శర్మ కాలక్షేపంకబుర్లు-సంచి కట్టు వైద్యం.( Barefoot Doctors)

సంచి కట్టు వైద్యం.( Barefoot Doctors)

స్వతంత్రం వచ్చినప్పటినుంచి రెండు విషయాలలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి, ఒకటి విద్య, రెండవది వైద్యం. ఏ దేశమైనా బాగుండాలంటే ముందు ఆ దేశ పౌరుల శారీరిక, మానసిక ఆరోగ్యం బాగుండాలి, ఆ తరవాతది విద్య. ప్రభుత్వాలు ఈ రెండిటిని నెమ్మది నెమ్మదిగా ప్రైవేట్ పరం చేసి వదిలేశాయి. కేంద్రంలో, విద్యా మంత్రిత్వ శాఖ అంటే అనుత్పత్తి కారకమైనదనీ,( Unproductive) ఖర్చుతప్పించి మరే ఆదాయం లేని శాఖ అనీ చిన్న చూపు, అలాగే వైద్యం కూడా. ఈ మంత్రిత్వ శాఖల మీద పెట్టిన ఖర్చు, ఉపయోగం లేనిదని ప్రభుత్వాలనుకున్నాయి. జనాభా పెరుగుతున్న మాట నిజమే, పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు కొన్ని చర్యలు తీసుకుంటూనే, ఉన్నవారి ఆరోగ్య,విద్యల పట్ల శ్రద్ధ వహిస్తే కుటుంబాలు బాగుంటాయి, తద్వారా దేశం బాగుపడుతుంది. ప్రభుత్వాలు నేల విడిచి సాముచేస్తున్నాయి, ఈ రెండు విషయాల్లో.

వైద్యం గురించి చెప్పుకోవాలంటే చాలా బాధ కలుగుతోంది. ఒకప్పుడు పరహితం కోసమే వైద్యం చేసిన దేశం లో జలుబు తగ్గించడానికి కూడా వేలు గుంజుతున్న డాక్టర్లని చూస్తే నిజం గానే కడుపు మండిపోతోంది. వైద్యం వ్యాపారమయిపోయింది. కార్పొరేట్ వైద్యం అంటే దోపిడీ, మోసం అనే ఒక ఉద్దేశం కూడా ప్రజలలో ప్రబలంగా ఉండిపోయింది. గత పది సంవత్సరాలలో కార్పొరేట్ వైద్యం పేరుతో జరిగినది లూటీయే. ప్రతి అనారోగ్యంకి పెద్ద పెద్ద పరీక్షలక్కరలేదు,హాస్పిటల్ లో జేరవలసిన అగత్యమూ లేదు, కాని చిన్న అనారోగ్యం దగ్గు,రొంప,జ్వరం కోసం, డాక్టర్ దగ్గర కెళితే ఉదయం నుంచి కూచుంటే సాయంత్రానికి దర్శనమైతే నాలుగు టెస్టులు రాస్తున్నాడు. అవి పూర్తి చేసుకుని మరునాడు దర్శనం చేసుకుంటే ఒక చిట్టా మందుల చీటీ చేతిలో పెడుతున్నాడు. అవి ఆ హాస్పిటల్ దగ్గరలో ఉన్న మందుల షాపులో తప్పించి దొరకవు. అదొక ప్రత్యేకత. టెస్టులెల్లాగా ఆ హాస్పిటల్లో చేసేవే, అంతా కలిపి తడిపి మోపెడవుతోంది. ఆ మందులు వాడితే రోగం తగ్గితే అదృష్టం. ఇలా ఎందుకు జరుగుతోంది? వైద్య విద్య చదువుకోడానికే పెట్టుబడి కావలసి వస్తోంది, ఇదెవరికి సాధ్యం? ఉన్నవారికే! ఆ తరవాత హాస్పిటల్ పెట్టుకోడానికి సొమ్ము కావాలి. మరి ఇవన్నీ వడ్డీ తో కలిపి ఎవరిస్తారు, రోగులు తప్పించి? ఇది ప్రైవేట్ డాక్టర్ల సంగతి. ఎక్కువ మంది చదువు ’కొన్న’వారే. ఇక ప్రభుత్వ డాక్టర్లు లేరు, ఉన్న చోట మందులు లేవు. ఉన్న డాక్టర్లు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ పట్ల చూపినంత మక్కువ ప్రభుత్వ వైద్యం పట్ల చూపటంలేదు. మన దేశం లో వచ్చే వ్యాధులన్నీ ఎక్కువగా ఋతువులకి సంబంధించినవే ఎక్కువ. ఋతువుల సంధికాలంలో ఇవి ప్రబలుతుంటాయి. పాత కాలంలో సంచి కట్టు వైద్యులు ఇంటింటికి తిరిగి వైద్యం చేసేవారు. ఇప్పుడది నామోషీగా భావిస్తున్నట్లుంది. ఈ ఋతువుల బట్టి వచ్చే వ్యాధులను తగ్గించడానికి పెద్ద వ్యయమూ అక్కరలేదు. ఈ సంచి కట్టు వైద్యులను మరల ప్రోత్సహించి, తగిన వృత్తి నైపుణ్యం ఇచ్చి, ఈ వ్యాధులను అదుపు చేయవచ్చు. ప్రభుత్వం చేయవలసినదల్లా వీరికి తగు శిక్షణ ఇచ్చి గ్రామాలలో వైద్యం చేసేలా ప్రోత్సహించి, వారి వల్ల కాకపోతాయన్న వాటిని పై హాస్పిటల్ కి పంపే ఏర్పాట్లు చేసి, వీరిని ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి జత చేసి, ఎప్పటికప్పుడు వీరికి వృత్తి పరమైన సూచనలు చేస్తుంటే చాలు. వీరికి ప్రభుత్వం జీత భత్యాలివ్వక్కరలేదు. రోగులే ఆ ఖర్చు భరించగలరు. ఆ కర్చు కూడా పెద్దగా ఉండదు కూడా. దీనివల్ల కొంతమంది యువకులకి జీవనోపాధి, ప్రజలకు సౌకర్యమూ ఉంటుంది. మరి ఈ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించటం లేదో తెలియదు.

భారతీయ వైద్యాన్ని బతకనీయకుండా చంపేశారు. ఇప్పుడు ఆయుర్వేదం మాత్రమే మానవాళిని రక్షించగలదంటున్నారు. ఏమో ఏం జరుగుతుందో!

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సంచి కట్టు వైద్యం.( Barefoot Doctors)

 1. ‘ఏమిటో ఈ అయ్యవారి ‘టపా శోష’ ! ఇవన్నీ అయ్యే పన్లా ? గవర్నమెంట్లు ఇవన్నీ చేస్తాయా ? మరీ ‘టపా శోష’ తప్పించి !
  ఇప్పుడున్న కార్పోరేట్ ‘మండూ’ జమానాలలో ఆయుర్వేదా బతుకుతుందా అంటే పెద్ద కొచ్చేను మార్కు మాత్రమె ! ఫారెను మెడికల్ వాళ్ళ ది పటిష్ట మైన ‘కాపీ’ రైటుల బంధం . వాళ్ళది పటిష్ట మైన వ్యవస్థ . దాన్ని బ్రేక్ చేయ గల శక్తి ఉన్నదా ??

  జిలేబి

  • జిలేబి గారు,
   కొన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. అవసరం ఏ పని అయినా చేయిస్తుంది. ప్రయివేటు డాక్టర్ల సొమ్ము దాహం పరకాష్ఠ కి చేరిపోయింది. మరల ఆయుర్వేదమే దిక్కు. కాలం తో పాటు ఎంతటి బలవంతులైనా కొట్టుకుపోవలసినవారే! ఈ విషయంలో నేను ఆశావాదిని
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s