శర్మ కాలక్షేపంకబుర్లు-జాబు/జవాబు రాయండి.

జాబు/జవాబు రాయండి.                                                          కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

మొన్న బుధవారం కంప్యూటర్ దగ్గర కూచున్నా. ఇల్లాలు టపా పట్టుకొచ్చింది, నెమ్మదిగా అడుగులేయడం అలవాటు చేసుకుంటూ. ఈ మధ్య దశాబ్దంగా ఉత్తరం అంటే డివిడెండ్ వారంటో, ఆన్యుయల్ మీటింగ్ నోటీసో, ఇన్సూరెన్స్ వారి ఉత్తరమో ఇలా ఉంటున్నాయి తప్ప, యోగక్షేమాలతో ఉత్తరమే కనపడటంలేదు, సెల్ ఫోన్, ఈ మెయిల్ వగైరాల మూలంగా…. పక్కన పడేసేవాడినే డివిడెండ్ వారంట్లు ఉన్నాయేమోనని చూస్తుంటే ఒక ఇన్లాండ్ లెటర్ కనపడింది. అడ్రస్ పూర్తిగా ముత్యాల కోవలా రాసివుంది. ఈ చేతిరాత ఎవరిదో పరిచితమేనే కాని ఎవరో పోల్చుకోలేకపోయాను. ఉత్తరం తిప్పి చూస్తే ఎవరి దగ్గరనుంచో ఊహించండి అని ఉంది. దీనితో మరి కాస్త ఇబ్బంది పడ్డాను. ఇంత చక్కటి చేతిరాత నా మిత్రుడొకరు చలపతికి ఉంది. అతనే ఇటువంటి పనులు చేస్తుంటాడనిపించింది. ఇదివరలో ఒక సారి నా అడ్రస్ తీసుకుని ప్రత్యేకంగా ఉత్తరం రాశాడు,అంతకు ముందు మాటాడుకున్నవే. కంపెనీల నుంచి వచ్చే ఇన్లాండ్ లెటర్లయితే రెండు పక్కల మడిచి చింపితే మూడవ పక్క నెమ్మదిగా చింపుకోవాలి, లేకపోతే ఉత్తరం చిరిగిపోతుంది. ఈ ఇన్లాండ్ లెటర్ కి మూడు పక్కలా బాగా అంటించి ఉంది, నెమ్మదిగా ఉత్తరం చిరగకుండా మొత్తానికి తెరిచాను. నిజంగానే ఆశ్చర్యమేసింది, ఆనందం ముప్పిరిగొంది. బాబాయ్య పిన్నిలకి నమస్కారమంటూ అబ్బాయి ముంబై నుంచి యోగక్షేమాలు విచారిస్తూ రాసిన ఉత్తరం, పిన్ని ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు, వగైరా వగైరా, అంతకు ముందు మాటాడుకున్నవే. అందులో కొన్ని మాటలు నన్ను కుదిపేశాయి. ఉత్తరాలు రాసుకోడం మరిచిపోతామేమో బాబాయ్! ఈ ఉత్తరం మిమ్మల్ని అందరిని ఆశ్చర్యం, ఆనందం లో ముంచుతుందని తెలిసి రాశాను అంటూ, ఉత్తరమొస్తే భయపడుతున్నామన్నాడు. ఇదేమబ్బా అని ఆలోచిస్తే విషయం బోధ పడింది. నిజమే ఈ మధ్య ఉత్తరం అంటే చావు కబురే అయి ఉంటోంది, అది కూడా ఫలానా వారు, ఫలానా ఊళ్ళో ఇన్ని గంటలకి ఫలానా రోజు కాలం చేసేరు, దశదిన కర్మ ఫలానా ఊళ్ళో ఈ డోర్ నెంబరులో జరుపబడుతోంది కనక తెలియచేయడమైనది,ఇట్లు కుటుంబ సభ్యులు, ఇదే సారంశం ఉంటోంది. ఈ ఉత్తరాలికి కూడా నాటిరోజుల్లో ఒక పద్ధతి ఉండేది. కార్డ్ రాసేవారు, ఆ కార్డ్ కి నాలుగు మూలలా దీపం మసి రాసేవారు, కాలం గడవడంతో దీపం మసి స్థానం సిరా ఆక్రమించింది, ఉత్తరం రాగానే తెలిసిపోయేది చావు కబురని. ఇప్పుడు ఆ ఉత్తరాలికి కూడా ఇటువంటివేమీ ఉండటం లేదు. ఇవి కూడా ప్రింట్ చేసి ఉంటున్నాయి, అడ్రస్ రాస్తున్నారంతే. ఆ ఉత్తరాన్ని ఇంట్లో వారంతా చూసిన తరవాత చింపేసేవారు, మరీ దగ్గరవారయితే ఉత్తరం సగంచింపి దాచేవారు.

ఈ ఉత్తరాన్ని పట్టుకుని ఇల్లాలి దగ్గరకెళ్ళి ‘అబ్బాయి ఉత్తరం రాసే’డన్నా! ‘తెలుసు’ అంది ఆశ్చర్యపోయాను, నీకెలా తెలుసన్నా. కోడలు చెప్పింది. టపా పుచ్చుకుని చూశాను. ఇన్లాండు లెటర్ కనపడింది, ఎవరబ్బా అని చూస్తే ఫ్రం దగ్గర గెస్ అని ఉంది, ఎవరా అని పరకాయించి పోస్టల్ ముద్ర చూశాను, ముంబై అని ఉంది, ఇంకేమీ మా బావగారే రాశారని అత్తయ్యకి చెప్పేను అని గుట్టు విప్పేసింది. ఏమబ్బా ఇది కూడా మరిచిపోయానే,తోచలేదే అనుకుని ఇల్లాలికి ఉత్తరమిస్తే చదువుకుంది, కాసేపు ఉత్తరం ఆవిడ దగ్గర వదిలేశాను, ఆవిడ మళ్ళీ మళ్ళీ చదువుకుని ఉత్తరం తెచ్చి నాకిచ్చింది.

ఆ ఉత్తరం పుచ్చుకుని ఉయ్యాలలో కూచున్నా, ఎన్ని సార్లు చదివేనో గుర్తులేదు,గుండెలమీద పెట్టుకున్నా, ఉద్విగ్నత చెందా, కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నా పట్టించుకోలేకపోయా, అబ్బాయిని గాఢంగా కౌగలించుకున్నంత అనందం కలిగింది. వాడూ నాలాగే ఉద్విగ్నతకి లోనయ్యేవాడే, మమ్మల్ని ఇటువంటి క్షణాలలో చూసిన అన్నయ్య ‘ఇద్దరూ సెంటిమెటల్ ఫూల్స్, ఒకటే నక్షత్రం కదూ’ అనేవాడు. ఏడీ అన్నయ్య? సంవత్సరం దాటిపోయింది అప్పుడే, నిన్నటిలా ఉంది. ‘మరీ అంత ఎమోషన్స్ దాచుకోలేరారురా’ అనేవాడు, ఏమో మాకిలాగే బాగుంది, ఉన్నదేదో ఎదుటివారికి చెప్పడమే, ఇది మా బలహీనతేమో, అందరిని ప్రేమించే బలహీన మైన మనసు ఎందుకిచ్చాడో దేవుడు అంటే, ఈ స్పందన ఇద్దరిలోనూ ఒకలాగే ఉంటుంది, విడివిడిగా అయినా సరే, అదేం చిత్రమో అనేవాడు. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అంటే ఇదేనేమో. ఇలా ఉద్విగ్నతతో కళ్ళనీళ్ళు కారుతూ ఉయ్యాలలో కూచోడం చూసిన ఇల్లాలు నెమ్మదిగా వచ్చి ఎందుకంత ఉద్విగ్నత? బోజనానికి సమయమయింది లేవండి, వాడికి జాబు జవాబు రాస్తే సరి, ‘జవాబు రాయండి’ అని కరణేషు మంత్రిగా సలహా ఇచ్చింది. ఎంత గొప్ప సలహా అనుకుని లేచి ప్రేమకి దరఖాస్థు ఇవ్వబోతే ఎర్రగా చూసి వెళిపోయింది. ఏంటో అర్థం చేసుకోరూ …!..
జవాబు రాయాలి.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జాబు/జవాబు రాయండి.

 1. చేతి రాత తో రాసి పంపే ఉత్తరాల కు ఒక ప్రత్యేకమైన ‘ వ్యక్తి గత స్పర్శ ‘ ఉంటుంది ( పర్సనల్ టచ్ ).
  టెక్నాలజీ అభివృద్ధి అయి , ఆ వ్యక్తి గత స్పర్శ దూరమవుతూ ఉంది !
  దానితో, సంబంధాలు కూడా !
  ప్రస్తుతం అందరికీ, గుండెలు గుభిల్లు మనిపించే బిల్లుల ఉత్తరాలే అందుతున్నాయి !
  గుండెలు కరిగించే , ప్రేమా, ఆప్యాయతా, అనురాగాల ఉత్తరాలు కాదు !
  అట్లాంటి ఉత్తరాన్ని అందుకున్న మీరు, మీ అనుభూతులను చక్కగా తెలిపారు, మీ టపాలో !

  • సుధాకర్ జీ,
   మీరన్నది నిజం. అంతా యాంత్రికమైపోతోంది, ఉత్తరం ఎవరికో రాయాలని ఉంది అడ్రస్ లేదు 🙂 ఇదీ నేటి సంగతి.
   బిల్లుల ఉత్తరాలు చూసి చూసి గుండె బండబారిపోతోందేమో 🙂
   అబ్బాయి కూడా నాలాటివాడే అందుకే ఉత్తరం రాశాడు, ఆనందంలో ముంచి తేల్చాడు, ఉత్తరం రాయాలి.
   ధన్యవాదాలు.

 2. మేడం ఆరోగ్యం కుదుటపడినందుకు ఆనందంగా ఉందండి. అంతా భగవంతుని దయ.
  ………..
  లాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు… ఎన్ని వచ్చినా, ఉత్తరాలు వ్రాసుకోవటాన్ని మర్చిపోకుండా ఉంటేనే బాగుంటుంది.

  • అమ్మాయ్ అనురాధ,
   అప్పుడప్పుడయినా ఉత్తరాలు రాసుకోవాలమ్మా! అడ్రసులుండటం లేదు అదో చికాకు.
   ధన్యవాదాలు.

  • హనుమంత రావు గారు,
   స్వాగతం, సుస్వాగతం నా బ్లాగుకు. పాత జ్ఞాపకాలు మరొకసారి గుర్తుకు తేగలిగినందుకు సంతసం.
   ధన్యవాదాలు.

 3. అవునండీ, అప్పుడప్పుడైనా ఉత్తరాలు వ్రాసుకుంటూ ఉంటే, జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి.

  నేను ఉద్యోగరీత్యా ఇల్లు వదిలివెళ్ళినప్పటినుండి మొబైల్ ఫోన్లు వచ్చేదాకా నాకు వచ్చిన ఉత్తరాలన్నీ ఒక పాత సూట్‌కేసులో దాచుకున్నాను. అవి ఎప్పుడైనా బయటకు తీసి చదువుతుంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోవచ్చు. అందులో కీర్తిశేషులైన మా అమ్మగారి జ్ఞాపకాలు కూడ ఉన్నాయి.

  • మిత్రులు బోనగిరి గారు,
   నిజం. అప్పుడప్పుడేనా ఉత్తరాలు రాసుకోవాలండి. ఇప్పుడు ఉత్తరం రాయాలన్నా అడ్రసులుండటం లేదండి. అదో చికాకు. నాకూ మా అమ్మగారు రాసిన ఉత్తరాలు దాచుకున్నా.
   ధన్యవాదాలు.

 4. శర్మ గారి గుండె తడిలో కృష్ణుల వారు పరుగెట్టు కుంటూ జస్మాష్టమి కి కూసింత ముందే వచ్చేసేరు !!

  శుభోదయం
  జిలేబి

  • జిలేబి గారు,
   నిజం. మా చిన్ని కన్నయ్య నెల ముందుగా పుట్టేసేడు. 🙂
   టపా వేసిన రోజు అష్టమి నెల మరచిపోయాను, టపా ఆరోజుకు షెడ్యూల్ చేశా. తరవాత చూస్తే నెల ముందు అయిపోయింది, సరి చేద్దామనే లోగా నెట్ పోయింది. ఇప్పుడే సరయింది. నిజమే ఆరోజు ఆనందం అలాటిది.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s