శర్మ కాలక్షేపంకబుర్లు-ఋణానుబంధ రూపేణా….

ఋణానుబంధ రూపేణా….

ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబు లీడేర్తురే
వేళనవ్వారి భజింప జాలిపడకావిర్భూత మోదంబునన్
కాలంబెల్ల సుఖంబు నీకు నిక భక్త శ్రేణి రక్షింపవే
శ్రీలెవ్వారికి కూడబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!

అంతా మిద్య తలంచి చూచిననరుండట్లౌటెరింగిన్ సదా
కాంతల్పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతి చెంది చరించుగాని పరమార్థంబైన నీయందు దా
చింతాకంతయు చింత నిల్పడుకదా శ్రీ కాళహస్తీశ్వరా!

ఈ జగత్తులో ప్రతిదీ కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు చెల్లిపోతాయి. వచ్చి వెళ్ళేది కనకనే జగత్తు అన్నారు. జాయతే గఛ్ఛతే ఇతి జగం. రావడమూ మన చేతిలో లేదు, పోవడం అంతకంటే మన చేతిలో లేదు. కాని మానవులు ఉండే కొద్దికాలం లో నూ సర్వమూ ’నేను చేశాను’ అని అహంకరిస్తూనే ఉన్నాడు, నాతో సహా, ఎవరెన్ని చెప్పినా, అవన్నీ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యాలే అయిపోతున్నాయి. కాలం తో ఋణానుబంధం తీరిపోతూ ఉంటుంది, ముఖ్యం గా వీటిని చెప్పేరు. ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః, పశువులు, భార్య/భర్త, బిడ్డలు,ఇల్లు. వీటితో ఉండే అనుబంధం కాలంతో పాటు చెల్లిపోతుంది. మరోలా కూడా చెప్పుకోవచ్చేమో! మానవులంతా ఈషణ త్రయం చుట్టూ తిరుగుతూ ఉంటారు, కాని అదేం లేదని బుకాయిస్తుంటారు. ఈ ఈషణాలేంటీ? దారేషణ,ధనేషణ, పుత్రేషణ అన్నారు. దారేషణ భార్య/భర్త కోసం  పాకులాట, ధనేషణ సొమ్ము సంపాదనకోసం పాకులాట, పుత్రేషణ కొడుకుల గురించిన పాకులాట. జీవితంలో వీటిని వదలిపెట్టడం చాలా కష్టమనీ చెప్పేరు.

శంకరులు కూడా ధనేషణతో ప్రారంభించే జీవితం,దారేషణ తరవాత, పుత్రేషణ చేసి, జీవితాంతం ధనేషణలో నే ఉండిపోతారు, భజ గోవిందం మరచిపోతున్నారన్నారు. గోవిందుణ్ణి మరవద్దాన్నారు. ఋణానుబంధం ఎంత బలంగా ఉంటుందో మొన్నను అనుభవంలోకి వచ్చింది.

మొన్ననా మధ్య కావలసినవారింటికెళ్ళాం. అక్కడో చిత్రమూ చూశాం. బాగా కలిగిన ఆసామీ, కావలసినవారింటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటారు. నాకంటే వయసులో నాలుగేళ్ళు పెద్దవాడయి ఉండచ్చు. మాకు భోజనాలు పెడుతూ ఆ ఇంటి కోడలు భోజనం ఒక కంచంలో పెట్టి పట్టుకెళ్ళి ఆయనకి పెట్టి వచ్చింది. పూర్తిగా భోజనం చేసేదాకా ఉండలేకపోయావా అమ్మా అన్నా! ఉండద్దంటారు, ఏమైనా కావాలంటే పిలుస్తారు, అందుకే అన్నీ కావలసినవాటికంటే ఎక్కువ పెడతానని చెప్పింది. ఆయనకు పది సంవత్సరాల కితం భార్య గతించింది, ఆ తరవాత కావలసినవారబ్బాయిని పెంచుకున్నారు, అతనో ఉద్యోగి, ఈయనను తన దగ్గరికి రమ్మంటాడు, ఈయన కదలి వెళ్ళడు, అలా పాడు పడినట్టున్న ఇంటిలో ఒక్కడు కూచుని కాగితాలు చూసుకుంటూ ఉంటాడు. అవేంటని ఆ ఇంటి కోడల్ని అడిగితే రావలసిన బాకీల తాలూకు నోట్లు, వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు, ప్రజలు ఆయన దగ్గర సొమ్ము వడ్డీకి పట్టుకెళుతుంటారు. అదీ ఆయన చరిత్ర టూకీగా, ఆ ఇంటి కోడలు మాత్రం గత పది సంవత్సరాలుగా ఆయనకు వండి పెడుతూనే ఉంది, ఆయన భోజనానికి ఇబ్బంది పడతారని పుట్టింటికి కూడా వెళ్ళదట.. ఇది ఏ ఋణానుబంధమో తెలియదు. ఈషణ త్రయాలు ఆయనను చాలా బంధించినట్టే అనిపించింది. భార్య గతించింది, ఒకటి పోయింది, పుత్రేషణ పూర్తయింది, ఈ ధనేషణ మాత్రం ఆయనను వదలలేదనుకుంటా. చిత్రమైన జీవితాలు.

ఋణానుబంధంలో ఆయనకు భార్య గతించింది ఆ ఋణం తీరినట్లుంది, ఇక సుత, ఆలయాల (ఇంటి) ఋణం తీరినట్టులేదు.తృష్ణ మాత్రం మిగిలివుండిపోయింది, ధనం మీద మోజుపోలేదు.

వలిభిర్ముఖమాక్రాన్తం పలితైరంకితం శిరః
గాత్రాణి శిధిలాయన్తే తృష్ణ తరుణాయతే.                                    భర్తృహరి

కరచరణాద్యవయవముల
భరముడిగెవ వళులు మొగముపై నిండారె
శిరసెల్ల వెల్లవారెను
దరిమాలిన తృష్ణయొకడె తరుణతబూనెన్.                                     లక్ష్మణ కవి.

కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ శక్తి కోల్పోయాయి,ముఖం మీద ముడుతలు పడ్డాయి, తల నెరిసింది ఇలా అన్నీ వార్ధక్యాన్నే సూచిస్తున్నాయి కాని తృష్ణ అనగా ఆశ మాత్రం ఇంకా యవ్వనంలోనే ఉంది.

మన పెద్దలు పిల్లల నుంచి సొమ్ము చేతితో తీసుకోవద్దంటారు, దీనికో కారణమూ చెబుతారు. పిల్లలు మనకు ఋణ గ్రస్తులట, ఏ జన్మలోనో వారు చేసిన బాకీ తీర్చుకోడానికి మన కడుపున పుడతారంటారు, వారి దగ్గర నుంచి సొమ్ము తీసుకుంటే ఋణ విముక్తి కావచ్చేమోనని భయం. ఈ అమ్మాయి ఏ ప్రలోభమూ లేకనే ఆయనకు సేవ చేస్తూ వస్తూవుంది, గత పది సంవత్సరాలుగా, ఇది ఏమి ఋణానుబంధమో! పోనీ వారికి ఏమైనా బంధుత్వం ఉన్నదా అంటే అదీ లేదు.

ఇల్లు, భార్య, పిల్లలు, సంపద, ఆఖరుకి స్నేహితులు, హితులు,ఈ రాతలు, పలకరింపులు సర్వం ఋణానుబంధమే, అది చెల్లిపోతే…….
అంతా మిధ్య. దర్పణ దృశ్య మాన నగరీ, జీవితమంతా చిత్రమే.
ఈ రోజుతో ఈ ఋణానుబంధం తీరునట్టే……

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఋణానుబంధ రూపేణా….

 1. శర్మ గారూ ,
  మీ ‘ ఋణానుబంధం ‘ టపా ఆలోచింప చేసేది గా ఉంది !
  మీరు ‘ ఈ ‘ ఋణం తీరిపోయిందని కూడా ( అంతర్జాలం నుంచి శెలవు తీసుకుంటున్నట్టు గా ) సూచించారు !
  అనివార్య కార ణా లయితే తప్ప , మీరు , మీ నిర్ణయాన్ని పునరాలోచించు కోగలరని ఓ మనవి !

  • సుధాకర్జీ,
   అనారోగ్యంతో జవాబు ఆలస్యమయింది, మన్నించాలి.
   అనారోగ్యం తో బాధ పడుతున్నామని చెప్పి ఆత్మీయులను చింతలో పడెయ్యలేక పోవడమే …..ఇప్పుడు బండి నడుస్తోంది 🙂
   ధన్యవాదాలు.

 2. బాబాయ్ గారు, ఏమిటిది, ఇలా నర్మగర్భంగా ఈ రుణం అంటూ మమ్మల్ని తికమక పెట్టి హటాత్తుగా మాయం అయిపోటం సమంజసమేనా? మీలాంటి పెద్దలు చెప్పే నాలుగు మంచి మాటలు కూడా లేకుంటే మాల్లంటి వారి పరిస్థితి ఏంటంటారు. ఈ సన్యాసం వదిలి బ్లాగు జీవన స్రవంతిలో కి మళ్ళా త్వరగా అడుగుపెట్టాలి అని మనసారా కోరుకుంటూ…

  • అమ్మాయి లక్ష్మి,
   అనారోగ్యంతో జవాబు ఆలస్యమయింది, మన్నించాలి.
   బాగో లేదని చెప్పి మిమ్న్మల్ని అందరిని ఆతృతకి లోను చెయ్యలేను, చెప్పకుండా పోలేని సందిగ్ధ పరిస్తితి, అందుకు చెప్పీ చెప్పనట్టుగా చెప్పేననమాట. ఏంటోనమ్మా! ఈ బంధాలు పెరుగుతూనే ఉన్నాయి తల్లీ! ఎలా? అర్ధం కావటం లేదమ్మా! వదిలించుకోండంటారు, ఆలోచించకండి అని కూడా అంటారు సాధ్యమా చెప్పమ్మా!! ఎక్కడికి పోతానమ్మా! పోలేను… ఇదింతే…. తిరిగే రంగుల రాట్నం… విష్ణుమాయ.. దాట తరమా…
   ధన్యవాదాలు.

 3. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  చక్కటి విషయాన్ని చక్కగా చెప్పారు. ఈ రుణానబంధం గురించి ఈ మధ్యనే నా బ్లాగ్ లో `రుణానుబంధం’ పేరుతో ఒక చిన్న కధను వ్రాశాను. చదవగలరు. (LINK: https://madhavaraopabbaraju.wordpress.com/ )

  మీరు వ్రాసిన “ఈ జగత్తులో ప్రతిదీ కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు చెల్లిపోతాయి. వచ్చి వెళ్ళేది కనకనే జగత్తు అన్నారు. జాయతే గఛ్ఛతే ఇతి జగం. రావడమూ మన చేతిలో లేదు, పోవడం అంతకంటే మన చేతిలో లేదు. కాని మానవులు ఉండే కొద్దికాలం లో నూ సర్వమూ ’నేను చేశాను’ అని అహంకరిస్తూనే ఉన్నాడు….” అనే విషయాన్ని నేను మరోరకంగా చెబుతాను:-

  రుణానుబంధం వల్లనే మనుష్యులు మరల,మరలా జన్మలను పొందుతున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుడు మనిషికి రూపం, బుద్ధిని ఇచ్చాడు. యత్ భావం – తత్ భవతి అని అంటారుకదా. మరి మన బుద్ధితో మనం దేనిని కోరుకుంటామో అదే మనకి దొరుకుతుంది. అంతేకాకుండా, సూక్ష్మ శరీర రూపంలో వున్న జీవాత్మ, ఏదో ఒక కారణం లేదా కోరికతో, స్థూల శరీరాన్ని పొంది, తన కొరికలను తీర్చుకొని, ఇంకా తీరనవి ఏవైనా వుంటే, మరణానంతరం, మరొక రూపం పొంది, ఆ కోరికలను తీర్చుకుంటుంది. అంటే, ఈ జగత్తులోకి రావడమూ, పోవటమూ రెండూ మన చేతుల్లోనే వున్నాయి అని రూఢీ అవుతున్నది. ఇక్కడ కర్త, కర్మ, క్రియా అన్నీ నేనే కాబట్టి, ` నేను చేశాను’ అని మనిషి అనుకోవటంలో తప్పులేదుకదా!! నిజం చెప్పాలంటే, ఈ `అహం’ వల్లనే జీవికి మరొక జన్మ కలుగుతుంది. ఆ అహమే లేకపోతే, ఆ జీవికి జన్మరాహిత్యం కలిగినట్లే కదా!! కాబట్టి, ఈ సృష్టికి, ఈ జగత్తుకీ మూలం `అహమే’. అయితే, ఇక్కడ ఒక గొప్పదైన, చిన్న విషయం చెప్పాల్సివుంటుంది:- గీతలో, గీతాచార్యుడు, విభూతియోగములో, తన విభూతలను గూర్చి చెబుతూ, “ మనిషిలో బుద్ధి ” ని నేనే అయివున్నాను అని చెబుతాడు. అంటే, నా బుద్ధితో నేను చేసిన పనులు అంటే, ఆ భగవంతుడు చేసిన పనులనే చెప్పుకోవాలి కదా!! అయితే, భగవంతుడు తప్పుడు పనులు చేస్తాడా? లేదా చేయిస్తాడా? అని అడిగితే, ఓ! చాలా లోతుగా సమాధానం చెప్పుకోవాల్సివుంటుంది. అది ఇక్కడ అనువుకాదు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవరావు గారు,
   అనారోగ్యంతో జవాబు ఆలస్యమయింది, మన్నించాలి.
   అహంతోనే సర్వం సృష్టి జరుగుతోంది, కాదనలేము, కాని అదే సర్వస్వం అని విర్రవీగిపోతున్నారు, మాయలో పడి.
   ధన్యవాదాలు.

  • కిరణ్ ప్రసాద్ గారు,
   అనారోగ్యంతో జవాబు ఆలస్యమయింది, మన్నించాలి.
   సూచన బాగుంది కాని, నేనొక నిరక్షర కుక్షిని, నా వల్ల జరిగేదేమీ ఉండదని నా అభిప్రాయం.
   ధన్యవాదాలు.

 4. ఇంతకీ ఈ శర్మ గారు చెబుతూంట – ‘ఈ’ ఋణానుబంధం ఏమిటి చెప్మా!!

  ఏమండోయ్, e-ఋణానుబంధం నించి విముక్తి పొందు దామని అనుకుంటున్నా రా కొంప దీసి ??

  అట్లాంటి పని మాత్రం చేయ మాకండి !! అట్లా అయితే ఋణాను బంధం ఇంకా ఎక్కువవు తున్దిస్మీ !!

  జిలేబి

  • జిలేబీ గారు,
   అనారోగ్యంతో జవాబు ఆలస్యమయింది, మన్నించాలి.
   ఏ అనుబంధాలూ వదలటం లేదండి. రోజు రోజుకు బిగుస్తున్నాయి,వదిలించుకోవాలనే ఉద్దేశం ఉన్నా కుదరటం లేదండీ.ఏం చేయాలో తెలియటం లేదు క్లూడా….
   ధన్యవాదాలు.

  • ఫాతిమాజీ,
   అనారోగ్యంతో జవాబు ఆలస్యమయింది, మన్నించాలి.
   అప్పులు తీరటం లేదండి, బాకీలుండిపోతున్నాయి, ఎప్పటికి తీరేనో ఏమో…..
   ధన్యవాదాలు.

 5. ఈ సూక్తులూ, నీతులు,మొదలైనవన్నీ మగవారి దృక్పథమ్నుంచె, నుంచే వాళ్ళకన్వయించే లాగానే రాశారు.ప్రస్తుతం స్త్రీలు కూడా వాళ్ళpoint of view నుంచి రాస్తున్నారు.ఐతే మంచి చెప్తే ఉభయులకీ అన్వయించుకోవలసిందే.

  • మిత్రులు రమణరావు గారు,
   సూక్తి చెప్పినపుడు అది పురుషపరంగా స్త్రీకి చెప్పినట్లే ఉంటాయి, అన్నీ, నిజమే. సమాజంలో ఈ సూక్తులు చెప్పే నాటికి కూడా స్త్రీ స్వామ్యమే ఉన్నది, మాతృస్వామ్య వ్యవస్థ ఉన్న కాలంలో చెప్పినవే, ఒకరి పరంగా, చాలా ఇద్దరికి వర్తించేవే. సూక్తిని ఏదో ఒక పక్క చెప్పేరంటే ఇద్దరికి వర్తిస్తుంది. మరో సంగతి కూడా, ఒక పురుషుడు పాడయితే అదై అతనిని మాత్రమే బాధిస్తుంది. ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం చదువుకున్నట్టే అంటున్నాం కదా! అలాగే ఒక స్త్రీ కట్టుబాటు తప్పితే ఆ కుటుంబం పాడవుతుందనుకున్నారు, మన పెద్దలు. నేనిలా అనుకున్నా.

   అమ్మయ్య! నేటితో ఈ ఋణానుబంధం తీరింది……..

   ధన్యవాదాలు.

  • మోహన్జీ,
   అన్నీ ఋణానుబంధాలే, అవి కొన్ని తీరాలని, కొన్ని ఉండాలని అనుకుంటాం, అదీ చిత్రం. ఈ రోజుతో, “ఈ” ఋణం తీరినందుకు ……

   ధన్యవాదాలు.

 6. నా అభిప్రాయాలను క్రితం టపా క్రింద వ్రాసానండి.

  మంచి వారి మౌనం సమాజానికి చేటు అన్నారు కదా పెద్దలు.

  • అమ్మాయ్ అనురాధ,
   తెలిసినవారు ధర్మం చెప్పకపోవడం కూడా తప్పే. నాడు కౌరవ సభలో ద్రౌపది అడిగిన ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా పెద్దలు చెప్పలేదు కదా! అలాగే నేటి కాలానికి కూడా మనమూ దానినే అనుసరించాలి. వికర్ణుడు నిజం చెప్పేడు, అతని మాట చెల్లిందా? పది మంది కలిసి అతని నోరు నొక్కేశారు కదా. పదుగురాడు మాట పాటియై ధరజెల్లు,ఒక్కడాడు మాట ఎక్కదెందు, నదీనాం సాగరోగతి, ఆపగలమా? మనం చెప్పడం వ్యర్ధం

   ధన్యవాదాలు.

 7. శర్మ గారూ ,

  నమస్తే .

  ఇవన్నీ అక్షర సత్యాలు .

  కాకుంటే , ఎప్పుడూ , ఆడవాళ్ళని వదిలేస్తుంటారు ఆదర్శాలలో . కావాలని మనమొక్కళ్ళమే చేయటం లేదు , అనాదిగా అలా కొనసాగుతూనే వున్నది .

  ఉదా : బస్సులలో చూడండి . కొన్ని సీట్లు సీనియర్ సిటిజన్స్కి కేటాయించటం జరిగింది . పలు మార్లు వృధ్ధ స్త్రీలు అచ్చట వున్నా వాళ్ళను ఆశినులను కానీయకుండా మగవాళ్ళె ఆశినులవుతారు . ఈ సీను ఎప్పుడూ కనపడ్తూనే వుంటుంది .

  అలాగే యిప్పుడు మన పూర్వీకులు చెప్పినట్లుగా చెప్పబడ్తున్న వాటిలో కూడా ఈ భేదం కనపడ్తోంది .
  ఇల్లు, భార్య, పిల్లలు, సంపద, ఆఖరుకి స్నేహితులు, హితులు,ఈ రాతలు, పలకరింపులు సర్వం ఋణానుబంధమే, అది చెల్లిపోతే…….
  ఇక్కడ భర్త అని కూడా కలపాలి కదండి .

  ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబు లీడేర్తురే
  వేళనవ్వారి భజింప జాలిపడకావిర్భూత మోదంబునన్
  కాలంబెల్ల సుఖంబు నీకు నిక భక్త శ్రేణి రక్షింపవే
  శ్రీలెవ్వారికి కూడబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!

  పైన మీరు కలిపారు భర్తృహరి సారు మఱచిపోయినా .

  చక్కటి టపాలను అందిస్తున్నారు . అర్ధం చేసుకొని మసలుకొనే వాళ్ళకి సత్జీవితం లభిస్తుంది .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s