు మనప్రయాణం?” అని ఇల్లాలు అనడంతో నా ప్రయాణాల, శుభకార్యాల సంబరం మొదలయ్యింది, మార్చి 19 న. ఉదయమే వెళ్ళేం ఎండపడకుండా, వచ్చేటప్పుడు సాయంత్రం వడ దెబ్బ తగిలేసింది, ఇంతకీ ప్రయాణం ఎక్కడికి? కాకినాడ. ఇంటికొచ్చి సేద తీరుతున్నామనుకునేలోగా ”మీ అక్క మనవరాలి పెళ్ళికి వెళ్ళాలా?” శ్రీమతిగారి ప్రశ్న. ”ఏమో! నువ్వే చెప్పాలంటే” ”నేను రాననుకున్నారా? అది మీకు ఆక్క కావచ్చు, నాకు ఆడపడుచూ కావచ్చు, కాని, మన పెళ్ళికి ముందే అది నాకు మేనత్త కూతురు తెలుసా? ఇది మరచిపోకండి నడవండ”న్నారు. మళ్ళీ ఉదయమే వెళ్ళేం, రోజు ఎండ భరించేం, రాత్రి పెళ్ళి చేయించేం,నిద్ర లేక సోలిపోయాం, ఉదయమే వచ్చేశాం. మరి ఈ బడలిక అనారోగ్యంలోకి దింపి బాధ పెట్టలేదా? తేరుకున్నామనుకునేలోగా నిరుడు ఇదే సమయంలో ముగ్గురు తోబుట్టువులు కాలం చేసేరు కదా సంవత్సరం గిర్రున తిరిగొచ్చేసింది. అన్నిటికి వెళ్ళలేకపోయినా అన్నగారి సాంవత్సరీకానికి వెళ్ళాలనుకున్నా. ఇల్లాలు ”ఇక నా వల్లకాద”ంది. ”ఒక్కడినే వెళ్ళలేన”ంటే తన అన్నగారిని జతిచ్చింది, బండి మీద బయలుదేరి వెళ్ళి, తిరిగివచ్చేటప్పుడు పెద్ద ప్రమాదమే దాటేం, అదిప్పుడు కాదు మరోసారి,వాడూ నేనూ, ఇద్దరం ఎవరికి చెప్పలేదు. ఆ బాధతో రెండు రోజులు ఇబ్బంది పడితే, మూడవరోజు ”బాబాయ్! రేపు సత్యనారాయణ వ్రతం నువ్వూ పిన్నీ రావాల”న్నారు, అన్న కొడుకులు. మనసుపీకింది ”ప్రయాణం చెయ్యలేనయ్యా! ఈ వాహనాల్లో” అంటే ”కార్ పంపుతాను రండి” అన్నాడు. వెళ్ళాలనిపించింది కాని, వెళితే బాధ మరికొద్ది పెరుగుతుందని వద్దని చెప్పేసేం. వాళ్ళ మనసు బాధ పెట్టివుండచ్చు, కాని మా ఇబ్బందులు గమనించి వుంటారని అనుకున్నాం.
ఫిబ్రవరి మొదలు కరంట్ ఎప్పుడు ఉండేది ఎప్పుడుపోయేది తెలియని సంగతి. సోలార్ ఉంది కనక పని నడిచిపోతోంది. ఈ లోగా ఏప్రిల్ నెల పది తరవాత టపా రాయలేదు. పాత టపాలు గిలికి వేసేను, మనసు ఆగక ఏప్రిల్ 23 న శ్రీపాద వారి పుట్టినరోజుకు పాత టపా రాసి వుంచినది షెడ్యూల్ చేసేను. ఆ రోజు టపా వెళ్ళిందో లేదో చూదామంటే బ్లాగు పని చెయ్యలేదు, ఏమయిందో తెలియలేదు. అబ్బాయి తనకు ఏవో పరిక్షలున్నాయని చదువుకుంటున్నాడు. ఉండలేక చెప్పేస్తే, చూసి, ఇప్పుడు చెయ్యలేను తరవాత చూద్దామని, నాకు బ్లాగు మరోబ్రవుసర్ లో ఓపెన్ చేసిచ్చాడు. అప్పుడే ఫాతిమాజీకి విషయం టూకీగాచెప్పి తప్పుకున్నా. అది మొదలు బ్లాగు దొరకలేదు. ఒక మనవరాలికి మైల్ ఇచ్చా, ఇలా వుందని, నాకు బాగానే దొరుకుతోందని సమాధానమిచ్చింది. నా దురదృష్టం కొద్దీ లేప్ టాప్ డెస్క్ టాప్ రెండూ పని చెయ్యలేదు, చెడిపోయాయి, ఎందుకో తెలియలేదు. అబ్బాయి పరిక్షల తరవాత చూస్తాడని ఊరుకున్నా. నా బాధ చూడలేక మరో లేప్ టాప్ తెచ్చి ఇస్తానని, మొన్న తెచ్చి పెట్టేడు. ఇందులో బ్లాగయితే ఓపెన్ అయింది కాని తెలుగులేదు, మళ్ళీ సమస్య మొదలుకొచ్చింది. అదేదో చూసుకుని టపా రాద్దామనుకునేసరికి, కావలసిన వారు నా సలహా సంప్రదింపులతో ఒక అబ్బాయిని దత్తత తీసుకుంటున్నారు, ఇప్పుడు ఆ కార్యక్రమానికి రేపు పదో తారీకున వెళ్ళకతప్పదు. మళ్ళీ ఎలా వుంటుందో! మూడురోజులుండాలన్నారు, ”బాబూ ఒక రోజు వచ్చి సాయంతరం వెళిపోతానని” చెప్పి ఒప్పించాను, కాకినాడ వెళ్ళాలి.
అంతా ఒప్పుకున్నాం కానీ ఈ ఎన్నికలు,పునస్సంధానాలు ఈతిబాధ అర్ధం కాలేదంటారా? ఎన్నికలలో మాకే ఓటేయండి అని అడిగేవారు చల్లబాటువేళొస్తున్నారు, బాగానే వుందికాని అప్పటికే నిద్రలోకి జారిపోయిన నన్ను నిద్ర లేపి చెప్పి అవుననిపించుకుంటే కాని వదలరు, మరి ఆ తరవాత నిద్ర హూష్ కాకి! ఇది భరించలేక ”ఆయనకి ఇన్ని సార్లు చెప్పక్కరలేదండి మీ మాట బాగా గుర్తని” చెప్పి ఈ బాధనుంచి తరవాత తప్పించేసేరు, ఏ రోజు ఏ ఛానల్ టి.వి లో పెట్టినా, వస్తున్న వార్తలతో మనసు బాధ పడుతోంది, తప్పించుకోడమెలా? పేపర్ కూడా చూడటం మానేసేను, కాని పునస్సంధానాల బాధ మాత్రం తప్పలేదు. మరి నాగరికులిప్పుడు పునస్సంధాన కార్యక్రమం పెడుతున్నారో లేదో కాని పల్లెలలో జరుపుతున్నారు. ఇదిగో ఇందులో ”దంపతి తాంబూల”మని ఇస్తారు,భార్యాభర్తలకి, అందునా అది సీనియర్లకే ఎక్కువ డిమాండు. అందునా మాలాటి అర్ధ సెంచరీ సంసారజీవితం గడిపినవారిని తప్పక పిలిచి ఇస్తారు. బహుశః కొత్తవారికి వీరిని చూపి వీరిలాగా దెబ్బలాడుకున్నా, కలసి బతికే సావకాశమే చూడమని సలహా అనుకుంటాను. ఈ తాంబూలం పుచ్చుకోడానికి వెళ్ళడమంటే శ్రీమతిగారికి చాలా సరదా. ఇద్దరమూ వెళ్ళాలి, అక్కడ ఆడ మళయాళంలో ”బాబాయొచ్చాడే తప్పుకో, మామయ్య నడుముందుకి, తాతా రా!, అని ఇలా పలకరిస్తే ఇల్లాలితో కలిసి పాన్పుదగ్గరకెళ్ళి, నవదంపతులిచ్చే తాంబూలం స్వీకరించి వారిని నేను ”సుపుత్రికా ప్రాప్తిరస్తు” అని ఆవిడ ”సుపుత్రాప్రాప్తిరస్తు” అని ఆశీర్వదించి రావడం అలవాటు. బానే వుందికాని వారిచ్చే తాంబూలంలో ముసలి దంతులకి నవదంపతులు చెరొక కొబ్బరిబొండాం ముచికతో ఉన్నది ఇస్తారు. ఇది తెచ్చుకోవాలి, ఇల్లాలికిద్దామంటే ”నాదీ మీరేతెండి అంటే!” అలా అంటే తేకపోతే ఆవిడ చిన్నబుచ్చుకుంటే చూసి సహించగలనా!! ఇది బలహీనత కాదు అదో సరదా. ఆ బొండాం పుచ్చుకుని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, ఆ రాత్రి వేళ ఇంటికి చేరడం ఆనందంగానే వుంటుందికాని, ఆ తరవాత నిద్దరే కరువైపోతుంది… మరిది ఈతిబాధ కాదంటారా? అందుకే ”అనువు కానిచోట అధికులమనరాదు,” ఎక్కడా అనువుకాని చోటు వగైరా……తరవాత టపాలో
బాగుందండి. చాలా కాలానికి ఈతిబాధలు అన్నీ తప్పించుకొని చల్లని కొబ్బరినీళ్ళలాంటి టపా రాసారు. తరచూ రాస్తుండండి శర్మగారూ.
వర్మాజీ,
ఆలస్యానికి మన్నించాలి.ఈతి బాధలు లేకపోతే రోజుకో టపా సాయించడం పెద్ద కష్టం కాదండి.
ధన్యవాదాలు.
“ఆ బొండాం పుచ్చుకుని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, ఆ రాత్రి వేళ ఇంటికి చేరడం ఆనందంగానే వుంటుంది”
ఇది చదివినప్పుడు “మిథునం” సినిమాలో పేరంటం తరువాత బాలు, లక్ష్మి నడుచుకుంటూ వెళ్ళడం గుర్తొచ్చింది.
మిత్రులు బోనగిరిగారు,
ఆలస్యానికి మన్నించాలి. పాత సంగతులు తిరగేసుకోడానికి అంతకు మించిన ఏకాంతం దొరకదు కదండీ!
ధన్యవాదాలు.
ఈ పంతులు గారు, అంటే e-పంతులు గారు , ఈతి బాధలు చెప్పినా ఐటీ బాధలు చెప్పినా దాని పునః ‘స్పందన’ యే వేరు సుమీ !!
శుభకామనలు – బ్లాగ్ టపా ‘పునః సంధించి’ నందులకు !!
చీర్స్
జిలేబి
జిలేబి గారు,
9 న ఉదయంనుంచి ఎండ మధ్యాహ్నం పెద్ద వర్షం, రాత్రి జ్వరం, ఉదయాన్నే ప్రయాణం, వైద్యం, తిరుగుటపాలో రావడం మొదలు ఈతి బాధలు ఇంకా కొనసాగుతున్నాయి.ఈ నాలుగు రోజులు ముజ్జిడ్డు పడ్డాం, ఇద్దరికి అనారోగ్యంతో, ఈ వేళ కాస్త ప్రజల్లో పడ్డాం. మీ అభిమానానికి ధన్యవాదాలు