శర్మ కాలక్షేపంకబుర్లు-సుశోభన ప్రేమ కథ

సుశోభన ప్రేమ కథ                                                                                  సుశోభన-1.

అయోధ్యను పాలించే రాజు పరిక్షిత్తు అనేవాడు ఒంటరిగా వేటకి వెళ్ళేడు. వేట సాగుతుండగా ఒక చోట మెలమెల్లని అడుగులేస్తూ పువ్వులు కోస్తున్న ఒక సుందరాంగి కనపడింది, ఇలా పలకరించాడు.

ఎవ్వరిదాన వంబుజదలేక్షణ యేకత మిట్టులేల నీ
వివ్వన భూమియందు జరియించెదు నావుడు తండ్రి పంపునన్
దివ్వనభూమియందు జరియించెద సద్వరు గోరుకన్య నే
నెవ్వరిదానగావలయు నేర్పడజెప్పుము రాజనందనా. భా… అరణ్య.ప.ఆశ్వా..4…324

ఓ!చిన్నదానా! ఎవరిదానవు, ఎందుకు, ఒంటరిగా ఈ అడవిలో తిరుగుతున్నావు? అని అడిగితే నా తండ్రి పంపగా ఈ అడవిలో తిరుగుతున్నాను, మంచి వరుడిని కోరే కన్యను, నేనెవరిదానను కావాలనుకుంటున్నావని, ( నేనెవరిదాననయితే నీకు కావాలని అనుకుంటున్నావు, నేనెవరిదానను కావాలనుకుంటున్నావనీ శ్లేషగా) గడుసుగా, జాణలా అడిగింది.

రామాయణం లో పిడకలవేటని, ఈ పద్యం ఈ కింద పద్యం తో పోలుతోందా?

ఎక్కడివాడొ? యక్షతనయేందు జయంతు వసంతు కంతునిన్
చక్కదనంబునన్ గెలువజాలెడువాడు, ఈ మహీసురాన్వయం
బెక్కడ ఆ తనూ విభవ మెక్కడ ఏలిన బంటుగా మరున్
ఢక్కగొనంగ రాదె అకటా నను వీడు పరిగ్రహించినన్..

(పెద్దనగారి పద్యం మను చరిత్రలోది, వరూధిని అంతరంగం.)

కథలో కొస్తే, ఆమె చెప్పిన సమాధానానికి మరింత ముగ్ఢుడై నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా సమయోచితంగానే చూసింది, .ఓరకంట.  రాజు తన మనోగతం చెప్పేడు, చేపడతానని. దానికామె కూడా ఒప్పుకొని ఒక షరతు చెప్పింది, ” ఎప్పుడూ నన్ను జలకాలటకి పిలవద్దు” అని, రాజు సమ్మతించాడు, ఆమెను రాజ్యానికి తీసుకుపోయాడు. కాలం గడచింది, ఒక నాడు భార్యతో కూడి వన విహారానికి వచ్చాడు. వనంలో తిరిగారు, వాస గృహంలో మసిలారు, ఇద్దరికి ఒంటి నిండా చెమట పట్టింది, వాస గృహం వదలి బయటికొస్తే, చక్కటి సరస్సు కనపడింది. నీళ్ళు బాగున్నాయి,సరస్సు అందంగా ఉంది, స్నానం చెయ్యమన్నాడు, ఆమెను. ఆమె నవ్వుతూ నీటిలో ములిగింది, మరి తేలలేదు, రాజు వెతికించాడు దొరకలేదు. కొలనులో నీళ్ళన్నీ తోడించి మరీ వెతికాడు, కనపడలేదు, కాని కప్పలు గుంపుగా కనపడ్డాయి. ఈ కప్పలే నా ప్రియురాలిని ఏదో చేసి ఉంటాయని కప్పలని చంపమని భటులకు చెప్పాడు. రాజ్యం మొత్తం మీద కప్ప కనపడితే చంపేస్తున్నారు, భటులు. ఈ సంరభం, సంహారం చూసి కప్పల రాజు ముని వేషంలో రాజు దగ్గరకొచ్చి ‘కప్పలని చంపడం గొప్ప ఖ్యాతి నిస్తుందా? ఎందుకు అకారణం గా కప్పలను చపిస్తా’వని అడిగాడు. దానికి రాజు, ఈ కప్పలు నా మనోహరిని ఏదో చేశాయి, అందుకే చంపిస్తున్ననన్నాడు. అందుకా ముని వేషధారి, ”నేను కప్పల రాజును నా పేరు ’ఆయువు’, నీవెవరి కోసం వెతుకుతున్నావో ఆమె, నా కుమార్తె సుశోభన, దాని వల్ల చాలామంది మోసపోయారు, నువ్వనగా ఎంత?” అన్నాడు. దానికి రాజు ఆమెను రప్పించి నా పై మరులు లేవని అనిపించమన్నాడు. కప్పల రాజు కుమార్తెను పిలిపించాడు, ఆమె ఒప్పుకుంటే రాజుతో పంపుతూ కోపంతో ”నువ్వు చాలా చెడ్డ దానివి, ప్రసిద్ధులైన రాజులను చాలా మందిని బాధ పెట్టేవు, అందుచేత నీకు పుట్టే కొడుకులు కపట బుద్ధి కలవాళ్ళవుతా”రని శపించి వెళిపోయాడు. అప్పుడు రాజు సుశోభనతో నగరానికొచ్చాడు. వారికి ముగ్గురు కొడుకులు కలిగారు, వారు శలుడు, దలుడు, వలుడు అనేవాళ్ళు. కొంతకాలానికి రాజు శలునికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకోడానికి వెళిపోయాడు.

కథని పరిశీలిద్దాం ఇంతవరకు జరిగినది. రాజు వేటకి వెళ్ళేడు, అమ్మాయి కనపడింది, వేట మరిచిపోయాడు, అమ్మాయితో కబుర్లలో పడ్డాడు.  కంటికి నదరైన అమ్మాయి కనపడితే కర్తవ్యం మరచిపోవడం ఆనాటినుంచీ అలవాటే 🙂 అమ్మాయి కూడా తక్కువ తినలేదు, రాజును కవ్వించింది, మా నాన్న చెబితే ఇక్కడ తిరుగుతున్నాను, ఎవరిదాననైతే కావాలని అనడంలో కవ్వింపు ఉంది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు, ఇప్పటివారిలాగే!.. అప్పటిదాకా తండ్రి చాటుదానని చెప్పిన అమ్మాయి ప్రియుడితో వెళిపోయింది, తండ్రికి కూడా చెప్పక. తండ్రి తీసుకుపోతాడని తెలిసే నీళ్ళలో దిగనని చెప్పింది. నీళ్ళలో దిగక తప్పలేదు, దిగితే తండ్రి కిడ్ నేప్ చేసి తీసుకుపోయాడు.  ఇప్పటికి చెప్పకుండా వెళిపోయిన అమ్మాయిల తండ్రులు చేస్తున్న పనే కదూ!! రాజుకి ప్రియురాలి మీద మోహం పెరిగి ఉంది కనక కప్పలే కారకులని చంపించడం, ప్రతీకారం తీర్చుకున్నాడు. బాధ భరించలేక కప్పల రాజు కనపడి, ఆ అమ్మాయి తన కూతురేనని చెప్పి, చాలా మందిని ఇలా బాధ పెట్టింది నువ్వనగా ఎంతన్నాడు. ప్రియుడు నీ కూతురు చేతనే నా మీద ప్రేమ లేదనిపించంటే,  రాజు ఇప్పటి అబ్బాయిలలాగానే మాటాడేడు.  సుశోభనను పిలిచి అడిగితే ప్రియుడే కావాలని కూడా వెళతానంది, తండ్రిని వదలి వెళిపోయింది, ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నదీ ఇదే కదా!. తండ్రి కూతుర్ని పంపుతూ శపించాడు, నీకు కలగబోయే సంతానం కపట బుద్ధి కలవారవుతారని. ఈ కథ నేడు జరుగుతున్నదానికి పూర్తిగా సరిగా సరిపోలటం లేదా? (నేటి కాలపు సినిమా స్టోరీలాలేదా?) ప్రియుడు కనపడగానే తల్లి తండ్రులు జ్ఞాపకానికి రావటం లేదు, అటునుంచి అటే వెళిపోతున్నారు,ప్రియుడు మోసం చేసి మరొకదాన్ని పెళ్ళి చేసుకుంటే, దారి లేక గోల పెడుతున్నవారూ ఉన్నారు, నోరు మూసుకుని భరిస్తున్న, లేక,  ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటున్నవారూ ఉన్నారు కదా!!!. నేడు జరుగుతున్నదీ ఇదే! అప్పటికి ఇప్పటికి ఏమీ మార్పు రాలా! మానవ మనస్తత్వం ఒకలాగే ఉంది సుమా!

కంటికి బాగా కనపడినది ప్రతిదానిని స్వంతం చేసుకోవాలనుకోడం,గొడవలు పడటం, ప్రేమ పేరు చెప్పి విశృంఖలంగా ప్రవర్తించడం అనర్ధాలకి దారి తీస్తుంది కదూ!

ఈ కథ ఎక్కడిదనుకున్నారు, భారతంలోమార్కండేయ మహాముని ధర్మరాజుకు చెప్పిన కథ. భారతం…అరణ్యపర్వం,ఆ.. 4 లో 319 నుండి 335 వరకు స్వేఛ్ఛానువాదం.

ఇంకా ఉంది… మిగిలినది రేపు.

 

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సుశోభన ప్రేమ కథ

 1. శర్మ గారూ ,

  నమస్తే .

  మనస్తత్వాలు మారవు గాని , మనుషులు ( ఆకారాలు ) మారుతాయి . ఆహార్యం మారుతుంది .
  ఒక్కముక్కలో చెప్పాలంటే విషయం అదే గాని విధానం మారుతుంది .
  ఎందుకంటే మూలంలో నుంచే మఱల మఱల జనించటమే .
  ” పునరపి జననం పునరపి మరణం ” ఇదేకదా ఈ మానవ జీవితం .

  ఇలాంటివి ఙ్నప్తికి తీసుకురావటం , అందునా మీలాంటి వాళ్ళు . చాలా బాగుంది .

  • శర్మాజీ,
   మనుషుల మనస్తత్వం యుగాలు మారినా మారదుగాక మారదు, మీరు చెప్పినది నిజమే.
   ధన్యవాదాలు.

 2. మొత్తానికి ఇప్పుడు అరాచకాలు విలువలు అంటూ మనం గొంతు చించుకుంటున్నాము కానీ ఇవన్నీ ఎప్పటి నుండో సమాజంలో ఉన్నవే అంటారు. అప్పట్లో వార్తా పత్రికలూ ఇరవై నాలుగ్గంటలూ మన శ్రేయస్సు కోసం వార్తలు ప్రసారాలు చేసే న్యూస్ చానెల్స్ లేవు కబట్టి ప్రాచూర్యం పొందలేదేమో మరి

  • అమ్మాయ్ లక్ష్మి,
   భారతం లో లేనిది ప్రపంచంలో లేదు. ఇటువంటివి పాత కాలం నుంచీ ఉన్నాయి, నా ఉద్దేశం మానవ మనస్తత్వం మారలేదు, మారదు అన్నదే! ఆ రోజులలో వీటికి ప్రాచుర్యం ఇచ్చేవారు కాదనుకుంటా,ఇప్పుడు న్యూస్ చానళ్ళకి ఇదే పని. ఒక సంగతి మనవారు జరిగినదేదీ దాచుకోలేదు, నిజం నిర్భయంగానే చెప్పేరు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s