శర్మ కాలక్షేపంకబుర్లు-గతజల సేతుబంధన న్యాయం

గతజల సేతు బంధనన్యాయం

గతము అనగా జరిగిపోయినది, జలము అంటే నీరు, సేతువు అంటే అడ్డుకట్ట. జరిగినదానికి విచారమేల అనేదే ఈ న్యాయం. ఒక పని చేశాం. ఫలితం వచ్చింది, అది మనకు అనుకూలం కావచ్చు వ్యతిరేకమూ కావచ్చు. జరిగిపోయిన కాలాని వెనక్కు తీసుకురాలేము, అలాగే పల్లానికి వెళిపోయిన నీటికోసం ఇప్పుడు ఆనకట్ట కడితే ఉపయోగం లేదని, దీనినే తెనుగులో “చేతులుకాలేకా ఆకులు పట్టుకోడ”మంటారు.

కంబళ భోజనన్యాయం

కంబళం అంటే గొంగడి. “గొంగట్లో తింటూ వెంట్రుకలు లెక్కపెట్టుకోడమని” తెనుగులో అంటారు. గొంగడి అనేది వెంట్రుకలను దారంలా పేని దుప్పటిలా తయారు చేస్తారు. వెంట్రుకలతో తయారు చేసిన దానిలో వెంట్రుకలేకదా ఉంటాయి. అందులో భోజనం పెట్టుకుని తింటే వెంట్రుకలే వస్తాయి. వెంట్రుక భోజనంలో వస్తే ఆ అన్నం తినకూడదు. మరి ఇలా గొంగడి పెట్టుకుని తింటే వెంట్రుకలే వస్తాయి కనక, తేలినదేమంటే గొంగడిలో భోజనం చేయకూడదు. తప్పు జరగడానికి సావకాశమిచ్చి, తప్పు జరిగిందని విచారించడం.

కరతలామలకన్యాయం

కరము అంటే చెయ్యి. ఆమలకం అంటే ఉసిరికాయ. చేతిలో ఉసిరికాయ కనపడుతున్నదే కదా! దీనిని గురించి మరొకరిని అడగక్కరలేదు. దీనినే తెలుగులో “ముంజేతి కంకణానికి అద్దమెందుకు?” అంటారు. ఎదురుగా సత్యం కనపడుతుండగా ఋజువుల కోసం చూడక్కరలేదనడమే, పూర్తిగా తెలిసినదే అని అర్ధం.

కూపస్థమండూకన్యాయం

కూపం అంటే నుయ్యి.మండూకమంటే కప్ప. దీనినే మరోలా కూడా చెబుతారు, కూప కూర్మన్యాయమని
( కూర్మం అంటే తాబేలు). నూతిలో ఉండే కప్పకి తెలిసినది కనపడేది, చాలా కొద్ది భాగమే. అలాగే ఆకాశం కూడా కొద్దిగానే కనపడుతుంది. ఆ కప్పకి తెలిసినది తక్కువ, మొత్తం ప్రపంచం అంతా అంతే అనుకుంటుందిట. దీనిని తెలివి తక్కువ వారు తమకు తెలిసినదే గొప్పని మిగతా వారికేమీ తెలియదని అనుకుంటారు, దానిని ఈ న్యాయంతో పోలుస్తారు.

తిలతండులన్యాయం

తిలలు అంటే నువ్వులు తండులాలు అంటే బియ్యం. నువ్వులు నల్లగానూ చిన్నవిగానూ ఉంటాయి. బియ్యం పెద్దవిగానూ తెల్లగానూ ఉంటాయి. రెండూ కలసిపోయినా వేరు చేసుకోడమూ తేలిక. అలాగే సుజనులు దుర్జనులు కలసిపోయినా వేరు చేసుకోడం తేలికని చెప్పడమే.

తాళాధిరోహణన్యాయం

తాళము అంటే తాడి చెట్టు ఇది సంస్కృత పదం. తెనుగులో తాళం అంటే  తాళము చెవి. అధిరోహణం అంటే ఎక్కడం. దీనిని తెనుగులో “తాడి చెట్టు ఎందుకురా ఎక్కేవంటే దూడ గడ్డి కోస”మన్నట్లు. తాడి చెట్టు ఎక్కినది కల్లు కోసం కాని, దూడ గడ్డి కోసమని చెప్పినది అసంబద్ధ సమాధానం, నమ్మ తగినది కాదని. ఒక చిన్న పిట్ట కథతో ముగిద్దాం. కన్నయ్య ఒకింటిలో దూరేడు, వెన్న కుండలో చెయ్యిపెట్టేడు, ఈ లోగా గోపిక వచ్చి కన్నయ్య చెయ్యి పట్టుకుంది. అలా దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకోవాలని ఆ గోపిక తాపత్రయం. పట్టేసుకున్నాననుకుంది పాపం. కుండలో చెయ్యి ఎందుకు పెట్టేవు కన్నయ్యా అని అడిగితే, నా లేగ దూడ తప్పిపోయింది, ఈ కుండలో ఉందేమోనని వెతుకుతున్నానన్నాడట. ఆ గోపిక, కన్నయ్య చెప్పిన సమాధానానికి విస్తుపోయి చూస్తూ ఉండిపోయిందిట, ఏమి చెయ్యడానికి తోచక. ఇది లీలా శుకుల భావమన్నారు పెద్దలు.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గతజల సేతుబంధన న్యాయం

    • జిలేబి గారు,
      ఈ ఘట్టం భాగవతం లో లేదు కాని లీలాశుకులు ఇలా ఊహించారట. అందంగా ఉంది కదా, కృష్ణుని బాల్య క్రీడ, అంతా విష్ణుమాయ.
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s