శర్మ కాలక్షేపంకబుర్లు-శీతకన్నేయకండి!

శీతకన్నేయకండి!

”శీతకన్ను” అంటారు అది సీత కన్నా, శీత కన్నా వివరించండి అన్నారు శ్రీదేవిగారు, వారి కామెంట్ లో, నా టపాకి. ఇది ప్రశ్నా? కాదు పరీక్ష, సమాధానం రాస్తున్నాను, న్యాయ నిర్ణేతలు మీరే.

శీత కన్ను అంటే ’ఉపేక్ష’ అనే అర్ధంలో వాడతాం. మాకు మీ మీద అపేక్ష ఉందికాని మీరే ఉపేక్ష చేస్తున్నారని చెప్పడానికి వాడే మాటే శీతకన్నేస్తున్నారనటం.

భూభాగం ఉత్తరార్ధగోళంలో ఎక్కువుంటుంది. అందునా మన దేశం సమ శీతోష్ణ స్థితిలో ఉంటుంది. అంటే శీతం ఉండేకాలం, ఉష్ణం ఉండే కాలం సమానంగా ఉంటాయని. ఊహారేఖలు 7 డిగ్రీల ఉ. 32 డి.ఉ మధ్య మన దేశం ఉంది. అందునా మన ఆంధ్ర దేశం 17డి. ఉ. ప్రాంతంలో ఉంది. మనకు వేడి కొద్దిగా ఎక్కువే! అందుకే మనవాళ్ళు ప్రతిదానికి ఇలా అంటారు, ”నీ ఇల్లు చల్లగా ఉండ”అంటారు దీవించేటపుడు,మీ చల్లని చూపు మామీద ఉండాలి,” ఇంకా ”అమ్మ కడుపు, చల్లగా, అత్తకడుపు చల్లగా, నువ్వు వెయ్యేళ్ళు వర్ధిల్లాలని, నీ ఇల్లు వెయ్యిళ్ళ మొదలవ్వాల”ని తలంటుకు నూనె పెడుతూ అమ్మ దీవించేది గుర్తుందా? అమ్మ కడుపుచల్లగా అంటే నువ్వు బాగోవాలి, అత్త కడుపు చల్లగా అంటే నీ భార్య/భర్త బాగోవాలి అని ఆకాంక్ష, ఎంత గొప్పదండీ మన సంస్కృతి. మన వాళ్ళు కోపం వస్తే ’నీ ఇల్లు తగలడిపోనూ, నీ ఇల్లు వల్లకాడుకానూ, నీ ఇంట జిల్లేళ్ళు మొలవా’ అనే దీవిస్తారు. మరి శీతల దేశస్థులు వారిల్లు వేడిగా ఉండాలని కోరుకుంటారు, అందుకే వారు గృహప్రవేశాన్ని హవుస్ వార్మింగ్ సెరిమనీ అంటారు. ఎవరికి ఏది కావాలో దానినే కోరుకుంటూ ఉండటం మానవ నైజం. ఇదేంటీ శీత కన్నా? సీత కన్నా అంటే సమాధానం ఏ-క్ఖ-డా- లంగరందనిది చెబుతున్నారు, అనికోపించకండి, వస్తున్నా.మన పలుకుబడులు వాతావరణానికి సంబంధించి కూడా ఉన్నాయి, సార్వజనీనంతో పాటుగా. చల్లని చూపు కావాలన్నవారు, శీతకన్నెయ్యకండి అనడం ఎంటని కదా అనుమానం. శీత కాలంలో సూర్యుడు దూరంగా జరిగిపోతూ కొద్దికాలమే కనపడి చలిబాధ కలగచేస్తున్నాడు. మనవారు చల్లగా ఉండాలన్నారు కాని చలిగా ఉండాలని కోరలేదు. ఈ కనపడకపోడం, తక్కువ కాలం కనపడటం తద్వారా కలగచేసే బాధను ప్రాతిపదికగా తీసుకుని, సూర్యుడు దూరంగా జరిగిపోయి చలిబాధ కలగచేస్తున్నట్టుగా, మీరు ఉపేక్ష చేసి బాధ పెడుతున్నారనడమే శీతకన్నేస్తున్నారనడం. పగటి కాలం తక్కువ కనక ఒక సామెత కూడా చెప్పేవారు. ”శీత కాలపు పొద్దు కలిగినవారి కోడలు కంచాలు కడగాడానికి సరిపోదని,” అంటే పగటి సమయం తక్కువ కనక కావలసిన అత్యవసరపనులు చేసుకోడం తప్పించి మిగిలిన కార్యక్రమాలు అంటే మిత్రులను బంధువులను చూడటం పలకరించడానికి సమయం సరిపడని కాలం.శీత కన్నంటే శీతాకలపు కన్ను అనగా తక్కువ సమయమని (సాకు)వంక చెప్పి పలకరించకపోవడం, కనపడకపోవడం గా గుర్తించాలి, కాని చల్లని కన్నని కాదు, సీతకన్నూ కాదు.

ఈ శీతకన్ను గురించి చెప్పాలంటే స్త్రీలదే అగ్రభాగం. శీతకన్నెయ్యడమూ వీరికే తెలుసు, శీతకన్నెయ్యద్దని చెప్పడమూ వీరికే తెలుసు. భాషా ప్రయోగం ఆడవారి దగ్గరే నేర్చుకోవాలి. దానికి చిన్న తార్కాణం ఈ మాటలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో!

1.వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.

2.ఏవండీ..ఇదేమైనా బావుందా?? అదే చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చెయ్యడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్దురూ..:) 

3.కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !

ఈ మాటలెవరివో చెప్పుకోండి చూద్దాం!
ఈ రెండో కామెంట్ అమ్మాయి, అబ్బ! పెద్ద అల్లరిపిల్లండీ బాబూ. నాకు రైట్ క్లిక్ కి కూడా సావకాశం లేకుండా చేసింది. వీళ్ళు నామీదకి దండయాత్రకి వస్తారేమో వాళ్ళ మాటలు అడగకుండా వాడుకున్నందుకు  ముందే క్షమాపణ చెప్పేస్తే పోలా! అమ్మలూ మీరు ముగ్గురూ నన్ను క్షమించండి మీ మాటలు మిమ్మల్ని అడగకుండా వాడుకున్నందుకు క్షంతవ్యుడిని

 

ఇవి కొన్ని బ్లాగులలో అమ్మాయిలు వాడినవి. ఇలా మీకు మరే మగవారి బ్లాగులోనైనా కనపడ్డాయా? మాతృ భాష అంటే స్త్రీలకి అంత మక్కువ.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శీతకన్నేయకండి!

 1. శర్మ గారూ చాలా థాంక్స్ అండీ!!
  గుర్తు పెట్టుకుని చక్కటి వివరణ ఇచ్చారు.

  • శ్రీదేవి గారు,
   వివరణ ఇచ్చాను, చూశారా? చూడలేదా? నచ్చలేదా? ఇలా గుంజాటన పడ్డాననుకోండి, ఇప్పటి దాకా! నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 2. మీ టపా తో పాటుగా,
  మీ టపా కు వచ్చిన వ్యాఖ్యానాలు కూడా ‘ చూస్తూంటే ‘ ,
  వాడి పోతూన్న మన తెలుగు పూవులు, వికశిస్తూ కనిపిస్తున్నాయి !
  మరి ‘ ఆ తెలుగు తోట మాలి ‘ మీరే కదా, అందుకే !

  • సుధాకర్జీ,
   తెనుగుతోట ఎప్పుడూ పచ్చగానే వుంటుదండీ. అప్పుడప్పుడు వడ గాలికి వాడుతుంది కాని ఎండిపోదు, మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 3. చాలా బాగుంది బాబయ్ గారు, మంచి మంచి విషయాలు చెప్తున్నారు. నాకేమో మరి నా చిన్నప్పుడు మా నాన్న మేనత్త ఇంటి పనీ వంట పనీ చేస్తూ “పొద్దు పొద్దున ఛాయ పొద్దున్న ఛాయ, పొద్దున్న భానుడూ పొన్నపూ ఛాయ” అని ఒక పాట పాడేవారు, అవిడ ఇప్పుడు లేరు కానీ నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం, కానీ గుర్తు లేదు 😦 మీకు వీలుంటే నాకోసం ఆ పాట ని టపాయించగలరు

  • లక్ష్మిగారూ,

   మీరు అడిగిన పాట ఇదే అయిఉంటుందని నమ్మకం. చిన్నప్పుడు ఆకాశవాణిలో తరచుగా ప్రసారమయ్యేది.

   భవదీయుడు,
   వర్మ

   • ధన్యవాదాలండీ వర్మ గారు. లిరిక్స్ ఇవే కానీ ఆవిడ ఇంకుంచం వేగంగా భలే ట్యూన్లో పాడేవారు. చాలా రోజులుగా స్పందించలేకపోయాను, క్షమించగలరు

 4. ఈ వాక్యములో దోషము ఏమైనా ఉన్నదా ? తెలియజేయ గలరు !!—> అమ్మాయి అబ్బ పెద్ద అల్లరిపిల్లండీ (అల్లరి పిల్లాడండి అని ఉండాలి కాదా ?)

  జిలేబి

  • యువరానర్!

   అల్లరిచేసే హక్కు అదోదో మగపిల్లలదే అన్నట్లు జిలేబీగారి వ్యాఖ్యలో ధ్వనిస్తోంది. దీనికి నా తీవ్రాతితీవ్రమైన అభ్యంతరం తెలియజేసుకుంటున్నాను.

   దోషమేదైనా ఉంటే అది జిలేబీగారి కామెంటులోనే ఉందని మనవి చేసుకుంటున్నాను.

   • ఆర్యా,

    అమ్మాయి ‘అబ్బ’ ఎట్లా ‘పిల్ల’ అగును అన్న సందేహం వస్తేను!!

    ‘some’ దేహ ప్రాణి
    జిలేబి

   • మిత్రులు రావు గారు,
    అల్లరి ఎప్పుడు చెయ్యాలో, ఎప్పుడు మానాలో ఆడపిల్లలకి తెలిస్నంత, సున్నితమైన అల్లరి వారు మాత్రమే చేయగలరని , మగ పిల్లలది బండ అల్లరని జిలేబి గారు గుర్తిస్తారనుకుంటా.
    ధన్యవాదాలు.
    ధన్యవాదాలు.

  • జిలేబి గారు,
   ఒక చిన్న పొరపాటు, అబ్బ తరవాత ఒక కామా ఉంటే బాగుండేది కదూ!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s