శర్మ కాలక్షేపంకబుర్లు-ములగ కూర పెసరపప్పు.

ములగ కూర పెసరపప్పు.

ఆషాఢ మాసం వచ్చేసి అప్పుడే పదిరోజులు దాటిపోయింది. నిన్ననే శ్రీశయనైకాదశి అదే తొలేకాశి కూడా వెళిపోయింది. మాకు చినుకు లేదనుకోండి ఇప్పటిదాకాను, పుణ్యాత్ములంకదా! ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో పోతున్నానా. వస్తున్నా! ఈ ఆషాఢమాసం లో ములగ కూర తిని తీరాలన్నారు. ములగ కూరా పెసరపప్పూ వేసింది ఇల్లాలు ద్వాదశిరోజు. దాని వంటక విశేషంబెట్టి దంటేని…..

కావలసినవి

1.ములగకూర లేతది చిగుళ్ళు.
2.పెసరపప్పు.
3.పోపుకి
మినపపప్పు.
పచ్చి మిర్చి.
ఆవాలు
మెంతులు చిటికెడు
జీలకర్ర.
చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి ఉంచుకోండి.
ఇంగువ ముక్క.
నూనె.
4.మిరియాలు కొద్దిగా.
5.కూర వడియాలు కాని గుమ్మడి వడియాలు.
6.పచ్చి శనగలు.
7.పసుపు చిటికెడు.
8.ఉప్పు

ములగ కూర శుభ్రంగా కడగండి, పురుగు లేకుండా చూసుకోండి. కూరని ఉప్పు నీళ్ళలో పడెయ్యడం, కొద్ది సేపు, మంచిది. గుమ్మడి వడియాలు కాని కూర వడియాలు కాని వేయించుకుని ఉంచుకోండి
పెసరపప్పు ఉడికించండి, నీళ్ళు పోయాలండోయ్. ములగకూరని కూడా అందులో వేసెయ్యచ్చు, అందులోనే పచ్చి శనగలు కూడా వేయండి, చిటికెడు పసుపేయండి. ఉడికిన తరవాత ఉప్పేయండి, నీరులేకుండేలా చూడండి, కొద్దిగా నీరున్నా కంగారు పడకండి,

మూకుడు వేడెక్కిన తరవాత కొద్దిగా నూని వేసి ఆ తరవాత మినపపప్పు వేయించండి దోరగా, దానిలో
ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయండి, ఆవాలు వేగేటపుడు జాగ్రత పేలతాయి, కళ్ళలో పడితే ప్రమాదం, ఆ తరవాత పచ్చిమిర్చి, సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం  , చివరగా ఇష్టాన్ని పట్టి ఇంగువ ముక్క వేయండి. పోపు కమ్మటి వాసనొచ్చాకా దింపండి.

ఇప్పుడు పోపులోకి పప్పుని చేర్చండి. వేయించి పెట్టుకున్న వడియాలు, నేతితో వేయించుకున్న మిరియాలు కూడా కలపండి.కొద్ది సేపు స్టవ్ మీదుంచండి, నీరుంటే ఇగిరిపోతుంది.

ములగ కూర పెసరపప్పు ఇదేంటి పిచ్చి తిండి అనుకుంటున్నారా? ఇది ఒక కమ్మనైన రుచికరమైన మందు. ములగ కూరలో ఇనుముంది, పెసరపప్పులో మాంసకృత్తులున్నాయి.ఇక పోపులో వేసినవన్నీ మందులే, మిరియాలతో, వడియాలతో. ఇది వర్షాకాలనికి కావలసిన మందు, అందుకే ఈ నెలలో తినమన్నారు. ములగాకు వేడి చేస్తుంది అందుకుగాను పెసరపప్పు చలవ చేస్తుంది. చేసుకుని చూడండి, బలే రుచిగా ఉంటుంది.

 

 

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ములగ కూర పెసరపప్పు.

 1. ములగ కూర పెసరపప్పు. గురించి చక్కగా వివరంగా తెలియజేసారు. మునగాకు కళ్ళకు కూడా చాలా మంచిదట. మేము చెన్నైలో ఉండగా అప్పుడప్పుడు వండేవాళ్ళం.

  చెన్నైలో సరస్వతి ఆకు కూడా అమ్మేవారు. మాకు ఆకుకూరలు తెచ్చే అమ్మాయిని అడిగితే 10 రూపాయలకు కొన్ని ఆకులు తెచ్చి ఇచ్చేది. సరస్వతీ ఆకు కూడా ములగాకు పప్పులా వండుకోవచ్చు. అయితే సరస్వతీ ఆకు కొద్దిగా చేదుగా ఉంటుంది. ( కాకరకాయలా ). చేదు ఉన్నా తింటే మంచిది.

  • అమ్మాయ్ అనురాధ,
   ప్రతి ఆకు కూరలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఇది మరిచిపోతామని …….నా ఘోష…అదీ సంగతి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s