శర్మ కాలక్షేపంకబుర్లు-శుభం.. 650 th Post

శుభం                                                                                            650 th Post

శ్లో. భద్రం భద్రమితి బ్రూయాత్, భద్రమిత్యేవ వా వదేత్
శుష్క వైరం, వివాదం చ న కుర్యాత్ కేనచిత్ సహ.

ఆ.వె. శుభము, శుభమటంచు శుభమునే పల్కుఁడు.
శుభము పల్క నీకు శుభము కలుగు.
శుష్క వైరములకు చూడబోవకుమయ్య.
వ్యర్థ వాదనంబు వద్దు వద్దు.

భావము. ఎల్లప్పుడూ శుభం, శుభం అంటూనే ఉండాలి. శుభమగుగాక అనే పలుకుతూ ఉండాలి. ఎవరి తోనూ కూడా శుష్క విరోధాలూ, తగవులకు దారితీసే వితండ వాదాలు కూడదు.

Coutesy:Sri Chinta Ramakrishna rao. (andhramrutam)

ఈ రోజుల్లో శుభం అంటే పూర్తయిందనే అర్ధం లో వాడుతున్నారు. సినిమా వారు శుభం కార్డ్ వేశాం అంటే పూర్తి చేశాం, అని అంటున్నారు. నేటి సమాజంలో వ్యతిరేకార్ధానికి వాడుతున్న పదాలలో ఇదీ చేరిపోయింది.

ఎప్పుడూ శుభాన్ని కోరాలి, అది మనకే కావచ్చు, ఇతరులకే కావచ్చు. శుభాలు కోరినంతనే జరిగిపోతాయా? అశుభాలు జరగవా? అనేది వితండవాదం. అశుభాలూ జరుగుతాయి. అశుభం జరిగే దాకా శుభాన్ని కోరుకోవచ్చు, అశుభం లో కూడా మంచిని చూడమన్నదే మనవారి మాట. అంటే పాసిటివ్ తింకింగ్ ఎప్పుడూ ఉండాలన్నారు. కాలుపోతే పాసిటివ్ తింకింగ్ ఎలా అని అడగచ్చు, ఒక కాలు పోయింది, రెండు కాళ్ళూ పోలేదు కదా అని సంతోషీంచు. రెండు కాళ్ళూ పోతేనో! నిజమే కావాలని కళ్ళు, కాళ్ళు ఎవరూ పోగొట్టుకోరు కదా! రెండు కాళ్ళూ పోతే భగవంతుడు రెండు చేతులూ ఇచ్చాడని సంతసించు, బతికుంచినందుకు కృతజ్ఞత చెప్పు. కుటుంబంలో తండ్రి లేడు, తల్లి ఉన్నందుకు సంతసించు, ఇలా కష్టం లో కూడా మంచిని వెతుక్కోడమే పాసిటివ్ తింకింగ్. ”గోచీ కంటే దరిద్రం, చావు కంటే కష్టం” మానవులకు లేదని మనవారి నానుడి, అందుకే మాటలో కూడా అశుభం కోరవద్దని మనవారి ఆకాంక్ష, కాదు ఆంక్ష.  ”కీడెంచి మేలెంచమన్నారు కదా!” ప్రశ్న. కీడెంచమంటే చేయబోయే పనిలో వచ్చే కష్టాలు, అనుకోని కష్టాలను ఊహించి, వాటిని ఎదుర్కోడానికి సిద్ధపడమన్నారు తప్పించి, నిరాశలో కూరుకుపొమ్మనికాదు  దీని అర్ధం. తధాస్థు దేవతలున్నారట. మనం అనే మంచి చెడ్డలు రెండిటిని దీవిస్తూ ఉంటారట. తధాస్తు   అంటే అటులనే జరుగుగాక అని అర్ధం. మన నోటి వెంట చెడ్డమాటొస్తే తధాస్తు అంటే…… అందుకూ వద్దన్నారనమాట.

ఎవరెన్ని చెప్పినా వినం అనేవారూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇళ్ళలో ఎప్పుడూ అశుభం మాటలే వినపడుతుంటాయి, ”నీ మొహం తగలెయ్య!” ”నీ పిండం పిల్లులకెయ్య!,” ”నీ శ్రార్ధం పెట్ట,” ”నీ శ్రార్ధం చెట్టుకింద పెట్ట”, ”నిన్ను తగలెయ్య!”, ”నిన్ను ఎన్నెమ్మెత్తుకుపోను”, కొన్ని మాత్రమే,దీనికి అంతులేదు. నిజానికి శ్రార్ధం చెట్టుకిందే పెడతారు గయలో!. కొంత మంది ముద్దుగా కూడా ఇలా తిడతారు, అదో తుత్తి.  🙂 …. అలా మాటలో కూడా అశుభం వద్దు.

”శుభం పలకరా మంకెన్నా అంటే ఐరేణి కుండలదగ్గర చచ్చినట్టే తొంగున్నానండి” అన్నాడట, ఈ నానుడి తెనుగునాట విస్తృతంగానే చెబుతారు..కొంతమందికొక చెడ్డ అలవాటుంటుంది, ఏం చెప్పినా ”అది జరిగి చచ్చేదా” అనేస్తారు వెంఠనే. ”అమ్మో కేన్సరా! మొన్న మా అన్నగారు, చెల్లాయి కూడా ఇలాగే పోయారు, బతకడం కష్టం” ఈ మాటలు నిజంగా బతికేవాడిని కూడా చంపేస్తాయి. ”శుభం, పెళ్ళికొడుకులా తిరిగొస్తావోయ్! ఏం భయపడకు, మొన్న మావాడొకడిలాగే వెళ్ళి వారంలో తిరిగొచ్చాడు హాస్పిటల్ నుంచి, ఇదే జబ్బు సుమా!” లేనిదయినా సృష్టించిన కథనమైనా చెప్పండి, ఆ రోగిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, బతుకాలనే, బతుకుతాననే ఆశ, సంకల్పం పెరుగుతాయి, జరిగేదెలాగూ జరగక మానదు, కాని బతికే సావకాశాలు పెరుగుతాయి. వరసగా కాన్పులు నిలవటం లేదు, వరసగా కుర్రాడు పరిక్షలు తప్పుతున్నాడు, అబ్బాయిని ఏ అమ్మాయి పెళ్ళి చేసుకోడానికి ఇష్టపడటం లేదు, వీరిని నిరుత్సాహ పరిస్తే ఆశుభం మాటాడితే పూర్తిగా నిరుత్సాహంలో, నిరాశలో కూరుకుపోతారు, ఫలితాలు దారుణంగా కూడా ఉండచ్చు. అశుభం పలకద్దు. ఒకరికి శుభం పలకడం మూలంగా నాకెలా శుభం జరుగుతుందని కదా అనుమానం. శుభం పలుకుతుంటే అసంకల్పితంగానే మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, పాసిటివ్ తింకింగ్ పెరుగుతుంది. జీవిత దృష్టి మారుతుంది, చూడండి.

వాదం అనేది అవసరమే! ‘స్పర్ధయా వర్ధతే విద్యా’ అన్నారు! అక్కడ వాదం కావాలి, కాని అది విద్య కోసమే అయి ఉండాలి,వ్యక్తి గత  ఈర్ష్య కాదు. ఒక చిన్న మాట బంగ్లాదేశ్ తో క్రికెట్ మేచ్ జరుగుతుండగా ఒక బౌలర్ మన ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ని ఔట్ చేయలేకపోయినందుకు అసహనానికి గురయ్యాడు. ఆ క్రమంలో అతను వేసిన బంతి రాహుల్ ద్రవిడ్ ని గాయ పరచింది. ఆ బంగ్లా దేశ్ ఆటగాడిని విలేఖరులడిగితే ద్రవిడ్ ని రక్తం వచ్చేలా గాయ పరచలేకపోయినందుకు విచారిస్తున్నానన్నాడు. ఇక్కడ ఈ ఆటగాడికి వ్యక్తి గత స్పర్ధ తప్పించి ఆటలో స్పర్ధ లేకపోయింది. ఈ విభజన రేఖను మరచిపోతే వారు శఠుడయి పోతారు, మొండివాడై పోతారు, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే దాకా దిగ జారిపోతారు. ఒక సిద్ధాంతం ఎవరూ ఆచరణలో పూర్తిగా తేలేకపోయారు, కారణం అది మానవ ప్రకృతి కి విరుద్ధంగా ఉంది కనక. అది చూడటానికి వాదించడానికి అందంగానే కనపడచ్చు, దాని గురించిన వాదం వ్యర్ధమే కదా! ఈ వ్యర్ధవాదం లో మిగిలేది?కోపం, అనవసర వైరం, పోనీ ఏమైనా కొత్తదేనా నేర్చుకోగలిగామా? లేదు, సమయం నష్టం, అందుకే వ్యర్ధవాదం పనికి రాదన్నారు.

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాం
గోబ్రాహమణేభ్య శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినో భవంతు.

 

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శుభం.. 650 th Post

 1. అందరి కిష్టము తమరి ప
  సందగు కబురుల టపా-లు శర్మ మహాత్మా !
  వందలు ‘ వేలగు ‘ గావుత !
  మందికి పాయసము పంచు మంచి పలుకులన్ .

  • రాజారావు గారు,
   ఆరోగ్యం బాగున్నట్టు తలుస్తాను, అమ్మ దయ, మీ అశీర్వచన రూపంలో.
   ధన్యవాదాలు

 2. ‘ అంతర్జాల ఉషశ్రీ ‘ గారికి అభినందనలు !
  ఇంకా అనేక వందల ( తెలుగు ) టపాలు,
  మీ నుంచి రావాలని ఆశిస్తున్నా !

 3. అభినందనలు. హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీ బ్లాగ్ ప్రయాణం మరింత చైతన్యంతో సాగాలని మనసారా కాంక్షిస్తూ
  నమస్సులు మాస్టారూ !

 4. శర్మ గారికి,

  శుభాకాంక్షల తో

  చత్వారి వాక్పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణా యే మనీషిణః
  గుహా త్రీణి నిహితా నేన్గయంతి తురీయం వాచో మనుష్యా వదంతి !
  (ఋగ్వేదం – ౧:౧౬౪:౪౫ )

  మీ టపాలు మరిన్ని రావాలని కోరు కుంటూ, అవిన్నూ శత సహస్ర కి పై బడి చేరుకోవాలని ఆకాంక్షిస్తో

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s