శర్మ కాలక్షేపంకబుర్లు-గో.జి.ల దంతసిరి-కొత్తపల్లి కొబ్బరి.

తూగో.జిలో కొత్తపల్లి అని రెండూళ్ళున్నాయి, ఒకటి గోకవరం కొత్తపల్లి, రెండవది ఉప్పాడ కొత్తపల్లి.. రెండూ ప్రసిద్ధి చెందినవే. గోకవరం కొత్తపల్లి మామిడి రకానికి రెండవది ఉప్పాడ దగ్గరున్నది జందానీ చీరలకి ప్రపంచ ప్రసిద్ధి, ఈ మామిడి గురించి…

ఈ మామిడిని కొత్తపల్లి అనే వూరిలో అభివృద్ధి చేశారు కనక దీనికి కొత్తపల్లి కొబ్బరి అని పేరొచ్చింది. ఈ మొక్కని అంటుగా పాతుకోవచ్చు. పదెకరాల తోటకి ఒకటే మొక్క వేస్తారు. దీనిలో పారు ఎక్కువ, దిగుబడి తక్కువ, కాని రుచి వాసన గొప్పగా వుంటాయి. ఈ రకం పళ్ళని పెద్దవారికి నేమానుగా పంపడం మా జిల్లా వాసుల అలవాటు.

ఈ కాయ పుట్టినదగ్గరనుంచి ఉపయోగమే, పింది కూడా ప్రత్యేకత. జీడి పట్టక ముందు వీటిని మెంతి బద్దలని వేస్తారు, బలే కమ్మగా ఉంటాయి, పప్పు అన్నంలో నంజుకుంటే! జీడి పట్టిన దగ్గర నుంచి టెంక పట్టే దశ దాకా పులుపు బలే ఉంటుంది. పప్పులో వేసుకుంటే ఆ రుచే వేరు, మరే కాయకి ఈ రుచి రాదు. ఆ తరవాత పండుకొచ్చే లోగా ఆవకాయ కి బలే ప్రసిద్ధి. పులుపే పులుపు, ముక్క సంవత్సరమైనా మెత్త బడదు, రుచికి రుచి అందుకు ఆవకాయ పెట్టడానికి ఎక్కువ మంది దీనికోసం ప్రయత్నం చేస్తారు. దీనిని ఆవకాయ చెట్టని కూడా పిలుస్తారు. ఆ తరవాత కాయ ముదురు ఆకుపచ్చకి మారి బూడిడ పోసుకుంటుంది, తెల్లగా. ఇది పక్వ దశ, చెట్టునుంచి పళ్ళు రాలుతుంటాయి. అప్పుడు కోసి కావు వేస్తే, సువాసన బలే బాగుంటుంది. పనస పండు వాసనలాగా దీని వాసన కూడా చాలా దూరం వ్యాపిస్తుంది. రుచి చెప్పే ప్రశ్న లేదు. ఈ కాయకి మరో ప్రత్యేకత పీచు. పండులో టెంకని ఎంత సేపు చీకినా ఇంకా తియ్యగా రసం వస్తూనే ఉంటుంది. ఈ పండు తినడానికి అలవాటు పడిన వారు మరొక పండు తినలేరు. తొక్క పలచన, రసం పల్చగా ఉంటుంది, పల్చటి రసంలో అన్నం వేడి వేడిగా కలుపుకు తింటే, చిరుపులుపుతో తీపి అద్భుతః. పండు మిగలముగ్గిపోతే తీపికి అంతులేదు, చెయ్యి ఎంత సేపు నాకినా తీపి కనపడుతూనే ఉంటుంది,. మా వాళ్ళు ఎందుకలా చెయ్యినాక్కోడం మరో పండు తినచ్చుగా అంటారు.మీరీ పండును గుర్తించడానికి మార్గాలు, మంచి సువాసన, మిగల ముగ్గిన పండు ముసలివాళ్ళ చర్మంలా ముడతలు పడి ఉంటుంది.

DSCN4796

మా చెట్టుకి వేపచెక్క ఎరువుగా వేస్తాం. పైన పురుగు పట్టకుండా వేప గింజలు, జిల్లేడాకులు, పచ్చి మిర్చి చేర్చి నీళ్ళలో నానబెట్టి వారం తరవాత తేర్చి దానిలో కొద్దిగా వేపనూనె కలిపి, ఆ పై కొద్దిగా నిర్మా చేర్చి గిలకరించి చెట్టు మీద చల్లుతాం, ఒకటి రెండు సార్లు, పురుగు చేరదు. మిగిలిన పిప్పిని మొదటిలో వేస్తాం ఎరువుగా. దగ్గరగా వెయ్యి కాయ కాస్తుంది. దగ్గరగా మూడు వందల పచ్చికాయ వాడుతాం. మిగిలినది కోసి ముగ్గేస్తాం, దగ్గరగా ఆరువందలలో రెండు వందలదాకా కుళ్ళిపోతాయి, నాలుగువందలు లో కొన్ని తింటాం, మిగిలినవి బంధువులు, మిత్రులు, చుట్టు పక్కల వారికి పంచుతాం. కోయలేని కాయలుంటాయి దగ్గరగా ఏభయి వీటిని, చిలకలకి, ఉడుతలకి, పక్షులకి వదిలేస్తాం, ప్రత్యేకంగా, అప్పటికే అవి ఎన్ని తిన్నా.

పండుకి కుళ్ళు తెగులు కొద్దిగా ఎక్కువే. అందుతో లభ్యత తక్కువ. రైతు పెంచకపోడానికి కూడా కారణం. ఇదిగోనండి ఇటువంటి చెట్టు కాసింది, కొంత కాలం ఆరోగ్యంగా ఉండటంతో కాయలు ఊరగాయికి బంధు మిత్రులకిచ్చాం. కొన్ని అమ్మకానికి, ఇచ్చాము,కాయ పది రూపాయలు. మేమూ ఊరగాయ పెట్టుకున్నాం. ఆ తరవాత అనారోగ్యాల పాలవడంతో కొద్ది కాయ మాత్రమే పండేసి పంచి పెట్టేం, అందరికి ఒక సారి.. పళ్ళు అమ్మం, ఊరకనే ఇస్తాం. పచ్చి కాయ అమ్మి పండుపంచిపెట్టడమేంటని కదా అనుమానం. ఊరగాయ పెట్టుకునేవారే అందరూ, కొనక్కరలేకపోతే అందరూ తయారే. పళ్ళు ఐతే అందరూ కొనుక్కో లేకపోవచ్చు, అందుకు ఇంటి జనాభానుబట్టి పంచిపెడతాం. ఇంకా కొంత కాయ చెట్టునే ఉండిపోయింది,అనారోగ్యంతో ఇద్దరమూ ఆ పని చేయలేకపోతున్నాము, కాయ కోసేవారు లేరు, పండబెట్టేవారు లేరు, కాయలు రాలిపోతున్నాయి, ఏమీ చెయ్యలేక చూస్తూ ఊరుకున్నాం, కోసి పండెయ్యడానికి ఎవరూ సాయానికి రారు. ఇద్దరు ముగ్గురికి చెప్పేం కాయలు కోయమని, ఎవరేనా దొరికితే కాయ కోయించి పండేయించి పంచి పెట్టాలి, ఎంత వరకు వీలు కుదురుతుందో తెలియదు, అమ్మ దయ ఎంత ఉందో! అమ్మేయచ్చు కదా అంటారా! ఇలా పది మందికి పంచి పెట్టేవి అమ్ముకోడం ఎందుకో ఇష్టముండదు, ఇద్దరికి, అదీ బాధ. వీటి ఖరీదు ఎక్కువే. వంద పళ్ళూ 2500/- నుంచి 3500/- దాకా పలుకుతుంది. కాయ రాలుడు ఎక్కువుంటుంది.

మామిడి కాయల కోసం రాజమంద్రి సెంట్రల్ జైలుకెళితే…ఏంటండీ జైలుకెళ్ళమంటున్నారని కదా అనుమానం. మా రాజమంద్రి సెంట్రల్ జైల్ కి పంటభూములు, మామిడితోటలు ఉన్నాయి. అందులోని జీవిత ఖైదీలు వ్యవసాయం చేస్తారు. కూరల దగ్గరనుంచి పండిస్తారు, మామిడి కాయలయితే చెప్పేదే లేదు. జైల్ కూరగాయలు మార్కెట్ కి వస్తాయి, అవంటే జనం విరగబడి కొంటారు. అలాగే జైల్ లో ఫలానా రోజునుంచి మామిడి కాయలు అమ్ముతారని ప్రకటిస్తారు. ఇదుగో ఈ రకం కాయలు కూడా అమ్ముతారు. చెట్టు దగ్గరకి తీసుకెళ్ళి కాయ కోసి చూపించి నచ్చిన కాయ, చెట్టు నుంచి దింపి అందచేస్తారు. నిజంగా అది అనుభూతే. ఈ వ్యవసాయం చేసినందుకు వారికి రోజు కూలి కాక, లాభాలలో వాటా కూడా ఇస్తారు, ఇలా జైల్ లో సంస్కరణలు కూడా మాతోనే మొదలు.

ఇక ప.గో. జిలో మొగల్తూరు బంగినపల్లి ప్రసిద్ధి. పేరు మొగల్తూరు కాని కాయ అంతా పేరుపాలెంలో నే దొరుకుతుంది, లారీలకొద్దీ ఎగుమతి చేస్తారు. ఈ బంగిన పల్లి కాయ రుచి చాలా గొప్పగా ఉంటుంది, తినాలి కాని చెబితే సుఖం లేదు. సముద్రపు ఒడ్డున అంత రుచయైన కాయి ఎలా కాస్తుందో భగవధేఛ్ఛ. ఇవి మా గోజిలలోనే దొరుకుతాయి మరి.ఇక్కడపండితేనే బాగుంటాయి. ఉండండి ఎవరో పిలుస్తున్నారు, కాయ కోసేవాళ్ళే కావచ్చు, ఉంటా.

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గో.జి.ల దంతసిరి-కొత్తపల్లి కొబ్బరి.

 1. ‘ తియ్యగా నూ , పుల్ల గానూ ‘ వివరించారు , మీ ఊరి ( న్చే ) మామిడి గురించి !
  మిగిలిన వాటిని అమ్మటం గురించి మొహమాట పడకండి !
  అమ్మిన డబ్బు సత్కార్యాలకు ఉపయోగ పడవచ్చు కదా !

  • సుధాకర్ జీ,
   దేని అందం దానిదే! అనుకుంటాం కాని నిజానికి డబ్బులు చేతిలో పడితే, ఏమీ చేయలేమండి, అదో బలహీనతే, అందుకే ఇలా కష్టమైనా పళ్ళు పంచిపెట్టాలనుకోడం.
   ధన్యవాదాలు.

 2. అన్నట్లు, మరో ముక్కండోయ్.
  “ఈ మామిడిని కొత్తపల్లి అనే వూరిలో అభివృద్ధి చేశారు కనక దీనికి కొత్తపల్లి కొబ్బరి అని పేరొచ్చింది. ” అంటారేం?
  కొత్తపల్లిమామిడి అని పేరురావాలి కదా న్యాయంగా? కొబ్బరేమిటీ?

 3. ఎక్కడో‌ చదివాను చిన్న తమాషా.
  ఒకాయన చచ్చి స్వర్గానికి వెళ్ళాడట. స్వర్గం గొప్పల గురించి చెబుతుంటే దేవతలు తనతో, ఆయన వాళ్ళనో ముక్క అడిగాడట. “ఇంతకీ మావిడివళ్ళు ఏఏ రకాలున్నాయీ స్వర్గంలో” అని. వాళ్ళు తెల్లముఖాలేసుకొని,
  మావిడిపళ్ళా ? అలాంతివేమీ ఇక్కద లేవే” అన్నారట. అందుకా పెద్దమనిషి విసుక్కున్నాడట “మావిడిపళ్ళే ఉండవా? ఇంకా మీ బోడి స్వర్గం గొప్ప ఏమిటీ? మావూరు పంపించేయండి నన్ను”‌అని!

  • శ్యామలరావు గారు,
   స్వర్గంలోకి వెళ్ళి మామిడిపళ్ళు దొరకవని తిరిగొచ్చినాయన నాకు నచ్చేడండి. జననీ జన్మ భూమిశ్చ అన్నారు కదా!
   మీ అనుమానం నాకూ వచ్చింది కాని ఈ కాయని కొత్తపల్లి కొబ్బరి అనే నామకరణం చేసేరు, మరో పేరుతో పిలవడానికి ఒప్పుకోరు.
   ధన్యవాదాలు.

  • వర్మాజీ,
   ఈ అభిప్రాయం కితం సంవత్సరమే చర్చకి వచ్చింది,ఇంటిలో, కాని ఏకాభిప్రాయం లేక వాయిదాపడింది, ఇప్పుడు రాబోయే సంవత్సరానికి నిర్ణయం తీసేసుకోక తప్పని పరిస్థితులే ఏర్పడ్డాయి.
   ధన్యవాదాలు.

 4. ఉప్పాడ కొత్తపల్లి మా పితామహులదే ! చిన్ననాడు ఆ ఇంట వేసవిలో కొత్తపల్లి కొబ్బరి పండ్లు, పొలంలో తాటి ముంజెలు తిన్న అనుభూతులు సదా జ్నాపకమే భాస్కర శర్మగారూ!

 5. బాబాయ్ గారు, తగునా ఇది మీకు. ఈ భోగ భూమిలో అన్నీ దొరుకుతాయి మామిడి పళ్ళు (అంటే రుచీ పచీ లేకుండా చూడటానికి అచ్చంగా మామిడిపళ్ళలా కనిపించేవి కాక)తప్ప. నేనూ నా పిల్లలూ ప్రతి యేడాదీ మామిడిపళ్ళ కాలం వచ్చేసరికి ఎంత బాధ పడిపోతుంటామో చెప్పనలవి కాదు. మా చిన్నప్పుడు దొంగతనం గా కాయలు కోసుకొచ్చి వాటిని గడ్డిలో ఎంత దాచినా ఆ వాసనకి మేము ఎలా పట్టు పడిపోయామో నేను కథలు కథలుగా చెప్తుంటే నా మాణిక్యాలు నువ్వేమో బాగా ఎంజాయ్ చేసావు మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చి పడేసావు అని తెగ దెబ్బలాడేస్తారు. మా హైదరాబాదులో బంగినపల్లి, రసాలే దొరికినా వాటినే మహ ప్రేమగా ఆశ్వాదించేవాళ్ళము, హేమిటో అవన్ని గతకాలపు స్మృతులైపోయాయి. అన్నట్టు తూ గో జీ లో మీరు చెప్పిన కొత్తపల్లులతో పాటు టీ కొత్తపల్లి కూడా ఉందందోయ్, ఐ పోలవరం దగ్గర.

  • అమ్మాయ్ లక్ష్మి,

   పళ్ళు అలా ఫోటో పెట్టి ఊరించడం తగని పనే కదూ 🙂
   చిన్న తనపు జ్ఞాపకాలు మధురమే, ఎంత చెప్పుకున్నా తీరవు. మరి నేటి బాలలు ఆ మధుర క్షణాలు కోల్పోతున్నారన్నది నిజం.
   సంవత్సరం కితం దాకా ఐతే వచ్చెయ్యమని ఆహ్వానించేవాడిని, ఇప్పుడు భయపడుతున్నా, మేమే లేవలేక వచ్చేవారికి ఆతిధ్యం ఇవ్వలేమని, ఇలా అనుకోడం తోనే రోజులు చెల్లిపోతున్నాయమ్మా!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s