శర్మ కాలక్షేపంకబుర్లు-ఉలూఖలం.

DSCN4433

“పందొమ్మిదో తారీకు కార్యక్రమానికి వెళుతున్నామా?” ప్రశ్నించింది ఇల్లాలు. అంటే వెళ్ళాలి అని చెప్పడమే, దీనినే లౌక్యం అంటారు. ఇల్లాలిమాట అందునా లౌక్యంగా చెబుతోంటే కాదనేదెలా? ఎలాగో ఓపిక చేసుకుందామనుకుని” సరే” నన్నా! అలా మార్చి పందొమ్మిది ఉదయం బస్సుకి బయలుదేరేం, కార్యక్రమం ఉపనయనం, బాగానే జరిగింది. కార్యక్రమం ఆలివంకవారింట్లో కదా! బాగోలేదనకూడదు, ఇదో లౌక్యం, బాగోకపోయినా మహ బాగుందనే అనాలి. కార్యక్రమం తరవాత నన్ను తీసుకుపోయి ఒక గదిలో కూచోబెట్టి ఫేన్ వేసేరు, ఎండ వేడి అప్పుడే పెరిగిపొయిందనుకుంటూ ఉండగా పుటుక్కున కరంట్ పోయింది. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని కరంట్ వాడికి నామీద ఎంతప్రేమో అనుకుని చుట్టూ చూశా, ఏమయినా విసురుకోడానికి దొరుకుతుందేమోనని. అదిగో అప్పుడు కనపడింది, నేను దగ్గరగా మూడేళ్ళనుంచి వెతుకుతున్న ఉలూఖలం, అదేనండి కఱ్ఱఱోలు. దానిని బయటికి లాగి ఫోటోలు తీసుకుంటుంటే వింతగా చూశారందరూ, పిచ్చాడే అనుకున్నారేమో కూడా.

DSCN4435

ఏదయినా శుభకార్యం చేయాలంటే ముందుగా గణానాంత్వా అంటాము కదా! అప్పుడు గణపతిని పూజించి తిరగలి వేసి శనగలు విసిరి బియ్యం తవ్వెడునరసోలడు పోసి అందులో రూపాయిపావలా దక్షణతో కొత్త ఎర్ర రవికలగుడ్డలో కలిపికట్టి ఉంచడాన్నే మీదు కట్టడం అంటాం. ఈ పని చేస్తేగాని ఆ కార్యక్రమం తాలూకు మరేపనీ చెయ్యంకదా! పసుపుకొట్టడానికి ఉపయోగించేదే ఈ ఉలూఖలం, దీనికి ఎన్ని తోరాలున్నయో చూడండి, అంటే ఒక్కోతోరం ఒక శుభకార్యం చేయించినదనమాట. వీటిని తీసెయ్యం. అలాగే ఉంచుతాం. అవి పెరిగిపోతే తీసేస్తాం. అన్నట్టు పెరిగిపోవడమంటే చెప్పాలి కదూ. పెరిగిపోవడ మంటే తెగిపోవడం, కాని కొన్ని సందర్భాలలో తెగిపోవడమనే మాట అవాచ్యం అందుకు దానిని పెరిగిపోవడమనే అంటాం. పుస్తెలతాడు తెగిందనం, పెరిగిపోయిందంటాం. అలాగే పసుపు,కుంకుమ అయిపోయాయనం, నిండుకుందంటాం, బియ్యం అయిపోతే, ‘తండులాలు నిండుకున్నా’యంటుంది ఇల్లాలు, అద్దం పగిలిందనం, ముక్కలయిందంటాం,ఇది లోక రివాజు. అమంగళం పలకడం కూడా మన సంస్కృతిలో లేదు. దారి తప్పేమా?

ఇంతగా మన శుభకార్యాలలో అవసరమైన ఈ ఉలూఖలం నేడు పల్లెలలో కూడా కనపడటం లేదు, ఇది నాకు కాకినాడ పట్టణంలో దర్శనమివ్వడం ఆశ్చర్యంగొల్పింది. ఎవరింత జాగ్రతగా దీనిని భద్రపరచినవారని అడిగితే ‘పప్పు’వారిదన్నారు, ఆనందమయింది.

ఇదిగో ఇటువంటి రోటికే కట్టేయాలనుకుంది పిచ్చి తల్లి యశోద,  టూకీగా చెప్పేసుకుందాం. కన్నయ్యకి యశోదమ్మ పాలిస్తోందిట, ఇంతలో దాలి మీద పాలు పొంగాయి, పొంగిన పాలు పొయ్యిలో పడతాయని, కన్నయ్యని కింద కూచోబెట్టి, పాలు చూసుకుని వచ్చేటప్పటికి, ‘నాకన్నా పాలెక్కువా?’ అని పెరుగు కుండలు బద్దలుకొట్టి, వెన్న పట్టుకుపోయి ఇదిగో కర్రరోలెక్కి నిలబడి గోడమీద కూచున్న కోతులకి వెన్నపెడుతున్నాడట. అమ్మకి కోపం వచ్చి పట్టుకోబేతే తప్పించుకుని స్థంభాల మధ్య తిరిగి అమ్మకి చిక్కకుండా పోయాడు. అమ్మ డస్సిపోవడం చూసి మనసుకరిగి దొరికిపోయాడు. అదంతా తన ప్రజ్ఞే అనుకుంది పిచ్చి తల్లి. ఇక ఆ తరవాత ఇలా అల్లరి చెయ్యకుండా ఉండటానికి గాను రోటికి కట్టేయ్యాలని తాడుతెచ్చింది, కన్నయ్య బొజ్జ చుట్టూ తిరిగిన తాడు రెండంగుళాలు తక్కువొచ్చింది, మరో తాడు తెచ్చింది, అదీ అంతే అయ్యింది. తల్లి కట్టేయాలనుకుందే తప్పించి, ఎవరిని కడదామనుకుంటూందో ఆలోచించలేదు. ఇలా అన్ని తాళ్ళు తెచ్చినా రెండంగుళాలే తక్కువొస్తోంది, అమ్మ అలసిపోవడం చూసిన కన్నయ్య తాడుకి దొరికిపోయాడు, అదే అమ్మ ప్రేమ తాడుకి దొరికిపోయాడు. అదుగో అలా ఇటువంటి రోటికే కట్టేసింది. దానిని బయటికి ఈడ్చుకుపోయి రెండు పెద్ద మద్ది చెట్లూ కూల్చి ఇద్దరికి శాపవిమోచన అనుగ్రహించాడు, కన్నయ్య.ఈ కధ చాలా సార్లు చెప్పుకున్నం కదూ!
స్వస్తి

 

1 thought on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉలూఖలం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s