శర్మ కాలక్షేపంకబుర్లు-ఉలూఖల శేష లేహన న్యాయం.

ఉలూఖల శేష లేహన న్యాయం.

ఉలూఖలం అంటే కర్రరోలు, శేషం అంటే మిగిలినది, లేహనం అంటే నాకడం. ‘కర్రరోలులో మిగిలినది నాకడమనమాట,’  చిత్రంగా ఉంది కదూ! దీని వెనక ఒక చిత్రమైన చిన్న కధకూడా చెబుతారు, సరదాగా ఉంటుందిలెండి, మరి చిత్తగించండి.

అనగా అనగా ఒక పలెట్టూరికి, అల్లుడు అత్తారింటికొచ్చాడు. అతనొచ్చిన రోజే భార్య ప్రధమ రజస్వల అయింది. దీనినే పెద్దమనిషి అయ్యారనడం, పుష్పవతి అయిందనడం, వ్యక్తురాలు  అయిందనడం, సరదాగా చాపెక్కడమనడం,మన తెనుగునాట ఆచారం. ఇదేంటి చిత్రం! ఆ అమ్మాయి అప్పుడు, ప్రధమ రజస్వల కావడమేంటనీ, అనుమానం కదా! అవి రజస్వలాత్పూర్వం వివాహాలవుతున్నరోజులు, ఇప్పటిలా ముఫై ఏళ్ళకి కాదు మరి. అమ్మాయి వ్యక్తురాలు కాకపోయినా, అల్లుడు రాకపోకలు, ముద్దు ముచ్చట్లు జరిగేరోజులవి. అలా అల్లుడు అత్తారింటి కొచ్చినపుడు, అనుకోకుండా ఆ అమ్మాయి ప్రధమ రజస్వల యిందనమాట.

మొదటి సారి రజస్వల అయినపుడు కొన్ని పనులు చేయడం మన తెనుగునాట అచారం.  ఐదు కుంచాల ధాన్యం ఒక గోడ వారగా పోస్తారు, .తూర్పుగాని, ఉత్తర ముఖంగా కాని అమ్మాయిని కూచోబెట్టడానికి వీలుగా. దానిపై పచ్చి తాటాకుల, లేక ఈతాకుల చాపకాని వేస్తారు. ఇవి దొరకని పరిస్థితులలో పచ్చి తాటాకు కాని, కొబ్బరాకు కాని వేయడమూ అలవాటే. ఆ పైన కొత్త దుప్పటి పరుస్తారు. అమ్మాయికి కొత్తబట్టలు కడతారు, కొంతమంది అప్పుడు అమ్మాయి చేత పైట వేయించడం మొదలు పెడతారు. అమ్మాయి కాళ్ళకి పసుపు పారాణీ రాస్తారు, .బొట్టూ కాటుకాపెట్టి. పారాణి లో ముంచిన చేతులను గోడపై వెనుతిరిగి అద్దిస్తారు. అప్పుడు ఆమెను ఆ ధాన్యపు కుప్పమీద కూచోబెడతారు,వీటినన్నిటిని లక్ష్మీ చిహ్నాలుగా భావిస్తారు, ఆ అమ్మాయిని లక్ష్మీ దేవిగా చేశారనమాట. హారతిస్తారు, పెద్ద ముత్తయిదువులు ఆశీర్వదిస్తారు. ఆ తరవాత కర్రరోటిలో తెల్లనువ్వులు, బెల్లం వేసి దంచుతారు. ఈ కార్యక్రమమంతా పెద్ద ముత్తయిదువులే నిర్వహిస్తారు., యువతులు సాయ పడతారు, ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వాలిపోతారు. 

ఇలా ప్రధమ రజస్వల అయిన తిధి, వార నక్షత్రాలను బట్టి మంచి చెడ్డలు చెబుతారు, అమ్మాయి ఆ సమయానికి కట్టుకున్న బట్టల బట్టికూడా ఫలితం ఉందంటారు, ఆ తరవాత అవసరం బట్టి శాంతీ చెబుతారు, ఇదంతా మరో దారి, మనం అందులోకి అనుకోకుండా జారిపోయాం కదూ! ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం.

ఇలా  నువ్వుపప్పు, బెల్లమూ వేసి దంచి చేసిన ముద్దని ‘చిమ్మిలి’ అంటారు. చిమ్మిలిని అమ్మవారికి నైవేద్యం పెడతారు. చిమ్మిలి అంటే ఇష్టం లేనివారుండరు. చిమ్మిలి ఉండని అమ్మాయి చేత తినిపిస్తారు, రోజూ మూడు పూటలా చిమ్మిలి పెడతారు. వచ్చిన పేరంటాళ్ళకీ ప్రసాదంగా చిమ్మిలే ఇస్తారు, పసుపు, బొట్టు పెట్టి తాంబూలం తో సత్కరిస్తారు, వచ్చిన వారిని. కలిగినవారు అమ్మాయికి బంగారు ఆభరణాలు పెడతారు. అమ్మాయికి భోజనంలో కి అన్నము వేడి ఆవుపాలు పోసి తాడిబెల్లం ముక్క నంజుకోడానికిస్తారు, .మరేమీ పెట్టరు. ఇలా అమ్మాయిని అక్కడ మూడురోజులు కాని, కొంతమంది, ఐదు, ఏడు, తొమ్మిది రోజులు కూడా కూచోబెట్టిన సందర్భాలుంటాయి. ఆ తరవాత స్నానం చేయిస్తారు, భోజనాలు పెడతారు, దానిని అట్లబంతి అని అంటారు, అట్లు వేస్తారు,అందరికి వడ్డిస్తారు, అట్లో నంజుకోడానికి ఆవ పచ్చడికూడా చేస్తారు. ఇది ఆడవాళ్ళకి మాత్రమే పరిమితం. ఒక సారి ఇటువంటి భోజనానికి పిలుపొస్తే నేనూ వస్తానన్నా సరదాగా, ఇల్లాలితో, అప్పుడు చెప్పింది, అక్కడ పోతు పేరంటాళ్ళకి తావులేదని, అప్పుడు తెలిసింది 🙂  ఇంతకీ ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు తప్పించి కర్ర రోలుకి మిగిలిన చిమ్మిలి నాకడానికి సంబంధం చెప్పలేదని కదా! ఈ ‘శాఖాచంక్రమణ న్యాయా’న్ని ఖండిస్తున్నారా?  🙂 ఇలా తిప్పి తిప్పి చెప్పడాన్నే ‘శాఖా చంక్రమణ న్యాయం’ అన్నారు. Beating around the bush. అబ్బ చంపక సంగతి చెప్పేయ్యమంటారా!

భార్య ప్రధమ రజస్వలైన సందర్భం, అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు, చిమ్మిలి తొక్కి రోలు ముందు వసారాలో పడేసేరు. అల్లుడికి చిమ్మిలి పెట్టబోతే వద్దన్నాడు, మొహమాటానికి. ఎవరు బలవంత పరచి పెట్టలేదు. అల్లుడికి చిమ్మిలి తినాలని ఉంది, అడగడానికి సిగ్గు, మొహమాటం. భోజనాలయ్యాయి, అందరూ పడుకున్నారు, అల్లుడికి మాత్రం నిద్ర పట్టలేదు, చిమ్మిలి తినాలనే కోరిక మాత్రం ఉండిపోయింది. అప్పుడిక అతను ఆగలేక వీధి సావడిలో పడేసి ఉంచిన కర్ర రోలు దగ్గరకిపోయి రోటికి అంటుకుని ఉండిపోయిన చిమ్మిలి నాకడం మొదలుపెట్టేడు. నాకుతున్న చప్పుడుకి వసారాలో మూలగా పడుకున్న మామగారికి మెలకువ వచ్చి, రోలు నాకుతున్నది కుక్క అనుకుని, కర్ర విసిరితే, అల్లుడికి తగిలితే, కుయ్యో మని అరిస్తే, అందరూ లేచి చూస్తే అల్లుడు సిగ్గుపడ్డాడు. ”అర్ధరాత్రి కర్రరోలు దగ్గర ఏంచేస్తున్నారు? అల్లుడు గారూ!” అంటే ”రోటికి చీమలు పట్టేయేమో చూస్తున్నా”నన్నాడట. దీనినే ”తాళాధిరోహణ న్యాయం” అన్నారు, తెనుగులో ”తాడి చెట్టు ఎందుకురా ఎక్కేవంటే?  దూడగడ్డికోస”మన్నాడట, నిజానికి తాడిచెట్టెక్కింది కల్లు కోసం. అల్లుడు మూతిని ఉన్న బెల్లం పిసర్లు చూసిన అత్తగారపుడు లోపల దాచిన చిమ్మిలి తెచ్చి అల్లుడుకి పెట్టిందిట. కధ బావుందా?

రజస్వల అయినపుడు చిమ్మిలి మాత్రమే ఎందుకు పెట్టాలి? ఇదెవరూ ఆలోచించలేదు, చిమ్మిలి తొక్కాలి కనక తొక్కుతున్నారు, పెడుతున్నారు. అసలు దీని వెనక ఒక ఆరోగ్య రహస్యం ఉంది. అమ్మాయి మొదటిసారి రజస్వల అయిందికదా! అండం విడుదలవుతుంది, ఇక ముందు కూడా ఋతుక్రమం నెలనెలా అనగా ఇరవైఎనిమిదిరోజులకొక సారి సవ్యంగా జరగాలంటే గర్బవాతం ఉండకూడదు. ఈ గర్భవాతాన్ని పరిహరించేందుకు ఇచ్చే మందే చిమ్మిలి. పాలబువ్వ తాటిబెల్లం కూడా అమ్మాయి ఆరోగ్యానికిచ్చే మందులే సుమా!. నువ్వులు, బెల్లం కలిపి తొక్కి చిమ్మిలి తీసుకుంటే గర్భవాతం తొలగుతుంది, ఋతుక్రమం నియమంగా వస్తుంది, అమ్మాయి ఆరోగ్యం బాగుంటుంది.ఆ తరవాత బిడ్డని కనడానికి అడ్డంకులు రావు. దీనికోసమే చిమ్మిలి పెడతారు.చిన్నపిల్లలలో రాత్రి నిద్రలో పక్క తడిపే అలవాటున్నవారికిది పెడితే వరుసగా రోజూ నిద్ర ముందు, పక్క తడపడం మానేస్తారు, అవసరాన్ని బట్టి వాడి చూడండి.

అమ్మాయిని పచ్చి ఆకు వేసిన ధాన్యం కుప్ప మీద కూచోబెట్టడం దగ్గరనుంచి అన్నిటికి శాస్త్రీయత ఉందంటారు, ఇదొక బయలాజికల్ ఛేంజ్ దీనికి హాడావుడేంటని కొట్టి పారేసీవారూ ఉన్నారు, అసలిప్పుడు ఎవరూ చేయటం లేదనుకుంటా.

స్వస్తి

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉలూఖల శేష లేహన న్యాయం.

 1. మీ టపా లో తెలుగు ‘ గంధం ‘ మీరు ‘ రాసిన కొద్దీ ‘ వస్తూంది !
  స్త్రీ జీవితం లో రజస్వల అవడం ఒక అతి ముఖ్యమైన ఘట్టం ! దానిని ఒక పండుగ గా కుటుంబమంతా జరుపుకునే సాంప్రదాయం తగ్గి పోతూ ఉండడం విచార కరం !
  ఇక లాభాల మాటకు వస్తే :
  1. ప్రధానం గా రజస్వల అయిన యువతి తన శరీరం లో జరిగే మార్పులతో ఆందోళన చెందకుండా, ఆ మార్పులు సహజమైనవేననీ ,ఆనందకరమైనవే ననీ ( మానసికం గా ) ధైర్యం చెబుతూ , ఆ ( శారీరిక ) మార్పులకు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా అనునయం గా చెప్పడమే ఆ సాంప్రదాయాల అంతరార్ధం !
  2. బెల్లం, నువ్వులు , కలిపిన ‘ చిమ్మిలి ‘ క్రమం గా తింటూ ఉంటే , యువతి శరీరం లో ఋతు స్రావం వల్ల కోల్పోయే ఇనుము( బెల్లం ద్వారానూ ) , ఇంకా ( నువ్వుల ద్వారా ) ముఖ్యమైన ఇతర ఖనిజాలూ , లభిస్తాయి !
  3. వంశ వృద్ధి ఆశించే తల్లి దండ్రులకు , అందుకు అనువైన లక్షణాల కు సంకేతం, తమ పుత్రిక రజ స్వల అవడం !
  ఇక ప్రస్తుతం ఏం జరుగుతుందనే విషయం, వారి వారి విజ్ఞత కే వదిలేయడం మంచిదేమో !

  • సుధాకర్ జీ

   ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించాలి.

   ఇది ఒక కుటుంబ కార్యక్రమమన్నది మర్చిపోయారు.
   మనవారు చేసే పనిలోనే మనసుకు సంబంధించిన విషయ్యాలు కూడా ఇమిడ్చేశారు, అది నేటి నాగరికులు మరచిపోయారు.ఇది శారీరిక మార్పు, అవసరమైనదే అనేసంగతి అమ్మాయికి చెప్పకనే చెప్పేరు.
   ముఖ్యంగా మూడు రోజులు విశ్రాంతి ఇచ్చారు,ఆ విశ్రాంతి అవసరం గుర్తించటం లేదు, హార్మోన్ల సమతుల్యం చెడిపోయి బాధలు పడుతున్నారు. మంచి చెప్పేరు పెద్దలు, ఆచరించడం మానేయడం ఎవరికి వారి ఇష్టమే కదా!
   ధన్యవాదాలు.

 2. టైటిల్ నుండి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకూ అన్నీ క్లిష్టమైన కొత్తపదాలే శర్మగారి కబుర్లలో 🙂

  • పద్మగారు,
   మీరిలా అంటారని నాకు తెలుసు 🙂 అందుకే ప్రతిచోటా వివరణ ఇచ్చాను కదా! ఇంకా తెలియని పదాలున్నాయంటారా!
   ధన్యవాదాలు.

 3. ఇప్పటి వారికి తెలియని ఎన్నో విషయాలను తెలియజేసారు.

  వెనుకటి సంగతులను , తెలిసిన వాళ్ళు తెలియజెబుతుంటే తరువాతి తరాలకు తెలుస్తాయి. మన ప్రాచీనులు అందించిన ఆచారాలు మరుగునపడకుండా ఉంటాయి.

  నువ్వులు, బెల్లం తినటం వల్ల ఐరన్ ఎక్కువగా లభిస్తుందట. నెలసరి సరిగ్గా రానివారికి నల్లనువ్వులు బెల్లం కలిపి చేసి ఇస్తే ఫలితం ఉంటుందంటారు.

  • అనురాధ గారు,
   నల్ల నువ్వులు అంటే ముడి నువ్వులలో టాక్సిన్స్ ఉంటాయి. వాటిని నానబోసి దంచి కడిగిపొట్టు తీస్తారు అప్పుడు అవి తెల్లగా ఉంటాయి, నువ్వులలో ఐరన్ తో పాటుగా కాల్షియం వగైరా ఋతుక్రమాన్ని సరి చేసేవి ఉన్నాయట.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s