శర్మ కాలక్షేపంకబుర్లు-మాటకి మాట తెగులు……..

మాటకి మాట తెగులు…….

“మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు, లంజకి పిల్ల తెగులు” అని తెనుగు నానుడి.  మాటకి మాట పెంచుకుంటే మిగిలేది దెబ్బలాట. “తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా” అంటారు, రెండవవారు. ‘మాటే మంత్రమూ…. ‘అన్నారో సినీకవి.  మాట రెండు వైపులా పదునున్న కత్తి, ప్రాణమూ పోయగలదు, ప్రాణమూ తీయగలదు, అనుమానం పెంచగలదు, తుంచనూ కలదు.  అటువంటి మాట మంటా పుట్టించగలదు, మలయమారుతమూ వీచగలదు. మీ నాన్న ఉన్నాడా? అన్నది మీ అమ్మ మొగుడున్నాడా? అన్నదీ అర్ధం ఒకటే కావచ్చు, కాని రెండవమాట విన్నపుడు చాచిపెట్టి లెంపకాయ, గూబపేలేలా కొట్టాలనీ, మొదటి మాట విన్నపుడు సౌమ్యంగా ఉన్నారు/లేరని సమాధానమూ చెప్పాలనిపిస్తుంది. నేడు తమలపాకుతో నీవొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అన్నటే ఉన్నాయి, రోజులు. ” తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు” ఇదీ జరుగుతున్న వరస.

మరైతే ఇంత చక్కటి మాటని ఎలా ఉపయోగిస్తున్నారు? కొంతమంది మాట మానేసి, మనసు మూసుకుంటున్నారు, కొందరు నోటికొచ్చినది మాటాడుతున్నారు, వాక్స్వాతంత్రం పేరిటా, ఇజాల పేరిటా. విషయాన్ని విస్పష్టంగా విశ్లేషించి చెప్పేవారు తగ్గిపోతున్నారు, చెప్పినా వినేవారూ లేరు… “సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః………..” వినేటంత ఓపిక లేదనుకుంటా. ఇంతటి మాటని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? అంటే మనందరిలోనూ అంతర్గతంగా ఎదుటివారు హింసపడితే చూసి ఆనందించాలనే మనస్తత్వం జీర్ణించుకుపోయి ఉండాలి, లేదా ఎదుటివారిని మాటలతో హింసించి ఆనందించాలనీ అనిపించవచ్చు. మనం ఎలాగూ అలా మాటాడలేం, కారణం భయం కావచ్చు, గౌరవం పోతుందనుకోవచ్చు లేదా ‘ఎందుకొచ్చిన సంత’ అని తల ఒరగేసుకునిపోనూ వచ్చు, అందుకు అలామాటాడేవాళ్ళని ప్రోత్సహిస్తున్నాము, ప్రత్యక్షంగా, పరోక్షంగా.. “ఎప్పటికా మాటలాడి అన్యులమనసుల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ” అన్నాడు శతక కారుడు, ఇది అవకాశ వాదం. నిజం చెప్పాలి కాని అది ప్రియంగా ఉండాలీ అని కూడా అంటారు కదా! అందుచేత మీ నాన్న ఉన్నాడా?, అనే అనాలి కాని మీ అమ్మ మొగుడున్నాడా? అనకూడదు కదా! కాని ఇప్పుడు ఈ సరిహద్దు రేఖలు చెరిగిపోతున్నాట్లున్నాయి. అందునా e లోకంలో. పట్టించుకునేవారూ తక్కువనుకుంటా దానితో ఇష్టం వచ్చినట్లు, నోటికొచ్చినది డోక్కోవడం అలవాటయి పోయిందనుకుంటాను. రాజకీయనాయకులు ఒకరిపై మరొకరు పై చెయ్యిగా చూపించుకోడానికి ఇటువంటి ఎత్తులూ జిత్తులూ ప్రదర్శిస్తుంటారు, కాని సామాన్యులు కూడా ఈ అలవాటుకి లొంగిపోతున్నారు, అంతెందుకు! చిన్న పిల్లలుకూడా అలాగే మాటాడుతున్నారు, కారణం మీడియా చేస్తున్న ‘అతి’ అంటే అతిశయోక్తి కాదు, నేటి పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎలకో, చిలకో, గిలకో పట్టుకునే ఉంటున్నారు తప్పించి, పుస్తకం చదివిన పాపానకాని, మంచి మాట విన్న, మాటాడిన పాపాన కానిపోవటం లేదు.. సభ్యత అనేది మరచిపోయినట్టే ఉంది, పిన్నా పెద్ద అందరూ.

జీవితకాలం కలసి బతకవలసిన భార్యాభర్తలు, రైలు పట్టాలలా వాదులాడుకుంటున్నారే తప్పించి ఏకాభిప్రాయానికీ రాలేకపోతున్నారు. వాదనే ముఖ్యమైపోయింది, బతుకు కంటే. వాదనతోనూ, మనసులో మాట బయట పెట్టకా, చాలా కాపురాలు కూలాయి, కూలుతున్నాయి, ఇక ముందు కూడా కూలతాయి, కారణం, వాదమే తప్పించి విషయం లేకపోవడమూ, విషయం లేకపోవడం మూలంగా హేళనా, మనసుల్ని విరిచేస్తున్నాయి, మరి అతకడానిఉకి వీలు లేనట్టు.

వేమన తాతేమన్నాడు

 ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరి యతుకగా రాదు
విశ్వదాభిరామ వినుర వేమ!

 

మరి మన్సులు విరిగేలా మాటాడు కోవడం సభ్యతా? మంచిదా? బంగారు పళ్ళానికీ గోడ చేరుపు కావాలి, గాలిలో నిలవదు.

“మంచిగతమున కొంచమేనోయ్” అన్నారు పెద్దలు వారే “గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్” అనీ అన్నారు. ఏది నిజమో తెలియక కొట్లాడుకుంటున్నారు.

“జ్ఞాతికి కంటిలోనూ పాముకి పంటిలోనూ విషం ఉంటుంద”ని నానుడి. ఇది నిజమే! అన్నదమ్ములమని, ఇలా మాటాడు కోకూడదనీ అనిపించటం లేదు. “అమ్మని తిడతావురా లంజకొడకా” అన్నట్టే ఉంది. అమ్మని వాడు తిట్టేడు, మరి వీడు పూజించాడా? ఎవరన్నమాట వారికి వేద వాక్కయిపోయింది. వినేవారికి విన సందు, నవ్వేవారికి నవ్వ సందు, అనేవారికి అన సందు అయిపోయింది, సంసారం వీధినపడింది, నువ్వంటే నువ్వనుకోడమే జరుగుతోంది.

మంచి మాట మరొక మంచి ఆలోచనకి తావివ్వాలి, ఒక వ్యాసానికి రాసిన వ్యాఖ్య మరొక కొత్త ఆలోచనకి తావివ్వాలి. కాని అది జరగటం లేదు, నిశ్చలమైన మనసులో ఊహలు పుట్టవు, పూర్తి చంచలమైన మనసులోనూ ఊహలు నిలవవు. స్పందించే మనసులో మాత్రమే ఊహలు రూపు దిద్దుకుంటాయి. బ్లాగుల కాలం చెల్లిందా? అని ఒక సందేహం పుట్టింది. అది నిజంకాదు, కొత్త వాటిని, వెదుక్కుంటూ పాత వారు కొత్త చోట్లకిపోవడమూ, ఇంత సేపు కంప్యూటర్ దగ్గర కూచుని రాయడమూ, అంతా అనవసరమనీ, హాయిగా రెండు మాటలలో ఎక్కడొ మరో చోట గిలికితే? ఈ ఆలోచన పెరిగింది,మనసుకి ఆనందం ముఖ్యం కదా! బ్లాగులలో సినిమా, రాజకీయం చొరబడిపోయి ప్రముఖ స్థానం ఆక్రమించేసేయి, అందుచేత కూడా బ్లాగులో రాసేవారు తగ్గిపోతున్నారు, ఇంకా తగ్గిపోతారు కూడా, ఎందుకంటే వీరిక్కడ మైనారిటీలో పడిపోయారు, మైనారిటీ హక్కులుండవు. కొంత కాలం తరవాత బ్లాగులో ఒకప్పుడు ఇటువంటి మంచి మంచి విషయాలు రాసేవారని మంచి చర్చ చేసేవారని రేపటివారనుకునే పరిస్థితి వచ్చేసీంది. వాదనా పటిమదే నేటి రోజు, నోటికొచ్చినట్లు తిట్టగలిగినవాడే రాజు. ఇష్టమైనవారుండటం లేదా……. Survival of the fittest సూత్రం వర్తిస్తుంది.
స్వస్తి.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మాటకి మాట తెగులు……..

 1. orkut 10 ఏళ్ళకు మూత పడింది.
  hot mail, sifymail గగనానికి ఎగిసి పోయాయి.
  google buzz బస్ బంద్ అయి పోయింది.
  ఎలెక్ట్రానిక్ ఉపకరణాలలాగే,
  అంతర్జాలం లో వీటికి కూడా
  ఆయు ప్రమాణం తక్కువే

 2. నీతి చంద్రికలు తియ్యని మాటలలో చెప్పారు
  నోరు జార కుండా చుసుకోవాలన్న మీసలహాలు
  అందరికీ ఎంతో ఉపయోగ పడేవి.

  • మోహన్జీ,
   కాలు జారితే తీసుకోగలం కాని నోరు జారితే తీసుకోలేమని నానుడి కదా! తొందరగా పెరిగేది తొందరగా నశిస్తుందనుకుంటా, మీ మాట నిజం.
   ధన్యవాదాలు.

 3. మీరు ఏమీ వ్రాసిన అదిఎంతోప్రియముగా ఉంటుంది. చాగంటి వారి ప్రవచనం చెవులకి మనస్సుకి ఎంత ఉల్లాసంగా ఉంటుందో, మీ రచనలు కళ్ళకి మనస్సుకి అంత ఆహ్లాదకరంగా ఉంటాయి. హమ్మయ్య ఎప్పటి నుంచో చెప్పాలనుకొన్నది చెప్పేసా. మీకు ఎన్నో అభినందనలు మరిన్ని వందనాలు.

  • రాముడు గారు,
   స్వాగతం.
   మీ వ్యాఖ్య చాలా ఆనందాన్నే ఇచ్చింది. నేను చాలా సామాన్యుడిని, చదువుకోని వాడిని, శృత పాండిత్యమే 🙂 చాలా పెద్ద వారితో పోల్చారు, కొంచం భయమేసింది. మీ అభిమానం సంపాదించుకోగలిగినందుకు అదృష్టవంతుడిని. మంచి మాట చెప్పాలనుకున్నదానికి ఆలస్యం కూడదు కదండీ!మీ అభినందనలకి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s