శర్మ కాలక్షేపంకబుర్లు-“కాయం”

“కాయం”

”పంతులుగారు! రండి రండి, ఒరే సుబ్బరాజూ పంతులుగారికి కుర్చీ వెయ్యి. ఏమండి అమ్మాయి పురిటికొచ్చిందాన్నారు, పురుడొచ్చిందా?”

”నిన్న రాత్రి అమ్మాయి ప్రసవించిందయ్యా! ఆడపిల్ల, తల్లీ బిడ్డా కులాసా, కాయం సరుకులకొచ్చాను.”

”మీరేరావాలా? కబురుపెడితే పంపకపోదునా? ఒరే సుబ్బరాజూ ఆ పనొదిలేసి ముందు పంతులుగారికి కాయం సరుకులు కట్టు, నెలకి కట్టమంటారా? మూడు నెలలకీ కట్టించెయ్యనా?” ఇలా సాగిపోయేది సంభాషణ. ‘కాయం ‘ అన్నది నాటి రోజులలో, పురుడొచ్చిన మూడవరోజునుంచి బాలెంతకి పెట్టేవారు, మూడు నెలలపాటు. ఈ కాయం తినడం మూలంగా పురటాలు ఆరోగ్యం బాగుండేది,ఒళ్ళు  గట్టిపడేది, పాలు తొందరగా, బిడ్డకి కావలసినన్ని పడేవి, పురటాలికి నడుమునొప్పి వగైరా ఉండేవి కావు, ఈ సరుకులన్నీ కిరణా కొట్టులో దొరికేవి, అదే కాక కిరణా కొట్టతనికి కూడా వీటి విషయం తెలిసుండేది. ఆ సరుకుల వివరం, మొన్న మాటల సందర్భంగా ఇల్లాలినడిగితే చెప్పింది. ఈ కాయాన్ని ప్రతి రోజు ఉదయం సాయంత్రం బాలెంతకు పెట్టేవారు, చిన్న నిమ్మకాయంత,.ఇది తినడానికి బలే రుచిగా ఉంటుంది.

కావలసిన సరుకులు.

1. వాము-250 గ్రా
2. పిప్పళ్ళు-100
3.శొంఠి-50
4.మిరియాలు-50
5.దాల్చిన చెక్క-100
6.పిప్పలకట్టి-100
7.దుంపరాష్ట్రం ఒక దుంప.
8.కళింగ రాష్ట్రం ఒక దుంప.
9.పసుపు కొమ్ము-1
10.వసకొమ్ము- ఒకటి.
11.ఆవు నెయ్యి
12.తాటి బెల్లం.

పై సరుకులన్నిటిని ఆవునెయ్యి కొద్దిగా వేసి దోరగా వేపుకుని తీసుకోవాలి, తాటిబెల్లం,కాకుండా,.వేరు, వేరుగా, అన్నిటిని విడివిడిగా మెత్తగా దంచుకోవాలి, అమాన్ దస్తాలో. అన్ని గుండలూ గుచ్చెత్తి దానికి సరిపడా మెత్తగా చేసుకున్న పాతబెల్లం వేసి కలపాలి. ఈ మొత్తం గుండకి తగు ఆవునేతిని కరిగించి పోసి ముద్దగా కలుపుకుని తడిలేని గాజు సీసా లో పెట్టుకోవాలి.

బెల్లo,ఆవునెయ్యి కలపకుండా ఉంచుకున్న గుండను అప్పటికప్పుడు మంచినీళ్ళతో ఉడకపెట్టి,అందులో బెల్లం వేసి, కొద్దిగా ఆవునెయ్యి వేసి తయారు చేసుకున్న దానిని ”ఉడుకు కాయం” అనేవారు. ఇది రెండు, మూడు రోజులు తప్పించి, ఎక్కువ కాలం నిలవ ఉండదు.

దీనిని రోజూ రెండు పూటలా పురటాలికి పెడితే బాగుంటుంది, దీనిని మా ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసేవారు, మా నాన్నగారు. ఆ తరవాత మేమూ చేసేం, మా తరవాత తరంవారు వీటి వాడకం మానేసేరు, నేటి డాక్టర్లు, ఇటువంటి పిచ్చి పిచ్చి మందులు తినద్దంటే. ఒకప్పుడు గోజిలలో విరివిగా వాడిన ఈ లేహ్యం కనుమరుగైపోయిందనుకుంటున్నా. పురటాలు ఎవరికైనా మా నాన్న గారు దీనిని ఉచితంగా తయారు చేసి ఇచ్చేవారు, తరవాతి కాలంలో సరుకులు తెచ్చుకుంటే చేసిపెట్టేవారం, ఆ తరవాత వెనకబడిపోయింది, ఇప్పటి తరానికి దీని పేరే తెలియదేమో!

 

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-“కాయం”

 1. కాయం అంటే గుర్తుకు వచ్చింది. నాకు చాలా చిన్నప్పుడు జరిగిన సంఘటన. బహుశః 1959 కాని, 1960 కాని అయ్యుంటుంది. నిద్రలో ఉన్న నన్ను మా నాన్నగారు నిద్రలేపి గుడికి వెడదాం రా అన్నారు. ఎగిరి గంతేసి మరీ బయలుదేరాను. ఊరు గెద్దనాపల్లి. అక్కడొక చిన్న కృష్ణాలయం. అప్పటికకే పాతబడింది. అర్థరాత్రి పూటా అరోజు ఎంతోమంది పాటలూ‌ పద్యాలు వగైరా పాడారు. అదంతా నాకు ఏమీ అర్థం కాకపోయినా ఆ హడావుడిని బాగా ఆనందించాను. ఇంతలో ప్రసాదం అంటూ ఒకాయన నాచేతిలో ఏదో ఒక చిన్న ఉండ పెట్టాడు. నోట్లో వేసుకొని కెవ్వుమన్నాను. ఆ రుచి నా కేమీ నచ్చలేదు. ఇంతికి వచ్చాక అందరూ ఒకటే నవ్వటం. బాగుంటుందిరా అని మా అమ్మా నాన్నా అనటం. బాగాలేదు బాగాలేదు అని నా గోల.

  కొన్నాళ్ళ తరువాత అవగాహనకు వచ్చింది. ఆరోజు కృష్ణాష్టమి అనీ, ఆ ప్రసాదం కాయం అనీ.

  మా అమ్మగారి చిన్నతమ్ముళ్ళు ఇద్దరూ‌ కవలలు బలరామకృష్ణులు వాళ్ళపేర్లు. నాకంటే చిన్నవాళ్ళు. మా మామయ్య కృష్ణుడికి కాయం అంటే మహాప్రీతి. మా అమ్మగారు బాలింతరాలుగా ఉన్నప్పుడు కాయం తినేవారు. కృష్ణుడు కాని వచ్చాడంటే సగానికిపైగా కాయం వాడే స్వాహోచేసేసేవాడు! మా అమ్మగారు గోలపెడుతుందని దొంగతనంగా చాకచక్యంగా కాయం ఉండల డబ్బా ఖాళీ చేసేసేవాడు.

  నాకు మాత్రం ఆ కాయం సహించేది కాదు. బోలెడు నెయ్యీ నల్లబెల్లమూ అందులో ఉన్నా సరే, పిప్పళ్ళవల్లనో మరిదేని వల్లనో అదొక రకమైన వాసనా, కటుత్వం ఉండేవి దాని రుచిలో. అందుకే‌ అస్సలు నచ్చేది కాదు.

  • మిత్రులు శ్యామలరావు గారు,
   బహుకాల దర్శనం. ఇది మన వారసత్వ సంపద, దీనిని కూడా దోచుకుని సొమ్ము చేసుకోవాలనుకునేవారు బయలుదేరిన రోజులు. అందుకే ఈ టపా రాశాను,ఒక కేస్ లో ఇలా బ్లాగులలో రాసినది సాక్ష్యంగా పనికొచ్చిన సంగతి తెలుసు, అదనమాట సంగతి.
   కాయం బలే రుచిగా ఉంటుందండి, మరి కొంతమంది ఇష్టపడలేరు. నిజానికి మా అత్తారింట్లో నా కోసం కాయం చేసేవారంటే నమ్ముతారా! మా అమ్మాయి కంటే అల్లుడే ఎక్కువ తింటాదు కాయం అనేవారు. ఇది శ్రీకృష్ణునికి నైవేద్యం ఎందుకు పెడతారో మాత్రం తెలియదు. స్పందనకి,
   ధన్యవాదాలు.

 2. గత నాలుగు నెలలుగా ఇల్లాలు పక్క దిగడం లేదు..అని వ్రాశారు. అయ్యో ! ఏమయిందండి ? మేడం గారు అనారోగ్యంతో ఉన్నారా ? ఇంటావిడ అనారోగ్యంతో ఉంటే భర్తకు , ఇంకా ఇంట్లో అందరికి ఎంతో ఆందోళనగా ఉంటుంది. దైవం దయ వలన మేడం గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మేడం ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. అధైర్యపడవద్దు. అనారోగ్యం త్వరగానే తగ్గిపోతుంది లెండి.

  కాయం గురించి వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు. ఇలాంటివి తెలిసిన మీలాంటివాళ్ళు ఇతరులకు కూడా తెలియజేయటం వల్ల , తరతరాలుగా వస్తున్న గొప్ప విధానాలు కనుమరుగవకుండా ఉంటాయి.

  నాకు తెలిసిన మరికొన్ని విషయములను వ్రాయాలనిపిస్తోంది. బాలెంతలకు కొన్నిసార్లు పాలు సరిగ్గా పడవు. అల్లోపతి డాక్టర్లు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. అవి సరిగ్గా పనిచేయవచ్చు లేక పనిచేయకపోవచ్చు.

  అయితే, ఆయుర్వేదంలో స్తన్యవర్ధిని అనే టానిక్ ఉంది. అది వాడితే బాలెంతకు పాలు చక్కగా పడతాయి. ఈ టానిక్ వాడటం మొదలుపెట్టిన కొంతకాలానికి క్రమంగా చక్కటి ఫలితాలు లభిస్తాయి. ( కొందరిలో సుమారు నెల తరువాత కూడా కావచ్చు..)

  అయితే ఈ టానిక్ ఎంతకాలం వాడాలో ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారం వాడుకోవాలి. అంటే ఈ మందులు ఈస్ట్రోజన్ లెవెల్ పై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది ? కాబట్టి , మరీ ఎక్కువ కాలం వాడితే నెలసరిలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉందేమో ? కాబట్టి వైద్యుల సలహా ప్రకారం వాడుకోవటం మంచిది.
  ( ఈ మందులు ఈస్ట్రోజన్ లెవెల్ పై ప్రభావాన్ని చూపిస్తాయా ? లేదా ? అనే విషయం నాకు సరిగ్గా తెలియదు . )

  • అమ్మాయ్ అనురాధ!
   అనారోగ్యం మళ్ళుతోంది. ఇప్పుడు కొద్దిగా అడుగులేస్తోంది, మీ అభిమానానికి ధన్యవాదాలు.
   బాలెంతకి పాలు పడటానికి ముఖ్యం గా పాలు తాగాలి, అన్నం లో పాలు పోసుకుని తాటి బెల్లం నంచుకుంటే మరీ మంచిది, ఇక మందులంటావా చాలానే చెప్పచ్చు. ఏదయినా వైద్యుని సలహా అవసరం.
   ధన్యవాదాలు.

 3. మా అమ్మ అంటూ ఉండేవారు మేము కాయం తినేవాళ్ళము అని. సరే ఎలా చెయ్యాలో చెప్పు, నేను సరుకులు తెస్తా అంటే, మీరు ఇచ్చిన పట్టీలో నుండి ఒక 5-6 సరుకులు మాత్రం చెప్పి మిగతావి గుర్తు లేదు అనేసేది. ఇంకేమి చేస్తాము, కాయం లేదు మరేమీ లేదు. మిగతవాటి పేర్లు విన్నా కానీ ఆ రాష్ట్రాల పేర్లు మాత్రం అస్సలు వినలేదు. రాసి పెట్టుకుంటా, నా కూతుర్ల టైం కి ఇంకా ఆయుర్వేద దుకాణాలు బ్రతికి ఉంటే ప్రయతిన్స్తా. మంచి విషయాలు చెప్తున్నారు బాబాయ్ గారు.

  • అమ్మాయ్ లక్ష్మి,
   గత నాలుగు నెలలుగా ఇల్లాలు పక్క దిగడం లేదు, ఆమె పక్కన కూచుని కబుర్లు చెప్పడంలో పాత కాలపు సంగతులు మాటాడుకుంటుంటే ఇది బయటికొస్తే, బ్లాగు లో పెట్టేను. వారసత్వ సంపద పోకూడదనే నా తాపత్రయం.
   భయం లేదమ్మా! రాబోయే కాలం లో మరల ఆయుర్వేదానిదే భవిష్యత్తు. రాబోయే కృష్ణాష్టమికి నైవేద్యం గా చేసి చూడమ్మా!
   ధన్యవాదాలు.

   • చంపేసారు బాబాయ్ గారు, ఈ దేశం కాని దేశంలో దోసకాయలు దొరకటమే కష్టం అలాంటిది ఆ సరుకులన్నీ ఎక్కడినుండి తెమ్మంటారు 😦

    కానీ మీ ప్రయత్నం మాత్రం ఎంతో అభినందనీయం. నేను అక్కడే ఉండి ఉంటే ఖచ్చితంగా రాజమహేంద్రవరం కి వచ్చి మిమ్మల్ని కలిసి మీ అనుభవ సారం నుండి ఒక్క నాలుగు చుక్కలైనా ఆశ్వాదించేదాన్ని. మా వాళ్ళందరితో మీ గురించి చెప్తూనే ఉంటాను

   • అమ్మాయ్ లక్ష్మి,
    ఈ భూమి మీద నీవు ఏ మూల ఉన్నా, దీర్ఘాయుష్షుతో, దీర్ఘ సుమంగళిగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. పోనిలే అమ్మా! నిరాశపడకు.మీ అభిమానానికి.మీరిటు వస్తే నా ఇంటికి స్వాగతం, సుస్వాగతం.
    ధన్యవాదాలు.

 4. మా అమ్మగారు చెప్పేవారు ‘కాయం’ గురించి. వాళ్ళకు అమ్మమ్మ పెట్టేవారని. మా పాప పుట్టినప్పుడు “కాచు” అని ఉంటుంది కదా.. అది పెట్టేవారు నాకు. తాంబూలంలో అనుకుంటా కలిపి వేసుకోవాలనేవారు. అది కూడా తెప్పించి పెట్టేది అమ్మ. అది తింటే నడుం గట్టిపడుతుందనో ఏదో చెప్పేవారు.

  • తృష్ణ గారు,
   దీనిని ఈ మధ్య కాలంలో అనగా దగ్గరగా ఏభై సంవత్సరాలుగా మానేస్తూ వచ్చారు. ఇది చాలా మంచిది, పురాటాలు ఆరోగ్యానికి, తద్వారా బిడ్డకు. పురటాలికి సంబంధించిన అనారోగ్యాలకిది మంచి టానిక్. దీని గురించి నెట్ లో లేదనుకుంటాను, అందుకే రాశాను, ఉపయోగపడాలనీ,త్యాగరాజ కృతులకి పేటెంట్ తీసుకుంటున్న కాలం లో ఇది మన వారసత్వ సంపదని పోరాడటానికైనా ఆధారం కావాలని నా ఉద్దేశంగా ఇది నెట్ కి ఎక్కిందనమాట. ఇటువంటివి ఎవరి బ్లాగులో కనపడినా స్పందించండి. ఇవన్నీ మన వారసత్వ సంపదని పోరాడేవారికి ఆధారాలుగా ఉంటాయి. చిల్లగింజలికి కూడా పేటెంట్ తీసుకుంటున్న రోజులు.నేను కాచు గురించి విన్నాను, దాని గురించి తెలిస్తే, లేదా తెలుసుకుని బ్లాగులో రాయగలరు.
   ధన్యవాదాలు.

 5. నమస్కారం బాబాయ్ గారూ ! మీరు చెప్పిన ఈ కాయం అనే దాన్ని మా చిన్నప్పుడు కృష్ణా ష్టమి రోజున ప్రసాదం పెట్టేవారు. బాగుంటుంది తీయతీయగా కారం కారంగా.

  • అమ్మాయ్ నాగరాణి,
   నిజమే! కృష్ణాష్టమికి ప్రసాదంగా పెడతారు, మరచిపోయాను, గుర్తుచేసినందుకు
   ధన్యవాదాలు.

 6. ఈ లేహ్యానికి ఓ పేరు పెట్టి, దాన్ని బ్రాండు ఇమేజు చేసి అమ్మితే కొంటారు గాని ఇట్లా సరకుల పేరులు జెప్పి సొంతం గా తయారు చేసుకో మంటే, ఈ కాలంపు జిలేబీల తరమా అయ్య గారు ??

  అసలు ఊరగాయలు, వడియా లే పెట్టడం తెలీదు మరి ఇట్లాంటి కళింగ , దుంప రాష్ట్రాల ని పేర్లు చెబ్తే మా జిలేబీ లకి అర్థ మగునా ??

  ఈ టపా చదివి ఏ రామోజీ వారో, ప్రియా పచ్చళ్ళు వారో కాకుంటే ఏ అమెరికా వారో ఈ కాంబినేషన్ కి పేటంటు కొట్టి మీ మీద కేసు బనాయించినా చేయ వచ్చు ‘పే’ ‘తంతు’ కోరి !! (ఈ మధ్య వారెవ్వరో త్యాగయ్య రాగాలకి పేటంటు పెట్టి కేసు పెట్టి నారంటా మరి పోయే కాలం దాపురించిందన్న మాట కాదూ మరి ఇది!)

  శుభోదయం
  జిలేబి

  • జిలేబిగారు,
   మనదైన వారసత్వపు సంపద మేధో హక్కు హరించేస్తున్నారనే దానితోనే ఈ టపా రాసాను. చాలా మందికి ఇది తెలుసునన్నది చెప్పాలనే నా ఉద్దేశం, ఇప్పుడు వాడకం మానేశారు. ఇలా పేటెంట్ తీసుకోడానికి వీలుండకుండా అడ్డుపడేందుకే ఇటువంటి టపా, ఇది కూడా రాస్తారాబ్లాగులో అంది ఇల్లాలు.సమాజం ఉపయోగించుకోవాలనేదే నా ఆరాటం. ఇప్పటి జిలేబీ లకి తెలివి ఎక్కువే 🙂 ఒక సారి చెబితే చాలు,చేసుకోగలరు. అసలు చెప్పేవాళ్ళు కావాలి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s