శర్మ కాలక్షేపంకబుర్లు-కూతురు చెడుగైన మాత తప్పు

కూతురు చెడుగైన మాత తప్పు      

తప్పు అంటే ఉండవలసినట్టుగా లేకపోవడం అని చెప్పచ్చు.  తప్పు చేయడం మానవ సహజం, తప్పు దిద్దుకోవడం దైవత్వం. తప్పు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం, దీనికి చాలా ధైర్యం కావాలి.  తెలిసినవారు తప్పు చేయడం పెద్ద తప్పు, తెలియకచేసిన తప్పుకి నిష్కృతి ఉంటుంది.  తప్పుని సమర్ధించుకోడం పెద్ద తప్పు. వారు తప్పుచేయలేదా? వీరు తప్పు చేయలేదా? వారినేం చేశారు, ఈ రకం వాదన వితండవాదం, ఇది మరీ తప్పు.  తప్పు చేసి తప్పుకాదని సమర్ధించుకోడం మరీ తప్పు.  తాము చేసేది తప్పని చెబుతూ దానినే చేసేవారినేమంటాం?   ఎవరికి తెలియకుండా, ఏ తప్పు చేసినా తప్పు కాదనుకుంటారు కొంతమంది.తప్పు గురించి వేమన తాత

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్లనుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ.

ప్రపంచంలో తప్పని చెప్పేవారు చాలా మందే ఉంటారు, అందరికి ఏదో ఒక తప్పు ఉంటుంది. ఈ తప్పు చెప్పేవారు, పాపం, వారి తప్పు వారు తెలుసుకోలేరని వేమన తాత భావం. గురువింద గింజ ఎర్రగా ఉన్నాననుకుంటుంది, కాని తన కిందనున్న నలుపు కనలేదు.  అలాగే, ఇది తప్పు అది తప్పు, మీరు తప్పు చేస్తున్నారు అని, చూపుడు వేలు చూపేవారి వైపు నాలుగు వేళ్ళు చూపుతుంటాయి కదూ! వారికి వారి తప్పు తెలియదు. మరొకరు చెబితే బాధ, కోపం తన్నుకొస్తాయి. నృసింహ శతక కర్త ఈ విషయం లో మరో అడుగు ముందుకేశారు చూడండి.

పసరంబు పంజైన పసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు,
భార్య గయ్యాలైన బ్రాణనాధునితప్పు,తనయుడు దుష్టైన తండ్రి తప్పు,
సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు,
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు,దంతి దుష్టైన మావంతు తప్పు,

ఇట్టి తప్పులెరుంగక యిచ్చవచ్చినటుల మెలంగుదురిపుడీ పుడమి జనులు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్టసంహార నరసింహ దురితదూర!.

ఓ నృసింహా! పశువు నీరసపడితే పసులకాపరిది తప్పు, ప్రజలు దుర్జనులైతే ప్రభువుది తప్పు, భార్య గయ్యాళిదైతే భర్త తప్పు, కొడుకు చెడ్డవాడయితే తండ్రి తప్పు, సైన్యం చెదరిపోతే సైన్యాధ్యక్షునిది తప్పు,కూతురు చెడ్డదైతే తల్లి తప్పు,గుఱ్ఱం చెడ్డదైతే (రౌతు) సవారీ చేసేవానిది తప్పు, ఏనుగు చెడ్డదైతే మావటీ తప్పు, ఇటువంటి తప్పులన్నీ తెలుసుకోక, ఇష్టం వచ్చినట్టు మాటాడి, పనులు చేస్తుంటారు, జనులు ప్రపంచంలో, అన్నారు.

కవి చాలా కాలం కితం చెప్పిన మాట నేటికీ సత్యమే. పశువు నీరసపడితే కాపరి తప్పన్నారు. పశువు తినవలసినది కాపరి తినేస్తుంటే, పశువు నీరసపడదా? నీతిలేని మనిషి, పశువు గడ్డి కూడా తినేస్తున్నాడు.  ఋజువులతో కోర్టులు శిక్ష వేసిన, సిగ్గులేక బెయిల్ మీద బయటికొచ్చి, అధికారం కోసం వెంపర్లాడుతున్నారు.

ప్రజలు చెడ్డవాళ్ళయితే ప్రభువుది తప్పు అన్నారు. ప్రభుత్వం లంచగొండిదయి, ఒకొకరికి ఒకొకలా చట్టాన్ని అమలు చేస్తుంటే ప్రజలేమవుతారు, లంచగొండులే అవుతారు. అమ్మో ఈ మంత్రి లంచం తీసుకోడంటే, అధికారి భయపడి తాను తీసుకోడు, కిందవాళ్ళూ తీసుకోలేరు. పైనుంచి అవినీతి కిందకి ప్రవహిస్తుంటే, ఎవరికి ఎవరి భయమూ లేదు, చేతకానివాళ్ళు కేసులు వగైరాలు పెట్టినా, పట్టించినా, పెట్టించినా కాలగతిలో కలసిపోతాయి. ప్రభుత్వం నీతి నిజాయితీలతో ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు. గోదారికి నీరురాలేదు, ఆకుమడిపోయడానికి కరంట్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, ముఖ్యమంత్రి గారు ఇరవైనాలుగుగంటలలో బాగు చేయిస్తామని ప్రకటనలిస్తారు. కింద అధికారులు రైతులతో ”వారలాగే చెబుతారు, ట్రాన్స్ఫార్మర్ మీరు బాగుచేయించుకోండి, లేదంటే కొత్తది కొనుక్కోండి, అసలు మీకు కరంట్ ఇవ్వడమే దండగ, బాగు చేయించడం మరో దండగా,” అదేమంటే, ”దిక్కున్నచోట చెప్పుకోoడ0”టున్నారు. రైతుల దగ్గర డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్మర్ బాగుకి పంపేరు, స్వానుభవం.   పైవారితో చెప్పినా వినే నాధుడూ లేడు, సరికదా పని మొండికి పడిపోతుంది, మిగిలిన రైతులు తిడతారు.   ప్రభుత్వ నీతి ఎంత ఉంది? తప్పెవరిది? ప్రభుత్వానిదే కదా? కాదు అటువంటి ప్రభుత్వాలని ఎన్నుకున్న ప్రజలది.  అసలు రాజకీయాలలో జేరినది సంపాదించుకోడానికి కాక ప్రజలకి సేవ చేయడానికా?  సేయడానికొచ్చమంటే నమ్మడం మీ తప్పు.

భార్య గయ్యాళిది, కట్టుకున్న తరవాత తెలిసింది, ఏం చేయాలి? వదిలేస్తే అది పరిష్కారమా? భార్యను తన మాటవినేలా చేసుకోవాలి, నయానో భయానో, ఇది చేయక విడాకులని పరిగెట్టడం భర్త తప్పు. ఒక వేళ దీనిని వదిలేసి, మరొకరిని చేసుకుంటే, ఆమె కూడా ఇలా ఉండదని నమ్మకమేంటి? అసలీవిడ ఇలా గయ్యాళిగా తయారవడానికి కారణం ఆమె తల్లి కదా? ఆ తరవాత అమెను సరిదిద్దలేని భర్తది తప్పు. భర్తను ఈసడించే ఆమె కూతురు గయ్యాళి కాక మరేమవుతుంది?

కొడుకు చెడ్డవాడయితే తండ్రి తప్పన్నారు. తండ్రి సిగరట్టు కాలుస్తాడు, మందుకొట్టి వస్తాడు, చిన్నిల్లు పెట్టేడు, వీధిలో అమ్మాయిలకి లైన్ వేస్తాడు, చిన్నప్పటినుంచి తండ్రిని ఇలా చూసిన కొడుకు మరోలా తయారవుతాడా? తప్పెవరిది? తండ్రిదే, కొడుకు పాడయ్యాడు,అమ్మాయిని రేప్ చేశాడంటె తప్పు కుర్రాడిది కాదు, తండ్రిది.  అందుకే మనవారు తండ్రిని చూసి కొడుక్కి పిల్లనియ్యమన్నారు.   కుటుంబంలో మూడు తరాలవారు, తాత, తండ్రి, మనవడు కలిసి మందుకొట్టే సినిమాలు మనకు శిరోధార్యాలు, ఆ సినిమా ఎగబడి మరీ చూస్తున్నాం కదా? తప్పెవరిది?.  తోట కూర దొంగతనంగా తెచ్చిన రోజు మందలిస్తే, కొడుకు దొంగవుతాడా? తండ్రి దొంగయితే కొడుకు గజదొంగ అవుతున్నాడు కదా?

కూతురు చెడుగైన మాత తప్పు అన్నారు, తల్లికి ఒంటిమీద గుడ్డ నిలవదు, పైట బరువైపోతుంది. ఆవిడో పక్క, పైట మరో పక్క ఉండగా చిన్నప్పటినుంచి చూసిన కూతురు పైట వేస్తుందా? వక్షస్థలం కప్పుతుందా? ఎవరెవరితోనో తీయించుకున్న ఫోటోలు ఫేస్ బుక్కులో పెట్టుకోదా? తల్లి మగవారితో స్వేఛ్ఛ పేరిట, హక్కుల పేరిట తిరిగితే, కూతురు ”మనసు ముఖ్యం కాని శరీరానికి పాపమంటదని” మెట్ట వేదాంతం చెప్పదా? మరోలా తయారవుతుందా? తల్లికి లేని నీతి కూతురుకి వస్తుందా? అందుకే మనవారన్నారు, ”ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదని”.అందుకే పెద్దలన్నారు, తల్లిని చూసి కూతుర్ని చేసుకోమని.

”రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడు కాళ్ళమీద పరుగెడుతుందని” నానుడి, గుఱ్ఱాన్ని సరయైన పద్ధతులలో ఉంచకపోతే దానిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది తప్పించి రౌతుకు అనుకూలంగా ఉండదు.  ఏనుగును చూడండి, ఎంత పెద్దదైనా అంకుశం చూస్తే భయపడుతుంది.   ఏనుగును నిలబెట్టి మావటి అంకుశం ముందుకాళ్ళ మధ్య పెడతాడు, అక్కడే కాళ్ళదగ్గర కూచుంటాడు, కాని ఏనుగు అంకుశం తీసేయదు, కాళ్ళు కదపదు, ఎందుకని? అలా తర్ఫీదిచ్చాడు కనక. లేకపోతే ఏనుగును, పీనుగులాటి మావటి ఆపగలడా?

ఇలా ప్రపంచంలో తప్పులన్నీ తమ దగ్గరే ఉంచుకుని ఎవరెవరో తప్పులు చేసేరు, చేస్తున్నారని జనులు వాపోతున్నారు, చిత్రంగా లేదా స్వామీ అన్నారు శతక కర్త.

మొన్న సంతలో ఆడపిల్లని మందలించలేదేమని అడిగినపుడు ఇల్లాలు , తప్పు ఆ పిల్ల తల్లిదంది, అప్పుడు ఈ పద్యం గుర్తొచ్చింది, బహుశః చిన్నప్పుడు ఆమె ఈ పద్యం చదువుకుని ఉండచ్చు.

 

 

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కూతురు చెడుగైన మాత తప్పు

 1. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  వేమన శతకాలను, నృశింహ శతకాలనూ తిరిగి మన పాఠశాల, కళాశాల స్థాయిలలోకూడా ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చేసింది. సరిగా చెప్పాలంటే, ఇప్పటికే సమయం మించిపోయింది. ఈ శతకాలలోని మంచి విషయాల్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవరావు గారు,
   అనారోగ్యంతో జవాబు ఆలస్యమయింది, మన్నించాలి.
   ఇటువంటివి ప్రభుత్వం ఎప్పుడో నిషేధించిందండీ.మళ్ళీ ప్రవేశపెట్టే సూచనలు లేవుగాకలేవు.
   ధన్యవాదాలు.

 2. బాగా వ్రాసారు. అయితే, ఇలాంటి టపాలు వ్రాయటం వల్ల మిమ్మల్ని చాలామంది తిట్టుకునే అవకాశం ఉంది.
  ఎవరైనా మంచిమాటలు చెప్పినా, కొందరు ఓర్చుకోలేకపోతున్నారు. మంచిమాటలు చెప్పిన శతకకర్తలను కూడా దూషిస్తారేమో ?

  మా ఇష్టం వచ్చినట్లు స్వేచ్చగా తిరుగుతాం. . మీరెవరు చెప్పటానికి ? అనే వాళ్ళ సంఖ్య ఈ రోజుల్లో బాగా పెరిగింది.

  పరిస్థితి ఇలాగే కొనసాగితే , మా ఇష్టప్రకారం జీవిస్తాం అంటున్న వాళ్ళు……భవిష్యత్తులో చట్టాన్ని కూడా గౌరవించని పరిస్థితి వస్తుందేమో ?
  ………………..
  ”మనసు ముఖ్యం కాని శరీరానికి పాపమంటదని” మెట్ట వేదాంతం చెప్పదా?.. అని బాగా వ్రాసారు. నిజమేనండి. ఈ రోజుల్లో ఇలా మాట్లాడేవారు ఎక్కువయ్యారు.

  • అనురాధ,
   నన్ను తిట్టనివాళ్ళు వానకి తడవని వారు లేరని అంటారు పెద్దలు, ఇల్లాలు అన్న మాట మీద ఈ పద్యం గుర్తొచ్చి రాశా తప్పించి… మరేంలేదు.
   ఓర్పు లేకపోవడం కలి లక్షణాలలో ఒకటి, శతకాలని ప్రభుత్వం ఎప్పుడో నీషేధించింది కదా, చరిత్ర కూడా అక్కరలేదన్నారు, మరి రాబోయే జనభా ఎలా ఉంటారు? ఇప్పటికే ఆ ఫలితాలు కనపడుతున్నాయి కదా!
   సహజీవనం తప్పు కాదంటున్నారు, శజీవనం లో నే మళ్ళీ ఎవరికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇష్టమయినవారితో వారుండచ్చట. విశృంఖలత్వం లో మరో కోణం. ఇప్పుడు కాలేజి నుంచే, తప్పు తప్పు, స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఫేస్ బుక్ లేకపోతే నడవటం లేదు. ఆ తరవాత నేను చెపితే బాగోదు…. ఇదీ నేటి జీవితం. ఇది పై మధ్య తరగతి, పై తరగతి బాగా చదువుకున్నవారిలోనే ఎక్కువ కనపడుతోంది. సమాజం ఏదో దిశకు పోతుంది…. సహజీవనం లో పుట్టేవాళది, వాళ్ళ ఖర్మ….ఏంచేయలేం.
   చట్టం కలిగినవారి చుట్టమే కదా!
   ముఖ్యంగా నేడు అధిక సంఖ్యలో ఆడవారు, మగవారు చెబుతున్న మాటది. టపా అంత, టపా రాసే వ్యాఖ్య. రాయను రాయలేను.మన్నించాలి. వ్యాఖ్య కు
   ధన్యవాదాలు.

   • సర్ ! నా వ్యాఖ్య మీకు మనసుకు బాధ కలిగిస్తే దయచేసి క్షమించండి.

    ఇంతకు ముందు వ్యాఖ్యలో నా అభిప్రాయం సరిగ్గా అర్ధం అయ్యేటట్లు వ్రాయలేకపోయానేమోననే సందేహం వచ్చి ఈ వ్యాఖ్యను వ్రాస్తున్నాను.
    ……………..
    మీరు వ్రాసిన టపాలో ఎన్నో మంచి విషయాలను తెలియజేసారు.

    నా అభిప్రాయం ఏమిటంటేనండి, ఈ రోజుల్లో ఎవరైనా నాలుగు మంచిమాటలు చెప్పబోతే మీరెవరు మాకు చెప్పటానికి ? అని యుద్ధానికి వస్తున్నారు కొందరు.

    మంచి చెప్పబోయిన కొందరు పెద్దవారిని తిట్టిపోసిన సంఘటనలనూ మనం చూశాము. నన్ను కూడా కొంతకాలం క్రిందట బ్లాగుల్లో తిట్టారు కొందరు . . మంచి మాటలు చెబుతున్న మిమ్మల్ని కూడా ఏమైనా అంటారేమోనని అలా వ్రాసానండి.

    సమాజంలో స్వేచ్చ పేరుతో పెరిగిన విచ్చలవిడితనం గమనిస్తే ఎంతో బాధ కలుగుతోంది.

    తిట్టేవాళ్ళు తిట్టుకున్నా సరే, సమాజానికి నీతినియమాలను చెప్పవలసిందే. వినకపోతే బలవంతంగా అయినా చెప్పి నియమాలను అమలుచేయించటం అవసరం.

   • అమ్మాయ్ అనురాధ,
    నేను అపార్ధం చేసుకోలేదు. నువ్వు నేటి పరిస్థితులెలా ఉన్నాయో చెప్పావు కదమ్మా! నీవు చెప్పిన మాట నిజం. వద్దన్న మాట మంచిదయినా ఎందుకు చెప్పాలి? వారి ఇష్టం వచ్చినట్లు వారిని ఉండమని అంటే మంచిది కదా! మనమేమీ మోరల్ పోలీస్ కాదుకదా. తిట్టడం వారి హక్కు కదా, పోనివ్వండి, మన కేల శ్రమ. విచ్చల విడి తనం తో బతకడమే అభివృద్ధి అనుకుంటే మనమెవరం కాదనడానికి.
    ధన్యవాదాలు.

 3. శర్మ గారూ ,

  నమస్తే .

  ముందు తరాల వాళ్ళు తికమక పడకుండా వాళ్ళు అప్పుడే చెప్పి వెళ్ళిపోయారు .
  మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు , అనుభవ సారాలు .

  వాటిని డైరెక్టుగా కాకుండా అర్ధం చేసుకొనే రీతిలో చక్కగా చెప్పారు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s